Monday, December 24, 2012

ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే సదవకాశం.

జైశ్రీరామ్.
సహృదయ భారాతీయ సహోదరులారా! ఆ జగన్మాత కటాఖ్శం వల్ల, మీ వంటి సన్మిర్తుల శుభాకాంక్షలవల్లా, "తిరుపతిలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహా సభలలో దిగ్దంతులవంటి తెలుగు సరస్వతీ, పుంభావ సరస్వతీ మూర్తులను చూచే భాగ్యంతో పాటు, అక్కడ వేదికపై ఉపన్యసించే సదవకాశం కూడా నాకు లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి నన్ను ఉపవేదికపై ఉపన్యసించ వలసినదిగా కోరుతూ ఆహ్వానం వచ్చింది.
ఈ సదవకాశం కలిగించిన ప్రభుత్వానికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను. 
అక్కడికి వస్తున్న మీ అందరిమీ ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు కలుగుతున్నందులకు ఆనందంగా ఉంది.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.

Thursday, November 22, 2012

సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? పద్య కవిత పోటీలో మన సోమార్క గారికి ప్రథమ బహుమతి

జైశ్రీరామ్.
సాహితీ పిపాసులారా! సుమనర్నమస్సులు.
ఇప్పుడు  రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొనిన శ్రీ అర్క సోమయాజిగారిని గూర్చి తియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. వారిని మనము హృదయ పూర్వకంగ అభినందిద్దాము. వారికి ఈ బహుమతి కైవసమైన వార్తను వారి మాటలలోనే చూద్దాము.
అయ్యా! నమస్కారాలు!
ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠ పద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని "పద్య శైలూషి "అనే పద్య ఖండికను పద్య కవిత రూపంలో పంపించాను.దానికి రాష్ట్ర స్తాయి పద్య కవితలపోటిలో ప్రధమ బహుమతి లభించినట్లు తెలిపారు.ఆ కార్యక్రమం "ఒంగోలు"లో ఏర్పాటు చేశారు.24/11/2012న ఆ బహుమతి అందుకోవడానికి మరియు అదే రోజు కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడానికి రేపు రాత్రి బయలుదేరుతున్నాను.మీ ఆశీర్వాదములు కోరుతున్నాను.
ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను. ఇట్లు మీ సోమార్క
తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ములనొప్పు,వాక్యవి
న్నాణములున్,మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగుపద్యముల జాతికి సాటికవిత్వమున్నదే?
పదముల్ పేర్చి,బిగించికూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి,సొం
పొదవన్, శైలియు,వృత్తి,రీతి,రసవత్పాకాది,మేలౌ గుణా
భ్యుదయోల్లాస, కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు,తెల్గు భాషకు,మహద్భాగ్యంబు!పద్యంబెగా! 
నన్నయనాటి నుండి,యధునాతన రీతులు నేర్చుకొంచు,నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియలనింపగు,రూపుల దిద్దుకొంచు,న
భ్యున్నతిగొంచు,కావ్యవిభవోజ్వలమౌచును,తెల్గుసాహితిన్
యెన్నగ!హృద్య పద్యమది!యింపగు!తెల్గు సమృద్ధినందగన్.
పద్యము ప్రాతవడ్డదని,భావన సేయుటయేమొ గాని?!త
ద్విద్య సహస్ర రూపిణిగ,విస్తృత రూపము దాల్చియొప్పె,న
య్యద్యతనాంధ్రసత్కవులు,యాధునికత్వ,కవిత్వరూపమౌ,
హృద్య కవిత్వ రీతులకు,నింపగు మూలము!గాదనందురే?
సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో,నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన,యక్షర రధ్యపైని,మా
సరస కవీశు లందముగ,చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున,త్రిప్పినారలు!వధాన విధాన పధాన నెల్లెడన్.
నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ములనొద్దికదిద్దితీర్చి,వి
ద్వన్నుతుడయ్యె;నూతన విధానము నేర్పెను సోమయాజి,రూ
పోన్నతిజేసె,దేశికవితోద్యమసారధి;సోముడున్ పదా
ర్వన్నెల శొభగూర్పగను!పద్యము జానగు శోభ నొప్పెడిన్.
చింతింపంబనిలేదు!పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు!పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద,మీ
వంతున్ సత్కృషిసల్ప,మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.
డా.చంద్రశేఖరావధాని చేస్తున్న అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సోమార్క..
చూచాము కదండి! ఈ సాహితీ ప్రయాణంలో శ్రీ సోమార్కగారు మరిన్ని విజయ బావుటాలెగరవేయాలని కోరుతూ వారిని ఆంధ్రామృతం ద్వారా మరొక్క పర్యాయము అభినందిస్తున్నాను. ఇక 
ఈ అంశముపై మీరూ మీ భావలకు పద్య రూపాన్ని కల్పించి ఆంధ్రామృత్ం ద్వారాపాఠకులకు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.

Wednesday, November 21, 2012

మియాపూర్ హైస్కూల్లో25-11-2012న కవిసమ్మేళనమునకు ఆహ్వానము

జైశ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా! సాహితీ సమితి శేర్లింగంపల్లి శాఖ వారు వివిధ ప్రాంతములనుండి అనేకమంది కవులను ఆహ్వానించి, కవిసమ్మేళనము ఏర్పాటు చేసియున్నారు. సహృదయులందరూ ఈ కార్యక్రమమునకు  అహ్వానితులే.
మియాపూర్ లోగల ఈసేవా కేంద్రము ప్రక్కనే గల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ఈ కార్యక్రమము జరుగుచున్నది. మియాపూర్ చౌరాస్తాకు, ఆల్విన్ చౌరాస్తాకు మధ్యగల ష్టాప్.రోడ్డుకు ఉత్తరంగా ఉన్న సందులో ఈ పాఠశాల కలదు.
జైహింద్.

Tuesday, November 6, 2012

తిరుమలేశుని తన హరికథా గానంతో ఓలలాడించిన హరికథా భాగవతార్ బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ ఈ నెల 2౦ వ తేదీన మన హైదరాబాదు వస్తున్నారు.

జైశ్రీరామ్.
భగవద్భక్తులారా! మొన్న గడిచిన తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో మూడు రోజుల పాటు తన హరి కథా గానంతో  జనాన్ని భక్తి పారవ్శ్యంలో ముంచెత్తి, ఆ వేంకటేశ్వర స్వామి వారికి సహితం ఆనంద పారవశ్యం కలిగించిన బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ (బొబ్బిలి)  మన భాగ్యనగరం తే.20 ని వస్తున్నారు. 23వ తేదీన వారి హరికథ ఉన్నది. 
20, 21, 22 తేదీలలో వారు మన భాగ్యనగరంలోనే ఉంటున్నందున ఎవరయినా వీరి హరికథా కార్యక్రమం పెట్టదలచుకొంటే ఇది ఒక మంచి అవకాశం.
23 వతేదీన పుట్టపర్తి సాయిబాబా వారి జయంతి సందర్భంగా 19 వతేదీ నుండి23వ తేదీ వరకు భక్తి కార్యక్రమాలు సాయి భక్తులు నిర్వహించుట పరిపాటి. అందుచే్ ఈ అవకాశం కోసం ఎదురు చూచేవారుంటారని భావించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
వారిని సంప్రదించ దలచుకొన్నవారి కొఱకు వారి సెల్ నెంబరు తెలియ జేస్తున్నాను.
వారి సెల్ నెంబరు 9014992816.
జైహింద్.

Thursday, October 4, 2012

ప్రభుత్వ మహారాజా సంస్కృత కలాశాల, విజయనగరం, పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము.

జైశ్రీరామ్.
సత్ సంప్రదాయ సాహితీ ప్రియ బంధువులారా!
నేను సన్మిత్రులతో కలిసి, సద్గురుదేవుల సుశిక్షణతో ప్రభుత్వ మహారాజా సంస్కృత కలాశాలలో 1968 - 69  నుండి 1971-72 వరకు భాషా ప్రవీణ అభ్యసించి యుంటిని. ఆ విద్యాభ్యసన సత్ ఫలముగా ఉపాధ్యాయ ఆచార్య పదవులు చేఁబట్టి సుమారు35 సంవత్సరములు బోధనా వృత్తిలో మమైకమై జీవనము విద్యార్థులమధ్య సాగించితిని.2008 జూన్ మాసాంతమున పదవీ విరమణ చేసి యున్న నాకు హృదయంలో చదువుకొనిన నాటి గుర్తులు లీలగా ఊగులాడుతున్నాయి.
ఐతే విజయ నగర వాసులైయున్న మా సతీర్థులు, మిత్రులు కొందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము గురు పూజ అనే మహాద్భుతమైన కార్యక్రమమును తే.07 - 10 - 2012 న  చేయ తలపెట్టి నాకు ఆహ్వానము పంపినారు. ఈ కార్యక్రమము చేయుచున్నారన్నంతనే నామనసు ఎంతగానో పొంగిపోయింది. మాకు జ్ఞాన భిక్షను పెట్టిన అలనాటి గురుదేవులను సేవించుకొనే సద్భాగ్యం నాకూ కలిగినందుకు,  హృదయంలో హృదయంగా మెలిగిన అలనాటి మిత్రులందరినీ ఒకేచోట ఒక్క సారి కలుసుకొనే భాగ్యం కలిగినందులకూ నాకెంతో ఆనందంగా ఉంది.ఈ మహదానందాన్ని నాలో దాచుకోలేక మీకూ పంచుతున్నందుకు నన్ను అన్యధా భావించకండి.
ఏ జన్మాంతర సద్గుణాళి ఫలమో యీ జన్మలో కల్గెనే!
తేజోరాశిగ నిల్చిలట్టి గురులన్ దీపించు జ్ఞాన ద్యుతుల్
రాజా సంస్కృత బోధనాలయమునన్ బ్రఖ్యాతిగా లభ్యమై
మా జన్మల్ తరియింపఁ జేసెను కదా! మా భాగ్యమే భాగ్యమౌన్.
మేమీ ప్రాంగణమందు సంచరిలుచున్ మేలైన సద్భావికిన్
నీమంబొప్పగ విద్య నేర్చితిమి సన్మిత్రాళితో గూడి. మా
క్షేమంబెప్పుడు చూచినారు గురువుల్, శ్రీశేషశాయాదులున్.
మేమాస్దద్గురు పాదదర్శనమునన్ మేల్గాంచగా కోరుచున్----
సోమేశ్వరాది మిత్రులు  -  ప్రేమామృత మొలుక మరల విద్యాజననిన్
మేమెల్లఁ గలియఁ బిలిచిరి  -  క్షేమంబులు తెలియ, గురుల సేవింప నటన్.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కలాశాల ప్రాంగణము.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కలాశాల ముఖ ద్వారము.
విద్యార్థులకు అన్నార్తిని పోకార్చే శ్రీసింహాచలవరాహ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానముసత్రవు.
కలాశాలలో తీర్చి దిద్దఁబడిన కొందరు సాహితీ మూర్తులు.
అలనాడచ్చట విద్య నేర్చితిమి.  స్నేహార్ద్రంపు చిత్తంబులన్
నిలిచెన్ బ్రేమ సుమాధురుల్. గతములన్ నేడిట్లు మేల్కొల్పుచున్
కలగా నిల్చిన నాటి గుర్తు లెదుటన్ కన్పించు నన్నంతనే
తులలేనట్టి ముదంబు తోడ నెదయే తూలెన్ మనోజ్ఞంబుగా.
ఎంతట తెల్లవారునని, ఎప్పుడు మిత్రులఁ జేరుదంచు క
వ్వింతలతోడ నామనసు వేగిరపెట్టుచు నుండె నద్దిరా!
ఇంతటి లౌల్యమా మదికి? ఏమని చెప్పుదు నాటి మిత్ర, స
ద్భ్రాంతిగ నిల్చినట్టి గురుపాద సుదర్శన భాగ్యమెన్నుచున్.
సరే ఇంత వయసొచ్చినా నా ఆరాటంమాత్రం అంతా యింతా కాకపోవటం నాకు వింతగా ఉన్నా ఇది మాత్రం యదార్థం. సరే ఎల్లుండి జరుగబోయే మాపూర్వ విద్యార్థుల సత్సమ్మేళనము గురుదర్శనానుభూతి మున్నగు విషయములను నేను ఈ కార్యక్రమానంతరం పంచగలను. విజయనగరం వెళ్ళి వస్తానండి మరి. నమస్తే.
జైహింద్.

Tuesday, September 4, 2012

మా మంచి మాష్టారు శ్రీ ఏ. గోపాలరావు గారు.

జై శ్రీరామ్.
 మా మంచి మాష్టారు  డా. ఏ. గోపాలరావు గురుదేవులు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా మంచి మాష్టారు శ్రీ ఏ.గోపాలరావుగారికి పాదాభివందనములు.
శ్రీరస్తు                                           శుభమస్తు                           అవిఘ్నమస్తు
శ్రీ గురుభ్యోనమః.
1.కంద గీత గర్భ ఉత్పల మాల.
శ్రీ గురు దేవ మీ చరణ సేవ రహిం గనఁ జాల నేను.స
చ్ఛ్రీఁ గొలుపున్ గదా! సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త! స
ద్ధీ గురు వంద్య! ఈ భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. భ
వ్యా! గణనన్ సదా సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజసా!

౧.ఉత్పల గర్భస్థ కందము:-
గురు దేవ మీ చరణ సే
వ రహిం గనఁ జాల నేను. సచ్ఛ్రీఁ గొలుపున్.
గురు వంద్య! ఈ భువి సుధీ
వర! మీ కృపఁ బొందితేను. భవ్యా! గణనన్. 

౨.ఉత్పల గర్భస్థ గీతము:-
చరణ సేవ రహిం గనఁ జాల నేను. 
సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త!  
భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. 
సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజ!

2.ద్విపద - మత్త కోకిల - కంద గర్భ సీసము:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా - మది నెంచుచున్, గురు మాన్య తమరు
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగఁగా! - సుజనాళిలో మేము శోభిలంగ!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగా  - గన నొప్పునే కద! వినుతముగను.
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా! గోప ప్రముఖ నామ!
గీ:-
ప్రముఖ గురు దేవ మీ దయ యమలము తమ
జ్ఞాన సుధ మహాద్భుతమగును గాదె! మహిని.
సుజనులు పొగడన్ దమ బోధ సులభ గతిని
ముదముగ కనంగ నగునయ! మురియుచునిల.

౧.సీస గర్భస్థ ద్విపద:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండ  
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగ! -  
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్న!  
మీదు పాద యుగంబు మిన్నగు మేలు! 

౨.సీస గర్భస్థ మత్తకోకిల:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా  మది నెంచుచున్,
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగగా! - సుజనాళిలో!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగాఁ  - గన నొప్పునే !  
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా!

౩.సీస గర్భస్థ కందము:-
ప్రముఖ గురు దేవ మీ దయ 
యమలము తమ జ్ఞాన సుధ మహాద్భుతమగును గా 
దె! మహిని. సుజనులు పొగడన్ 
దమ బోధ సులభ గతిని ముదముగ కనంగన్ !

3. నిరోష్ఠ్య ఆట వెలది:-
సరస! సకల శాస్త్ర సాన్నిధ్య సహృదయ! 
రస జగాన శిష్య రాజి నునిచి,
జగతి కీర్తి నెదిగి చక్కగా నిలిచిన
జ్ఞాన దాన నిరత! జయ నిధాన!

4. శ్రీ చక్ర బంధ తేట గీతి:-
సకల పూజిత శ్రీ కవి చంద్ర భాస !  
ధరణి దేవుఁడ శ్రీకర ధర్మ మోద !
విశ్వ కవి శేవ్య శ్రీ గోప వేద్య నామ !  
సవిధ సేవిత సత్పద సామ భాస !


5. చతురంగ బంధ కందము:-  ( గురువరు - పదములు - సుకవికి - వరములు )
సుమ సమ మృదుల వర గురు ప
దములు ఘన రుచిని వరలు బుధ వరులు నవనిన్
తమ పదవికి విజయ మొదవు. 
తమ కవితలు ముదము వసుధ తనరును సతమున్.


6. నక్షత్ర బంధ కందము:- ( సుగుణ వర వందనములు )
సుమ సహృదయ! మనమున ప్రా
ణముగా మములన్ నిలుప తనర కవిసత్ వం
శము దయఁ గని గుర్తించిరి
నమనమున విభవ! ప్రణతులు నయ వంశ శశీ!

7. క:- గురువర! మీ పాదాబ్జము
లరసి కొలువ కవిత ధార లసదృశ రీతిన్
పొరలుచు వచ్చును. నిజమిది.
కరుణనుఁ గను మిమ్ముఁ బోలు ఘను లిలఁ గలరే!

8. క:- దోషము లున్నను సైచెడి
మీ సము లెవరయ్య భువిని? మేల్తరమగు మీ
ధ్యాసను కలిగినవా రిల
భూషణులగు భారతికిని. పూజింపఁ బడున్.
స్వస్తి.
ఇట్లు
మీ ప్రియ శిష్యుఁడు 
చింతా రామ కృష్ణా రావు.
ఇందలి చిత్రకవితలకు చిత్రములు నిర్మించి పద్యముల నమర్చి సహకరించిన చిరంజీవి లంక రవీంద్ర కు నా అభినందనలు తెలియ జేసుకొనుచున్నాను.
జైహింద్.
జైహింద్.

మా మంచి మాష్టారు శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి.

జైశ్రీరామ్.
శ్రీ మంగళంపల్లికి ఎడమవైపున శ్రీ మానా ప్రగడశేషశాయి గురువులు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు దేవులకు సుమనర్నమస్సులు.హృదయ పూర్వక అభినందనలు.
సాహితీ బంధువులారా! 
వారికి ఇదివర్కు భక్తి పారవశ్యముతో చేయుచున్నపాదాభివందనములు ఈ సుభ సందర్భములో మరల ప్రకటిస్తున్నాను.

శ్రీరస్తు.                         శుభమస్తు.                    అవిఘ్నమస్తు.
శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీ గురు చరణములకు
మీ శిష్య పరమాణువు చింతా రామ కృష్ణా రావు
భక్తి పారవశ్యముతో చేయుచున్న
పాదాభివందనములు.
శా:- శ్రీనాధాది కవుల్ ధరా తలమునన్ శ్రీ శేషశాయే యనన్
మానాప్రగ్గడ శేష శాయి గురుసమ్మాన్యా! కృపన్ గల్గిరే!
జ్ఞానాంభోధి ప్రసన్నభాస్కర! మహా జ్ఞానామృతాంశల్ సదా
ప్రాణంబై ప్రణవంబునౌచు వెలయన్ భాగ్యంబుగాఁ గొల్పిరే!

చ:- గురువర! మీ మహాద్భుత సుగోచర మయ్యెడి జ్ఞాన దీప్తి మా
వరగుణ వృద్ధి కారణము. భాగ్య నిధానము. భవ్య బోధయున్.
సరి యెవరయ్య మీకిలను సద్గుణ గణ్యులలోన నెన్నగా.
కరములు మోడ్చి మ్రొక్కెదను గౌరవమొప్పగ, జ్ఞాన భాస్కరా!

చ:- మధుర వచస్వి! మీ మృదుల మంజుల గాత్ర విశేషమేమొ! మా
యెదలును పల్లవించినవి. ఏమని చెప్పుదు మీదు ప్రేమ! వా
ఙ్నిధి లభియించె మాకు. మహనీయుల దర్శన భాగ్యమబ్బె. మీ
సదమల దివ్య మానసము సారథియై నడిపించె మమ్ములన్.

కంద గీత గర్భ చంపక మాల:-
వర మధుస్రావమై, అమృత వారిధియై, శుభమై రహించు శ్రీ
చరణ నుతిన్ సదా సకల సత్పరివర్తనఁ జక్క జేయుచున్,
పర సుధనంబు గా కవిత పార, ధరన్ నను గౌరవించ్రి. ప్రాక్
సరస కవీ! సదా తమరి సన్నుత దీవన తప్పదెందునన్!

చంపక గర్భస్థ గీతము:-
అమృత వారిధియై, శుభమై రహించు
సకల సత్పరివర్తనఁ జక్క జేయు
కవిత పార, ధరన్ నను గౌరవించ్రి.
తమరి సన్నుత దీవన తప్పదెందు.

చంపక గర్భస్థ కందము:-
మధుస్రావమై, అమృత వా
రిధియై, శుభమై రహించు శ్రీచరణ నుతిన్
సుధనంబుగా కవిత పా
ర, ధరన్ నను గౌరవించ్రి, ప్రాక్ సరస కవీ!

శ్రీ చక్ర బంధ తేటగీతి:-
వరద పాండిత్య! శ్రీ యుత! వాఙ్నిధాన!
లక్ష్య వరదుఁడ! శ్రీ కర! లక్షణాది
సిద్ధిఁ గొలిపితే! శ్రీ వరసిద్ధి రామ
వరలఁ జేసితి నన్నంది వామ దేవ!

చ"తురంగ"గతి బంధ కందము:- ( గురువరు - వదనము - భవభయ హరణము )
సునిశిత పదముల తగు వివ
రణముగ గురువుల శరణు నర వరులు మహతిన్
కనవలె నుయభ సుఫలదము
లనవరతము నయము శుభము లది యిడును తగన్. 


నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - శేషశయన )
సుధ నభిషవ వశ వర! జ్ఞా
న ధనా! నయ బోధనను తనర కొలుపన్ శే
షి ధిషణ! భూమిజ దేవ! వి
శదమయ సుకవివర గణన. జన శేఖరుఁడా!

చ:- శుభమగు గాక దివ్య పరిశోభిత మూర్తికి జ్ఞాన దీప్తికిన్,
శుభమగు గాక పూజ్య రవి శోభలు గాంచిన పుణ్య మూర్తికిన్,
శుభమగు గాక శిష్య గణ శోభిత సద్గురు భవ్య కీర్తికిన్, 
శుభమగు గాక పుణ్య పరిశోభిత సత్కవి శేష శాయికిన్.
  
మంగళం                                                                   మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
ఇట్లు,
మీ శిష్య పరమాణువు
చింతా రామ కృష్ణా రావు.
హైదరాబాదు.
తేదీ.05 - ౦9 - 2012.
http://andhraamrutham.blogspot.com
సెల్.నెంబరు:- 9247238537.
జైహింద్.

మా మంచి హిందీ మాష్టారు శ్రీ తమ్మిశెట్టి అప్పారావు.

జై శ్రీరామ్.
అలనాటి్ మా హిందీ భాషాబోధనోపాధ్యాయిలు
శ్రీ తమ్మిశెట్టి అప్పారావు గారు.
ఆర్యులారా!
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యావత్ ఉపాధ్యాయ లోకానికి అభినందనలు తెలియ జేస్తున్నాను.
నేను విశాఖపట్టణం జిల్లా, యస్. రాయవరం గ్రామంలో 1961 - 62  నుండి 1966 - 67 వరకు ఉన్నత పాఠశాలలో యస్సెస్సెల్సీ వరకూ చదువుకొన్నాను.
ఆ రోజులలో మాకు హిందీ భాషా బోధకులుగా శ్రీ తమ్మిశెట్టి అప్పారావు మాష్టారు ఉండే వారు. ప్రస్తుతము వారు విశ్రాంతి తీసుకొని అదే గ్రామంలో ఉంటున్నారు.
వారి భాషా బోధనావిధానము, అంకిత భావముతో పని చేయుట, అత్యద్భుతమైన క్రమశిక్షణ, మున్నగు లక్షణాలు ఆనాడు మాకు మార్గదర్శకాలయ్యాయి. ఆ నాడు పడిన ఆ బీజాలే మమ్మల్ని సమాజంలో చక్కని నడవడికతో వృత్తిపట్ల అంకిత భావంతో ప్రజలతో మమేకమైస్నేహ భావంతో ప్రవర్తిల్లేలాగ చేసాయి.
మా మంచి మాష్టారుగా చెప్పుకొనేవారిలో మాకు ఈ హిందీ మాష్టారు ఒకరుగా చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
నమస్తే.
జైహింద్.

మా మంచి మాష్టారు.రచన :- శ్రీ పుల్లెల శ్యామ్.


జై శ్రీరామ్.
ఆర్యులారా!
సెప్టెంబరు మాసం ఐదవ తేదీన ఉపధ్యాయ దినోత్సవము సందర్భముగా శ్రీ పుల్లెల శ్యామ్ రచించిన మా మంచి మాష్టారు  వ్యాసము చదువ వలసినదిగా మనవి. 

అవి నేను హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. ఇంచుమించుగా కాలేజీలోని మాస్టారులందరూ క్లాసులో చెప్పవలసిన పాఠాలను ట్యూషన్ పేరిట ఇంట్లో చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్న రోజులు. మాకు శ్రీహరి అనే ఒక లెక్చరరు గారు రసాయనిక శాస్త్రమును చెప్పేవారు. చాలా నిజాయితీ గల మనిషి. ప్రభుత్వ కళాశాలకి వచ్చే విద్యార్ధులందరికీ ట్యూషన్లకు వెళ్లే స్థోమత ఉండదనీ అందుకని కాలేజీలోనే వాళ్ళకు చదువు నేర్పాలని నమ్మేవారు. తను ట్యూషన్లు చెబితే ధనాశ పెరిగి కళాశాలలో పాఠాలుచెప్పడానికి అడ్డువస్తుందని, ట్యూషన్లు చెప్పేవారు కాదు. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్లు రోజూ క్లాసుకు వచ్చి పాఠాలు చెప్పడం చాలా అరుదైన విషయం. అటువంటిది, తను రోజూ వచ్చి పాఠాలు చెప్పడమే కాకుండా, కాలేజి ప్రిన్సిపాలు గారిదగ్గర తాళాలు తీసికుని, శని ఆదివారాలలో కూడా ఆసక్తి ఉన్న విద్యార్ధులకు రసాయన శాస్త్రము బోధించేవారు. చాలా ఓపికగా అడిగిన ప్రశ్నలన్నింటికీ విసుగుపడకుండా సమాధానాలు చెబుతూ చాలా ప్రణాలికగా క్లాసుని నడిపేవారు. ఆయనకు పాఠాలు చెప్పడములో ఎంత శ్రద్ధ ఉండేదంటే, ఆయనకు ఒకసారి ఒక వారం రోజులపాటు విపరీతమైన జ్వరము వచ్చినా,  ఇంజినీరింగు ఎంట్రన్సు దగ్గరకి వస్తోంది కాబట్టి క్లాసులు చాలా ముఖ్యమని, మేము వద్దంటున్నా వినకుండా, క్లాసులకి వచ్చి పాఠాలు చెప్పడమే కాకుండా, శని ఆదివారాలు కూడా వచ్చి మాకు రివ్యూ చేసారు. అయితే ఇంజినీరింగు కోచింగుల మోజులో పడి ఈయన చెప్పే ఉచిత క్లాసులకు చాలామంది వచ్చేవారు కాదు. ఆయన ఎంత బాగా చెప్పేవారంటే, శని ఆది వారాలలో వచ్చే మా అయిదుగురిలో ముగ్గురకు మంచి ర్యాంకు వచ్చి, REC (now it's called NIT, Warangal)లో సీటు వచ్చింది. నాకు ఇంజినీరింగు ఎంట్రన్సులో, కెమిస్ట్రీలో, 50 కి 45 మర్కులు వచ్చాయి. తద్వారా నేను ఇంజినీరునయ్యి జీవితంలో స్థిరపడడానికి కారణం మా శ్రీహరి మాస్టారేనని నా ప్రగాఢ నమ్మకం.

ఇంతకీ ఈ శ్రీహరి మాస్టారు ఎవరో కాదు, TDP ద్వార ఎన్నికయి, మొదట MLAగా తరువాత ఒక మినిస్టరుగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలందించిన కడియం శ్రీహరి గారు. మొదట ఆయన రాజకీయాలలోకి దిగినప్పుడు ఆశ్చర్యము, కొద్దిగా బాధ కలిగినా, అటువంటి నిజాయితీపరుడు మంత్రి పదవిలో ఉండడం మూలంగా, రాష్ట్రానికి కొంచమైనా మేలు జరిగిందని నా అభిప్రాయం. ఉపాధ్యాయుల దినము సందర్భంగా మీ శ్రీహరి మాష్టారును తలుచుకోవటం నా కనీస విధిగా భావిస్తున్నాను. అయితే ఇంటర్మీడియట్ తరువాత ఆయనను మళ్ళి కలవడం కుదరలేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక సారి కలవడానికి వెళ్ళాను గాని బంట్రోతు పూజారి వరమియ్యలేదు. ఈసారి భారతదేశం వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను.
 
కం//
కడియం శ్రీహరి మాస్టరు,
బడిలో మీర్నేర్పినట్టి పాఠము లన్నీ
ఇడెనయ చక్కని ర్యాంకును
కడు ప్రణతులు మీకు దయను గైకొనుమయ్యా

భవదీయుడు,
పుల్లెల శ్యామసుందర్.
చదివిరి కదండీ! మరి మీ మంచి మాష్టారు వ్యాసం వ్రాసి పంపకుండా ఉండ గలరా? మరెందుకు ఆలస్యం? పంపొంచేయండి.
నమస్తే.
జైహింద్.

Tuesday, August 28, 2012

ఆదర్శోపాధ్యాయ శ్రీ కంది శంకరయ్య గారికి అభినందన మందారాలు.


శ్రీరస్తు         శుభమస్తు       అవిఘ్నమస్తు
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా " శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు 
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.

కం:- శ్రీ కంది వంశ చంద్రమ! 
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన  
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!

సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి  -  స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి  -  ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము  -  నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో  -  విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టిన నగవులు జిందు మోము 
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ  గాంభీర్యతలు చూపు కన్ను దోయి 
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!

శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.

గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!  
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము. 
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.

గీ:- మంగళంబులు మీకిల మంగళములు. 
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.  
మంగళంబులు హరికి సన్ మంగళములు.

మంగళం                       మహత్                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ