Tuesday, August 28, 2012

ఆదర్శోపాధ్యాయ శ్రీ కంది శంకరయ్య గారికి అభినందన మందారాలు.


శ్రీరస్తు         శుభమస్తు       అవిఘ్నమస్తు
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా " శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు 
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.

కం:- శ్రీ కంది వంశ చంద్రమ! 
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన  
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!

సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి  -  స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి  -  ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము  -  నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో  -  విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టిన నగవులు జిందు మోము 
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ  గాంభీర్యతలు చూపు కన్ను దోయి 
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!

శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.

గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!  
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము. 
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.

గీ:- మంగళంబులు మీకిల మంగళములు. 
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.  
మంగళంబులు హరికి సన్ మంగళములు.

మంగళం                       మహత్                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

Friday, August 17, 2012

ఉపాధ్యాయులకుండవలసిన లక్షణాల విషయమై మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పక తెలియజేస్తారా?

జైశ్రీరామ్.
తమ శిష్యులని సచ్ఛీలవంతులుగను, అవధానులుగను తీర్చిదిద్ధిన 
అభినవ మల్లినాథ బిరుదాంకితులైన శ్రీ ధూళిపాళి మహాదేవమణి.

ప్రియమైన భారతీయ సోదరీ సోదరులారా! సహృదయులైన మీకు నా నమస్కృతులు.
సెప్టెంబర్ ఐదవ తేదీ డా. సర్వేపల్లి రాధా కృష్ణ గారి జన్మదినం సందర్భంగా యావత్ ఉపాధ్యాయ వర్గమే గౌరవింప బడుతుండడం అత్యంత ముదావహం.
ఉపాధ్యాయోత్తము లందరికీ నా కైమోడ్పులు.
ప్రియ మిత్రులారా! నాదో మనవి. దయ చేసి స్పందించి నా మనవినాలకించి నా కోరిక నెరవేర్చ గలరా? ఐతే వినండి.
అన్ని వృత్తుల లోను తల్లిదండ్రుల తరువాత గౌరవింపఁబడే ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని  "ఆచార్య దేవోభవ" అన్నవాక్యమే తెలియజేస్తోంది. అట్టి గౌరవప్రదమైన ఆచార్య వృత్తి జీవితంలో లభించడం పూర్వ జన్మ పుణ్య ఫలంగా చెప్పుకున్నా అతిశయోక్తి కానేరదు.
సమాజం ఇంతటి మహోన్నత స్థానం కల్పించిన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వారు ఏ మహనీయత కలిగి ఉండడం ద్వారా ఈ గౌరవానికి అర్హులౌతున్నారు?
SCHOOL అన్న పదం ఎంతో మహోన్నత ఆశయంతో నెలకొల్పఁబడినది.
S = సేక్రిఫైజేషన్ = త్యాగనిరతి.
C = కేరక్టర్ = సత్శీలత.
H = హానెష్టీ = హుందాతనము.
O = ఒబీడియన్సీ = అణకువ.
O = ఆర్గనైజేషన్ = కార్య నిర్వహణ సామర్ధ్యము.
L = లీడర్షిప్ = నాయకత్వ లక్షణములు.

ఈ విధమైనవి పాఠశాలలో చేరిన పిల్లలకు పాఠశాల చదువు పూర్తయేసరికి అలవడి ఉండాలి. అలా అలవడేలాగ ఆ SCHOOL లో విద్యను బోధించే ఉపాధ్యాయులు శిక్షణను ఇవ్వాలి.

ఇట్టి విధంగా శిక్షణను ఇవ్వడానికి  యదార్థమైన ఉపాధ్యాయుఁడు కలిగి యుండ వలసిన పరిపూర్ణమైన లక్షణాలు ఏమిటేమిటి?
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వ్యక్తి తన వృత్తికి పరి పూర్ణమైన న్యాయం చేకూర్చడానికి ఏమి చేయాలి?
ఒక ఉత్తమ ఉపాధ్యాయుని సత్ ప్రవృత్తి  విద్యార్థులపై ఎంతటి మహోన్నత ప్రభావం చూపుతుంది?

ఒకవేళ ఉపాధ్యాయుఁడే దుష్ప్రవృత్తి కలిగి ఉన్ననాడు సమాజం ఏదిశగా పయనిస్తుంది?
మీరు శ్రమగా భావించకపోతే కొంచెం ఓపికగా మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యాఖ్య ద్వారా తెలియజేసినట్లైతే భావితరాలకు మేల్తరమైన సూచన చేసినవారౌతారు.
మీరు తెలియఁ జేసిన మేలైన అభిప్రాయాలను ప్రభుత్వం గుర్తించ వచ్చును. వాటిని ఉపాధ్యాయలోకానికి అందజేయ వచ్చును.మహోన్నత భావి భారతావని నిర్మాణానికే మీ సూచనలు మార్గదర్శకం కావచ్చును.
మీ అభిప్రాయం మీ పేరుతో సహా పంపండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరుతో ప్రకటిస్తాను. కానినాడు మీ సూచన ననుసరిస్తాను. అత్యంత విలువైన భావిభారతపౌరులనిర్మాణాన్ని బాధ్యతగా స్వీకరించు ఉపాధ్యాయులకు మీ సూచనలు శిరోధార్యాలుగా నిలుస్తాయి.
దయచేసి తెలియ జేస్తారు కదూ?
నమస్తే.
జైహింద్. 

Tuesday, August 14, 2012

యావద్భారత జాతికీ 66 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
యావద్భారతీయ సోదరీ సోదరులారా! భారత దేశ 66 వ 
స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల మహనీయమైన ధన మాన ప్రాణ 
త్యాగ ఫలంగా  సంపాదించిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ 
ఉన్న మనం మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా 
మనసులో ఉంచుకొని సమాజంలో మెలగుదాం. తద్వారా 

ఏ ఒక్కరి స్వేచ్ఛకు మనం ఆటంకం కలిగించకుండా మెలకువతో ప్రవర్తిద్దాం. ఉత్తమ భారతీయులుగా జీవనం సాగిద్దాం.
జైహింద్.

Wednesday, August 1, 2012

యజ్ఞోపవీత ధారణ విధానము.

జై శ్రీరామ్.
యజ్ఞోపవీత ధారణ.
ప్రియ హైందవ సంప్రదాయానువర్తులారా! మీ అందరికీ జంధ్యాల పౌర్ణమి సందర్భంగా నా శుభాకాంక్షలు.
యజ్ఞోపవీత ధారణ క్రమము ఈ క్రింది చిత్రములలో గల విధానముననుసరించి గ్రహించ వచ్చును.
చూచారు కదండీ! వీటిలోని అక్షరాలు ఇంకా పెద్దవిగా కనిపించాలంటే ఆ చిత్తరువులమీద క్లిక్ చెయ్యండి.
శుభమస్తు.
జైహింద్.

రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.
అకళంక సోదర సోదరీ భావనా సంభరిత హృదయారవిందులైన భారతీయుల ఈ సత్ సంప్రదాయము నిష్కళంకమై కల కాలమూ విరాజిల్లుతూ ఉండు గాక. సోదరీ సోదరులు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుతురు గాక.
జైహింద్.