Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 3 / 22వ భాగము 11 నుండి 15వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.3 / 22వ భాగము 11 నుండి  15 వ  పద్యము వరకు. 


చ. వరగుణ గణ్య వాఙ్మధుర భవ్య మనోజ్ఞ సుధాస్రవంతిగా,

నిరుపమ మాతృమాధురి పునీత మనస్స్థితి మాన్య మూర్తిగా

చరణములంటి మ్రొక్కను, ప్రశాంతిగఁ గొల్వను తోచుటొప్పు నే

తరుణిని జూచినన్. వనిత తత్త్వము నట్లొడఁగూర్చు. భారతీ! 11.

భావము. 

ఓ జ్ఞానముద్రా! ఏ తరుణిని చూచిననూ మంచి గుణగణ్యగా, వాగమృత 

ప్రవాహముగా, సాటిలేని మాతృమూర్తిగా భావించి ఆమె పాదములనంటి 

మ్రొక్కవలెనని, ప్రశాంత చిత్తముతో ఆమెను కొలువ వలెనని, అనిపించుట 

ఒప్పిదముగనుండును. వనితలను అందుకు తగిన తత్వముతో ఒప్పువారిగా 

చేయుమమ్మా.


చ. శరణు సరస్వతీ! సుకవి సన్నుత! సత్కమనీయ కావ్య సం

భరిత హితోక్తి మాధురి! ప్రపంచ వివర్ధిత బ్రహ్మ తేజమా!

నిరుపమ జ్ఞానతేజ మహనీయత మాకొడఁ గూర్చి నిత్యమున్

స్మరణము చేయఁ జేయుము సమర్థత నా విధి నెంచి, భారతీ! 12.

భావము. 

ఓ రమామాతా! ఓ సరస్వ! తీశరణు తల్లీ! ఓ సుకవి సన్నుత! మంచి కమనీయ 

కావ్యములలోని మంచిమాటల రూపమున నిండియున్న తల్లీ! 

ప్రపంచమంతటను వ్యాపించియున్న ఓ బ్రహ్మ తేజమా! సాటి లేని జ్ఞానము 

వలన కలిగెడి తేజస్సు యొక్క మహనీయతను మాకు సంభవింపఁ జేయుచు 

నిత్యమూ మా వ్రాత నెంచుచు నిన్ను స్మరించునట్లు చేయుము.


చ. ఇహ పర మెన్న శబ్ద చయమే కద మూలము సృష్టికంతకున్.

మహితుఁ డజుండు వాణి కృప మన్నికఁ గొంచు రచించునంతె. యీ

మహిమయు, మన్ననన్ గనఁగ మా వర వాణియె యోగ్య యందురే

సుహిత మనస్కులౌ కవులు, శోభిలు పండితు లెల్ల భారతీ! 13.

భావము. 

ఓ పరా మాతా! ఇహమునందు పరము నందు ఈ సృష్టి మొత్తమునకు శబ్దమే 

మూలము. గొప్పవాఁడయిన బ్రహ్మ నీ కృపను సంపాదించి ఈ సృష్టి చేయునంతే. 

పండితులు, కవులు ఈ సమస్త మహిమ మన్నన అంతయు నీదే అందురు.


చ. నలువ ముఖాబ్జ సంభవ మనంత నిరంత వసంత సంతతుల్.

వెలుఁగులు చీకటుల్, మహిని వెన్నెల రాత్రులు, కాళ రాత్రులున్,

పలుకుల రాణి వాసమటు పర్విడఁ జేయును సృష్టినింతయున్.

కొలువయి యుండి నీ నలువ గొప్పను పెంచితివొక్కొ? భారతీ! 14.

భావము. 

ఓ కామరూపా! బ్రహ్మ ముఖము నుండి సృష్టింపఁబడిన అనంత నిరంతర 

వసంతములు, చీకటి వెలుగులు, వెన్నెల రాత్రులు కాళ రాత్రులు, నీ 

నివాసమయిన బ్రహ్మ ముఖము సృష్టిని పరుగుపెట్టించునునీవు ఆ 

బ్రహ్మ ముఖమున కొలువుతీరి ఇంత గొప్పగా చేసి బ్రహ్మ కీర్తిని పెంచుచుంటివి.


చ. క్షరములె యక్షరమ్ములగు,  సాధన సత్కవితామృతంబగున్.

భరములె భాగ్య రాశులగు, భారత భారతి భవ్య తేజ సు

స్థిర కరుణా కటాక్ష ఫల తేజమునన్ విధి పత్ని పాద సు

స్థిర మతులైన వారికిని  దివ్య శుభ స్థితిఁ గొల్పు భారతీ! 15.

భావము.  

ఓ మహావిద్యా! దివ్య శుభ స్థితిని కలుఁగ జేసే ఓ భారతీ! నీ పాదములనమోఘ 

భక్తితోనాశ్రయించువారికి నీ యొక్క సుస్థిరమైనటువంటి కరుణా కటాక్షము వల 

కలిగిన తేజము చేత నీ కృపతో క్షరములే అక్షరములగును, సాధనచే 

సత్కవితామృతమే ఉద్భవించును కదా. బరువులే భాగ్య రాశులగును. 

జైహింద్.

No comments: