జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 2 / 22 వ భాగము 6 నుండి 10వ పద్యము వరకు.
చ. కనుప నకారమాద్యవయి కల్పన చేయుదువన్ని నీవెయై
మనుప నుకార మధ్యవయి మన్ననతో నడిపింతు విన్నిటిన్.
దునుప మకారమంతమయి దోయిలిఁ బట్టి గ్రహింతువన్నిటిన్,
నినుఁ గన నోంకృతిన్ మునులు నిత్యము గొల్తు రనంత భారతీ! 6.
భావము.
ఓ పద్మనిలయా! అకార స్వరూపవై సృష్టిని చేయుచుంటివి. ఉకార స్వరూపవై
నడుపుచుంటివి. మకార రూపవయి నీలో కలుపుకొనుచుంటివి. అందువలననే
నిన్ను చూచుట కొఱకు భక్తులు ఓం కార రూపమున నిన్ను నిత్యము
కొలుచుచుందురు.
చ. పలుకుల తల్లివీవు. పరిపాలనఁ జేసెద వెల్ల లోకముల్,
మెలకువ తోడ పల్కినను మేలును గూర్తువు మాకు నట్టి మా
పలుకులలోన దోషములు వచ్చుట నీ దయ లేకపోవుటన్.
పలుమరు వేడుకొందు. వర భాషణ భాగ్యము నిమ్ము భారతీ! 7.
భావము.
ఓ పద్మాక్షీ! నీవు పలుకులమ్మవు. లోకములను పాలించుదువు. మేము స్పృహ
కలిగి మాటాడినచో మంచి చేయుదువు. ఆ విధముగా పలికే మా మాటలలో
దోషములు నీ కృప లేకపోయినప్పుడే వచ్చును. మాచేత మంచిగా మాటాడ
చేయుమని నిన్ను వేడుకొందునమ్మా.
చ. పరుల మనంబులన్నిలువ, పట్టుగ వారికి శోభఁ గూర్పఁగా,
వరమగు భాషణం బెలమి వారి మనంబులు మెచ్చు మాటలున్,
నిరుపమ సాధు వృత్తి, మహనీయతయున్ భవదీయ సత్కృపన్
వరముగఁ గల్గినన్ గలుఁగు. భాగ్యమదే కద మాకు భారతీ! 8.
భావము.
ఓ పద్మవక్త్రా!! నీ కృపావరముననే ఇతరుల మనస్సులలో స్థానము
సంపాదించుట, వారికి శోభను కొల్పఁగలుగుట, శ్రేష్టమైన భాషణము, వారి
మనసునకానందము కలిగించు విధముగ మాటాడుట, సాటిలేని మంచి ప్రవర్తన,
మహనీయత, అనునవి మాకు లభించునమ్మా.అదే కదా మాకు భాగ్యము.
చ. ఇహ పర సాధకంబగు మహీస్థలి వాక్ పరి భూషణంబు. స
న్నిహితముగా పరాత్పరుని నేర్పునఁ జూడఁగఁ జేయు. భాషణం
బిహమున శాంతి సౌఖ్యము లహీన పరాత్పరుచింతనంబునున్
మహిమను గొల్పునమ్మ. కనుమా! వర భాషణ మిచ్చి భారతీ! 9.
భావము.
ఓ శివానుజా! మాటలాడుట అనెడి గొప్ప అలంకారము మానవులకు ఇహపర
సాధక సాధనము. పరాత్పరుని నిపుణతతో సమీపమునుండి చూచునట్లు
చేయును. మాటయనెడిది ఐహికముగా శాంతిని, అంతులేని పరాత్పర
చింతనమును, మహిమను కలుగజేయును తల్లీ.
చ. మనమున హావ భావములు మాటలఁ గానఁగఁ జేయుచుండ నా
వినెడి మనంబులం గలుఁగు భిన్న వివేచనఁ జేసి మంచిగా
కనఁబడు, చెడ్డ కానఁబడు, కాంచెడివారి మనంబు సాక్షిగా,
వినఁబడ మంచిగా పలుకఁ బ్రీతిని జేయుమ మమ్ము భారతీ! 10.
భావము.
ఓ పుస్తకభృతా! మాట యనునది మానవుని మనసులోని హావభావములను
ముఖములో కనఁబడునట్లు చేయును. వినెడివారి వివేకమును పట్టి వినెడి
మాటలు మంచిగా అనిపించవచ్చును, లేదా చెడ్డగా అనిపించ వచ్చును.
మమ్ములను చూచువారి మనసులకు మేము మంచిగా అనిపించుకొను విధముగా
పలుకునట్లు మమ్మనుగ్రహింపుము.
జైహింద్.
No comments:
Post a Comment