Sunday, August 21, 2022

స్తోత్రము చేసిన పది పద్యాలను నందితిమ్మన బంధకవిత్వముతో రాశాడు.

 నారదుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తాడు. ఈ స్తోత్రము చేసిన పది పద్యాలను నందితిమ్మన బంధకవిత్వముతో రాశాడు. వాటిలో మూడు పద్యాలు విందాం!

మొదటి పద్యం –

క॥ నాయ శరగ సార విరయ

తాయన జయసార సుభగధర ధీ నియమా

మాయ నిధీ రధ గ భసుర

సారజనయ తాయరవిర సాగర శయనా!

ఈ పద్యం మొదటి రెండు పాదాలూ వెనక్కి తిరగేస్తే మూడు నాలుగు పాదాలు వస్తాయి. ఇలా రాసిన కంద పద్యాన్ని “అర్ధ భ్రమక కందము” అంటారు. ఈ పద్యానికి భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నీతిని బాణంగా చేసి, పక్షివేగంతో కదిలి యుద్ధంలో గెలిచే శక్తి ఉన్న వాడివి. లక్ష్మీదేవిని వక్షస్థలమున నిలుపుకున్నావు. బుద్ధికి కట్టుపడిన వాడివి. లక్షీదేవి సంపదలకు గని వంటివాడివి. నీ శరీరములో చంద్రాది దిక్పాలకులు కొలువై ఉన్నారు. క్షీరసాగరాన శయనించే వాడివి నువ్వు!”

రెండవ పద్యం –

క॥ ధీర శయనీయ శరధీ

మార విభానుమత మమత మనుభావిరమా

సార సవన నవసరసా

దారద సమ తారహార తామస దరదా

ఈ కంద పద్యంలో ప్రతి పాదం ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. దీన్ని “పాద భ్రమక కందము” అంటారు. ఈ పద్యానికి భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు ధైర్యంతో సముద్రమునే ఆధీనం చేసుకుని, మన్మధుని మించిన దేహకాంతితో తలచుకున్నంతనే సంపదలు ఇచ్చే వాడివి! సముద్రము నుంచి లభించిన మేలైన మంచి ముత్యాలు ధరించిన వాడివి. మంచివారి చెంత ఉండి చెడ్డవారిని శిక్షించే వాడివి.

మూడవ పద్యం –

క॥ మనమున ననుమానము నూ

నను నీ నామమను మను మననమును నేమ

మ్మున మాన నన్ను మన్నన

మనుమను నానా మునీన మానానూనా

“న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది.

ఈ పద్యం భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నిరంతరం నీ నామధ్యానం చేసే మునులకు సైతం అందనంతటి గొప్పవాడివి. నాకు ఎలాంటి సందేహం లేదు. నీ నామ జపాన్నే నియమంగా జపించే నన్ను దయతో చల్లగా దీవించు.”