Monday, August 22, 2011

జన్మాష్టమి శుభాకాంక్షలు.


మీ అందరికీ నా శుభాశీస్సులు.
గీతా మాహాత్మ్యము
ధరోవాచ:
భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||
కః- ప్రారబ్ధ కర్మ బద్ధుల
కే రకముగ భక్తి యబ్బు నీశ్వర! యనుచున్
చేరి ధర హరిని యడుగగ
నారాయణుఁ డిట్లు చెప్పె నమ్మిక మీరన్.
భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

శ్రీవిష్ణురువాచ:
ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||
కః- ప్రారబ్ధ కర్మ బద్ధులు
తీరికగా గీత చదివి తృప్తిగ నాపై
భారము వేసిన, కర్మలు
వారల కంటవు. విముక్తి ప్రాప్తించు ధరా!
ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.

మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||
కః- గీతా ధ్యానము చేయు పు
నీతుల కఘమంట బోదు. నీరముఁ గన నే
రీతిని  తామర కంటునె?
యాతీరుగ  నిదియు, తెలియ నద్భుతమిదియే.
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||
కః- గీతా గ్రంథ మదెచ్చట,
గీతా పఠనంబదెచట కీర్తి ప్రదమై
భూతలమందున నుండునొ
యా తలమున పుణ్య తీర్థ మమరిక నుండున్.
ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||
గీః- ఎచట గీతపారాయణ మెలమి జరుగు
నచట దేవతల్, ఋషివరు లఖిల యోగు
లఖిల నాగులు గోపిక లఖిల గోప
కులును నార దోద్ధవులు కొలుపు మేలు.
ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యాస్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||
గీః- గీత పఠన పాఠన , శ్రావ్య కృతి విచార
మెచట జరుగుచు నుండునో యచట నేను
నిష్టతో నుండి కాతును నేర్పు మీర. 
గమ్య మార్గము  చూపుదు. కనుమ! పృథ్వి!
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||
ఆః- గీత నాశ్రయించి క్రీడింతు జగమున.
గీతయే గృహముగ ప్రీతి నుందు.
గీత నాశ్రయించి ఖ్యాతి ముజ్జగముల
నేలు చుంటి నేను మేలుగాను.
నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||
గీః- గీతయే నా పరమ విద్య. ఖ్యాతిఁ గనిన
గీత బ్రహ్మస్వరూపము. కీర్తి ప్రదము.
ప్రణవమందున నాల్గవ పాదమైన
అర్థ మాత్ర నిత్య సు శాశ్వితానుపమము.
గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది.

చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||
గీః- కృష్ణుఁ డర్జునునకుఁ జెప్పె గీత  కృపను 
మూడు వేదాల సారము. మూడు లోక
ములకు నానందప్రదమిది. కలుగ జేయు
తత్వ విజ్ఞానమును తనన్ దలచినంత.
సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||
గీః- ప్రీతి నష్టా దశాధ్యాయ ఖ్యాతి నెఱిగి,
పఠన చేయు నా నరుఁడు తా బ్రహ్మ పథము
నొందు. సందేహమే లేదు. మంద మతియు
దీనిని పఠించి మోక్షంబు తాను పొందు. 
ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||
గీః- శక్తి హీనులు గీతను భక్తి తోడ
సగము చదివిన చాలును సత్ ఫలమిడు.
గంగి గోదాన ఫలమిచ్చు గాన  చదివి
సత్ ఫలంబును గాంతురు సహృదయు లిల.
గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12 ||
గీః- గీత మూడవ వంతైన ప్రీతి తోడ
చదువ స్వర్గంగ స్నాన ఫలదము. నిజము.
గీతనారవ భాగము ప్రీతిఁ జదువ
సోమ యాగ ఫలంబిచ్చు. శుభము లొసగు.
గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

ఏకాద్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్ || 13 ||
గీః- ఒక్క అధ్యాయమైనను నిక్కముగను
గీత ప్రతిదినంబు చదువఁ బ్రీతి తోడ
రుద్ర లోకము పొంది తా రుద్ర గణము
నందు నొకడగు.నివసించు నందనిశము.
ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||
గీః- నిత్య మధ్యాయ పాదము నేర్పు మీర
చదువ నుత్కృష్ట నర జన్మ చక్క నొదవు
సరిగ మన్వంతరము . కాన చదువ వలయు
భక్తి తోడను గీత. సద్భక్తు లెల్ల.
ఓ భూదేవీ ఎవరు గీతనందలి ఒక అధ్యాయమునందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15 ||
చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||
గీత పది, ఏడయిదు నాల్గు ప్రీతి తోడ
మూడు, రెండొకటందర్థము చదివినను
నింద్ర లోకమున పదివేలేండ్లుబ్రతుకు.
గీత చదువుచు మరణింప కీర్తిఁ గొలుపు
మనుజ జన్మము నొందును మానవుండు.
ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,౧౫.
వారు ఇంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.౧౬

గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ || 17 ||
గీః- అట్లు మానవుఁడై పుట్టి యనుపమగతి
గీత పఠియించి సన్ముక్తి నాతఁడు గొను.
గీత గీతయనుచు ప్రాణ మాతఁడు విడ
సద్గతిని పొందు నప్పు డసంశయముగ.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||
క:- గీతార్థము వినఁ గోరెడి 
పాతకుఁడును ముక్తి పొంది పరమాత్మునితో
ప్రీతిగ నొందును సుగతిని.
ఖ్యాతిగ పఠియింప గీత యమరుడతఁడగున్. 
మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును.

గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 ||
క:- గీతార్థ చింతనంబున
నాతండగు కర్మదూరుఁడాతనికబ్భున్
ఖ్యాతిగ జీవన్ముక్తియు.
భాతిగ నొడఁగూడు పరమ పథమతనికిలన్.
ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును(కైవల్యమును) పొందును.

గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ || 20 ||
ఆ:- సాక్షులరయ మనకు జనకాది రాజులీ
లోకమందనుపమ శ్రీకరమగు 
గీతనాశ్రయించి పాతక దూరులై
ముక్తి నొందినారు పూజ్యముగను.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||
క:- గీతా పఠనము చేసియు
గీతా పఠన ఫలమున్నొకింతచదువమిన్
గీతాపఠనము వ్యర్థం
బేతత్ఫల శూన్యులగుదు రెఱుగుడు దీనిన్.
గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||
గీ:- గీత మాహాత్మ్యము చదివి, గీత చదువు
సజ్జనులు పొందుదురు తాముసత్ఫలములు
పైన చెప్పిన ఫలములు ప్రాప్తమగును.
దుర్లభంబగు సద్గతి దొరకు నిజము.
గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు.

సూత ఉవాచ:
మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||
గీ:- శౌనకాదిమహాఋషి సౌమ్యులార!
అతి సనాతన గీతా మహత్యమేను
తెలిపితిని. గీత పఠియించి దీని నెవరు
చదువు గీతా ఫలము వారు సరగున గను.
సూతుడు చెప్పెను.
శౌనకాది ఋషులారా! ఈ ప్రకారనముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.
ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.
జై శ్రీకృష్ణ.
జైహింద్.