జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము.4 / 22వ భాగము 16 నుండి 20వ పద్యము వరకు.
చ. సుమధుర భావనాంబర సుశోభిత మూర్తి యనంత కృష్ణ తే
జమును గనంగ సాధ్యమగు సద్వర భావ ప్రపూర్ణ దివ్య చి
త్త మహితులైన వారికిల, తత్పరతన్ నిజ తైజసంబునన్.
ప్రముదముతోడ వారి మది వర్తిలుచుందువు నీవు భారతీ! 16.
భావము.
ఓ మహాపాతకనాశినీ! మంచి శ్రేష్ఠమైన భావప్రపూర్ణులైన గొప్పవారికి మంచి
మధురమైన భావనాకాశములోవిహరించువాడయిన కృష్ణుని యొక్క అనంతమైన
తేజమును చూచుటకు సాధ్యపడును ఏలననగా నీవు అటువంటి వారి
మనస్సులలో సంతోషముతో వసించుచున్నందుననే.
చ. నిరుపమ శాంతి తత్వము, వినిర్మల చిత్తము, సత్ప్రవృత్తి, నీ
సురుచిర సుందరాక్షర విశుద్ధ ఫలంబులనొందువారికిన్
వరములుగా లభించును. సభాసదు లెల్లెడఁ బ్రస్తుతింప. నీ
చరణములంటి మ్రొక్కెదఁ, బ్రశాంతముగా నను గాంచు. భారతీ! 17.
భావము.
ఓ మహాశ్రయా! నీ సాటిలేని అందమయిన అక్షర ప్రసూనములొందగలిగినవారికి
నిర్మల ప్రశాంత చిత్తము, మంచి నడవడిక ఫలములుగా లభించును, అంతటనూ
నన్ను సభాసదులు ప్రశంసించున్నతరి నేను నీ పాదములను మనసుచేత తాకి
మ్రొక్కుచుందునమ్మా. నన్ను ప్రశాంతునిగా కాపాడుము.
చ. జగతికి మూలమెద్ది కన? శబ్దమె కాఁదగు. నక్షరాకృతిన్
సుగతికి సాధకంబునయి చూడఁగఁ జేయు ననంత తైజసం
బగు పరమాత్మ తత్వమును. భక్తి, స్వశక్తి ప్రయుక్త మార్గమున్
భగవ దనుగ్రహంబు మురిపంబునఁ గొల్పఁగ నీవు భారతీ! 18.
భావము. ఓ మాలినీమాతా! ఆలోచింపగా ఈ జగతికి మూలము శబ్దమే అగును. నీవు
మాకు స్వశక్తి ప్రయుక్త మార్గమును భగవదనుగ్రహమును కల్పించిననాడు అది
అక్షరాకృతిలో సుగతికి మార్గమయిన అనంత తేజోరూపమయిన పరమాత్మ
తత్వమును చూచునట్లు చేయును.
చ. క్షరమగు సృష్టిఁ బుట్టి, ఘన కర్కశ వృత్తులు చేతఁ బట్టి, య
స్థిర మగు జీవితంబున గతించెడి కాలము విస్మరించి, సం
కర మతులైన వారికిని గల్గినఁ గల్గును గాదె నీదు సుం
దర చరణాబ్జ మందుటయు, ధాత్రిని ధన్యులు వారు, భారతీ! 19.
భావము.
ఓ మహాభోగామాతా! నశించెడి ఈ సృష్టిలో పుట్టి, కర్కశమైన వృత్తులను జీవితము
గడుపుటకు ఎంచుకొని, స్థిరము కాని ఈ జీవితమున గడిచిపోయే కాలం గుర్తించక
కలుషిత మతులైన వారికి కూడా నీ పాద పద్మదర్శనభాగ్యము నీ అనుగ్రహముచే
కలుగవచ్చునమ్మా.వారెంతటి అదృష్టవంతులో కదా.
చ. కటిక కసాయి బోయకు ప్రకాశముఁ గొల్పఁగ నారదుండు ప్రా
కటముఁగఁ జెప్పరామిని ప్రకల్పనఁ జేసి మరా యటంచు సం
కటములు బాపు వర్ణములు గాఢముగా మది కెక్కఁ జెప్పఁగా
కటిక కసాయి సాధువయి కావ్యమునే విరచించె భారతీ! 20.
భావము.
ఓ మహాభుజా! కటిక కసాయి అయిన బోయవానికి జ్ఞానము కలిగించ గోరి నారదుడు
వానికి సంకటములు బాపు రామ శబ్దమును మరా అని ఉపదేశించగా ఆ కసాయి
ఆ జపము చేసి సిద్ధిపొంది నీ అనుగ్రహమున రామయణ కావ్యమునే వ్రాసెను.
జైహింద్.
No comments:
Post a Comment