జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 6 / 2 2వ భాగము 26 నుండి 30వ పద్యము వరకు.
చ. అసదృశమంచు వస్తువుల నాదరణంబొనరింత్రు కొన్నిటిన్,
విషమముగా తలంచెదరు భీతిని కొందరు కొన్నిటిన్, భువిన్
విషయము స్పష్టమాయె, కలప్రీతికి భీతికి హేతు వీవె యో
ధిషణ నిధానమా! కృపను తేజముఁ గొల్పెడి దివ్య భారతీ! 26.
భావమ.
ఓ మహాపాపాశామాతా! సాటి లేనివిగా తలచి కొందరు కొన్ని వస్తువులను అతిగా
ఆదరింతురు. కొందరు కొన్నింటిని విషమముగా భావించి భయపడుచుందురు.
ఇట్టి భావనలన్నింటికినీ నీవే కారణము. నీవు హృదయములలో కలిగించు
ప్రేరణయే ఇన్నిటికీ మూలము. సాటిలేని ఓ భారతీమాతా! మహాద్భుతమైన
భావనలను మా హృదయములందు కల్పింపుము.
చ. క్షరము గణింప నీ జగతి. గౌరవ సన్మహనీయ గాధలన్
సురుచిరమై వెలుంగుటది చూడగ హేతువు నీవె కాదె? నీ
వరగుణ వర్ణ సంచయ మవారిత రీతిని నిల్పు నీ కథల్.
పరమ వివేక మీ జగతి భాసిలఁ జేయునదీవె భారతీ! 27.
భావము.
ఓ మహాకారా! ఈ లోకము నశించునదే. అట్టి యీ జగతిలో గౌరవపూరిత గాథలు
ప్రకాశించుచుండుటకు కారణము నీవేకదా. వరగుణభాసితమైన నీ స్వరూపమైన
వర్ణ సంచయము నీ మహనీయ గాథలను శాశ్వితముగా నిలుపునమ్మా.
ఈ ప్రపంచమున పరమ వివేకమును భాసిలఁ జేయునది నీవేకదా.
చ. జగతి ననంత సాక్షి గుణ సన్నుత పాళికి, దుష్ప్రజాళికిన్.
సుగణిత సచ్చరిత్రకులు శోభిలు గాధలలోన, నీ కృపన్
నిగమ సువేద్య దైవమటు నిర్భర కీర్తి మనోజ్ఞ చంద్రికల్,
సొగసులు, భూమిపై వెలుఁగ సుస్థిరులై మనుచుంద్రు భారతీ! 28.
భావము.
ఓ మహాంకుశామాతా! సద్గుణములచే పొగడఁబడు మంచివారి సమూహమునకైనను,
దుర్మార్గులకైనను వారి చరిత్రలకు ఈ లోకమే సాక్ష్యము. నీ కృప వలన గొప్పగా
గుర్తింపఁబడెడి మంచిగా ప్రవర్తించు మహనీయులు వారి గాధలలో
ప్రకాశించుచుందురు. వేదములందెఱుగఁబడు దైవము వలె వారియొక్క
పూర్తిగా నిండిన మనోజ్ఞమైనకీర్తికాంతి యొక్క సొగసులు భూమిపై
ప్రకాశించుచుండగా ఆ కీర్తి రూపమున భూమిపై స్థిరముగ నిలిచిపోవుదురు.
అన్నిటికీ నీ కృపయే కారణము..
చ. మగనికి సృష్టి కర్త యను మన్ననఁ గొల్పితివీవె కాదె? నీ
మగని ముఖాబ్జమున్ నిలిచి మన్నికతో ‘సృజియించు కార్యమున్
దగిన విధంబుగా సలిపి, తత్ప్రభ భర్త పరంబు చేయుదీ
వగణిత భావనా భరిత! అక్షర రూప విలాస భారతీ! 29.
భావము.
ఓ అగణిత భావనాభరిత! ఓ అక్షర రూపా! ఓ పీతామాతా! నీ భర్తయగు బ్రహ్మకు
సృష్టికర్త యనెడి గౌరవమును నీవే కొలిపితివి కదా. నీ భర్త యొక్క ముఖపద్మమున
నీవు వసించియుండి, గౌరవముతో సృష్టి చేయు పనిని చేసి, ఆ కీర్తిని భర్తకు
కలిగించుచుంటివికదా.
చ. హరి జగతిన్ వహించియు నహర్నిశలున్ మదిఁ జింతనొందు. నీ
వరయుచు భాషణాధ్వర మహావ్రతమున్గృప సేయకున్నచో
జరుగునదెట్లు లోకమని. చక్కని వాఙ్మహనీయ భాగ్యమై
నిరుపమ లోకమాతవయి నిత్యము వర్తిలుదీవు భారతీ! 30.
భావము.
ఓ విమలామాతా! లోకభారమును శ్రీహరి భరించుచు, అన్నియు నీవు చూచుచు
భాషణాధ్వర మహావ్రతమును నీవు కృపతో చేసియుండనిచో నేను ఈ పనిని
ఏ విధముగా చేయ గలిగి యుండెడివాడిని? ఈ లోకము ఏ విధముగా జరుగును
అనుచు నిత్యమూ ఆలోచించుచుండును. నీవు సాటిలేని మహనీయమైన
వాగ్రూపములో మాకు లభించిన భాగ్యముగా నిలిచి ప్రవర్తించుదువమ్మా.
జైహింద్.
No comments:
Post a Comment