Sunday, January 31, 2016

ఓటు దండకము . . . గోలకొండ పత్రిక 24-5-1934

జైశ్రీరామ్.
ఓటు దండకము ---గోల్కొండ పత్రిక సంపాదకులు.
క. నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ; నిజముగ సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా గతివి పతివి నిజముగ ఓటర్!
శా. లావొక్కింతయులేదు;ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్దప్పెను మూర్చవచ్చె; తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
ఓటే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే వోటర కావవే వరద సం రక్షించు భద్రాత్మకా-
దండకము
మహా భాగ్యనగరాన మా పూర్వపుణ్యాన మే మెన్నియో యేండ్లు చూడంగ చూడంగ మా బాల్యమున్ యౌవనత్వంబు
మా ప్రాయముల్ మనో దార్ఢ్యముల్ క్రుంగుచున్ పొయి వృధ్ధాప్యమున్ పొంది వెండ్రుకల్ తెల్లనై ముప్పయారేండ్లు అటు గడ్చి ఇటు గడ్చి
ఈనాటికిన్వచ్చె యీ కొత్త ఖానూను మా గోర్కెలీడేర మా జన్మముల్ ధన్యతన్ బొందె నో బల్దియా శాసనంబో ఇదే నీకు వేవేల దణ్ణాలు
కైకొమ్ము తల్లీ వినో వొటరా--
మూడేండ్ల(ఐదేండ్ల) కోసారి నీ పాదపద్మంబులం గొల్చి నిన్ను నే దలచెదన్ నే పిలిచెదన్ నీ కటాక్షంబునన్ జూడవే దాతవై బ్రోవవే దగ్గిరన్
నిల్వవే స్వామి నిన్నెంచ నే నెంతవాడన్ దయా దృష్టి వీక్షింపవే నా ఓటు నాకిచ్చి నన్నెట్టులైనన్ సఫాయీకమేటీకి మెంబర్నుగా
జేసినన్ జాలు నా వంశమున్ దేశమున్ ధన్యతం బొందు ఆ మీద నా పూర్వపుణ్యంబు నా చాకచక్యంబు నా భావి భాగ్యంబు నా తంత్ర
నాదంబు సవ్యంబుగా నున్నచో ఆ నిచ్చెనంబట్టి ఎంతైన పైబైకి ఎగబ్రాకగావచ్చు ఎన్ని హాట్ హోములైనన్ భుజింపంగ ఆటంకముల్లేవు
రాజ మాన్యుండగావచ్చు పేదసాదల్ భయంబంద అటు తిర్గి ఇటు తిర్గి ఎంతెంత పేరైన నే పొందగావచ్చు కొద్ది యుద్యోగులన్ శక్తి
యున్నంత ఏడ్పించగావచ్చు వీలుగా నున్నచో కొద్ది మేల్జేసి షాభాషు షాభాషు అనిపించుకోవచ్చు ఏవైన లాభాలు సాధించుకోవచ్చు
కాబట్టి యెట్లైన నీ ఓటుతో గూడ బంధుమిత్రాది వర్గంబు ఓట్లన్ని నాకు నిప్పింపుమా నన్ను రక్షింపుమా లేమి పోగొట్టుమా దీనునిన్
బ్రోవగా దిక్కు నీవే గదా నీవేకులంబందు జన్మంబుగానీ నీ స్పర్స నీ చూపు నీ తీరు మొదలైన నీదే సమస్తంబు అస్పృస్యమౌ గాని
సాక్షాత్ పరబ్రహ్మ రూపంబుగా నుండు నీ ఓటు మాత్రంబె నిత్య సంపూతమై నెగడు లోకంబులన్ సంసారమున్ బాసి సౌఖ్యంబులన్ రోసి
నిద్రహారంబులన్ నీతి నియమంబులన్ నిత్యకృత్యంబులన్ మాని సర్వంబు వర్జించి యోగీశ్వరుంబోలి నీ దీక్షతో నుండి నీ ఓటు
వాంచించెదన్ నిన్ను యాచించెదన్ ఓటే సమస్తంబు ఓటే ప్రశస్తంబు ఓటే మహా ముక్తి ఓటే పర బ్రహ్మ తధ్ధారివైనట్టి ఓటర్ మహాదేవ
నమస్తే ! నమస్తే! నమః.
[గోలకొండ పత్రిక 24-5-1934]
జైహింద్.