జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 5 / 2 2వ భాగము 21 నుండి 25వ పద్యము వరకు.
చ. కనులకుఁ గానిపించునవి కావు మహీస్థలి శాశ్వతంబు లీ
కనులను మూసి జ్ఞానమను కంటికిఁ గన్పడు కాంచఁ గల్గినన్
వినుత పరాత్పరాక్షర సువేద్య మహత్వ కవిత్వ తత్వ సం
జనిత మయూఖజృంభణము. జక్కఁగ కానగనిమ్ము భారతీ! 21.
భావము.
ఓ మహాభాగా! ఈ కనులకు కనిపించునవి అశాశ్వితము.. జ్ఞాన నేత్రముతో
చూడఁ గల్గినచో గొప్ప కవిత్వ తత్వమునుండి ఉద్భవించిన పొగడబడెడి
పరాత్పరుని యొక్క అక్షయమైన సువ్యక్తమయే కాంతి విజృంభణ కన్బడును...
దానిని చక్కగా చూచునట్లు చేయుమమ్మా.
చ. అజుఁడు సృజింపనోపునె సహాయము నీ వొనరింపకున్నచో,
ప్రజలు రహింపఁ గల్గుదురె? వాగ్వర మీవయి లేకపోయినన్,
సుజనులు శోభలొందుదురె? సూక్తిచయంబయి నీవు లేనిచో
నిజము వచింప నీవ మహనీయ జగత్క్రయ భాతి, భారతీ! 22.
భావము.
ఓ మహోత్సాహా! నీవు సహాయము చేయనిచో బ్రహ్మ ఈ సృష్టి చేయఁగలఁడా.
మాటాడుట అనే వరముగా నీవు దక్కకున్నచో ప్రజలు రహింపఁ గలరా.
సూక్తిచయమై నీవు లేనిచో సుజనులు కీర్తి కాంచఁ గలరా. నిజము చెప్పవలెనన్నచో
ముల్లోకములందు కాంతిగా నున్నది నీవే సుమా.
చ. శుక పిక శారికా వితతి చూపులలో పరిభాష లేమిటో?
ప్రకటన చేయఁ బల్కు పలు భాషలలోఁగల భావమేమిటో?
సకల జగంబు భావనలు చక్కఁగ వాగ్వరమార్గమందునే
ప్రకటనఁ జేయుఁ గాదె. మది భావనవీవె కదమ్మ. భారతీ! 23.
భావము.
ఓ దివ్యాంగామాతా!పక్షుల చూపులలో పరిభాష యేమిటయి యుండును?
అవి ప్రకటించే పలుకులలోని భావములేమిటయి యుండును? సృష్టి అంతటా
భావనలను శ్రేష్ఠమైన పలుకులతోనే ప్రకటన చేయును కదా. మదులందు భావ
రూపముననున్నది నీవే కదమ్మా.
చ. విదితము చేయు దైవమును వేదములెల్ల గ్రహింపఁ గల్గినన్.
విదిత మదెట్లగున్? సుగుణ పేశల చిత్త సరోజ వర్తివై
పదిలముఁగాఁగ నిన్నునిచి భక్తిని కొల్చిన వేద్యమౌను. సం
పదవు, మనః ప్రకాశ వర భాస్కర తేజవు నీవు. భారతీ! 24.
భావము.
ఓ సురవందితా! గ్రహించ గలిగినచో వేదములన్నియు దైవమును వ్యక్తమ గునట్లు
చేయగలవు. ఐతే ఏవిధముగా వ్యక్తము కాగలవనిన సుగుణ పేశల చిత్త
మనోజ్ఞవర్తివయిన నిన్ను మనస్సులో నిలిపి కొలిచినచో అది సాధ్యమగును.
నీవే మా సంపద్సవు. మనస్సులో ప్రకాశించే శ్రేష్ఠుడయిన భాస్కర తేజస్సుతో
నీవే ఒప్పి యుందువు.
చ. కదలదు లోక మించుకయు కాదని నీవు నిరాకరించినన్.
మెదలదు భూమి నీ సుగుణ మేదుర వర్ణ చయంబు లేనిచో,
వదలదు దుర్గుణార్ణవము భద్రము నీవయి లేకపోయినన్
మదుల వికాసమై వరలు మానిత మూర్తివి నీవు భారతీ! 25.
భావము.
ఓ మహాకాళీమాతా! కాదు అని నీవు నీ సహాయమును నిరాకరించినచో ఈ లోకము
కొంచెమైనను ముందుకు సాగదమ్మా. నీ మంచి గుణములతో ప్రకాశించే
వర్ణసమామ్నాయము లేనిచో భూగోళము ఇంచుకైనను కదలదు సుమా. నీ భద్రత
లేనినాడు దుర్గుణార్ణవము కబళించక విడిచిపెట్టదు. మదులలో ప్రకాశమై వరలే
మహనీయ మూర్తివమ్మా నీవు.
జైహింద్.
No comments:
Post a Comment