Saturday, January 17, 2009

పింగళి సూరన ప్రదర్శించిన అత్యద్భుత రచనా ప్రక్రియ

పింగళి సూరన ప్రదర్శించిన అత్యద్భుత రచనా ప్రక్రియ

ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం. అన్న మాట లెంత యదార్థము.మన తెలుగు భాషామతల్లికి తమ అనిర్వచనీయమైన సేవలందించిన మహనీయులు సార్థక జన్ములెందరో వున్నారు. అష్ట దిగ్గజ కవులలో సుప్రసిద్ధుడైన పింగళి సూరనార్యుడు రాఘవ పాండవీయము అనే ద్వ్యర్థి కావ్యమే కాక కళా పూర్ణోదయము అనే మహా కావ్యాన్ని కూడా వ్రాసి తన అప్రతిమాన ప్రతిభా పాటవాల్ని పాఠకలోకాని కందించి కావ్య జగత్తులో అజరామరుడయ్యాడు.ఇంతకు ముందే " ఈ పద్యం సంస్కృతమా? తెలుగా? చెప్పుకోండి చూద్దాం. " అనే శీర్షికతో రెండు భాషలలోనూ అన్వయం గల పద్యం ఈ బ్లాగులో వుంచడం జారిగింది.

ఇప్పుడు మరొక తమాషా ప్రక్రియతో మన ఊహకే అందని అత్యంత ఆశ్చర్య జనకమైన పద్యాన్ని మీ ముందుంచుతున్నందుకు చాలా ఆనందంగా వుంది.
ఆ పద్యంలో ప్రారంభం నుండి చివరి దాకా చదివితే తెలుగు పద్యమై తెలుగు పదాల పొందిక గలిగి తెలుగు లో అర్థ స్ఫూర్తి కలిగిస్తుంది.
మరి అదే పద్యాన్ని చివరి పాదంలో చివరి అక్షరం నుండి మొదటి పాదంలో మొదటి అక్షరం దాకా { వెనుకనుండి ముందుకు } చదివితే అత్యంత ఆశ్చర్య జనకంగా సంస్కృతపద భూయిష్ఠమై చక్కని భావ స్ఫూర్తిని కలిగిస్తుంది. వింతగా వుంది కదూ? ఐతే ఆ పద్యమేమిటో చూద్దామా?
కందము:-
తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తెజా
దేవర గౌరవ మహిమన
మావలసిన కవిత మరిగి మాకునధీశా.
ముందుగా తెలుగులో చూద్దాం.
ప్రతిపదార్థము:-
అతి విభావిసు తేజా = మిక్కిలి ప్రకాశించు పరాక్రమము కల
అధీశా = ఓ మహారాజా!
దేవర గౌరవ మహిమన = మీ ఘనత యొక్క మహిమ చేతనే
మా వలసిన కవిత = మా ప్రియమైన కవిత్వము
తాన్ = అది
వినువారికి సరవిగన్ = వినెడి వారికి యుక్తముగా
భావనతోన్ = భావించుటతో { ఆలకించు వారు సముచితముగా నున్నదని తలచినట్లు }
మాకు మరిగి = మాకు అలవడి { మరుగు రూపాంతరము మరిగి }
ఆనున్ = కనిపించును
భావము:-
మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల ఓ మహారాజా! మీ ఘనత యొక్క మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వము ఆలకించువారు అది యుక్తముగా భావించుటతో మాకు అలవడి వ్యక్తమగుచున్నది.
{ఓరాజా! మేమాశ్రయించిన మీ మహత్వము వలననే శ్రోతల కానందకరమైన కవిత్వము మా కబ్బినది.అని భావము.}
అదే పద్యాన్ని తలక్రిందుగా వ్రాసి చూస్తే సంస్కృతం. చూద్దామా?
సంస్కృతం లో పద చ్ఛేదము:-
శాధి - ఇన - కుం - ఆగిరి - మత - వికనసి - లవమాన - మహిమవరగౌరవదే - జాతే - సువిభౌ - ఇతి - నను - నా - అతః - నవభాః - గవి - రసకిరి - వా - అనువితా.
అన్వయ క్రమము:-
ఇన - ఆగిరి - కుం - శాధి - మత - వికనసి - లవమాన - నను - మహిమవరగౌరవదే - సువిభౌ - ఇతి - జాతే - నా - అతః - నవభాః - రసకిరి - గవి - అనువితా వా.
ప్రతిపదార్థము:-
ఇన =ఓ రాజా!
ఆగిరి = పర్వతములున్నంత కాలము
కుం = భూమిని
శాధి = శాసింపుము
మత = సర్వ సమ్మతుడా!
వికనసి = మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు.
లవమాన = లవుని యొక్క మానము వంటి మానము కలిగిన
నను = ఓ భూవరా!
మహిమవరగౌరవదే = గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరవమునిచ్చునట్టి
సువిభౌ = నీ వంటి మంచి రాజు
ఇతి = ఈ విధముగా
జాతే = కలిగి యుండగా
నా = పండితుడైన, మనుష్యుడు
అతః = ఇట్టి గౌరవము వల్ల
నవభాః = క్రొత్త వికాసముగలవాడై
రసకిరి = రసము చిమ్మునట్టి
గవి = భాషయందు
అనువితా వా = స్తుతింపనివాడగునా! { తప్పక నుతించువాడగునని యర్థము. }
భావము:-
-ఓ రాజా పర్వతములున్నంత కాలము భూమిని శాసింపుము. సర్వ సమ్మతుడా! మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లు చున్నావు. లవుని యొక్క మానము వంటి మానము కలిగిన ఓ భూ వరా! గొప్పతనముచే శ్రేష్ఠమైనట్టి నీ వంటి మంచి రాజు యీ విధముగా కలిగి యుండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవము వల్ల క్రొత్త వికాసము కలవాడై రసము చిమ్మునట్టి భాష యందు స్తుతింపనివాడగునా. స్తుతింపబడును.
చూచారు కదా! ఎంత అద్భుతంగా వుందో.
మన సాహిత్యంలో వున్న చిత్ర విచిత్ర కవిత్వాలను గూర్చి తెలుసుకోవాలంటే బహుశా మన జీవితం చాలదేమో.
మీరు కూడా మీ దృష్టిలో యిటువంటి కవితలుంటే కామెంటు ద్వారా పంపినట్లయితే తప్పక పదిమందికీ పంచినవారవతారు.
జైహింద్.

Saturday, January 10, 2009

చిత్ర కవిత్వం చూద్దామా? .

పాయాదనాదిః పరమేశ్వరో వః .
చిత్ర కవిత విచిత్ర కవిత అనడంలో సందేహం లేదు. మీకు ఆశీశ్శులందించే యీ క్రింది శ్లోకాన్ని చూద్దామా?
శ్లోకము:-
గవీశ పత్రః నగజార్తి హారీ
కుమార తాతః శశిఖండ మౌళిః
లంకేశ సం పూజిత పాద పద్మః
పాయాదనాదిః పరమేశ్వరో వః.
ఈ పై శ్లోకాన్ని గమనించాం కదా?
ఆశీరర్థక శ్లోకమిది. 
మొత్తం శ్లోకంలో పరమ శివుడు మిమ్ము రక్షించు గాక! అని అర్థం మనకు ప్రస్ఫుట మవడమే కాదు. దీని లోగల చిత్ర కవితా ప్రావీణ్యతను గమనిస్తే మానసోల్లాస కారకమయే మరో తమాషా మనకు అవగతమవక మానదు. 
అదేమిటంటారా?
గవీశపత్రః = నంది వాహనుడును,
నగజార్తి హారీ = పార్వతీదేవి దుఃఖాన్ని పోగొట్టిన వాడును,
కుమార తాతః = కుమార స్వామి తండ్రియును,
శశి ఖండ మౌలిః = చంద్రశేఖరుడును,
లంకేశ సంపూజిత పాద పద్మః = రావణాసురునిచే పూజింప బడిన పద్మముల వంటి పాదములు కలవాడును,
అనాదిః = పుట్టుక లేని వాడును అగు
పరమేశః = పరమ శివుడు,
వః = మిమ్ము,
పాయాత్ = రక్షించు గాక.
భావము:-
నంది వాహనుడును, పార్వతీ దుఃఖాపహారియును, కుమార స్వామి తండ్రియును, చంద్ర శేఖరుడును, రావణ పూజిత పాద పద్మములు కలవాడును, పుట్టుక  లేని వాడును అగు పరమ శివుడు మిమ్ము రక్షించు గాక.
అని పరమ శివుని పరంగా ఒక అర్థం వస్తుంటే
విష్ణువుపరంగా మరొక అర్థం మనకు ద్యోతకమయే విధంగా రచించ గలిగి యుండడమే దీనిలో గల చిత్రత.
చూడండి.
శివునికి వాడిన విశేషణములనే విష్ణువుకూ ఉపయోగించి చెప్ప గలగడమే దీనిలోని చమత్కారం.
శివునకు ప్రయోగించిన విశేషణ వాచక పదములలోని మొదటి అక్షరములను తొలగించి చదివితే మనకు అర్థమైపోతుంది.
{గ} వీశప త్రః = పక్షి రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడును,
{న} గజార్తి హారీ = గజేంద్రుని దుఃఖమును హరించిన వాడును,
{కు} మార తాతః = మన్మధుని తండ్రియును,
{శ} శిఖండ మౌలిః = నెమలి పింఛమును తలపై ధరించిన వాడును,
{లం} కేశ సంపూజిత పాద పద్మః = {క+ఈశ} బ్రహ్మ రుద్రులచేత పూజింపబడుచున్న పాద పద్మములు కలవాడును,
అనాదిః = పుట్టుక లేని వాడును,
{ప} రమేశః = లక్ష్మీ పతియు నైన శ్రీ మహా విష్ణువు,
వః = మిమ్ములను,
పాయాతు = రక్షించు గాక.
భావము:-
గరుత్మంతుని వాహనముగా కలవాడును, గజేంద్రుని రక్షించిన వాడును, మన్మధుని తంద్రియును, నెమలి పింఛమును తలపై ధరించిన వాడును, బ్రహ్మ రుద్రులచేత పూజింప బడు పాద పద్మములు కలవాడును, పుట్టుక లేని వాడును, లక్ష్మీ పతియు నగు శ్రీ మహావిష్ణువు మిమ్ము కాపాడు గాక.
చూచాం కదా! ఎంత చమత్కారంగా శివ కేశవుల శుభాశీశ్శులు మీకు కలగాలని చెప్ప బడిందో.
ఇలాంటి శ్లోకాల్ని ఈ రోజుల్లో చెప్ప గలిగేవారు మృగ్యం కదా? అందుకని మనం ఇలాంటి శ్లోకాలు కాని, పద్యాలు కాని మన కంట పడితే వెన్వెంటనే పుస్తకంలో వ్రాసుకోవడంతొ పాటు మస్తిష్కంలో భద్ర పరచుకోగలగాలి. అంతే కాదు. ఆ శ్లోకాన్ని దానిలోని చమత్చారాన్ని వివరించి చెప్పి, దీనిని వినడం వలన అవతలి వ్యక్తి పొందిన ఆనందానుభూతిని చూచి మనం కృతార్థులమవగలగాలి. మరి అలాగే చేద్దామా?
జైహింద్.