జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 21 / 2 2వ భాగము 101 నుండి సాంతము పద్యములు.
కంద గీత గర్భ చంపకమాల.
స్వర విలసన్నుతా! సహజ సౌమ్య లసద్గుణ శారదాంబ! మ
మ్మరయుమిలన్ సదా. మధుర మంజుల వాగ్ఝరి మాకొసంగి సుం
దర గళ మాధురుల్, కవిత ధారలు కొల్పుచు కావుమింక రా.
దరి నిలుమా మదిన్. ఘనత దాల్చిన సన్నుత జ్ఞాన భారతీ! 101.
భావము.
ధ్వనిరూపమున ప్రకాశించుచు పొగడఁబడు ఓ భారతీమాతా! ఓ నిరంజనా!
ఘనత దాల్చిన ఓ సన్నుత జ్ఞాన భారతీమాతా! సహజమైన సౌమ్యముతో
ప్రకాశించు స్వభావము గల ఓ శారదాంబా! మధురమైన మంజులమైన వాగ్ఝరిని
మాకు ప్రసాదించి మమ్ములనెల్లప్పుడు భూమిపై అరయుచుండుమమ్మా.
ఇంకనూ సుందరమైన గళ మాధుర్యమును, కవితా స్రవంతిని మాకొసంగుచు
కాపాడుచుండుము. వచ్చి మా సమీపముననే మా మనస్సులలో ఉండుము
తల్లీ!
బహు ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల.
మము జననీ సదా నిలుపు మా ఘనతన్ గణనీయ తేజ గా
మము మననీ భువిన్, తెలుపుమా కనఁ జేయుచు దీప్తిరాశిగా
మము కననీ నినున్, కొలుపుమా ఘన తేజము కూర్మి తోపగా
మము విననీ స్తుతిన్,, కనుమ మాదిన చర్యలు జ్ఞాన భారతీ! 102.
భావము.
ఓ చతుర్వర్గ ఫలప్రదా! ఓ జననీ! మమ్ములను ఎల్లప్పుడు నిలుపుము.
ఘనత యేదైతే మాకు కలదో దానినిగణనీయ తేజముతో నొప్పునట్లు ఎల్లప్పుడు
నిలుపుము. నిన్ను కాంతి పుంజముగా మాకు కనఁ కేయుచు మమ్ములను
చూడనిమ్ము.మాలోనను ఘనమైన తేజస్సు తోచునట్లుగా ప్రేమతో కొలుపుము.
నిన్ను గూర్చిన స్తోత్రమును విననిమ్ము. మా దిన చర్యలను గమనించుచు
ఉండుమమ్మా.
గూఢ పంచమ పాద చంపకమాల.
గురు లెఱుకన్మెలంగ శుభగుల్ గని నేర్తు రుదగ్ర వర్తనల్.
గురు గుణముల్వరల్త్రు.ప్రభ గొప్ప వరాళిగ దల్తురుద్ధతిన్.
గురువులె భవ్య పూజ్య శుభ గోత్రజ రాఘవుఁబోలుభాస్కరుల్.
గురువను దైవముండిన సుగోత్రులు దేవులుకారె?భార తీ! 103.
ఇందలి గూఢ పంచమ పాదము.
గురువును కల్వపూడి శుభ గోత్రుని రాఘవుఁ దల్తు భారతీ!
భావము.
ఓ చతురానన సామ్రాజ్యా! ఓ భారతీ మాతా! గురువులు తెలివి కలిగి
ప్రవత్రించుచున్నచో మంచివారు వారిని గమనించి శ్రేష్టమైన ప్రచర్తనలను
వారినుండి గ్రహింతురు. అటువంటి గురువుల గుణములను ప్రవర్ధింపఁ
చేయుదురు. ఈ లభించెడి జ్ఞాన ప్రభను గొప్ప వరములుగా భావించుదురు.
అట్టి శ్రేష్టులైన గురువులే ఉత్తమ కులజుఁడయిన రాముని పోలెడి సూర్యులే.
గురువలబఁడే మంచి దైవమున్నచో సద్గోత్రులు సాక్షాత్ దైవస్వరూపులగుదురు
కదా.
గుప్త పంచమ పాద భావము.
ఓ భారతీ మాతా! కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య గురుదేవులను నేను ఆత్మలో
తలచెదను తల్లీ!
గూఢ పంచమ పాద చంపకమాల.
గురుతు గలట్టి వారు నెలకొల్ప రహించెడి దివ్య వాగ్ఝరీ!
కరుణను కష్టపాళి తొలగన్ బ్రవహించుమ నవ్య తేజమై
గురువరమై ప్రకాశమును కొల్పుమ వేచెదనమ్మ భావికై.
ధర కరు ణాలవాలవయి తల్పగనే వడి బ్రోచు భారతీ! 104.
గూఢ పంచమపాదము
గురువరులష్టకాల నెలకొల్ప రహించెడి దివ్య భారతీ!
భావము.
ఓ రక్తమధ్యా! భూమిపై కరుణకు ఆలవాలమయి, నిన్ను తలంచినంతనే
వేగముగా కాపాడెడి ఓ భారతీమాతా! ప్రసిద్ధులయినవారు నీ యునికిని గుర్తించి
నిన్ను నెలకొల్పగా ప్రకాశించెడి ఓ దివ్యమైవ వాగ్ప్రవాహ రూపమా! కరుణ చూపి
నా కష్టములు తొలిగిపోవునట్లుగానీవు నవ్య తేజముగా నాలో ప్రవహించుము.
గురుదేవుల వరమై నాలో ప్రకాశమును కొల్పుము. నేను ఉజ్వలభవితకై
వేచియుందును తల్లీ!
గూఢ పంచమపాద భావము.
గురుపుంగవులయిన బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామశర్మ అనంత సాగరమున
నిన్ను ప్రతిష్ఠింపగాప్రపంచమున వెలుగొందుచున్న ఓ దేవతామూర్తివైన
సరస్వతీమాతా! అని సంబోధన.
చ. దినమున నూరు పద్యములు తీరుగ వ్రాసితి పిమ్మటిచ్చటీ
యెనిమిది చిత్రబంధము లనేక మహద్గతులన్ రచించితిన్.
కనుఁగొని వ్రాయఁ జేసితివి గౌరవమబ్బగ నాకు నీవె, నీ
యనుపమమైన బ్రేమయె మహత్వముఁ గొల్పినదమ్మ భారతీ! 105.
భావము.
ఓ నీలభుజా! భారతీమాతా! రోజులో నూరు పద్యములను వ్రాసితిని.
అటు పిమ్మట ఈ ఎనిమిది పద్యములు చిత్రబంధ మహత్తరమైన అనేక గతులలో
రచించితినమ్మా. నేను వ్రాయుచుండుట కనుగొని నాకు గౌరవము కలిగించ దలచి
నీవే వ్రాయునట్లు చేసితివమ్మా.నీ సాటిలేని ప్రేమయే నాకవితకు గొప్పఁదనము
కలుగఁ జేసినదితల్లీ!
జైహింద్.
No comments:
Post a Comment