జైశ్రీరామ్.
16 వ శ్లోకము.
కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ ||
పదచ్ఛేదము.
కవీంద్రాణాన్ - చేతః - కమల వన - బాల - ఆతప - రుచిమ్ -
భజంతే - యే - సంతః - కతిచిత్ - అరుణామ్ - ఏవ - భవతీమ్ -
విరించి - ప్రేయస్యాః - తరుణతర - శృంగార లహరీ -
గభీరాభిః - వాగ్భిః - విదధతి - సతామ్ - రంజనమ్ - అమీ.
అన్వయక్రమము.
కవీంద్రాణామ్, చేతః, కమలవన, బాలాతపరుచిమ్, అరుణాం + ఏవ, భవతీమ్, కతిచిత్, యే - సంతః, భజంతే, అమీ, విరించి ప్రేయస్యాః, తరుణతర, శృంగార, లహరీ, గభీరాభిః, వాగ్భిః, సతామ్, రంజనమ్, విదధతి.
పద్యము.
చం. కవుల సుచేతనాబ్జవన గణ్య దినాది రవిప్రకాశమౌ,
ప్రవర మనోజ్ఞమౌ నరుణ పావననామ! నినున్ భజించుచున్
బ్రవరులు బ్రహ్మరాజ్ఞి పరువంపు విలాస ఝరీ గభీరమౌ
శ్రవణ సుపేయ వాగ్ఝరిని ప్రాజ్ఞులకున్ బరితృప్తినిత్తురే. ॥ 16 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ జననీ!)
కవీంద్రాణామ్ = కవిశ్రేష్ఠుల యొక్క,
చేతః = చిత్తములు అనెడి
కమలవన = పద్మ వనములకు,
బాలాతపరుచిమ్ = ఉదయసూర్యుని కాంతి వంటిదగు,
అరుణాం + ఏవ = అరుణ యను పేరు గల,
భవతీమ్ = నిన్ను,
కతిచిత్ = కొందఱు,
యే - సంతః = ఏ విబుధ జనులు,
భజంతే = సేవించుదురో
అమీ = అట్టి వీరు,
విరించి ప్రేయస్యాః = సరస్వతీ దేవి యొక్క,
తరుణతర = ఉప్పాంగు పరువపు,
శృంగార = శృంగార రసము యొక్క,
లహరీ = కెరటము వలె,
గభీరాభిః = గంభీరములైన,
వాగ్భిః = వాగ్విలాసము చేత,
సతామ్ = సత్పురుషులకు,
రంజనమ్ = హృదయానందమును,
విదధతి = చేయుచున్నారు.
భావము.
తల్లీ! బాల సూర్యుని కాంతి- పద్మములను వికసింపజేసినట్లుగా, కవీంద్రుల హృదయ పద్మములను వికసింపచేసే నిన్ను, అరుణవర్ణముగా ధ్యానించే సత్పురుషులు- సరస్వతీదేవి నవయౌవన శృంగార ప్రవాహము వంటి గంభీరమైన వాగ్విలాస సంపదతో, సత్పురుషుల హృదయములను రంజింపచేసెదరు.
17 వ శ్లోకము.
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభి
ర్వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి
ర్వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః ||
పదచ్ఛేదము.
సవిత్రీభిః - వాచామ్ - శశిమణి శిలా - భంగ రుచిభిః -
వశిన్యాద్యాభిః - త్వామ్ -సహ - జనని - సంచింతయతి - యః -
స కర్తా - కావ్యానామ్ - భవతి - మహతామ్ - భంగి - రుచిభిః -
వచోభిః - వాగ్దేవీ - వదన కమల - ఆమోద - మధురైః
అన్వయక్రమము.
జనని, వాచామ్, సవిత్రీభిః, శశిమణి శిలా, భంగ, రుచిభిః, వశిన్యాదిభిః సహ, త్వామ్, యః, సంచింతయతి, సః, మహతామ్, భంగి, రుచిభిః, వాగ్దేవీ వదన కమల, ఆమోద,మధురైః, వచోభిః, కావ్యానామ్, కర్తాభవతి.
పద్యము.
సీ. అనుపమవాక్కునకును మూలహేతువై చంద్రకాంతిమణుల చక్కనైన
ముక్కల కాంతులఁ బోలి వశిన్యాది శక్తులతోఁ గూడ చక్కగ నిను
నెవరు ధ్యానింతురో యిలపైన వారలు మహనీయ సుకవుల మాన్యతయును,
రసవత్తరంబును, రమ్య సరస్వతీ ముఖపద్మసంభూత పూజ్య వాక్సు
ధామోద మధుర మహావచనంబులన్ గమనీయమైనట్టి కావ్యకర్త
తే.గీ. యగుట నిక్కంబు, శాంభవీ! ప్రగణితముగ,
శక్తి సామర్థ్యముల ననురక్తితోడ
నాకునొసగంగ వేడెదన్ శ్రీకరముగ
నిన్నుఁ గవితలన్ వర్ణింప నిరుపమముగ. ॥ 17 ॥
ప్రతిపదార్థము.
జనని = ఓ జననీ!
వాచామ్ = వాక్కులకు,
సవిత్రీభిః = జనక స్థానీయులును,
శశిమణి శిలా = చంద్రకాంతమణుల,
భంగ = ముక్కల యొక్క,
రుచిభిః = కాంతులను పోలెడు,
వశిన్యాదిభిః సహ = వశినీ మొదలగు శక్తులతో గూడ,
త్వామ్ = నిన్ను
యః = ఎవడు,
సంచింతయతి = చక్కగా ధ్యానించునో
సః = అతఁడు,
మహతామ్ = వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క,
భంగి = (రచనల) రీతుల వలె నుండు
రుచిభిః = రసవంతమైన,
వాగ్దేవీ వదన కమల = సరస్వతీదేవి ముఖము అనెడు కమలము నందలి,
ఆమోద = పరిమళముచేత,
మధురైః = మధురములైన,
వచోభిః = వాక్సంపత్తితో,
కావ్యానామ్ = కావ్యములకు,
కర్తా భవతి = రచయితగా సమర్ధుఁడగు చున్నాడు.
భావము.
జగజ్జననీ! వాక్కులను సృజించు వారు, చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతికలవారు అగు – వశినీ మొదలగు శక్తులతో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించునో వాడు – మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వరచన వలె మధురమైన, శ్రవణరమణీయమైన, సరస్వతీ దేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో – రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థుఁడగును.
18 వ శ్లోకము.
తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీసరణిభి
ర్దివం సర్వాముర్వీమరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్యద్వన హరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణ గణికాః ||
పదచ్ఛేదము.
తనుచ్ఛాయాభిః - తే - తరుణ తరణి - శ్రీ సరణిభిః -
దివమ్ - సర్వామ్ - ఉర్వీమ్ - అరుణిమ - నిమగ్నామ్ - స్మరతి - యః -
భవంతి - అస్య- త్రస్యతి - వన హరిణ శాలీన - నయనాః -
సహ - ఊర్వశ్యా - వశ్యాః - కతి కతి - న - గీర్వాణ గణికాః.
అన్వయక్రమము.
తరుణ తరణి, శ్రీ సరణిభిః, తే, తనుచ్ఛాయాభిః, సర్వా, దివమ్, ఉర్వీమ్, అరుణిమ, నిమగ్నామ్, యః, స్మరతి, అస్య, త్రస్యత్, వనహరిణ, శాలీన, నయనాః, గీర్వాణ గణికాః, ఊర్వశ్యాసహ, కతికతి, న వశ్యాః భవంతి.
పద్యము.
సీ. తరుణ తరుణిఁ బోలు నిరుపమ కాంతితో వెలిఁగెడి నీదైన వెలుఁగు లమరి
యాకాశమున్ భూమినంతటన్ గాంతులు చెలఁగు నా యరుణిమన్ దలచు నెవ్వ
డట్టి సాధకునికి హరిణముల కరణి బెదరుచూపుల సుర వేశ్యలు మరి
యూర్వశిఁ బోలెడి సర్వాంగసుందరుల్ వశముకాకెట్టుల మసలగలరు?
తే.గీ. నిన్ను నిరతంబుఁ గొలిచెడి నిత్యభక్తి
నాకొసంగుము మాయమ్మ! శ్రీకరముగ,
నీదు పాద పరాగమే నియతిఁ గొలుపు
నాకుఁ బ్రాపింపఁ జేయుమో నయనిధాన! ॥ 18 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ అమ్మా!)
తరుణ తరణి = ఉదయ సూర్యుని యొక్క,
శ్రీ సరణిభిః = కాంతి సౌభాగ్యమును బోలు,
తే = నీ యొక్క,
తనుచ్ఛాయాభిః = దేహపు కాంతుల చేత,
సర్వా = సమస్తమైన,
దివమ్ = ఆకాశమును,
ఉర్వీమ్ = భూమిని,
అరుణిమ = అరుణ వర్ణము నందు,
నిమగ్నామ్ = మునిగినదానిగా,
యః = ఏ సాధకుడు,
స్మరతి = తలంచుచున్నాడో,
అస్య = అట్టి సాధకునికి,
త్రస్యత్ = బెదరుచుండు,
వనహరిణ = అడవి లేళ్ళ యొక్క,
శాలీన = సుందరము లైన,
నయనాః = కన్నులు కలిగిన వారు,
గీర్వాణ గణికాః = దేవలోక వేశ్యలు,
ఊర్వశ్యాసహ = ఊర్వశి అను అప్సర స్త్రీతో సహా,
కతికతి = ఎందరెందరో,
న వశ్యాః భవంతి = లొంగిన వారుగా ఏల కాకుందురు ? అందఱూ వశ్యులగుదురు.
భావము.
జగజ్జననీ! ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్యదేహపు కాంతులలో- ఈ సమస్తమైన ఆకాశము, భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి- బెదురు చూపులతో ఉండు లేడి వంటి కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా వశులవుతారు.
19 వ శ్లోకము.
ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలామ్ |
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగామ్ ||
పదచ్ఛేదము.
ముఖమ్ - బిందుమ్ - కృత్వా - కుచయుగమ్ - అధః - తస్య - తత్ - అధః -
హర + అర్ధమ్ - ధ్యాయేత్ - యః - హరమహిషి - తే - మన్మథ - కలామ్ -
స - సద్యః - సంక్షోభమ్ - నయతి- వనితా - ఇతి - అలఘు -
త్రిలోకీమ్ - అపి - ఆశు - భ్రమయతి - రవీందు స్తనయుగామ్.
అన్వయక్రమము.
హరమహిషి, ముఖమ్, బిందుమ్, కృత్వా, తస్య, అధః, కుచయుగమ్, కృత్వా, తత్, అధః, హరార్థమ్, కృత్వా, తత్ర, తే, మన్మథ కలామ్, యః, ధ్యాయేత్, సః, సద్యః, వనితా, సంక్షోభమ్, నయతి ఇతి, అతిలఘు, రవీందు, స్తనయుగామ్, త్రిలోకీం అపి, ఆశు, భ్రమయతి.
పద్యము.
సీ. శ్రీచక్రముననున్నచిన్మయ బిందువున్ నీముఖసీమగాఁ బ్రేమఁ గనుచు,
దానిక్రిందను కుచ ద్వయము నాక్రిందను శివునర్ధభాగమౌ భవుని సతిని,
బిందువు క్రిందను వెలుఁగు త్రికోణాన క్లీమ్ బీజమున్ మదిన్ లీలఁ గనుచు
నెవరుందురో వార లెవరినైననుగాని మోహంబులో ముంచి ముగ్ధులుగను
తే.గీ. జేయఁ గలుగుదురోయమ్మ! శ్రీ రవీందు
లను గుచములుగ నొప్పెడి వినుతయౌ త్రి
లోకినిని భ్రమన్ ముంచు తా నేకబిగిని
శీఘ్రముగనమ్మ, నీ శక్తి చెప్పఁ దరమె? ॥ 19 ॥
ప్రతిపదార్థము.
హరమహిషి = శివుని పట్టమహిషివైన ఓ జననీ!
ముఖమ్ = ముఖమును,
బిందుమ్ = బిందువుగా,
కృత్వా = చేసి (అనగా - బిందుస్తానమును ముఖముగా ధ్యానించి అని అర్థము),
తస్య = ఆ ముఖమునకు,
అధః = క్రిందిభాగమునందు,
కుచయుగమ్ = స్తనద్వయమును,
కృత్వా = (ధ్యానము)చేసి
తత్ = ఆ స్తనద్వయమునకు
అధః = క్రిందుగా,
హరార్థమ్ = హరునిలో అర్థభాగమై యున్నశక్తి రూపమును ,(త్రికోణమును)
కృత్వా = ఉంచి
తత్ర = అక్కడ,
తే = నీ యొక్క,
మన్మథ కలామ్ = కామబీజమును,
యః = ఏ సాధకుడు,
ధ్యాయేత్ = ధ్యానించునో,
సః= ఆ సాధకుడు,
సద్యః = వెనువెంటనే,
వనితా = కామాసక్తులగు స్త్రీలను,
సంక్షోభమ్ = కలవరము,
నయతి ఇతి = పొందించుచుండుట అనునది ,
అతిలఘు = అతిస్వల్ప విషయము,
రవీందు = 'సూర్యచంద్రులే
స్తనయుగామ్ = స్తనములుగా గల,
త్రిలోకీం అపి = ముల్లోకములను సహితము,
ఆశు = శీఘ్రముగా,
భ్రమయతి = అతడు భ్రమింప చేయుచున్నాడు .
భావము.
ఓ మాతా! నీ మోమును బిందువుగా జేసి, దానిక్రిందుగా కుచయుగమునుంచి, దాని క్రిందుగా త్రికోణముంచి నీమన్మథకళ నెవడు ధ్యానిస్తాడో, ఆ ధ్యాన ఫలితంగా కామాసక్తులైన వనితలను కలవరపెడుతున్నాడు. అంతే కాదు ఆ సాధకుడు సూర్య చంద్రులను స్తనములుగా కలిగిన త్రిలోకములను మోహమునకు గురిచేయుచున్నాడు.
20 వ శ్లోకము.
కిరంతీమంగేభ్యః కిరణ నికురుంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా ||
పదచ్ఛేదము.
కిరంతీమ్ - అంగేభ్యః - కిరణ - నికురుంబ - అమృత రసం -
హృది - త్వామ్ - ఆధత్తే - హిమ కర శిలామూర్తిమ్ - ఇవ - యః -
స - సర్పాణామ్ - దర్పమ్ - శమయతి - శకుంతాధిప - ఇవ -
జ్వర - ప్లుష్టాన్ - దృష్ట్యా - సుఖయతి - సుధాధార - సిరయా.
అన్వయక్రమము.
అంగేభ్యః, కిరణ, నికురుంబ, అమృత రసం, కిరంతీమ్, త్వామ్, యః, హృది, హిమకరశిలా, మూర్తి + ఇవ, ఆధత్తే, సః, శకుంతాధిప ఇవ, సర్పాణామ్, దర్పమ్, శమయతి, జ్వర, ప్లుష్టాన్, సుధాధార సిరయా, దృష్ట్యా, సుఖయతి.
పద్యము.
సీ. ఆపాద మస్తకంబంతటి కిరణాలఁ బ్రసరించు నమృతమ్ము నసమరీతిఁ
గురిపించుచున్నట్టి నిరుపమ శశిశిలా మూర్తిగా భావించి స్ఫూర్తితోడ
నే సాధకుండు నిన్ హితముతోఁ బ్రార్థించునట్టివాఁ డసమానుఁడయిన గొప్ప
గరుడుని యట్టుల నురగ దంష్ట్రల నుండి వెల్వడు విషమును వింతగాను
తే.గీ. బాపువాఁడగుచుండెను, జ్వరముతోడ
బాధనందువారికి బాధఁ బాయఁజేయు,
నమృతపు సిరల దృక్కుల ననితరముగ
నమ్మ! నా ప్రార్థనల నందుకొమ్మ నీవు. ॥ 20 ॥
ప్రతిపదార్థము.
(హే మాత! = ఓ జననీ!)
అంగేభ్యః = కరచరణాది అవయవముల నుండి,
కిరణ = వెలుగుల యొక్క,
నికురుంబ = సమూహము వలన కలిగిన,
అమృత రసం = అమృత రసమును,
కిరంతీమ్ = వర్షించుచున్న,
త్వామ్ = నిన్ను,
యః = ఏ సాధకుడు,
హృది= హృదయమునందు,
హిమకరశిలా = చంద్రకాంతిశిలయొక్క
మూర్తి + ఇవ = ప్రతిమవలె,
ఆధత్తే = ధారణ చేసి ధ్యానించునో,
సః = ఆ సాధకుడు,
శకుంతాధిప ఇవ = గరుత్మంతుని వలె,
సర్పాణామ్ = పాముల యొక్క,
దర్పమ్ = పొగరును,
శమయతి = శాంతింప చేయుచున్నాడు,
జ్వర = జ్వరతాపముచే,
ప్లుష్టాన్ = బాధపడువారిని,
సుధాధార సిరయా = అమృతమును స్రవించు నాడివంటి,
దృష్ట్యా = వీక్షణము చేత,
సుఖయతి = సుఖమును కలుగ చేయుచున్నాడు.
భావము.
తల్లీ! అవయవముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును వెదజల్లుతున్న చంద్రకాంత శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువాడు, గరుత్మంతుని వలె సర్పముల యొక్క మదమడచగలడు. అమృతధారలు ప్రవహించు సిరలు గల దృష్టితో జ్వర పీడితులను చల్లబరచగలడు.
జైహింద్.