Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 19 / 22వ భాగము 91 నుండి 95 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  19 / 2 2వ భాగము 91 నుండి  95వ  పద్యము వరకు.


చ. పరమ దయానిధానయగు పార్వతి,  మాత రమా కృపాబ్ధియున్

నిరుపమవైన నీవును మనీషుల మధ్యను నన్ను నిల్పగా 

గరువముతోడ నొప్పితిని. కావ్యరమాసతి కంఠ హారమై

మరువకుడమ్మ ముక్తినిడి మాన్యతఁ నిల్పఁగ భవ్య భారతీ! 91.

భావము. 

ఓ వారాహీ! లక్ష్మీదేవియు పార్వతీ మాతయు నీవునుమహనీయుల మధ్య 

నన్ను నిలుపుట చేత ఆత్మ గౌరవముతో కవ్యరమాకంఠహారమై రహించితిని. 

నాకు ముక్తినొసగి గౌరవమును ఇచ్చుట మీరు మరువవలదమ్మా.


చ. తెలిసి వచించియుంటినొకొ, తెల్పితొ యేమి యెఱుంగకే. మదిన్

దలచినదెల్లఁ దెల్పితిని, తన్మయతన్,  మహనీయమైన నీ 

సులలిత సుందరోజ్వల విశుద్ధసుపూజ్య గుణాదికంబులన్

దలచుచు నిన్ను నేఁ బలుకఁ దప్పక యుక్తమె యౌను భారతీ! 92. 

భావము. 

ఓ వారిజాసనా!నిన్ను గూర్చి తెలిసి చెప్పితినో, తెలియక చెప్పితినో,మనసున 

భావించినదంతయు తన్మయత్వముతో చెప్పియుంటిని.గొప్పదైన నీయొక్క

సులలితమైన సుందరమైన ఉజ్వలమైన శుభ్రమైనప్రపూజ్యమైనగుణములు 

మున్నహువాన్ని తలచుచు నిన్ను గూర్చి చెప్పినప్పుడు అవి యుక్తమైనవే 

యగునమ్మా.


చ. పదములు రావు నాకు, పరిపక్వత లేదు, పఠించువాటిలో.

ముదమున నిన్ను నేఁ దలచి పొందుదు బంధుర బంధ నైపుణిన్.

వదలను నీదు పాదములు వ్రాయగనెంచినవెల్ల వ్రాయుటన్

ముదమున చేయుదాక. వరమో? భరమో? కరుణించు భారతీ! 93. 

భావము. 

ఓ చిత్రాంబరా మాతా! నాకుపదసంపద తక్కువ. పఠించువాటినర్థము 

చేసుకొనునంతటి జ్ఞాన పక్వత లేదు. సంతోషముతో నిన్ను తలంచుకొని నేను 

బంధురమైన బంధ కవితా నిపుణతను పొందితినమ్మా. నేను వ్రాయనెంచినవి 

పూర్తిగా వ్రాయు వరకు నీ పాదములు వీడనమ్మా.  ఇది వరమో, భరమో, ఎఱుఁగను. 

కరుణించుమమ్మా.


చ. శుభముల కాలవాలమయి శోభిలఁ జేసెడి శారదాంబ ! మా

కభయము నీవు. నీ కృపమహాద్భుతరీతిని గాంచితమ్మ! నీ

విభవము నూరు పద్యముల విస్తృతి మించి రచించి తిద్ది. నా 

కుభయ ఫలంబు లీవొసఁగి, యుద్ధతినొప్పఁ నిల్పు, భారతీ! 94.                                         

భావము. 

ఓ చిత్రగంధా మాతా! ఓ శోభనమూర్తివై భక్తులను శోభిలునట్లు చేయు శారదామాతా! 

నీవే మాకు అభయమమ్మా. నీకృపను నేను గొప్పగా చూచితినమ్మా! నీ వైభవమును 

నూరు పద్యములమించి ఇది వ్రాసితినమ్మా. ఇహపర సద్గతులు కొలిపి, గొప్పగా 

నన్ను నిలుపుమమ్మా! 


చ. తెలతెలవారుచుండగనె దీక్షగ పద్య శతంబు వ్రాసితిన్

నిలుపుచు నిన్ను నా మదిని నిత్యశుభావహ శారదాంబ! నీ

తలపులె వ్రాయఁ జేసినవి, ధన్యతఁ గూర్పఁగ నాకు. నిత్యమున్

మెలకువతోడ నిన్గొలిచి మేలుఁ గ వర్ధిలనిమ్ము.భారతీ! 95. 

భావము. 

నిత్యమును శుభములకు స్థానమైన ఓ చిత్రమాల్యావిభూషితా!నిన్ను నా మనసులో 

నిలిపి ఉదయము ప్రారంభించిన ఈ శతక రచనను తెలతెలవారుచుండుసరికి 

దీక్షతో వ్రాయఁగలిగితిని. నా జన్మను చరితార్థము చేయుటకు నిన్ను గూర్చిన 

ఆలోచనలే నాచే వ్రాయించినవి. ఎల్లప్పుడూ ధ్యాసతో నిన్ను కొలుచుచు మేలుగా 

అభివృద్ధి చెందనిమ్ము.

జైహింద్.

No comments: