Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 8 / 22వ భాగము 36 నుండి 40 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  8 / 2 2వ భాగము 36 నుండి  40వ  పద్యము వరకు.


చ. మునుమును పాడు లోకమున పూజ్యులు దుర్భర జీవనంబుతో

మనుటకు మూలమన్నటుల మంచిని దుష్టులు దూరుచుంట, స

జ్జనులను దుఃఖపెట్టుట, విషాద పరిస్థితి గొల్పనోమొ,. నీ

వనిశము మంచివారికి మహర్దశఁ గొల్పుచు నేలు, భారతీ! 36.

భావము. 

ఓ చంద్రలేఖావిభూషితా! రాబోవు రోజులలో ఈ పాడగుచున్న లోకములో సజ్జనులు 

భరింపరాని కష్టమయ జీచితము గడపుటకు మూలము వీరే అనే విధముగా

దుర్మార్గులు మంచి పనులను తిట్టుకొనుచు,మంచివారిని దుఃఖపెట్టుట 

విషాద పరిస్థితిని కల్పించుటకేమో. మంచివారికెల్లప్పుడు నీవు మహర్దశనే 

కలిగించుచు పాలించుమమ్మా.


చ. మనమున భక్తి భావమును మాకు నొసంగిన లోటు రాదుగా?

ఘనముగ మా లలాటమున కర్మలు వ్రాసిన గౌరవంబెగా?

గుణగణనీయ మూర్తులుగ గొప్పగ చేసిన మమ్ము నొప్పుగా?

కని మము చేయుమట్టులనె గౌరవమొందఁగ జేయు భారతీ! 37.

భావము. 

మేము గౌరవింపఁబడునట్లు చేయు ఓ సావిత్రీమాతా! మా మనస్సులలో 

భక్తిభావమును నీవు నెలకొల్పినచో నీకేమీ లోటు రాదుకదా. మా నుదుటి వ్రాత 

బాగుగా ఉండునట్లు వ్రాసినచో నీకు గౌరవమే కదా.మమ్ములను గుణగణులుగా 

చేసిన ఒప్పిదముగనే ఉండును కదా. నా మాటలను గణించి 

ఆ విధముగా చేయుము.


చ. సునిశితమైన తత్వమును శోభను గాంచ నొసంగితీవు. మా

కనిశము తోడు నీడగ భవార్ణవ మీదఁగఁ జేయ నిల్చితే.

మనమున సంశయార్ణవము మాపవదేల త్వదీయ శక్తి నే

ఘనమని నమ్మి కొల్వఁగను గాంచఁగ వేడెద నిన్ను భారతీ! 38.

భావము. 

ఓ సురసామాతా! మేము శోభించుటకు సునిశిత తత్వమునిచ్చితివి.

ఈ సంసార సాగరము ఈదుటకుమాకు తోడుగా బలమునిచ్చితివి. అట్టి నీవు 

మా మనస్సులో సంశయమనెడి మహార్ణవమును పోగొట్టవేమి? నీ శక్తినే 

గొప్పగా నమ్మి నిన్ను కొలుచుటకై నేను నిన్ను చూడవలెనని

వేడుకొనుచున్నానమ్మా.


చ. మొరవినుమా! దయా సరసి! పూజ్యుల నే కొలువంగఁ జేయుమా!

నిరతమనంత భక్తిమతి నిర్జర పాళి భజింపఁ జేయుమా!

కరుణ దయార్ద్ర చిత్తమున గాంచఁగఁ జేయు మనంతు నెల్లెడన్.

సరి యెవరమ్మ నీకు. విలసన్నుత మంగళ దాయి భారతీ! 39.

భావము. 

విలసన్నుత మంగళములను కలిగించు ఓ దేవీమాతా! ఓ దయాపరా! 

మా మొర వినుము. మేము పూజ్యులయిన వారినే సేవించునట్లు చేయుము. 

దేవతలను భక్తితో ఎల్లప్పుడూ కొలుచునట్లు చేయుము.ఆ అనంతుని 

కరుణతో దయార్ద్ర చిత్తముతో అంతటా చూచునట్లు చేయుము.


చ. పలుకులు భావముల్ భవుఁడు పార్వతి రూప మనంగ వచ్చు నా

పలుకును వీడి భావమును భావము కల్గని పల్కులుండునే?

పలుమరు చింతితుండనయి పట్టుగ గాంచగ శారదాంబయే

పలుకును, భావమై వరలు భవ్యుఁడు పార్వతి యెన్న. భారతీ! 40.

భావము. 

ఓ దివ్యాలంకార భూషితా! వాగర్థాలు పార్వతీ పరమేశ్వరులనవచ్చును.వారి వలెనే 

వాగర్థములు ఒకదానిని విడిచి మరొకటి ఉండనేరదు.ఆలోచింపగా వాదర్థములు 

శారదా స్వరూపములే అనగా నీవే పార్వతీ పరమేశ్వర స్వరూపము. 

జైహింద్.

No comments: