Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 16 / 22వ భాగము 76 నుండి 80 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  16 / 2 2వ భాగము 76 నుండి  80వ  పద్యము వరకు.


చ. వలచిన నిన్ను నెంచుచునవారిత రీతిని బ్రహ్మ మోములన్  

నలుదిశలం గనుంగొనగ నాల్గు పదంపడి యొందియుండు. నీ

తలపులనంత సృష్టికి విధాతగ తోడ్పడునంచు నెంచుటన్.

ఫలితముగా ముఖాబ్జముల భ్రాంతిగ నిన్ వరలించె భారతీ! 76.  

భావము. 

ఓ శుభదా! నిన్ను గూర్చిన ఆలోచనలే యీ అనంతమైన సృష్టి చేయుటకు 

తనకు తోడ్పడునని అతఁడు భావించియుండుట చేతనే సృష్టికర్త యగు బ్రహ్మ 

నిన్ను వలచి నాలుగు దిక్కులనూ నిన్ను కనుఁగొనుటకు నాలుగు ముఖములను 

పొందియుండును. దీని ఫలితముగనే నిన్ను తన నాలుగు ముఖములందును 

నిన్ను వరలించియుండునమ్మా.


చ. జనని భవాని నీవలెనె సన్నుత శ్రీహరి రాణి నీవలెన్ 

ఘనతరమైన సృష్టి శుభ కార్యము చేయుననంత శక్తితో

ననుపమ సాధనాగరిమనంతయు నీవె యనుగ్రహింపగా.

మనమున ముగ్గురమ్మలకు మాతృకవీవగుదమ్మ భారతీ! 77. 

భావము. 

ఓ స్వరాత్మికా! సాటి లేని సాధనా సంపత్తిని నీవనుగ్రహింపగా లక్ష్మీ పార్వతులు 

ఈ సృష్టిని నిర్వహించుచున్నారమ్మా.మనస్సులో ఉండే నా ముగ్గురమ్మలకు 

మాతృక నీవేనమ్మా.


చ. వెలుగులవెల్ల నీవలన వెల్గెడి వెల్గులె, వేద రూపిణీ!

కలిగెడివెల్ల నీవలన కల్గెడి కల్ములె సద్విభాసినీ!

పలికెడివెల్ల నీవలన పల్కెడి పల్కులె బ్రహ్మ భామినీ!

తెలియునవెల్ల నీవలన దీప్తమగున్ మహనీయ భారతీ! 78. 

భావము. 

వేద రూపిణివైన ఓ రక్తబీజ నిహంతీ! వెలుగులవెచ్చట నున్నను అవి 

నీవలననే వెలుగునవి.ఓ సద్విభాసినీ కలిగెడి కలుములు కూడా నీ వలన 

కలిగెడివే కదా.ఓ బ్రహ్మాణీ! పలుకునవన్నియు నీవలన కలిగినవేనమ్మా.

ఓ మహనీయ భారతీ తెలిసెడివన్నియు నీ వలననే తెలియుచున్నవిసుమా.


చ. సృజనములైన సర్వమును సృష్టిగ ధాత యొనర్చినట్టివే

ప్రజనిత భాగ్య మెల్ల భగవంతుని సృష్టియె. భారతంబునన్

సుజనులు దుర్జనుల్ కలరు చూడుమిదెవ్వరి సృష్టి యౌనొ? నీ

ప్రజలను సన్నుతాత్ములుగ భవ్య మనంబునఁ గాచు భారతీ! 79. 

భావము. 

ఓ చాముండామాతా! సృజింపఁబడు అన్నింటి సృష్టియు బ్రహ్మ చేసినవే. 

పుట్టింపఁబడిడి భాగ్యమంతయు భగవంతుని సృష్టియే. భారతమున 

మంచివారు, చెడ్డవారూ ఉండిరి. ఎది యెవరి సృష్టి? ప్రజలనుసన్నుతాత్ములుగా 

భవ్యమనంబుతో కాపాడుమమ్మా.

 

చ. సుజనుఁడె దుర్జనుండగుట చూచుచునుంటిమి. దుర్జనుండె తా

సుజనుఁడునౌటఁ జూచెదము. శోభిలు సజ్జనుఁ డేల దుర్గతిన్

నిజముగ కోరి పొందుటది? నిర్ణయమెవ్వరి చేతనుండు నో

యజుని మనోహరీ? భువి మహాత్ముల సుస్థితి నిల్పు. భారతీ! 80. 

భావము. 

ఓ అంబికామాతా! మంచివారు చెడ్డవారుగను, చెడ్డవారు మంచివారుగను 

అగుచుండుట చూచుచుంటిమి.మంచివారు చెడ్డవారుగా అగుట యనునది 

ఎవరి చేతిలో పని?. మంచివారిమంచిస్థితిని నిలఁబెట్టుమమ్మా.

జైహింద్.

No comments: