Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 9 / 22వ భాగము 41 నుండి 45 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  9 / 2 2వ భాగము 41 నుండి  45వ  పద్యము వరకు.


చ. గగన తలంబునన్ వెలుఁగు కాంతిమయుండగు సూర్య దేవుఁడీ

జగతికి వెల్గులిచ్చినను సన్నుతినీ జగమంత నిల్వగా

నగణిత శబ్ద జాతమున కాద్యము నీవయి నిండియుండుటన్  

నిగమ సువేద్యు సృష్టికి సునిశ్చిత సుస్థితి కల్గె భారతీ! 41.                                                 

భావము. 

ఓ వాగ్దేవీ! ఆకాశమునుండి సూర్యుఁడు వెలుగులిచ్చుచున్నప్పటికి ఈ సృష్టి 

మొత్తము నిలుచుటకు శబ్దమునుండి నీవుద్భవించుచుండుట చేతనే 

ఆ పరమేశ్వర సృష్టినిశ్చితమైన స్థితితో నొప్పఁగలుగుచున్నదమ్మా.


చ. కనులకుఁ గానిపించునవి కల్గు టబద్ధము. జ్ఞాన చక్షువున్

గనఁబడు టాత్మ తత్వమది కర్మ ఫలంబునఁ గల్గు. నిక్కమై

వినఁబడునట్టి శబ్దముల విస్తృత మైనది నిత్య సత్యమో

మ్మను ప్రణవాక్షరం బొకటి, హత్తెను మన్మతిలోన భారతీ! 42.

భావము. 

ఓ వసుధామాతా! ఈ కనులకు కనిపించునవి అబద్ధము,.జ్ఞాన నేత్రమునకు 

ఆత్మతత్వము కనఁబడుట కర్మ ఫలితముననే కలుఁగును. నిజముగ 

వినఁబడునట్టి శబ్దములలో ఓం అను ప్రణవాక్షరము నిత్య సత్యమై విస్త్రుతమైనది. 

ఆ ఓమ్ నామదిలో హత్తుకొనెనమ్మా., 


చ. జయములనిచ్చు తల్లివి,  ప్రజన్ గృపఁ గాచెడి కల్పవల్లివై

భయహర తేజమై నిలిచి భద్రముఁ గొల్పెడి భద్రమూర్తివై.

నయమును, నేర్పు,  నేర్పుచును, నా మది వర్తిలు శారదాంబవై

రయమున పద్యరూపమున ప్రస్ఫుటమైతివి నాకు భారతీ! 43.

భావము. 

ఓ తీవ్రా మాతా! ప్రజలను కాపాడు కల్పవల్లివై జయములనిచ్చుదానవు.. 

భయమును పోఁగొట్టుదానివయి,మనసులలో నిలిచి బ్రద్రతను కల్పించెడి 

భద్రమూర్తివయి, న్యాయము, నైపుణ్యము నేర్పుచు, నా మనసున వసించు 

వాగీశ్వరివై వేగముతో కూది పద్యరూపములలో నీకు స్పష్టమైతివమ్మా.


చ. తలపులలోన నిల్పుమిక తత్పరతత్వము. దైవ మార్గమున్.

తెలిపెద భావనా చయము, తెల్పగ భాష నమేయ రీతిలో

గొలుపుము. నీ పదాబ్జ నుత గోచర దీప్తులు దుర్మదాంధమున్

నిలపడనీక మాపు నిక. నీ దయ నా కభయంబు భారతీ! 44.

భావము. 

ఓ మహాభద్రా! దైవ మార్గమును తత్పరత్వమును నా ఆలోచనలలో ని నేను 

నా భావనలను తెలిపెదను. ఆవిధముగ తెలుపుటకు భాషను నాలో నిలుపుము. 

నీ పాద దీప్తులు దుర్మదాంధమును పారద్రోలును.నీ దయయే నాకు 

అభయమమ్మా.


చ. మదికి పురాణముల్ కథలు, మార్గ సుదర్శకమెట్టులౌను? స

ద్బుధజన వాక్ప్రభా కలిత బోధక వాఙ్మహనీయ సారమే

మదిని రహించి నిల్చు. వర మాతృకలై వికసించుచుండు. సం

పదలవి మాకునెల్లెడల భాసిత సత్కృతులమ్మ. భారతీ! 45.

భావము. 

ఓ మహాబలా! పురాణములు కథలు మార్గదర్శకములగుటకు పెద్దలు చెప్పెడివే 

మా మనసులలో నిలుచును. రచనకు మాత్రుకలై వికసించుచుండును. 

అవియే మాకు సంపదలు. భాసించు సత్కృతులవేనమ్మా.

జైహింద్.

No comments: