Thursday, November 30, 2017

బాలభావన శతకము 54వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్
54) తండ్రి ప్రేమ చూపు. తన వస్తు వేదైన  పాడు చేయ మమ్ము పట్టి కొట్టు.
     తల్లి యట్లు కాక తండ్రిని వారించుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తండ్రి పిల్లలపై ప్రేమ చూపించుచుండును . కాని ఏదైనా తన వస్తువును పిల్లలు పాడు చేసినట్లైతే పట్టుకొని కొట్టును. కన్న తల్లి మాత్రము ఆ విధముగా కాదు. దండింపఁ బోవుచున్న తండ్రిని దండించనీయకుండా ఆమె అడ్డుకొనును
జైహింద్.

Wednesday, November 29, 2017

బాలభావన శతకము 53వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
బాలభావన శతకము 53వ పద్యము.
53) తల్లి ప్రేమ తీపి తలపక పిననాడు  -  కొట్టి తిట్టినాము కొరికినాము.
     తల్లి మనసు వెన్న దండించదేనాఁడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు అమ్మ యొక్క ప్రేమ చిన్న తనములో తెలియక పోవుట చేత మేము ఆ ప్రేమ మూర్తిని కొట్టుట, తిట్టుట, కొరుకుట, మొదలగు పనులవలన ఎంతగానో బాధ పెట్టి యుంటిమి. ఐననూ వెన్న వంటి మనసున్న మా అమ్మ ఏనాడూ పిల్లలను దండించుట చేయలేదు. అట్టి తల్లి ఋణము ఏ బిడ్డ తీర్చుకొన గలఁడు? జీవితాంతము మేము మా తల్లిదండ్రులపై ప్రేమతో మెలగవలసి యున్నది.
జైహింద్.

Monday, November 27, 2017

బాల భావన. 52వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
బాల భావన. 52వ పద్యము.
52) తల్లిదండ్రులెపుడు పిల్లల వృద్ధినే   -  కోరుచుంద్రు సుఖము ధారవోసి.
     పెంచి పెద్ద చేసి, మంచినే చూపుడీ.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి తండ్రులు తమ సుఖమును ధారవోసిమరీ తమ పిల్లల యొక్క అభివృద్ధినే కోరుకొనుచుందురు. అట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నప్పుడు వారిలో మంచి గుణములనే అభివృద్ధి చేయవలెను.
జైహింద్.

Sunday, November 26, 2017

బాల భావన. 51వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
బాల భావన. 51వ పద్యము.
51) తల్లి ప్రేమ పంచి తల్లడిల్లుచునుండు  పిల్లవాఁడు పుట్టి పెరుఁగు వరకు
     తండ్రి బ్రతుక నేర్ప దండించి, చింతించుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పిల్లలను కని వారు పెరిగే వరకు తల్లి తన ప్రేమను పంచుచు వారి కొఱకై తల్లడిల్లుచునే యుండును. అంతటి ప్రేమ మూర్తి అమ్మ. తండ్రి పిల్లలకు బ్రతుకుట నేర్పుట కొఱకు తప్పని పరిస్థితిలో దండించి, ఆ తరువాత అయ్యో ఎందుకు పిల్లవానిని దండించానా అని విచారించుచుండు.ను. అంతటి జాలి గుండె కలవాడు తండ్రి..
జైహింద్.

Friday, November 24, 2017

బాల భావన శతకము. 50 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
50) తినుటకిచ్చి మమ్ము తిట్టుదురప్పుడే  చదువలేదటంచు చవటయనుచు.
     తినుటకిచ్చి తిట్ట తినబుద్ధి పుట్టునాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు తినుటకు ఆహారము పెట్టి మేము భోజనము చేయుచున్నప్పుడే చదువుకోవటం లేదు, వట్టి చవటవి అని  మమ్మల్ని పెద్దలు తిట్టుచుందురు. తినుటకు పెట్టి తిట్టుచున్నట్లైతే మాకు ఆ ఆహారము తినుటకు ఎట్లు బుద్ధి పుట్టును?
జైహింద్.

Thursday, November 23, 2017

బాల భావన శతకము. 49 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
49) కులమునెంచకుండ కలిసికట్టుగనుండు  సంఘ జనుల పెంపు చక్కన భువి.
     కులము మతము నెంచి కూల్చఁ బోకుడు మమ్ముపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కులమతములను గణింపకుండా, సంఘీభావముతో ఉండేటువంటి సంఘము లోని జనుల యొక్క పెంపు మాకు భూమిపై చక్కఁగనుండును. కులమతములనెంచి మమ్మల్ని కూల్చకండి.
జైహింద్.

Wednesday, November 22, 2017

బాల భావన శతకము. 48 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
48) స్వార్థ బుద్ధితోడ సన్మార్గమును వీడి  దురిత వర్తనమున దూఱువడెడి
     పెద్దవారు పెంచ పెంపు మాకెటులబ్బుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తమ స్వార్థ బుద్ధితో ప్రవర్తనలో సన్మార్గమును విడనాడి, దుర్మార్గ ప్రవర్తనతో నిందింపఁ బడుతూ ఉండెడి పెద్దవాళ్ళ పెంపులో మేమున్నచో మాకు ఆధిక్యత అనునది ఏ విధముగా కలుగుతుంది?
జైహింద్.

Tuesday, November 21, 2017

బాల భావన శతకము. 47 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
47) స్వార్థ బుద్ధి వీడి పర సుఖంబును కోరు  ఘనుల మంచి గుణమె కాంతి మాకు

     దారిఁ జూపి స్వార్థ దూరులఁ జేయునుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! స్వార్థ బుద్ధిని విడనాడి, పరుల సుఖమునే ఎల్లప్పుడు కోరుకొనుచు ఉండెడి మహనీయుల యొక్క మంచి గుణమే మాకు వెలుగు. మంచి మార్గమును కనఁబరచి, మమ్ములను స్వార్థమునకు దూరముగా ఉండునట్లు చేయండి.

జైహింద్.

Monday, November 20, 2017

బాల భావన శతకము. 46 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
46) పేదవారి నెల్ల సాదరంబుఁగ చూచి  ప్రేమ ధనము పంచి వెలుగు నెవరు
     వారె భువిని మాకు నారాధ్య దైవముల్పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ధనము లేని పేదవారిని ఆదరముతో చూచుచు, ప్రేమ అనే దనమును  వారికి పంచిపెట్టి ఎవరు ప్రకాశింతురో అట్టి మహనీయులే మాకు ఆరాధ్య దైవములు.
జైహింద్.

Sunday, November 19, 2017

నాగపాశబంధము అంత్యప్రాసాలంకార చంపకమాల. కవి శ్రీ కోట శర్మ

జైశ్రీరామ్.
 ఆర్యులారా! 
కవి కోట శర్మ కృత నాగపాశ బంధ చంపకమాలను ఎలా వ్రాసారో చూడండి. అభినందించండి.


నాగపాశబంధము
అంత్యప్రాసాలంకార చంపకమాల

పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్
నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్
కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్
తలచెద నీదు తత్త్వమును తత్త్వము నేనగుచున్ తరించగన్
స్వస్తి.
కోట శర్మ

కవికి అభినందనలు.
జైహింద్.

బాల భావన శతకము. 45 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
45) పాఠశాలలోన పంతులమ్మలు చెప్పు   మాట మాకు బ్రతుకు బాట. కాన
     మంచి మాటలాడి మంచిని పెంచుడీ పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే బడిలో మాకు పాఠములను చెప్పెడి పంతులమ్మల మాటలే మాకు బ్రతుకు బాటలు. కావున మాతో మంచి మాటలాడి మంచినే పెంచండి.
జైహింద్.

Friday, November 17, 2017

బాల భావన శతకము. 44 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
44) మద్య మాంసములను మా ముందు సేవించ- మేము నేర్చుకొనమె మిమ్ముఁ జూచి?
     మంచి తిండి తినుఁడు, మంచివే త్రాగుడుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మా ముందే మద్య మాంసాదులను సేవించుచుండగా, మిమ్ములను చూచి మేము నేర్చుకొనమా? మీరెల్లప్పుడు మంచి తిన తగిన పదార్థములనే తినుచు, త్రాగఁ దగిన పానీయములనే త్రాగుచుండుడు. అది ఉభయులకు శ్రేయస్కరము.
జైహింద్.

Thursday, November 16, 2017

బాల భావన శతకము. 43 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
43) నచ్చినట్టివెల్ల వెచ్చించి కొని, తినితినఁగఁ జేయ మాకు తెలియునెట్లు
     తినఁగ నేవి తగునొ? తినరానివేవియోపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీకు నచ్చిన తినుబండారములనన్నిట్టిని మీరు ధనము వెచ్చించి కొని, తినుచు మాకును తినుఁడని పెట్టుదురు. మీరు మాకు ఆ విధముగా అలవాటు చేయుటచే ఏవి తిన తగినవో, ఏవి తిన రానివో మాకు ఏవిధముగా తెలియును?
జైహింద్.

బాల భావన శతకము. 42 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
42) మంచి త్రోవలోన మము నడిపించుచు  మంచి మాటలాడి మంచి నేర్పి
     మంచి మార్గమెంచి యుంచుఁడు మమ్ములపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్ములను మీరు మంచి త్రోవలో నడిపించండి. మంచిగా మాతో మాటలడండి. మంచి మార్గాన్నే మీరు యెంచి మమ్ములను ఆ మార్గమున ఉంచండి.
జైహింద్.

Wednesday, November 15, 2017

బాల భావన శతకము. 41 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
41) ఆడరాని మాట లాడెడి మీ నుండి  పాడు మాటలెల్ల పట్టు మమ్ము.
     మంచి మాట లాడి మంచిగా పెంచుడీపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాటలాడ కూడనివి మీరు మాటలాడు చున్నచో  ఆ పాడుమాటలన్నియు మా మనసుకు పట్టివేయును. మేమునూ అటులే పాడుమాటలాడుటకు అలవాటు పడిపోక మానము. కాబట్టి మీరు ఆడ తగిన మంచి మాటలే మాటలాడుచు మమ్ములను మంచిగా పెంచండి.
జైహింద్.

Tuesday, November 14, 2017

బాల భావన శతకము. 40 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
40) చూడరానివెల్ల చూడగా చూడగా  కనులలోన నిలుచు కానఁ బడుచు
     చూపఁ దగినవెల్ల చూడుఁడు. చూపుఁడుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చూడ రాన్ వాటినే మనము చూడగా చూడగా ఆ దృశ్యములు మన కన్నులను వీడిపోక అలా కనులు మూసినా తెరచినాకనపడుతూనే ఉంటాయి. కాబట్టి చూడ తగిన వాటినే మీరు చూడండి అట్టివే మాకునూ తప్పక చూపించండి. 
జైహింద్.

Monday, November 13, 2017

బాల భావన శతకము. 39 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
39) చదువరాని చెత్త చదువగా చదువగా  మనసు ఖిలము చెంది మైల పడును.
     మైల పడిన మదిని మముఁ జూడ మనసౌనెపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చదువరాని వాటిని చదువు చుందురు. అట్లు చదువుట వలన మనసు చెడి మలినమునొందును. అట్టి మలినమైన మనసుతో మమ్ము చూచుటకు వారికి ఏ విధముగా మనసు కలుగును? సిగ్గనిపించదా?
జైహింద్.

Sunday, November 12, 2017

బాల భావన శతకము. 38 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
38) పిల్లల కను గప్పి బిడియము విడనాడి  చేయరాని పనులు చేయుచున్న
     పెద్దలన్న ప్రేమ పెరుగునెట్టులు మాకుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చిన్న పిల్లల కంట పడకుండా, సిగ్గు విడిచి, చేయ రాని పనులు చేయుచుందురు. అట్టి పెద్దలపై మాకు ప్రేమ ఏవిధముగా పెరుగును?
జైహింద్.

Saturday, November 11, 2017

బాల భావన శతకము. 37 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
37) తమ సుఖంబు కాంచు తమ బిడ్డ సుఖములో  తల్లిదండ్రులిలను ధర్మమనుచు.
     కన్న వార లనిన కరుణకు ప్రతి రూపుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల సుఖములోనే తమ సుఖమును కూడా చూచుకొందురు. ఇదియే ధర్మమని వారు తలంతురు. భూమిపై అట్టి తల్లిదండ్రులు కరుణకు ప్రతి రూపులే.
జైహింద్.

Friday, November 10, 2017

బాల భావన శతకము. 36 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
36) బద్ధకమ్ముతోడ పట్టించు కోకుండ  కాలమును గడిపెడి కన్నవారు
     మార్గదర్శకులుగ మాకెట్టులగుదురుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కాలము వాలా విలువైనది. అట్టి కాలము గడిచి పోవుచున్నదని గ్రహించుకోకుండా బద్ధకముగా గడిపే తల్లిదండ్రులు ఉన్నట్లైతే వారు మాకు మార్గదర్శకులెలా అగుదురు?  (Time sence) కాల వివేచన కలిగి ఉండి బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉంటూ కాలంతోపాటు నడుస్తూ మమ్మల్ని నడిపించే తల్లిదండ్రులే మాకు ఆదర్శము
జైహింద్.

Thursday, November 9, 2017

బాల భావన శతకము. 35 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
35) చూడఁ దగిన మంచి చూపుచు, మామది  వీడనట్టి నీతి పెంచి, మీరు
     మంచి మార్గమునను మము నడిపించరేపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చూడ తగినటువంటి మంచివాటిని మాకు చూపుచు, మా మనస్సును వీడిపోని నీతిని మాలో పెంచి, మమ్ములను మంచి మార్గమున మీరు నడిపించలేరా?
జైహింద్.

అనంతపురంలో అష్టావధానం. అవధాని. బ్రహ్మశ్రీ మాడుగుల అనిల్ కుమార్.

జైశ్రీరామ్.

ఈ అవధాన కార్యక్రమం నిరుపమానంగా సంపన్నమవాలని మనసారా కోరుకొంటూ నిర్వాహకులకు, అవధాని గారికి, పృచ్ఛకాళికి సంచాలకులకు, సభాసదులకు శుభకాంక్షలు ముందుగానే తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.

Wednesday, November 8, 2017

బాల భావన శతకము. 34 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
34) దూరదర్శనమున దూర భాషణమున  కాలమెల్ల పుచ్చు కన్న వారు
     పిల్లల మదిఁ బ్రేమ పెరుఁగ నెట్టులొనర్త్రుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  దూర దర్శన కార్యక్రమములు చూచుచు దూర శ్రవణము ద్వారా నిరంతరము ఇతరులతో సంభాషించుచు కాలమును గదుపునట్టి తల్లిదండ్రులు ఇక పిల్లల మనసులో ప్రేమ నేవిధముగా పెరుగునట్లు చేయుదురు? వ్యర్థమైన దూర దర్శన కార్య క్రమములు చూచుట వారికి తగదు. అటులనే వ్యర్థమైన సంభాషణలు చేయుచూ కాల యాపన చేయక పిల్లలతో ప్రేమగా అవకాశము కల్పించుకొని ఎక్కువ కాలము గడి పిల్లలలో ప్రేమ కలిగించవలెను.
జైహింద్.

Tuesday, November 7, 2017

బాల భావన శతకము. 33 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
33) మంచి మాటలాడి మన్నన నుండెడి  తల్లిదండ్రులున్న ధన్యమదియె.
     తప్పుచేయకుండ గొప్పగా మెలగుడో  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మంచిగా మాటాడుతూ మన్ననలందుతూ ఉండే తల్లిదండ్రులు కలిగి ఉండుట కంటే ధన్యత మాకేమున్నది? తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుడు పనులకొడికట్టకుండా గొప్పగా ప్రవర్తించవలసి ఉన్నదని గ్రహింతురుగాక.
జైహింద్.

Monday, November 6, 2017

బాల భావన శతకము. 32 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
32) తెల్ల కాగితాలు పిల్లల మనసులు  మమ్ము పట్టి మీరు మప్పుచుండ
     మంచి చెడులు కనుట మాకెట్లు సాధ్యముపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా మనస్సులు తెల్లకాగితములవలె నిష్కళంకంగా ఉంటాయి. మాకు మీరు మప్పుచున్నవాటిని మేము గ్రహింతుము. వాటిలో ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుసుకొనుట మాకు సాధ్యము కాదుకదా? కావున మంచి విషయములే మీరు మాకు నేర్పాలని మేము మీకు గుర్తుచేయనక్కర లేదు కదా?
జైహింద్.

Sunday, November 5, 2017

బాల భావన శతకము. 31 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
31) పుస్తకాలు పట్టి కుస్తీలు పట్టుటే  నిత్యకృత్యమాయె. నిదుర లేక
    మనసు గాడి తప్పి, మరతుము. కనరేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము పుస్తకాలను చేతితో పట్టుకొని వాటితో కుస్తీలు పట్టుతూ చదవడమే మాకు నిత్యకృత్యమైపోయింది. ఈ కారణం గాకు నిద్దురపోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. తీరని నిద్దుర మత్తుతో మనసు గాడి తప్పుతోందిచదివినది గుర్తుండటం లేదు. ఈ విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
జైహింద్.

శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన నాగ శ్రీ బంధ కందము

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మన సాహితీ బంధువు శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన 

నాగ శ్రీ బంధ కందము 
చక్కగా ఉన్నది. చూడఁగలరు.
మా స్వగ్రామము(గవరపేట)లో ప్రతీ దీపావళికి గౌరిదేవిని మా దేవాలయము నందు ప్రతిష్టించి, ఒక మాసము అమ్మవారు మా పురజనుల పూజలందుకొనును. ఇటువంటి గవరపేటలందు సంబరాలు(క్షణములు) అంబరాన్ని అంటుతాయి.
శ్రీకారబంధము

కం. శ్రీ గౌరి! హృదయ శంకరి
గా, గాంధర్వి! దయతోడఁ గాంచుము తల్లీ!
యీ గవరపేట లందు స్వ
రాగాల క్షణము లిడుదుము, ప్రణయము నందున్!
స్వస్తి.
పొలిమేర మల్లేశ్వరరావు.
బంధకవితాభిలాషులగు శ్రీ మల్లేశ్వరులకభినందనలు.
జైహింద్.

Saturday, November 4, 2017

బాల భావన శతకము. 30 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
30) ఆట పాటలాడి యమ్మతో నాన్నతో  ప్రేమ పంచుకొనిన క్షేమమొప్పు.
     నట్టి ప్రేమ మాకుఁ గిట్టదా? దక్కదా?   పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  ఆడుతూ పాడుతూ అమ్మా నాన్నలతో ప్రేమగా హాయిగా ఉండడం మాకెంతో ఇష్టం. అది మాకు ఎంతో క్షేమమని మీకు తెలియదా? అటువంటి ప్రేమ మాకు కిట్టదా? ఇక మాకు దక్కదా? ఆ ప్రేమ మాకు అందని ద్రాక్షయేనా?
జైహింద్.

Friday, November 3, 2017

బాల భావన శతకము. 29 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
29) గొప్ప దేశ భక్తి కొలిపెడి పాటలు  మప్పి, దైవ భక్తి మప్పుడయ్య.
     దేశ సేవ చేసి దీపించు ఘనులారపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  దేశ శేవ చేసి ప్రకాశించు మహాత్ములారా! గొప్ప దేశ భక్తిని మాలో కలిగించే పాటలను మాకు నేర్పండి. దైవ భక్తిని మాలో కలిగించండి.
జైహింద్.

Thursday, November 2, 2017

బాల భావన శతకము. 28 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
28) నడక చేతకాని బుడుతలమగు మాకు  కాళ్ళు మోయలేని జోళ్ళవేల?
     పుస్థకమ్ములేల బోధనలవి యేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము నడవడమే సరిగా రాని చిన్న పిల్లలము కదా! అలాంటి మా యొక్క పాదాలకు మోయలేనంత బరువుండే పాదరక్షలు ఎందుకు చెప్పండి? పుస్తకాలను చూపిస్తూ కాక బొమ్మల్ని చూపిస్తూ చేస్తున్న బోధ మాకేమి లాభం చేకూరుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా?
జైహింద్.

Wednesday, November 1, 2017

బాల భావన శతకము. 26 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
26) పుస్తకములు మాకు బస్తాలతో యిచ్చి  మూపుపైన పెట్టి మోయమనిన
     మోయు బరువు చేత మొద్దుగా మారమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చదువు పేరు చెప్పి మేము మోయలేనన్ని పూస్తకాలు కొనిపించి, పెద్ద బస్తాలవంటి సంచీలో ఉంచి మా వీపుపై పెట్టి మోయిస్తున్నారు. ఈ బరువు మోయడం వల్ల మేము మొద్దుబారిపోతున్న విషయమెప్పుడైనా మీరు ఆలోచించారా? పుస్తకాలు ఎక్కువ ఉంటేనే బాగా చదివిస్తున్నామన్న భావన తల్లిదండ్రులలోను ఉపాధ్యాయులలోను తొలగి పోవాలి.
జైహింద్.

బాల భావన శతకము. 27 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
27) మస్తకంబు చెడును మణుఁగుల బరువున్న- పుస్తకములు మోయ. బుడుతలమయ

     వెన్నుపూస విఱుగు. వినిపించుకోరేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మణుఁగులకొద్దీ బరువు గల పుస్తకాలను మోస్తుండడం వల్ల మా బుర్ర చెడిపోతోందికదా! మేము చిన్న చిన్న పిల్లలము కదా! మా వెన్నుపూస విరిగిపోదా? మీరీ విషయం ఎందుకు గ్రహించటం లేదు?

జైహింద్.