జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 11 / 2 2వ భాగము 51 నుండి 55వ పద్యము వరకు.
చ. స్వరములలోన నోంకృతిని, స్వాదుశుభాస్పద భాషణంబునున్,
నిరుపమ నిర్మలాత్మను, వినీతి ప్రవృత్తిని, నిర్వికల్పమున్,
గరువముఁ బెంచు కావ్యకృతి, గౌరవనీయుల సన్నిధానమున్,
దొరలఁగఁ జేయు మెల్లెడలఁ దోచగనిమ్ము శుభాళి, భారతీ! 51.
భావము.
ఓ వంద్యామాతా! ఓంకార శబ్దమును, మధుర శుభంకరభాషణమును సాటిలేని
నిర్మలమైన ఆత్మను,నైతిక ప్రవృత్తిని, నిర్వికల్ప జ్ఞానమును, అందరూ
ప్రశంసించు కావ్యనిర్మాణ దక్షతను, గౌరవనీయుల సాన్నిధ్యము, ఎల్లెడలా
అనుభవింపఁ జేయుము.శుభసంహతినే నా మనసునకు తోచునట్లు చేయుము.
చ. ధ్వని జనియింప భావమును, తత్వము, నెన్నసుసాధ్యమౌను, త
ధ్వనియె రహస్య సృష్టికిల దారులు కొల్పెను ప్రస్ఫుటంబుగా
ననితర సాధ్య సాధక మహాధ్వని యోంకృతి నీదు రూపమే
మనమున మారుమ్రోగు నది, మాన్యత నొప్పెడి దివ్య భారతీ! 52.
భావము.
మన్ననతో ఒప్పెడి ఓ జటిలా! శబ్దము పుట్టినచో భావమును, తత్వమును,
తెలుసుకొనుట సాధ్యమగును. అట్టి ధ్వనియే ఈ రహస్యమైన
సృష్టికిమార్గము లేర్పరచెను. అట్టి ధ్వనులలో అనితర సాధ్యమైనది
ఓంకార నాదము. అది నీ పూర్ణ రూపమేనమ్మా. అది నా మనస్సులో
మారుమ్రోగుచూ ఉండునమ్మా.
చ. సురుచిర బ్రహ్మ దృష్టిని వసుంధర నెల్ల సృజంబులయ్యె సు
స్థిరమన స్థావరాదులు. వశీకరణంబయి మాయ చేతికిన్
నరకము చూచుచుండెను, వినాశనమే కనిపించునెల్లెడన్,
గరుణను జూపి కావు మిల. కామిత దాయిని! దివ్య భారతీ! 53.
భావము.
కోరికలను పండించు మనోజ్ఞవయిన ఓ వింధ్యవాసా! మిక్కిలి
కాంతివంతమయిన బ్రహ్మ చూపు తగిలినంత మాత్రము చేతనే భూమిపై
స్థావరాదులన్నియు స్థిరములనుకొను విధముగా సృజింపఁబడినవి.
మాయకు చిక్కి నరకముననుభవించుచున్నవి. ఎక్కడ చూచినను వినాశనమే
గోచరమగుచున్నది. నీవు కరుణించి కాపాడుమమ్మా.
చ. ప్రగతిని కోరువారలకు భాగ్యము నీ కృప, భద్ర మార్గమున్
సుగమము చేయునమ్మ. మధుసూదనుఁడైనను మెచ్చు నీదు సత్
ప్రగణిత భావనా కృతిని వర్ధన శక్తిని. లోక బాంధవీ!
నిగమ సువేద్యుఁడౌ విధికి నేర్పుగ నీ గతి నేర్పు భారతీ! 54.
భావము.
ఓ వింధ్యాచల విరాజితా! వేదములందెఱుఁగబడు బ్రహ్మకు నీ సుగతిని
నిపుణతతో నేర్పెడి లోక బాంధవీ! ప్రగతి పథమున చరించువారికి నీ కృపయే
భాగ్యము. భద్రమార్గమును సుకరముగా లభింపఁ జేయునుకదా. నీ యొక్క
ప్రశంసనీయమైన భావనాధన వివృద్ధి చేయు శక్తిని మధుసూదనుఁడునూ
మెచ్చునమ్మా.
చ. జగతికి వెల్గువీవె. విరజాజుల సౌరభమీవె. వెల్గుదీ
వగణిత భావ బోధన నహర్నిశలున్ వర శబ్దజాలమై.
సుగమము చేసి సాధకుల సుందర స్వప్నము మోక్షసిద్ధి. సత్
ప్రగతిని సాగఁ జేయుము నిరంతరసాధన నిచ్చి భారతీ! 55.
భావము.
ఓ చండికా మాతా! లోకమునకు వెలుగువు నీవే. విరజాజుల సువాసన నీవే.
గొప్ప జ్ఞానమును కలుగఁజేయుశబ్దరూపమున నీవు ఎల్లప్పుడూ ప్రకాశింతువు.
సాధకుల సుందర స్వప్నఫలమైన మోక్షసిద్ధిని సుగమము చేయుము.
నిరంతర సాధననిచ్చి మంచి ప్రగతిమార్గమున నడిపించుమమ్మా.
జైహింద్.
No comments:
Post a Comment