జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 12 / 2 2వ భాగము 56 నుండి 60వ పద్యము వరకు.
చ. క్షణములలోన పద్యములు కమ్మగ వ్రాయు కవీశులందు, సద్
వినుత వధానముల్ సలుపు విజ్ఞతనొప్పు వధానులందు, ని
న్ననయము గొల్చు భక్తుల మహాద్భుత భావవిలాసమందు నీ
వనయము గొల్వు తీరెడి మహాద్భుత శక్తివి చూడ భారతీ! 56.
భావము.
ఓ వైష్ణవీ మాతా! అలవోకగా పద్యములు కమ్మగా వ్రాయు కవీశ్వరులందు,
గణితావధానము సునాయాసముగా చేయు అవధానులందు, నిన్ను ఎల్లప్పుడూ
కొలిచే భక్తులు గొప్ప అద్భుతమైన భావ విలాసమున నీవెల్లప్పుడు కొలువుతీరి
యుందువమ్మా.నిజముగా నీవు మహాత్మ వరేణ్యవుమ్.
చ. నిరుపమ సాధనా పటిమ నిన్ను గ్రహింపఁగఁ జేయు. నీదు సుం
దర దరహాస చంద్రిక ముదంబును గూర్చును మాకు నిత్యమున్.
మరి మరి వేడుకొందు ననుమానము శూన్యముఁ జేసి నిన్ మదిన్
స్థిరముగనుండఁ జేయునటు చేయుము నాకు మనోజ్ఞ భారతీ! 57.
భావము.
మనోజ్ఞమైన ఓ బ్రాహ్మీ! సాటిలేని భావనా బలము నిన్ను గ్రహించునట్లుగా
మమ్ము చేయును. నీ అందమైన చిఱునగవు మాకు నిత్యమూ సంతోషమును
కూర్చునమ్మా.నాలో అనుమానమును పోవునట్లు చేసి, మనస్సు నిన్ను
స్థిరముగా లోన ఉంచుకొనునట్లు చేయుమని మరీ మరీ ప్రార్థించుచున్నాను.
చ. వరముగ నీవె దక్కితివి వర్ధిలఁ జేయగ మమ్ము తల్లివై
నిరుపమ మార్గదర్శివయి నేర్పెదవీవు చరించు పద్ధతిన్,
గురువయి కూర్మి చూపెదవు కోరిన విద్యలనెల్ల నేర్పుచున్.
భరముగ నెంచవెన్నడును భక్తులనో మహనీయ భారతీ! 58.
భావము.
మహనీయవైన ఓ బ్రహ్మజ్ఞానైకసాధనా! మమ్ము వృద్ధి చేయు తల్లివై మాకు
వరముగా నీవు లభించితివమ్మా. సాటిలేని మార్గదర్శిగా ఉండి నీవు మాకు
ప్రవర్తనా విధానమును మప్పెదవమ్మా. మేము కోరుకొనెడి విద్యలు నేర్పు గురువుగా
ఉండి ప్రేమను చూపించుదువుకదా.నీ భక్తులను ఎప్పుడూ భారముగా
తలపోయని తల్లివమ్మా నీవు.
చ. సరియెవరమ్మ నీకు మనసా వచసా భవదీయ పాద సం
స్మరణము చేయు భక్తులను మానసమందు వసించి కాచుటన్?
జరిపెదవీవమోఘమగు సత్కృతులన్ కవికావ్య కాంతికిన్
వరగుణ మేధకున్, ధృతినవారిత రీతి నొసంగు భారతీ! 59.
భావము.
శ్రేష్ఠమైన గుణములతోనొప్పు మేధా సంపత్తిని అంతు లేని విధముగా ప్రసాదించు
ఓ సౌదామినీమాతా! త్రికరణ శుద్ధిగా నిన్ను కొలుచు భక్తుల మనస్సులలో ఉండి
కాపాడుటలో నీకు సాటి ఎవ్వరూ లేరమ్మా. కవియొక్క కావ్య ప్రకాశమునకు నీవు
సత్కృతి జరిపించుచుందువు కదా.
చ. గరువము బాపు దేవతవు, కామిత సత్ ఫలదాతవీవు. నీ
చరణము సంస్మరించినను సంస్మృతులెన్నడు చేర రావు. సు
స్థిరముఁగ నిన్ను నామదిని జేర్చి భజింపఁగ శోభ గూర్తువే
నిరుపమ నిర్వికల్పమును నేర్పుగ మన్మది నుంచు భారతీ! 60.
భావము.
ఓ సుధామూర్తీ! నాలోని గర్వమును పోఁగొట్టెడి దేవతవమ్మా నీవు.
నీ పాద సంస్మరణ మాత్రముననే సంస్మృతులు విడిపోవును. నా మనస్సులో
సుస్థిరముగా నిన్ను చేర్చి భజించితినేని నాకు శోభను కలుగఁ జేయుదువు.
సాటి లేని నిర్వికల్పమును నీ నిపుణతతో నా మనస్సులో స్థిరపరచుము తల్లీ.
జైహింద్.
No comments:
Post a Comment