Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 7 / 22వ భాగము 31 నుండి 35 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  7 / 2 2వ భాగము 31 నుండి  35వ  పద్యము వరకు.


చ. పలుకుల లోన మాధురులు, పంచఁగ నేర్చిన పండితాళికిన్

సలుపుదురెల్ల లోకులును సత్కృతు లెన్నుచు సంస్తుతించుచున్

గలుష వినాశివై సుగుణ కారణమై యిల కాచుచున్నచో

వెలుగుదు రందరున్ భువిని వేల్పుగ నిన్ మదిఁ గొల్త్రు భారతీ! 31

భావము. 

ఓ విశ్వమాతా! మాటలలోని మధురిమలను పంచెడి పండితులనందరూ గుర్తించి 

గౌరవించుదురు.నీవు కలుషములు బాపుచుమా సుగుణకారకురాలివగుచుఉన్నచో 

అందరూ ప్రకాశించుచు నిన్ను నిత్యము కొలుచుచుందురు. దయతో 

నీవావిధముగా చేయుచు మమ్ము కాపాడుము.


చ. వినుటకు వీనులిచ్చితివి విజ్ఞత నిచ్చితి విన్నవెన్నఁగన్.

గనుటకుఁ గన్నులిచ్చితివి. కాంచినవాటిని మన్నికెన్నగా.

ననుటకు నోటినిచ్చితివి. హాయిగ పల్కఁగ సత్యమెన్నుచు.న్.

మనుటకు మంచిమార్గమిడి మమ్ము కృపం గనుమమ్మ! భారతీ! 32.

భావము. 

ఓ విద్యున్మాలామాతా! వినుటకు చెవులొసంగితివి. విన్నవాటిలో 

మంచిచెడ్డలరయుటకు విజ్ఞతనిచ్చితివి. చూచుటకు చూచిన వాటిలో 

మంచిచెడ్డలెఱుఁగుట కొఱకు కన్నులనిచ్చితివి. సత్యమును గ్రహించి 

సుఖముగా పలుకుటకు నోటినిచ్చితివి. జీవించుటకు మంచి మార్గమును 

కల్పించి మమ్ములను కృపతో చూడుమమ్మా.


చ. అభయము నిచ్చి భాషణ ననంత శుభాస్పద మార్గ వేద్య స

త్ప్రభవ విశేష శక్తియుత ధార్మిక వర్గ నిరంత వర్తనన్ 

శుభములు గొల్ప జేయఁ గదె! సుస్వరభాగ్యమనోజ్ఞ వాఙ్మయీ!

విభునికి వేల్పు వైతివిగ. విజ్ఞత నొప్పుటఁ జేసి భారతీ! 33.

భావము. 

ఓ వైష్ణవీమాతా! మంచి స్వరమనెడి భాగ్య స్వరూపమైన ఓ వేదమాతా! నీవు 

విజ్ఞతతో ఒప్పుచుండుట చేసి నీ భర్తకే దేవతవైతివమ్మా. మాకు అభయమునిచ్చి, 

భాషణ చేత అంతులేని శుభములకు నెలవైన మార్గము తెలిసిన, మంచిని 

పెంచగలుగు అధికమైన శక్తితో కూడిన ధర్మప్రవర్తకుల నిరంతర ప్రవర్తన 

మూలముగాశుభములను కలుఁగునట్లు చేయువచ్చును కదా తల్లీ.


చ. కదలిక లేని జన్మలకు గౌరవమెద్ది? విధాత సృష్టిలో

మదిని కదల్చు మార్గమది మాన్యతనొప్పెడి భాషణంబు. స

న్మధుర వచోవిలాసముగ మాన్యులు మెచ్చ వచించు టొప్పగున్.

వదులక నా కొసంగుమది. వర్ధిలఁ జేయఁగ నన్ను భారతీ! 34.

భావము. 

ఓ చంద్రికామాతా! బ్రహ్మ సృష్టిలో చైతన్యము లేని జన్మలకు మనస్సులను 

కదల్చ గలిగినది గౌరవముతో కూడిన భాషణమే. అందు చేతనే మధురమైన 

వచో విలాసముగా గొప్పవారు మెచ్చునట్లు పలుకుట ధర్మము. నన్ను 

వర్ధిల్ల చేయుటకు నీవు నాకు అట్టి వచోవిలాసమును కలిగించుము తల్లీ. 


చ. జగతిని కల్గు దైవమది సద్విభవంబయి వెల్గుచుండు, నీ

యగణిత సత్ప్రభావుల కహర్నిశలున్ శుభ చింతనంబె. లో

జగతి వెలుంగు దైవమును చక్కఁగ నంతట చూడ నేర్తు రీ

ప్రగణిత మూర్తులిద్ధర నిరంతరమున్ నినుఁగొల్త్రు భారతీ! 35.

భావము. 

ఓ చంద్రవదనా! మంచివారి యొక్క వైభవము రూపములో దైవమీలోకమున 

వెలుఁగుచుండును.. ఈ గొప్ప మంచిప్రభాపూర్ణులకు అహర్నిశలూ మంచిని 

గూర్చియే ఆలోచన ఉండును. తమలోనున్న ప్రపంచమును చక్కగ చూచుచు 

వీరు నిన్నే కొలుచుదురుకదా.

జైహింద్.

No comments: