Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 17 / 22వ భాగము 81 నుండి 85 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  17 / 2 2వ భాగము 81 నుండి  85వ  పద్యము వరకు.


చ. పరమ రహస్యమై ప్రకృతి వర్ధిలు ప్రాణులలోన ప్రాణమై

నిరుపమ జ్ఞానమై వరలు నిర్మల దైవము నిర్వికల్పుఁడై

మరుగుననుంట వింత. భరమా పరమాత్మను చూపుటన్న? నో

కరుణ సుధాంబుధీ! కనులఁ గానఁగఁ జేయము, దివ్య. భారతీ! 81.  

భావము. 

ఓ ముండకాయప్రహరణా! ప్రకృతిలో వర్ధిల్లెడి ప్రాణులలో ప్రాణమై, సాటి లేని 

జ్ఞానరూపుఁడై వరలెడి పరమాత్మపరమ రహస్యముగా, నిర్వికల్పుఁడైచాటుగా 

మాకు గోచరము కాకుండా ఉండుట వింతగానున్నది. అట్టి పరమాత్ముని 

కనులారా మేము చూచునట్లు చేయుట నీకు భారమా తల్లీ! మా కన్నులతో 

వానిని చూవునట్లు చేయుమమ్మా.


చ. మరువకు మమ్మ నన్ను, గుణమాంద్యము బాపుము. శక్తినిమ్ము. నీ

సురుచిర సుందరాకృతి వసుంధర పొంగ వచింపనిమ్ము. సుం

దర మతి మందిరంబున ముదంబుగ నిన్గని పొంగనిమ్ము. నా

భరమిక నీది. కావుమ. సభక్తిగ నిన్ను నుతింతు భారతీ! 82. 

భావము. 

ఓ ధూమ్రలోచన మర్దనా! నన్ను మరిచిపోకుమమ్మా.సుగుణ మాంద్యమును 

పోఁగొట్టుము. నాకు శక్తిని ప్రసాదించుము.నీ ప్రకాశవంతమైన సుందర 

స్వరూపమును భూజనులు ఆనందించువిధముగా నన్ను చెప్పనిమ్ము. 

నా అందమైన మనస్సులో నిన్ను చూచుచు నేనుప్పొంగిపోవునట్లు 

అనుగ్రహింపుమమ్మా నా భారమింక నీదేనమ్మా. నిన్ను భక్తిటొ నుతింతును. 

నన్ను కాపాడుము.


చ. నిఖిలము నీవె నిండితివి నిర్మల మానస వీధులందు. స

న్మఖముల జ్వాలలందును  రమాపతి చేయు తపస్సునందునున్

సుఖమయ జీవులన్ గలుగు సుందర భావన భాగ్యమందు. నీ

వఖిలమునై రహించ తగు దద్భుత రీతిని భవ్యభారతీ! 83. 

భావము. 

ఓ సర్వదేవస్తుతా! నిర్మలమైన మనస్సులలో, గొప్ప యజ్ఞజ్వాలలలో, 

శ్రీమహావిష్ణువు యోగముద్రలో,సుఖనుభూతితో చూచెడి సుందరమైన 

భావనాభాగ్యమునను, అనిఇటియందు నీవు ఒప్పుచు అద్భుతముగా 

ఉండతగుదువమ్మా. సమస్తము నీవే నిండియుంటివమ్మా.


చ. చదువుల తల్లివైన నిను చంపక భారతిఁగా రచించితిన్ 

వదులక నీ గుణంబులను  వర్ణనఁ  జేసితి, భాగ్యవంతులీ

సుధను గ్రహింపనెంచి మది సోక పఠించిన మేలుఁ గొల్పుమా!

వదులక దోషపంకిలము  పాపుమ. భక్తులఁ గాచు భారతీ! 84. 

భావము. 

భక్తులను కాపాడెడి ఓ సౌమ్యామాతా! విద్యాధిదేవతవైన నిన్ను చంపకభారతిగా 

రచించితినమ్మా. ఉపేక్ష చేయక,నీ గుణములను వర్ణించెడి భాగ్యవంతులు 

ఈ చంపకభారతీ సుధను గ్రహింపఁ గోరి మనసునకెక్కు విధముగా చదువుదురేని 

వారికి తప్పక మేలును కూర్చుమమ్మా.దోషపంకిలమున్నచో పోఁగొట్టుము.


చ. జననమునొందఁ జేసితివి. చక్కని సంస్కృతి నేర్పినావు. నీ

మననము చేసి సంఘమున మాన్యతనొందఁగ జేసినావు, స

ద్వినయమొసంగినావు. మహి విజ్ఞులలో మనఁజేసినావు. నే

ననయము నీ యధీనమయి, హాయిని పొందితినమ్మ. భారతీ! 85. 

భావము. 

ఓ సురాసురనమస్కృతా! నన్ను ఈ భువిపై జనింపఁ జేసితివి. మంచి సంస్కృతిని 

నేర్పితివి.నీ మననము చేసెడి నాకు సంఘములో గౌరవము కలిగించితివి. 

మంచి వినయ గుణమును ప్రసాదించితివి. విజ్ఞులచెంత నివసించు భాగ్యము 

కలుఁగఁ జేసితివమ్మా. నేను నీ అధీనమయి యున్న భాగ్యముచే సుఖము 

పొందఁగలిగితినమ్మా.

జైహింద్.

No comments: