జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 20 / 2 2వ భాగము 96 నుండి 100వ పద్యము వరకు.
చ. నిరతము నీ పదాబ్జములు నేను మదిం గని, పొంగనిమ్ము, సు
స్థిరముగ నీ నిధానమగు తెల్గుల తేజము చాటనిచ్చి, యం
తరములు లేని యాత్మనిడి ధన్యత తోడఁ జరింపనిమ్ము, నే
పరమ పథంబుగాంచఁదగు భక్తినొసంగుము. దివ్య భారతీ! 96.
భావము.
ఓ దివ్య భారతీ మాతా! నీ పాదపద్మముల నెల్లప్పుడునూ నామదిలో చూచుకొనుచు
నన్ను సంతోషింపనిమ్ము. నీ నిధానములైన తెలుగు తేజమును సుస్థిరముగ
చాటునట్లు చేయుము. భేద భావములు లేని మనసును నాకు ప్రసాదించి
ధన్యతతో జీవింపనిమ్ము. పరమపథమునంద తగిన భక్తిని నాకొసగుమమ్మా.
చ. వినయముతోడ సత్కృతిని విజ్ఞులుమెచ్చఁ గ నీ కొసంగెదన్.
ఘనమగు భావనాపటిమ కన్బడుటన్న నమోఘమౌనొ. శో
ధనమున దోషపంకిలము తప్పదొ తోచక. సైచుమన్నియున్
గుణములనేకముల్ గలుఁగుఁ గూర్మిని గొల్పితివీవె భారతీ! 97.
భావము.
ఓ శివా! విజ్ఞులు మెచ్చునట్లుగా వినయముతో నీకీ చంపకభారతిని
సమర్పింతునమ్మా.గొప్ప భావనాపటిమ కనఁబడుచూ అమోఘముగా ఉండునో
లేక పరిశీలన చేసిచూచినచో దోషపు మరకలు కనబడి తీరునో యేమో. అన్నియు
నీవు సహించుమమ్మా.నీవే ప్రేమతో ఈ శతకము వ్రాయఁ జేసితివి కాన గుణములు
తప్పక ఉండి తీరునమ్మా.
చ. సుధఁ గురిపించు తల్లివని శోభిలఁ జేసెదవంచు నెంచి, నే
నెద నిను నిల్పి, నేడు పరమేశ్వరునానతిఁ జేసి వ్రాసితీ
సదమల శోభనోజ్వలిత చంపక భారతి. మంచి చెడ్డలన్
మదినిడఁబోక కైకొనెడి మాతవు సన్నుత రూప. భారతీ! 98.
భావము.
ఓ కామప్రదా!! సుధను వర్షించు తల్లివని, శొభిలఁ జేయుదువని.నేను నిన్ను
నా మనసులో నిలిపి ఆ పరమేశ్వరునాజ్ఞ వలన నేడు సదమల శోభనోక్వలిత
చంపక భారతిని రచించితిని. మంచిచెడ్డలనెంచక స్వీకరించే తల్లివమ్మా నీవు.
ఈ చంపక భారతీ శతకమును గ్రహించుమమ్మా.
చ. కొనుమిది భారతీ జనని కోమల చంపక భారతీ కృతిన్
వినఁబడఁ జేయుమమ్మ పృథివీ స్థలి నందరు సంతసింపఁగా.
జననము లేని ముక్తిపథ సద్గతినిమ్మ పఠించువారికిన్.
గని ననుఁ గావుమమ్మ వర కామితముల్ నెరవేర్చి, భారతీ! 99.
భావము.
ఓ విద్యాధరసురపూజితా! కోమలమైన ఈ చంపక భారతీశతకమును నీవు
స్వీకరింపుమమ్మా. భూమిపై అందరూ సంతోషించునట్లు దీనిని వినఁబడునట్లు
చేయుము తల్లీ. ఈ డతకపాఠకులకు పునర్జన్మరహిత ముక్తిని ప్రసాదించుము.
నీవు నన్ను ప్రేమతో జూచి, మంచి కోరికలును నెరవేర్చి కాపాడుము తల్లీ
చ. శుభమగు పాఠకాళికి వసుంధర చంపక భారతీ కృతిన్.
ప్రభుతకు మేలుగాత. పరిపాలనచే ప్రజ సంతసించుతన్.
విభవముతోడ సజ్జనులు వెల్గుత మంగళ కార్యధుర్యులై
యభయముగా వెలుంగుమిల నార్యుల సంస్కృతిఁ బెంచి భారతీ! 100.
భావము.
ఓ శ్వేతాననా!ఈ చంపక భారతీకృతి కారణముగా పాఠకులకు శుభము అగుగాక.
ప్రభుత్వమునకు శుభమగుగాక. పరిపాలన ప్రజారంజకముగా ఉండు గాక.
మంగళ కార్య ధుర్యులఒ సజ్జనులు విభవముతో ప్రకాశింతురు గాక.
ఆర్య సంస్కృతిని పెంచి అభయముగా ఉండుగాక.
జైహింద్.
No comments:
Post a Comment