జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 18 / 2 2వ భాగము 86 నుండి 90వ పద్యము వరకు.
చ. వరగుణ గణ్యులౌ సుజన వర్గమునన్ కవితామృతంబు నే
మురిపముతోడ పంచునటు పూజ్యులు తృప్తిని పొందునట్లు, నన్
గురువరులెన్నునట్లు, గుణ కోవిదులందు రహించునట్లుగా
సరగున చేయునిన్ను మది చక్కగ నిల్పఁగ చేయు భారతీ! 86.
భావము.
ఓ కాళరాత్రీ! మంచివారిమధ్య కవిత్వమును చెప్పే విధముగ,
అది వినిన పూజ్యులు సంతోషించునట్లు, నన్ను వారు గుర్తించునట్లు,
ఆ విధముగా గుణకోవిదులమద్య నేను ప్రకాశించునట్లు, వేగముగా చేయుచున్న
నిన్ను నా మనస్సులోచక్కగా నిత్యమూ నిల్పునట్లు చేయుమమ్మా.
చ. మనసును విప్పి చెప్పుటకు మాటలు చాలవు నీ ప్రతాపమున్
కనులకుఁ గట్టినట్టులు ప్రకాశము చేయ కవిత్వ శక్తి లే
దనుపమ దేవతామణి వనాది మహాద్భుత శక్తివైన నిన్
మనముననుండఁ గోరుదును. మన్నికనుండుమ జ్ఞానభారతీ. 87.
భావము.
ఓ కళాధారా! నీ గొప్పతనమును మనసారా చెప్పుకొనెదమన్న నాదగ్గర ఉన్న
మాటలు చాలవమ్మా. ఆ విధముగ కాక నిన్ను కన్నులకు కట్టినట్లుగా వర్ణించి
చెప్పుటకు నాకున్న కవిత్వ శక్తి చాలదమ్మా. సాటిలేని దేవతామణివమ్మా నీవు.
అనాదిగా ఉన్న మహాద్భుత శక్తివైన నిన్నునా మనస్సులో ఉండ వేడుచున్నాను.
నా మనసును విడువక ఉండుము తల్లీ.
చ. ధరణియె నీకు తల్లియొకొ? ధాత్రికి తల్లివి నీవెయొక్కొ? యీ
ధరణిని నుద్ధరించుటను ధన్యత పొందితి వీవు, కాగ యీ
ధరణియు నీ సముద్ధరణ దక్షతతో నొనరించునద్దిరా!
పరమహితాత్ములిద్దరును. భాగ్యము మాదగునమ్మ భారతీ! 88.
భావము.
ఓ రూపసౌభాగ్యదాయినీ! భూమాత నీకు తల్లియా? కాక భూమాతకే నీవు తల్లివా?
ఈ భూమిను ఉద్ధరించుట వలన నీవు ధన్యత గాంచినావమ్మా. ఈ భూమాత కూడా
నీ సమ్ముద్ధతిని ధక్షతతో చేయుచున్నది. మీ యిరువురునూ క్షేమమును
కోరువారే. ఈ భాగ్యము నిజముగా మాదేనమ్మా.
చ. నిరుపమ కల్వపూడి మహనీయ సదన్వయ రాఘవార్యు సం
స్మరణము ముక్తిదాయకము. మా గురుదేవులు వారు. వారిచే
వరముగ పొందితీ చదువు భాగ్యవశమ్మున భక్తియుక్తిమై
చరణయుగంబునెంచి గురు సన్నుతి చేసెదనమ్మ, భారతీ! 89.
భావము.
ఓ వాగ్దేవీ! నా గురుదేవులు శ్రీ కల్వపూడి వర వంశజులైన వేంకట వీర
రాఘవాచార్యులవారు. వారిని స్మరించుటయే ముక్తిదాయకము. నా భాగ్యము చేత
భక్తుతో వారినుండి ఈ విద్యపొందఁ గలిగితినమ్మా. వారి పాదములను స్మరించుకొని
వారిని సన్నుతింతును తల్లీ.
చ. గురువులు శేషశాయియును, గోపక పాలుడు, కోరినట్లుగా
నిరుపమ సాధనాపటిమ నీదయనొందితి నీదు సత్కృపన్
ధర కవితానురక్తిని ముదంబున గర్భ సు చిత్ర బంధముల్
సరసులు మెచ్చునట్టులుగ సన్నుతి వ్రాయుదునమ్మ భారతీ! 90.
భావము.
ఓ వరారోహా మాతా! శ్రీ మానాప్రగడ శేషశాయియు, శ్రీ గోపాలరావును నాకు చదువు
చెప్పిన గురువులే నిరంతర సాధనతో నీ దయను పొందితిని. నీ దయతో
కవితానురక్తునై చిత్ర బంధ గర్భ కవిత సరసులు మెచ్చువిధముగా వ్రాయుదును
తల్లీ.
జైహింద్.
No comments:
Post a Comment