Wednesday, April 20, 2011

PSLV 16 ప్రయోగం విజయవంతమైనందుకు అభినందనలు.


శ్రీకరమైన మన భారత మాత ముద్దు బిడ్డలైన శాస్త్ర వేత్తల అకుంఠిత దీక్షా ఫలితంగా సిద్ధమైన అంతరిక్షనౌక PSLV16 యావత్ భారతీయుల హృదయాలను రంజింప చేస్తూ అత్యద్భుతంగా నిరాటంకంగా గగన తలంలో ప్రయాణించి, తన గమ్యాన్ని చేరుకొంటూ మూడు ఉపగ్రహాలను తమ కక్ష్యలలోకి చేర్చి, శాస్త్రజ్ఞులను యావద్భార జాతినీ ఆనంద పారవశ్యంలో ముంచిందంటే అది మన శాస్త్రవేత్తల నైపుణ్యానికీ, దేశ భక్తిభావానికీ నిదర్శనం.
ఇస్రో చైర్మన్ శ్రీ రాధా కృష్ణన్ గారిని, వారి సూచనలను పొల్లువోవకుండా అనుసరిస్తూ, తమ జ్ఞాన నైపుణ్యాలను జోడించి,ఐక్యతతో పనిచేసి,ఈ విజయానికి కారకులైన, భారతాంబకు ముద్దుబిడ్డలైన శాస్త్రవేత్తలను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన ప్రతీ ఒక్కరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ సందర్భంగా మన ప్రియతమ భారత రాష్ట్రపతికీ, కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు, మహోన్నత భావ ప్రపూర్ణులైన యావద్భారతీయులకు నాహృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను.
మన శాస్త్రీయ పురోగతి ప్రపంచాన్నే ఆశ్చర్యపరచేలా దినదినాభి వృద్ధి చెందుతూ, యావత్సృష్టికీ మంగళప్రదంగా అకుంఠితంగా కొనసాగేలా చేయాలని ఆ పరమాత్మను మనసారా ప్రార్థిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

Wednesday, April 13, 2011

శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీగురుచరణారవిందాభ్యాంనమోనమః.

శ్రీ మంగళంపల్లిని తన చూపులతో మంగళప్రదునిగా చేస్తున్న శ్రీశేషశాయి
శ్రీరస్తు.                         శుభమస్తు.                    అవిఘ్నమస్తు.
శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీ గురు చరణములకు
మీ శిష్య పరమాణువు చింతా రామ కృష్ణా రావు
భక్తి పారవశ్యముతో చేయుచున్న
పాదాభివందనములు.

శా:- శ్రీనాధాది కవుల్ ధరా తలమునన్ శ్రీ శేషశాయే యనన్
మానాప్రగ్గడ శేష శాయి గురుసమ్మాన్యా! కృపన్ గల్గిరే!
జ్ఞానాంభోధి ప్రసన్నభాస్కర! మహా జ్ఞానామృతాంశల్ సదా
ప్రాణంబై ప్రణవంబునౌచు వెలయన్ భాగ్యంబుగాఁ గొల్పిరే!

చ:- గురువర! మీ మహాద్భుత సుగోచర మయ్యెడి జ్ఞాన దీప్తి మా
వరగుణ వృద్ధి కారణము. భాగ్య నిధానము. భవ్య బోధయున్.
సరి యెవరయ్య మీకిలను సద్గుణ గణ్యులలోన నెన్నగా.
కరములు మోడ్చి మ్రొక్కెదను గౌరవమొప్పగ, జ్ఞాన భాస్కరా!

చ:- మధుర వచస్వి! మీ మృదుల మంజుల గాత్ర విశేషమేమొ! మా
యెదలును పల్లవించినవి. ఏమని చెప్పుదు మీదు ప్రేమ! వా
ఙ్నిధి లభియించె మాకు. మహనీయుల దర్శన భాగ్యమబ్బె. మీ
సదమల దివ్య మానసము సారథియై నడిపించె మమ్ములన్.

కంద గీత గర్భ చంపక మాల:-
వర మధుస్రావమై, అమృత వారిధియై, శుభమై రహించు శ్రీ
చరణ నుతిన్ సదా సకల సత్పరివర్తనఁ జక్క జేయుచున్,
పర సుధనంబు గా కవిత పార, ధరన్ నను గౌరవించ్రి. ప్రాక్
సరస కవీ! సదా తమరి సన్నుత దీవన తప్పదెందునన్!

చంపక గర్భస్థ గీతము:-
అమృత వారిధియై, శుభమై రహించు
సకల సత్పరివర్తనఁ జక్క జేయు
కవిత పార, ధరన్ నను గౌరవించ్రి.
తమరి సన్నుత దీవన తప్పదెందు.

చంపక గర్భస్థ కందము:-
మధుస్రావమై, అమృత వా
రిధియై, శుభమై రహించు శ్రీచరణ నుతిన్
సుధనంబుగా కవిత పా
ర, ధరన్ నను గౌరవించ్రి, ప్రాక్ సరస కవీ!

శ్రీ చక్ర బంధ తేటగీతి:-
వరద పాండిత్య! శ్రీ యుత! వాఙ్నిధాన!
లక్ష్య వరదుఁడ! శ్రీ కర! లక్షణాది
సిద్ధిఁ గొలిపితే! శ్రీ వరసిద్ధి రామ
వరలఁ జేసితి నన్నంది వామ దేవ!

చ"తురంగ"గతి బంధ కందము:- ( గురువరు - వదనము - భవభయ హరణము )
సునిశిత పదముల తగు వివ
రణముగ గురువుల శరణు నర వరులు మహతిన్
కనవలె నుయభ సుఫలదము
లనవరతము నయము శుభము లది యిడును తగన్. 


నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - శేషశయన )
సుధ నభిషవ వశ వర! జ్ఞా
న ధనా! నయ బోధనను తనర కొలుపన్ శే
షి ధిషణ! భూమిజ దేవ! వి
శదమయ సుకవివర గణన. జన శేఖరుఁడా!

చ:- శుభమగు గాక దివ్య పరిశోభిత మూర్తికి జ్ఞాన దీప్తికిన్,
శుభమగు గాక పూజ్య రవి శోభలు గాంచిన పుణ్య మూర్తికిన్,
శుభమగు గాక శిష్య గణ శోభిత సద్గురు భవ్య కీర్తికిన్, 
శుభమగు గాక పుణ్య పరిశోభిత సత్కవి శేష శాయికిన్.
  
మంగళం                                                                   మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
ఇట్లు,
మీ శిష్య పరమాణువు
చింతా రామ కృష్ణా రావు.
హైదరాబాదు.
తేదీ.౧౪ - ౦౪ - ౨౦౧౧.
http://andhraamrutham.blogspot.com
సెల్.నెంబరు:- 9247238537.


Friday, April 8, 2011

ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా! మేల్కోండి.

ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా!  మేల్కోండి. 
మంచి సమయం ఆసన్నమైంది. 
అవినీతి భరతం పట్ట గల జన లోక్ పాల్ బిల్లు కొఱకై అలుపెఱుగని పోరాటం చేస్తున్న అపర గాంధీ మన అన్నా హజారే చేస్తున్న నిజమైన సత్యాగ్రహాన్ని మనసారా అభినందించండి. 
మీ నిష్కళంకమైన హృదయ పూర్వకమైన మద్దత్తును తెలియ జేయండి. 
నేను సహితం అంటూ ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందడుగు వేయండి. 
అలుపెఱుగని పోరాటానికి మీరూ శక్తినివ్వండి. 
భావి భారత పౌరులలో నీతి బీజాలు నాటే నైతికమార్గదర్శులవండి. 
ఎన్నాళ్ళని ఈ దురంతదౌష్ట్యాలను మీలో మీరే తిట్టుకొంటూ, ఏమీ చేయలేని అసహాయులులాగా జీవచ్ఛవాలలాగా జీవించాలని మీరు కోరుకొంటున్నారు? 
వద్దు. పిరికితనం మీకు వద్దు. 
యావద్భారత దేశంలోను అవినీతి రాబందులు సంఖ్యకంటే 
వారి అవినీతి కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధా సర్ప దష్టుల సంఖ్యే ఎక్కువ అన్న మాట మరువకండి. 
అంతా ఒక్కటైతే అవినీతిని రూపు మాప గలిగే జన లోక్ పాల్ బిల్లు తేవటం చాలా సులభమన్న విషయం మరువకండి. 
అన్నా హజారే అకుంఠిత దీక్షనొక్కమారు మనసారా తిలకించండి. 
అకళంక లోక కల్యాణకరమైన  హజారే దీక్షకు కారణం అతని ప్రగాఢ ఆత్మ విశ్వాసమే కదా! మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరూ సాఘిక సంస్కరణకుద్యుక్తులయేవారికి తోడ్పడండి.
మీదే విశాల భారతం, మీకే సొంతం, మీదే ఈ విశాల స్వతత్ర్య స్వేచ్ఛా సామ్రాజ్యం, సమైక్యతతో నడప గలిగే మీకే దేశ క్షేమం కూర్చడం సాధ్యమౌతుంది. 
విజయోస్తు.
అన్నాహజారే సహృదయతను మీరూ అలవరచుకొన గలిగితే మీరుద్యమించిన నాడు స్వార్థపూరితులకు , వారి రాజకీయ జీవనానికీ నూకలు చెల్లక మానవు.
అన్నా హజారే సత్యాగ్రహ ఫలంగా  అన్నా హజారే కోరిన విధంగా జన లోక్ పాల్ బిల్లు అతి త్వరలో నెలకొల్పబడునని మనసారా ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.