Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 10 / 22వ భాగము 46 నుండి 50 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  10 / 2 2వ భాగము 46 నుండి  50వ  పద్యము వరకు.


చ. చదువుల జోలికేగుటది సాధ్యము కానిది నీవు లేక. సం

పదలకు నేగుటన్నయది వర్ధిలఁ జేయదు నిన్ను వీడ. నే

కదలక నీ మహత్వమును కావ్యగతిన్ విరచింపఁ జూచినన్

వదులవవెల్ల నన్ను. వరవాఙ్మయ భాగ్య విభాతి భారతీ! 46. 

భావము. 

గొప్ప వాఙ్మయమనెడి భాగ్యమున ప్రకాశించు ఓ భోగదాయీ! నీవు మాలో 

లేకపోయినచో చదువుకొనుట అసాధ్యము. నిన్ను వదిలి సంపాదనకు 

ప్రయత్నించినను అది వర్ధిల్లఁ జేయదు. నేను కదలకుండ ఉండి నీ 

గొప్పఁదనమును కావ్యముగా రచింపఁ బూనినను ఆ సంపాదనా తత్పరత 

మున్నగునవి నన్ను వదలకున్నవి.


చ. తనయుఁడ నేను. తల్లివి. నితాంతము నీ మహనీయ భావనా

ధనమును కోరుచుండెదను. తప్పక నా కమనీయ కల్పనా

గుణ గణనాభిజాతమయి కోరిన నీమహనీయ తేజమే

మనముల సుస్థిరంబగుచు మన్ననఁ గొల్పును గాదె భారతీ! 47.

భావము. 

ఓ భారతీ! నేను సుతుఁడను. నీవు తల్లివి. ఎల్లప్పుడు నిన్ను గూర్చిన 

భావనాగుణము అనెడి ధనమునే నేను కోరుదును. తప్పకుండా నీకమనీయమగు

కల్పన చేసెడి గుణమునెన్నుట నుండి జనించుచు నేను కోరెడి నీ మహనీయ 

తేజస్సే నా మదిలో సుస్థిరమయి నాకు గౌరవమును కొలుపునమ్మా.


చ. ప్రణవమె నీవు. మద్ధృది విరాజిత భవ్య ప్రబంధ  వాణి! సు

స్వనమది  నీవు. సంస్కృత ప్రశస్త కవీశ్వర తేజమీవు. స

ద్గుణ గణవీవు. నీ మహిమ తోచెడు భక్త కవీశ్వరాళికిన్.

జననిరొ! సంస్తుతించెదను, సద్గుణ భావనఁ గొల్పు. భారతీ! 48.

భావము. 

ఓ భామామాతా! ప్రణవస్వరూపమే నీవు! నా హృదయమున విరాజిల్లెడి 

దివ్య ప్రబంధమమ్మా నీవు. సంస్కృత కవుల ప్రశస్తమైన తేజస్సు నీవే నమ్మా. 

నీవు సద్గుణ గణనవే. భక్తులకు నీ మహిమయే మనసునకు తోచునమ్మా. 

అమ్మా! నిన్ను స్తుతింతును నాకు సద్గుణభావననే ప్రసాదించుము.


చ. జగతిని కొల్పునప్పుడె ప్రజన్ సుగుణాళిగఁ గొల్ప వచ్చుగా!

ప్రగతికి మూల కారణము భద్ర విరాజిత భావ భాగ్యమౌ

నగణిత భవ్య భాష. సుగుణాకరమౌ వర భాష గొల్పినన్

ప్రగణితులే వసుంధరను భవ్యముగా ప్రభవింత్రు భారతీ! 49.

భావము. 

ఓ గోవిందమాతా! సృష్టించునప్పుడే ప్రజల మేలునే ఆలోచించవచ్చునుకదమ్మా. 

భవ్యమైన భాష భద్రతా గుణముచే ప్రకాశించెడి భావమనెడి భాగ్యమునకు దాని 

అభివృద్ధికి మూలము. సుగుణములకు మూలమైన భాషను కొల్పినచో భూమిపై 

గొప్పవారే గొప్పఁగా పుట్టుదురమ్మా.


చ. ననుఁ గను. రామకృష్ణ కవి నాన్ రహియింతు, ననన్య సాధ్యమై

తనరెడు చిత్ర బంధ కవితా మహిమాన్విత మార్గమీవెగా,

గొనకొని కల్వపూడి వర కోవిద రాఘవు శిష్యరేణు వే

ననగ ప్రవర్ధమానుఁడ, మహార్తిని నిన్ వినుతింతు భారతీ! 50.

భావము. 

ఓ గోమతీ! నన్ను చూడుము. రామకృష్ణ కవిగా రహింతును తల్లీ. 

అనన్య సాధ్యమయి ఒప్పెడి చిత్ర బంధ కవిత్వముల మహిమతో కూడిన మార్గము 

నీవే కదా. నేను శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారి 

శిష్యపరమాణువనునట్లుగా వర్ధిల్లుదును. గొప్ప ఆర్తితో నిన్ను 

వినుతించుచుంటినమ్మా.

జైహింద్.

No comments: