Sunday, July 30, 2023

వివాహములో గణపతి పూజ సప్తపది, పెద్దల దీవనలు...ఫలితాలు.

 జైశ్రీరామ్.

కం.  గణపతిపూజను విఘ్నం

బణువంతయు లేక జీవితాంతము శుభముల్,

మణిమాన్యంబులు, సుతులును,

ప్రణవాక్షరయోగసిద్ధి ప్రాప్తించునిలన్.


కం.  పట్టితి చేతిని, విడువను,

జట్టుగ నేడడుగులగ్నిసాక్షిగ వేయన్,

గుట్టుగ జీవితమంతయు

నెట్టగ తగు దైవబలము నిత్యంబుండున్.


కం.  సత్సంతానము పడయుచు 

నుత్సాహముతోడ మనుట కుద్గతిఁ బెద్దల్  

ప్రోత్సహమునిత్తురు తమ 

వాత్సల్యము చూప వచ్చి  పరిణయవేళన్

జైహింద్.

Sunday, July 23, 2023

గరికిపాటి, చాగంటి, సామవేదం, వద్దిపర్తి - దత్తపది / Garikipati, Chaganti,...

జైశ్రీరామ్.
గరికిపాటి, చాగంటి, సామవేదం, వద్దిపర్తి - దత్తపదికి శ్రీ సురభి శంకరశాస్త్రి అవధాని పూరణ అద్భుతం.
జైహింద్.

Friday, July 7, 2023

భూసుర దీప్తి........చింతా రామ కృష్ణా రావు.

 ఓం శ్రీమాత్రేనమః.

శ్రీమద్విశ్వ వదాన్య బ్రహ్మకులజుల్, చిన్మార్గ సంశోభితుల్,
ప్రెమోదంచిత భక్తియుక్తులు, మహద్ బీహెచ్చుయీయల్లు సం
క్షేమోద్ధారులు, శ్రీనివాసు కృపచే శ్రీమన్మహా భాగ్యులై
శ్రీమాతాశ్రయ చిత్తవృత్తినిల సంక్షేమంబునొప్పారుతన్.

విశ్వశ్శ్రేయ వదాన్య బ్రహ్మ కులజుల్ బీహెచ్చుయీయల్లులో
శశ్వత్కీర్తిత కార్య మగ్నమతులై సద్భాష్య చిద్రూపులై
విశ్వ ఖ్యాతిఁగ దాటిరైదు పదులన్. విఖ్యాత స్వర్ణోత్సవాల్
విశ్వ ఖ్యాతిని వెల్గుతన్ సకల సద్విద్వాంశులుప్పొంగఁగన్.

భూసుర దీప్తి.
శ్రీమద్భారతావని, త్రికాల జ్ఞాన సంపన్నబ్రాహ్మణ తేజో విరాజితమై, అతి ప్రాచీన కాలమునుండియు, నిరుపమాన విజ్ఞాన తేజస్సంపదను ఈ జగతికి అందించిన విషయము జగద్విదితమగు అప్రతిహత సత్యము. ఇందు ముఖ్య భూమిక వేద విజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులదే. పారమంటిన జ్ఞాన ఖనులగుటం జేసి బ్రాహ్మణులు లోకాః సమాస్తా: సుఖినో భవంతు అని కోరుకొనుచు వారి వారి పరిధిలోఁ గల పుర హిత కాంక్షులై యజ్ఞయాగాది మంగళ కార్యాచరణలతో యాజులుగా విరాజిల్లుచు పురోహితులుగా సుప్రసిద్ధులయి లోక పూజ్యులై బ్రాహ్మణ వంశమునే దైవ వంశముగా నిరూపించి యుండిరి. బ్రాహ్మణోస్య ముఖామాసీత్, అని వేదోక్తి. సర్వ వ్యాపకుఁడైన శ్రీమన్మహావిష్ణువు యొక్క ముఖమే బ్రాహ్మణుఁడు అని వివరించెననఁగా బ్రాహ్మణత్వమెంతటి పూర్వ జన్మ తపఃఫల సంభవమో గ్రహించఁగలము.
న విశేషోస్తి వర్ణానాం సర్వం బ్రహ్మమిదం జగత్.
బ్రాహ్మణాః పూర్వ సృష్టా హి కర్మభిర్వర్ణతాం గతాః. (భారతమ్ శాంతి పర్వమ్) 
అన్న భారతోక్తిని చూచినచో వర్ణములలో విశేషమేదియును లేదు. ఈ జగత్సర్వము బ్రహ్మ మయమే. సృష్టి ప్రారంభమున అందరూ బ్రాహ్మణులే. తదనంతర కాలమునుండియు జీవన గమనమునకై తాము స్వీకరించిన కర్మలననుసరించఁగా అవి వారి వర్ణములుగా పరిణమించినవి. అట్టి వర్ణములలో అగ్ర వర్ణముగా చెప్పుకొనఁబడుచున్న బ్రాహ్మణ వర్ణ సంజాతులు జన్మతః శూద్రులే. గర్భాదానాది షోడశ కర్మల ద్వారా కలిగించిన సంస్కారములచే ద్విజు లనిపించుకొనుచుండిరి. అట్టి ద్విజులు వేదాధ్యనతత్పరులు విప్రులనఁబడుచున్నారు. అందు బ్రహ్మ జ్ఞాన సముపార్జితుఁలే బ్రాహ్మణులు అని ఈ క్రింది శ్లోకము స్పష్టపరచుచున్నది. 
‘జన్మనా జాయతే శూద్రః సంస్కారా ద్ద్విజ ఉచ్చతే
వేదపాఠీ భవే ద్విప్రః బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః’
మన ప్రాచీనులు అతి ప్రాచీన కాలము నుండియు ఈ షోడశ కర్మలను అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహించుట ద్వారా బ్రహ్మ తేజః పుంజముగా తమ వంశజులను తీర్చిద్దెడివారు. కలికాల ప్రభావమో లేక కర్మ ప్రభావమో కారణ మేదయినను  అలనాటి నుండియు వచ్చుచున్న షోడశ కర్మాచరణమునందు ఈ నాడు అలసత్వము చోటు చేసుకొన్నట్లు కనిపించుచున్నది. అలనాడు ఎంతో శ్రద్ధాసక్తులతో చేసెడి కర్మలు ఈ నాడు నామ మాత్రముగా జరుపఁబడుచున్నట్లు తోచుచున్నది. మానవ జన్మకు మూలమైనది గర్భాదానము. ఈ కార్యక్రమము జరుపు విషయమున అత్యంత శుభ లగ్నమును పడికట్టి, ముహూర్తము నిర్ణయించి, వంశోద్ధారకులైన సత్ సంతాన ప్రాప్తినాకాంక్షించి శాస్త్రోక్తముగా అప్రమత్తతతో ఈ కార్యక్రమము నిర్వహించెడివారు. వశ్యవాక్కులైన విప్రవరుల యొక్క వేదోక్త పరిపూర్ణ ఆశీర్వచనముల ద్వారా సత్ఫలములను జనించు సంతతికి అందించెడివారు. తదనుగుణముగనే అలనాటి బ్రాహ్మణ సంతతి పరమ పూజ్యులుగనే రూపితులయ్యెడివారు.  గుణనిధి వంటివారానాడు జనించలేదని కాదు.  అధిక సంఖ్యలోఁ గల శ్రోత్రియులైన సద్బ్రాహ్మణులే సుప్రసిద్ధులై బ్రాహ్మణుల కీర్తి ఆచంద్ర తారార్కము నిలుపఁ గలిగియుండెడివారు.  ఈ నాడు బ్రాహ్మణ సంతతిలో కొందరిని కర్మ బాహ్యులుగా, దురాచారసంపన్నులుగా, పండిత భృవులుగా, పండిత పుత్రులుగా అధిక్షేపించుచుండుట అటనట తటస్థపడుచున్నది. ఈ దుస్థితికి మూలమేదో విజ్ఞతతో యోచింప వలసి యున్నది. 
శిశువు గర్భస్థుఁడగుచున్న నాటి నుండియు ఆశిశువులో సంస్కార బీజావాపము జరుగు చున్నదా? ప్రహ్లాదుఁడు తల్లి గర్భమునందుండగనే నారదమునిచే హితోపదేశ సంస్కారము పొందలేదా? అభిమన్యునకు తల్లి గర్భముననుండగనే పద్మవ్యూహప్రవేశ విజ్ఞానబీజావాపము చేయఁబడలేదా? మరి ఈ నాడు దంపతులు తమకు సత్సంతానమును మనసారా కోరుకొను చున్నమాట వాస్తవమే ఐనప్పటికి తదనుకూల స్థితిని కలుఁగఁ జేయఁగలుఁగుచున్నారా? శిశువు గర్భస్థమైన నాటినుండియు ఆ గర్భిణి యొక్క శారీరక, మానసిక స్థితి ప్రభావము ఆ గర్భస్థ శిశువుపై పడునని వినుచున్నాముకదా! ప్రశాంత మనస్సుతో, ఆనంద భరిత జీవనము గడిపినచో గర్భస్థ శిశువు పై ఆ సత్ప్రభావము పడును. ఇట్టి కారణము చేతనే గర్భిణియగు స్త్రీని ఆమె తల్లిదండ్రులవద్ద నిశ్శంకగా సంతోషముగా ఉండగలదనిభావించి, తత్ సత్ప్రభావఫలమున గర్భస్థ శిశువు కూడా శారీరక మానశిక ఆరోగ్యసంపన్నుడై ఉండఁ గలఁ డని తలంచి గర్భిణీ స్త్రీని మూడవ మాసములో కన్నవారి ఇంటికి పంపుట ఆచారముగా వచ్చుట సంభవించినది. కాని నేటి స్థితిగతులు తద్భిన్నముగా ఉండి విపరీత ఫల హేతువులగుచున్నవనక తప్పదు.
స్త్రీ సదాచార సంపన్నయై యుండి, గృహిణిగా విధ్యుక్త ధర్మ బద్ధయై ఆదర్శ మహిళగా మనుటకు యత్నించినచీ ఆ కుటుంబమంతయు సదాచార సంశోభిత జనానీకమై యొప్పును.
ఆ విధముగ కాక వ్యర్థ కాల యాపనతో దూరదర్శన దర్శనాభిలాషియై, చల్నచిత్రాది దర్శనాభిలాషియై విధ్యుక్త ధర్మ దూరయై ప్రవర్తించుచున్నచో తదుపరి విపరీత పరిణామములను ఎదుర్కొనుటకు సంసిద్ధ అయి యుండవలసి వచ్చును. ఈమె ప్రవృత్తి కుటుంబమున కాదర్శమను విషయమును గుర్తుంచుకొని ప్రవర్తింపవలసి యున్నది.
తల్లిదండ్రులు తమ కుమార్తెకు మంచి భర్త కావలెనని కోరుచున్నారే గాని, ఆ ఫలిత సాధనకై చేయుచున్న కృషి యేమిటి? 
కన్యలు భాగవతమునందలి రుక్మిణీ కల్యాణమును పఠించిన చక్కని భర్త లభించునని ప్రాచీనులు ఆ పద్ధతిననుసరింపఁ జేసెడివారు. ఈ నాడు ఎందరు తల్లిదండ్రులు కన్యలచే ఈ పని చేయించ యత్నించుచున్నారు? 
అత్తవారింటికి క్రొత్తగా అడుగు పెట్టి తన జీవితాంతము అక్కడ జీవించ వలసి యున్న తమ ఆడు బిడ్డలకు తల్లిదండ్రులు నేర్పుచున్న నడవడిక ఏమిటి? తల్లిదండ్రుల మాటలను తలకెక్కించుకొని అత్తవారింట అడుగు పెట్టుచున్న నూతన వధువులకు అక్కడ జీవనము సుగమముగా లేకపోవుటకు కారణమునూహించఁ గలరా? 
మహాముని కణ్వుఁడు తన పెంపుడు కుమార్తె శకుంతలకు అత్తవారింట మసలుకొనవలసిన విధానమును శ్లోక చతుష్టయములో వివరించి చెప్పలేదా? 
1. యాస్యత్యద్య శకున్తలేతి హృదయం సంస్ప ష్ట ముత్కంఠయా 
కణ్ఠస్తంభిత బాష్ప వృత్తి కలుషశ్చిన్తా జడం దర్శనమ్ 
వైక్లబ్యం మమ తావదీదృశ మహా స్నేహాదరణ్యౌకస: 
పీడ్యంతే గృహిణ: కథం నుతనయా విశ్లేష దుఃఖైర్నవైః 
శకుంతల అత్త వారింటికి వెళ్తున్నదని నా మనసు కలవరపాటు చెందుతోంది. కన్నీటితో చూపు మందగించింది. కంఠం రుద్ధమై పోయింది. కొంత కాలం పెంచిన ప్రేమతో మా వంటి తపోధనులే ఇంత బాధ పడుతూ ఉంటే, కన్న బిడ్డలను అత్త వారింటికి పంపించే టప్పుడు గృహస్థులు ఎంత విచారిస్తారో కదా ?
2. పాతుం నప్రధమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషుయా 
నా దత్తే ప్రియమణ్డనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్ 
ఆద్యేవ: కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్యుత్సవ: 
సేయం యాతి శకున్తలా పతి గృహం సర్వైరను ఙ్హ్ఞాయతామ్. 
తపో వనం లోని లతలను, వృక్షాలను సంబోధిస్తూ చెప్పినది: ఎవతె మీకు నీరు పెట్టనిదే తాను ఎన్నడూ త్రాగ లేదో, ఎవతె అలంకారార్ధం కోసం కూడా మీ చిగుళ్ళను త్రుంచేది కాదో, తొలిసారిగా విచ్చు కున్న మీ పూలను చూసి ఎవతె సంబర పడేదో, అట్టి సుకుమారి శకుంతల నేడు పతి గృహానికి పయన మవుతున్నది. దయతో అనుమతించండి.
3. అస్మాన్ సాధు విచిన్త్య సంయమి ధనానుచ్చై: కులంచాత్మన 
స్త్వయ్యస్యా: కథమప బాంధవ కృతాం స్నేహ పృవృత్తించతామ్ 
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా 
భాగ్యాయత్త మత: పరం నఖలు తద్వాచ్యం వధూబన్ధుభి: 
శిష్యుల ద్వారా కణ్వుడు దుష్యంతునకు పంపిన సందేశం: గొప్ప తపోధనులమైన మమ్ములను, శ్రేష్ఠమయిన తన కులాన్ని, బంధువులను కూడ తలచక ఈమె నీ పయి ప్రేమను చూపి నిన్ను పరిణయమాడింది. సరి, ఈమెను నీ ఇతర అంతి పుర స్త్రీలతో సమానంగా గౌరవాదరాలతో చూసుకో. అడపిల్ల బంధువులు ఇంత కన్నా ఎక్కుగా చెప్పరాదు. ఆ పిదప మా భాగ్యం ఎలా ఉంటే అలా ఉంటుంది.
4. శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే 
భర్తుర్వి ప్రకృతాపి, రోషణతయా మాస్మ ప్రతీపం గమ: 
భూయిష్ఠా భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ 
యాన్త్యేవం గృహిణీపదం యువతయో వామా: కులస్యాధయ: 
అమ్మా, శకుంతలా ! పెద్దలను సేవించుకో. నీ సవతులను ప్రేమతో చూడు. నీ భర్త కోపించినా అసూయతో అతనికి వ్యతిరేకంగా ప్రవర్తించ వద్దు సుమా ! సేవక జనులను దయతో చూడు. సంపద వలన గర్వ పడకు. ఈ విధంగా ప్రవర్తిస్తే కాంతలు గొప్ప పతివ్రతలని కొనియాడ బడుతారు. అలా కాక పోతే నిందలకు గురవుతారు సుమీ! 
ఇప్పుడు తల్లిదండ్రులు ఈ విధముగ సద్బోధ చేయుచున్నవారెందరుండిరి? తమ ఈ బాధ్యతను సక్రమముగా నిర్వహించ యత్నించుచున్నారా? 
ఇంత చెప్పనేల. 
అనుకరణ శీలురైన పిల్లల నడవడికకు మూలము తల్లిదండ్రుల నడవడికయే కదా! మరి తమ నడవడిక తమ పిల్లలలో సంస్కారమును ఎంతవరకు తీర్చిదిద్ద సమర్థమైయున్నది? ఇది ఆత్మ పరిశీలన చేసుకొని తెలుసుకొన వలసినదే.  
మానవులకు వైవాహిక జీవనము అత్యంత బాధ్యతా యుతమైనది. ఇందు ఎటువంటి నిర్లక్ష్యము ఎవరి వలన జరిగినను అది సమాజముపై ప్రభావము చూపక మానదు. పురుషుఁడు భర్తగా అత్యంత విజ్ఞతతో ప్రవర్తించఁ గలిగి తన అర్థాంగి సత్ప్రవర్తనకు మూలముగా నిలువఁ గలిగి యుండవలెను. అటులనే స్త్రీ కూడా తన అత్మీయతానురక్తులతో అత్తవారింట నందరి మనసులను చూరఁగొను విధముగా అత్యంత అప్రమత్తయై ప్రవర్తించవలెను. ఆ విధముగా భార్యాభర్తలు ప్రవర్తించుటలో నిపుణత కలిగి యున్ననాడు తమ కుటుంబము ఆనందమున కాలవాలమై తమ బిడ్డలను సత్ప్రవర్తకులుగా తీర్చి దిద్దుననుటలో ఏమాత్రము సందేహింపఁ బని లేదు.
ఇక బ్రాహ్మణుల విషయమునకు వచ్చినచో
భూతానాం ప్రాణినః శ్రేష్టాః ప్రాణినాం బుద్ధి జీవినః.
బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠా నరేషు బ్రాహ్మణాః స్మృతాః
బ్రాహ్మణేషు చ విద్వాంసో విద్వత్సు కృత బుద్ధయః
కృత బుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మ వేదినః. (మను స్మృతి).
సర్వ భూతములలోను ప్రాణులే శ్రేష్టములు. ప్రాణులలో బుద్ధి జీవులు శ్రేష్టములు. బుద్ధిఁ గలవాటిలో మానవులే శ్రేష్టులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్టులు. బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్టులు. విద్వాంసులలో కృత బుద్ధులైన వారు శ్రేష్టులు. కృత బుద్ధులలో ఆచరణ శీలురు శ్రేష్టులు. ఆచరణ శీలురలో బ్రహ్మ వేత్తలు శ్రేష్టులు.
కావున బుద్ధిజీవ మానవులై విద్వాంసులైన బ్రాహ్మణులై కృత బద్ధులైనవారు తదాచరణ శీలురై బ్రహ్మవేత్తలై ఇహ పర సాధకులు కావలెను.
బ్రహ్మజ్ఞానేతి బ్రహ్మణః .
బ్రహ్మ పుట్టుకకు, బ్రహ్మచే పుట్టించిన దానికి కారణము అయిన శక్తి  ఆత్మ రూపములో మనలోనే ఉన్నది అని గ్రహించిన వాడు బ్రహ్మజ్ఞాని. అతను మాత్రమే బ్రాహ్మణుఁడు.
విప్రాణాం జ్ఞానతోజైష్ఠ్యమ్.(మను ౨ -  ౧౫౫)
బ్రాహ్మణులలో పెద్దరికము జ్ఞానము వలననే నిర్ణయింపఁబడును.
న యోనిర్నాపి సంస్కారో న శ్రుతం నచ సంతతిః
కారణాని ద్విజత్వస్య, వృత్తమెవతు కారణమ్.
పుట్టుక కాని, సంస్కారము కాని, పాండిత్యము కాని ద్విజత్వమునకు కారణములు కావు. నడవడి ఒక్కటియే దానికి కారణము.
న జాతిః న కులం తాత న స్వధ్యాయం శ్రుతం నచ.
కారణాని ద్విజత్వస్యవ్రుత్తమెవతు కారణమ్. (మహాభారతమ్)
బ్రాహ్మణత్వమునకు కారణము జాతి కాదు. కులము కాదు. వేదాధ్యయనమున్నూ కాదు. పాండిత్యమంతకంటెనూ కాదు. ప్రవర్తనమొక్కటియే దానికి కారణము.
బ్రహ్మైకం పరమార్థ సత్. (సిద్ధాంత సంగ్రహము)
బ్రహ్మమొక్కటియె పరమార్థిక సామర్థ్యము కలది 
అను బ్రహ్మ జ్ఞానము కలిగి యున్నందుననే బ్రాహ్మణుఁడు పూజ్యుఁడగుచుండెను.
దైవాధీనం జగత్ సర్వం , మంత్రాధీనంతు దైవతం ,
తన్మంత్రం బ్రాహ్మణాధీనం , బ్రాహ్మణో మమ దేవత .
అని బ్రాహ్మణులు పూజింపఁబడుదురు. ఈ విధముగా పూజింపఁ బడుటకుండవలసిన అర్హతలు తప్పని సరిగా బ్రాహ్మణుఁడు కలిగి యుండవలెను కదా!
"శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజమ్"
మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, ఓర్పు, సత్ప్రవర్తన, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దేవుడిమీద నమ్మకము అనునవి బ్రాహ్మణులకు  స్వభావసిద్ధమైన కర్మలు. 
ఇట్టి ద్విజులు ఆచరింప వలసిన షట్ కర్మలను మనువు తెలిపెను.
యజనం యాజనం దానం బ్రాహ్మణస్య ప్రతిగ్రహః 
అధ్యాపనంచాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః.. (మసుస్మృతి)
యజ్ఞములు చేయుట, చేయించుట, దానములొసగుట, గ్రహించుట, బోధించుట, చదువుట, అను ౬ కర్మలు బ్రాహ్మణులకవశ్యాచరణీయములు.
నిత్యకర్మానుష్టానము, నిత్య భగవన్నామస్మరణము బ్రాహ్మణ ధర్మము. 
ఇంతటి సామాజిక శ్రేయోదృక్పథముతో వర్తించుట చేతనే బ్రాహ్మణుఁడు పూజనీయుఁడు.
అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములుగా భావింపఁబడి సామాజికులచే పూజింపఁబడుచు, మహోన్నత గౌరవార్హులగుచుండిరి.
ఇంతటి గౌరవార్హమైన బ్రాహ్మణ జన్మములనొందియు దుష్కర్మానుశీలురై ఆత్మాభిమాన రాహిత్యముతో అనాలోచిత జీవన సరళిచే అవహేళనములపాలై అత్యంత దయనీయ దుస్స్థితిని తమకు తామే కల్పించుకొనుచున్నవారు ఆత్మావలోకనము చేసుకొనవలసి యున్నది. 
ఏ సమాజమున బ్రాహ్మణ జాతి గౌరవింపఁబడుచున్నదో ఆ సమాజముననే అవహేళనపాలగుచున్న బ్రాహ్మణ వంశస్థులు కలరన్నచో  అది ఆ వ్యక్తుల యొక్క రుజు విరహిత ప్రవృత్తియే కారణము కాదా? 
ఎవరు ధర్మ బద్ధులై ఉందురో వారు గౌరవార్హులు. ఇతరులు గౌరవార్హులు కానేరరు. వైదిక వృత్తినాశ్రయించిన మహనీయుల సత్ప్రవృత్తి లోకమునకు మార్గదర్శకమనక తప్పదు. 
అట్టి వైదిక వృత్తిలో ఉండియు దురోదర సహవాస దుస్సంచార శీలురున్నచో వారు తమ తప్పిదమునకు మూల్యము చెల్లింపక తప్పదని జీవితమున గ్రహించి తీరుదురు. 
బ్రాహ్మణ తేజస్సు సత్ప్రవర్తన కాగా శిఖ, యజ్ఞోపవీతము, విభూతి, తిలక ధారణము, స్మిత పూర్వ భాషణము బాహ్యసౌందర్యాలంకారములు.
త్రికాల సంధ్యాది విధులందు అప్రమత్తులై శ్రద్ధాసక్తులతో నిర్వహించుచు ఆత్మ తోజస్సును వృద్ధి చేసుకొనవలెను. 
ఉదార చరితులై వసుధైక కుటుంబ భావ విలసిత హృదయులు కావలయును. ప్రియ వాఙ్మాధురులతో పరులకానందోత్సాహ కారకుఁలై వెలుఁగ వలయును. 
భూసురుఁడు సత్యవాగ్భాసురుఁడు కావలెను. 
అసంతుష్టో ద్విజో నష్టః.అని ఆర్యోక్తి కావున పౌరోహిత్యమున సంపాదనయే ధ్యేయము కాకుండా ఉండి లభించిన ద్రవ్యముతో తృప్తి పొందుట ధర్మము. విజ్ఞానమనునది మనకు 
ఆచార్యాత్ పాదమాదత్తే - పాదం శిష్య స్వమేధయా 
పాదం సబ్రహ్మచారిభ్యః - పాదం కాల క్రమేణతు. 
జ్ఞానములో పాతిక పాళ్ళు గురువుద్వారా , పాతిక పాళ్ళు శిష్యుని ఆలోచద్వారా , పాతిక పాళ్ళు తోటివారి ద్వారా. మిగిలిన పాతిక భాగము కాల క్రమమున ప్రాప్తించును.. 
కావున నిరంతరము శాస్త్ర గ్రంథ పఠనమవశ్యమాచరింపవలయును. 
ఇట్టి సల్లక్షణ సమన్వితులైయుండు ద్విజులు సర్వ కాల సర్వావస్థలయందును సర్వత్రా పూజ్యులై విరాజిల్లుట తథ్యము.
గాయత్రీ పద పద్మముల్ సతతమున్ కాంక్షింతు నాగుండెలో
శ్రేయస్కారకమై రహించ. సతమున్ శ్రీమాతృ తేజంబు నన్
మాయాదూరుఁగఁ జేయుతన్. సుగుణ సన్మాన్యోల్లసద్బ్రాహ్మణుల్
శ్రేయంబుల్ గనుతన్. సతంబు జగతిన్ శ్రీమంగళంబేలుతన్
ఓం స్వస్తి.
చింతా రామ కృష్ణా రావు.

రగడలు ద్విపదలు. వీనికి ప్రాస మాత్రమే కాక అంత్యప్రాస కూడ అవసరము.

జైశ్రీరామ్. 

రగడలు ద్విపదలు. వీనికి ప్రాస మాత్రమే కాక అంత్యప్రాస కూడ అవసరము. 

తెలుగులో యతి తప్పక నుండవలెను.                                                                 

అనంతామాత్యుని ఛందోదర్పణములో      

ఆద్యంతప్రాసంబులు  -  హృద్యంబుగ రెంట రెంట నిడి పాదములు                                 

ద్యద్యతులఁ గూర్పఁదగునన - వద్యంబగు రగడలందు వారిజ నాభా.   

అని రగడను నిర్వచించి, తెలుగులో తొమ్మిది రకములైన రగడలు చెప్పెను.                                     

 1.హయప్రచార రగడ - త్రిమాత్రలు నాలుగు, త్రిశ్ర, 1.1, 3.1                                               

2.తురగవల్గన రగడ - త్రిమాత్రలు ఎనిమిది, త్రిశ్ర, 1.1, 5.1                                               

3.విజయమంగళ రగడ - త్రిమాత్రలు పదునాఱు, త్రిశ్ర, 1.1, 9.1                                         

4.ద్విరదగతి రగడ - పంచమాత్రలు నాలుగు, ఖండ, 1.1, 3.1                                           

5.జయభద్ర రగడ - పంచమాత్రలు ఎనిమిది, ఖండ, 1.1, 5.1                                          

 6.మధురగతి రగడ - చతుర్మాత్రలు నాలుగు, చతురస్ర, 1.1, 3.1                                       

7.హరిగతి రగడ - చతుర్మాత్రలు ఎనిమిది, చతురస్ర, 1.1, 5.1                                           

8.హరిణగతి రగడ - త్రి చతు త్రి చతు, మిశ్ర, 1.1, 3.1                                                  

9.వృషభగతి రగడ - త్రి చతు త్రి చతు త్రి చతు త్రి చతు, మిశ్ర, 1.1, 5.1

మూడు మాత్రల రగడలను ఉత్సాహ రగడ లందురు..

ఉత్సాహ: ౭సూ.గ. గురువు. యతి: 1.1, 5.1

చలికి వణకె చేతు లిచట చలికి కాళ్ళు వణకెరా.

చలికి వణకె పెదవు లిచట చలికి నోరు వణకెరా.

తురగవల్గనరగడ: ౮సూ.గ, యతి: 1.1, 5.1, ప్రాస: అంత్యప్రాస

చలికి వణకె చేతు లిచట చలికి కాళ్ళు వణకెరా(మ)

చలికి వణకె పెదవు లిచట చలికి నోరు వణకెరా(మ)                                                   

మాత్రాబద్ధమైన పద్యములు, పాటలు పాడుటకు అత్యుత్తమమైనవి.                               

మూడు మాత్రల నడకను త్రిశ్రగతి యందురు. త్రిశ్రగతికి రూపక తాళము,                         

నాల్గు మాత్రల నడక చతురశ్రగతి యగును.  చతురశ్రగతికి ఏక తాళము,                         

ఐదు మాత్రల నడక ఖండగతి యనబడును.  ఖండగతికి జంపె తాళము,                         

మూడు, నాల్గు మాత్రలతో మిశ్రితమైన నడక మిశ్రగతి యగును. 

మిశ్రగతికి త్రిపుట తాళము వాడుకలో నున్నవి. 

చతుర్మాత్రలకు అట తాళము, పంచమాత్రలకు ధ్రువ, మఠ్య తాళములు 

కూడ వాడబడినవి                                                                 

'నమశ్శివాయరగడ' .చక్రపాణి రంగనాథు

శ్రీగిరీశ వశ్యమంత్ర సేకరము నమశ్శివాయ

ఆగమోపదిష్ట విధి మహాకరము నమశ్శివాయ

పంచవర్ణ పంచరూప భాసురము నమశ్శివాయ

అంచితానురక్త జిత గజాసురము నమశ్శివాయ

'నయనరగడ'  చక్రపాణి రంగనాథు

శ్రీశైల వల్లభుని శిఖరంబుఁ బొడగంటి

కాశీ పురాధీశు గౌరీశుఁ బొడగంటి

సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి

సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి.

సుదర్శన రగడ తాళ్లపాక యన్నమాచార్యుల కొమారుండు తిరుమలయ్యంగారు

ఓంకారాక్షరయుక్తము చక్రము

సాంకమధ్యవలయాంతర చక్రము

సర్వఫలప్రదసహజము చక్రము

పూర్వకోణసంపూర్ణము చక్రము.

జైహింద్.