జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 13 / 2 2వ భాగము 61 నుండి 65వ పద్యము వరకు.
చ. మనుజులు వ్రాయు వ్రాతలవి మానక నీవయి యుండునెల్లెడన్,
మనుజులు పల్కు భాషలును మానక నీవయి యుండునన్నియున్,
మనుజుల హావ భావములు మానక నీవయు యొప్పి యుండు నీ.
మనుజుల జ్ఞానరూపమయి మన్ననఁగొల్పెదవీవె భారతీ! 61.
భావము.
ఓ సుభద్రా మాతా! మానవులువ్రాయునవి, పల్కునవి, ముఖములందు వ్యక్తమగు
హావభావములు నీవే. జ్ఞానరూపమున మనుజులలోనుండి గౌరవము కలిగించునది
నీవేనమ్మా.
చ. హృదయపు స్పందనంబుడుగ హృద్వరభావమనంత తేజమై
పదిలము గాత నీదు వర పాదయుగంబున ముక్తినొందగా,
మదికిననంత సాధనము మాతృ పదద్వయ సేవనంబెగా?
మదిఁ గని నిన్నుఁ జేరెదను మన్నికతో ననుగాంచు భారతీ! 62.
భావము.
ఓ సుపూజితా మాతా!ప్రాణము పోవు సమయమున హృదయమందలి
శ్రేష్టమైన భావము శాశ్విత తేజమైనీ పాదయుగళమునందు ముక్తి కొఱకై
పదిలమగుగాక. మనసునకు అనంతుని సాధించుట యనునదు మాత్రు
పాదద్వయ సేవవలననే సాధ్యము కదా.నా మనసులో నిన్ను చూచుచు నిన్ను
చేరుదునమ్మా. నన్ను దయతో చూడుము..
చ. మనము విచిత్ర సాధనము, మంచికి, చెడ్డకు మార్గమిద్ది. సద్
గుణముల కాలవాలమయి గొప్పఁగఁ జేయును లోకమందు. దుర్
గుణములనేకముల్ కలిగి క్రూరునిగా విరచించి చూపు యో
ప్రణవమ! నీవె నా మనము, వర్ధిలఁజేయు పవిత్ర భారతీ! 63.
భావము.
పవిత్రమైన ఓ సువాసినీ మాతా! మనసనునది ఒక వింత పరికరము.మంచి
కయినను చెడ్డకయినను మనసే మార్గము. మంచికి స్థానమయి గొప్పకార్యములు
నిర్వహింపచేయకలదు. చెడ్డకు స్థానమయి దుర్మార్గునిగనూ మార్చకలదు.
ఈ మనస్సు అనెడిది నీవే కదా. ఇందావంతయు అనుమానము లేదమ్మా.
చ. పర మహనీయ బ్రహ్మమది పావన సచ్చరితామృతంబు సు
స్థిరముగఁ గొల్పు మాకు వరసిద్ధి గణాధిపు సత్కృపాకృతిన్.,
స్థిరమగు భావ భారతికి తేజము గొల్పుననేక సత్పదో
ద్ధరణముఁ జేసి పల్కులిడు, ధార్మికతత్వముకల్గ భారతీ! 64.
భావము.
ఓ సునాసా మాతా!వరసిద్ధి వినాయకుని కృపగా మాకు ఆ పరబ్రహ్మము పవిత్రమైన
సచ్చరిత్రమును సుస్థిరముగా నిమ్ము. ధార్మిక తత్వము కలుగు విధముగ అనేక
సత్పదోద్ధరణము చేసి స్థిరమయిన భావ భారతికి తేజస్సును కలుగజేసి, చక్కని
మాటలను ప్రసాదించుము.
చ. స్మర రిపు నాశ్రయించి, సతి సత్పద ధూళి వహించి, చిత్త సం
చరిత దురంత దుష్టములు సాధనచేసి నశింపఁ జేసినన్,
మరువఁగ రాని సత్యధన మార్గము నీవె గ్రహింపనిత్తువో
పరమదయాన్వితా! సుగుణ భారతివై మముఁ గాచు భారతీ! 65.
భావము.
సుగుణములతో ప్రకాశించుదానివై మమ్ములను కాపాడునట్టి ఓ వినిద్రా మాతా!
ఓ పరమ దయాన్వితా! ఆ పరమశివునాశ్రయించి, సతీదేవి పాదరజము వహించి,
సాధనతో దురంత దుర్గుణములు నశింపజేయగా నీవే సత్యమార్గమును
చూపుదువమ్మా.
జైహింద్.
No comments:
Post a Comment