జైశ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు
చంపకభారతీశతకము.1/22వ భాగము 1 నుండి 5వ పద్యము వరకు.
చ. అనయమునా గజాననుని, యాతనిఁ గాంచిన పార్వతీసతిన్,
ప్రణవమహత్స్వరూపుఁడగు భక్తవశంకరు శంకరున్, కృపా
మణియగు శ్రీహరిన్, రమను, మాన్య చతుర్ముఖునిన్, మహిన్ నినున్
బ్రణుతులు చేసి మ్రొక్కెదను భక్తిని నిల్పగ నన్ను. భారతీ! 1.
భావము.
ఓ సరస్వతీమాతా! ఆ గజాననుని, అతని తల్లియగు పార్వతిని,
ప్రణవ స్వరూపుఁడయిన శంకరుని, కృపామణియగు శ్రీహరిని, ఆలక్ష్మీమాతను,
చతుర్ముఖుఁడయిన బ్రహ్మను, నిన్ను నన్ను భక్తిమార్గమున నిలుపగోరి
మ్రొక్కెదనమ్మా!
చ. అజముఖ వేద్య! యీ సృజనమౌ సకలంబును నీ యధీనమై
ప్రజనితమౌట నిక్కము,. ప్రపంచమునందలి జీవరాశులన్
సృజనము చేయు బ్రహ్మయును చేకొను నీ మహనీయ శక్తి,. నీ
నిజమగు శబ్దశక్తియె వినిర్మితి హేతువు చూడ భారతీ! 2.
భావము.
శ్రీమద్బ్రహ్మ ముఖమున తెలియఁబడుచున్నట్టి ఓ మహాభద్రా మాతా!
సృష్టింపఁబడుచున్నట్టి ఈ సృష్టి అంతయు నీచే పుట్టించఁబడుచుండుట
నిజము. జీవులను పుట్టించు బ్రహ్మయు నీ యొక్క గొప్ప శక్తిని నీ నుండి
పొందుచుండును. నీ యొక్క నిజమయిన శబ్ద శక్తియే ఈ సృష్టికి మూలము.
చ. సరగున పొంగివచ్చెనిట చంపక భారతి సద్విభాతి నే
డరుదగు నూరుపద్యము లహర్నిశమాత్రములోన. నేను సు
స్థిర మతినై రచించెద ప్రసిద్ధము కాగ విధాతృ రాజ్ఞి సుం
దర దరహాస సత్ఫల సుధా మధురంబునుఁ దెల్ప భారతీ! 3.
భావము.
ఓ మహామాయామాతా! మంచిచే ప్రకాశించు చంపకవృత్తములలో
భారతీ శతకము వేగముగా పొంగుచూ ఈ ఒక్క రోజులో నా కలము నుండి
జాలువారినది. శారదా సుందర దరహాస సత్ ఫలసుధ యొక్క మాధుర్యమును
ప్రసిద్ధమగునట్లు నేను సుస్థిర చిత్తుఁడనై రచించెదను.
చ. వదనము నుండి వెల్వడు ప్రభావము చూపెడి శబ్దశక్తియే
యెదలను సంస్పృశించు నదియే కద మూలము మంచి చెడ్డలన్
మదులను పాదుకొల్పఁగను. మంచిగ పల్కినఁ, జెడ్డ పల్కినన్
వదనమునుందు వీవెకద. వాఙ్మయ రూప! యనంతభారతీ! 4.
భావము.
వాఙ్మయ స్వరూపవయిన ఓ వరప్రదా! మానవుల ముఖములనుండి
వచ్చెడి ప్రభావమును చూపెడి మాటలే వినువారి మనసులకు తాకును. అదే వారి
మనస్సులలో మంచిగానైనా చెడ్డగానైనా భావించునటు చేయును. కదా.
అది మంచయినను చెడ్డయినను అది నీ వలననే మాటలరూపమున
ప్రకాశమగును.అది నీవే సుమా.
చ. పలుకక యుంట నేరమగు, పల్కిన నేరము, పల్కు పల్కునం
బలుపలు భావనావళులు మానవులందు సముద్భవించుచున్
గొలిపెడు మంచి చెడ్డలను, కోరని చెడ్డయొ, కోరు మంచియో,
నిలువక మాన దబ్బుచు. గణింపుచు కావుమ మమ్ము భారతీ! 5.
భావము.
ఓ శ్రీప్రదా! పలుకకుండా ఉండుట నేరముగా గణింపఁబడును. అటులని
ఒక్కొక్కప్పుడు పలుకుటయు నేరము. మా పలుకుల వలన అనేక అర్థములు
మానవులకు తోచుచుండును. ఆవిధముగ కలుగజేసెడి మంచిచెడ్డలలో
కోరే మంచియో కోరని చెడ్డయో తప్పక కలుగుచుండును. ఆ విషయమును
గిర్తించి మమ్ము కాపాడుము.
జైహింద్.
No comments:
Post a Comment