Thursday, September 11, 2008

వర్దిపర్తి కోనకవి.

వర్దిపర్తి కొనమరాట్ కవీన్ద్రుదుడి సర్వసిద్ది గ్రామం.నెల్లూరు నెరజాణల కొంటె ప్రశ్నలకు తుంటరి సమాధానం చెప్పిన ఉద్దనులు ౧౯ వ శతాబ్దంనాటి సర్వసిద్ధి వాస్తవ్యులు. కవీంద్రుని సమాధానాలకి అచ్చెరువొందిన ఆ కాన్తామనులు ఒక మెట్టు దిగి, " సర్వసిద్ధి సరసులకు నెల్లూరు నేరజాణలు దాసోహం " అనిరి. అంతటి మహాకవి అంటే కాదు మహిమాన్విత కవి కూడా. ఈ కవి వేంకటేశ్వరోపాఖ్యానం, మహాలక్ష్మీ పరిణయం, మున్నగు గ్రంధాలు రచించాడు. ఇతని పెక్కు చాటువులు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత్పర్యం.
ఇతడు రచించిన శ్రీ మహాలక్ష్మీ పరిణయం కావ్యం లోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.

క్షీర సముద్రుడు తన కుమార్తె వివాహానికి రమ్మని తనకు కాబోయే అల్లుడయిన
శ్రీమహావిష్ణువుకి ఆహ్వానం పంపుతూ శుభలేఖలో ఇలా వ్రాస్తాడు.
సీ:-మత్స్య స్వరూపక! మనుజ కంఠీరవ! పురుషోత్తమ! త్రిశూల ధర ధనుర్వి
భంగ! కాకాసుర భంజన! విశ్వాత్మ! వామన! హరి! మురవైరి! నరక
శిక్ష! కుచేల సమ్రక్షక! సర్వజ్ఞ ! హరిహయనుత! చక్ర హస్త! రఘుకు
లాధిప! సర్వంసహాధీశ! మేఘ సన్నిభ గాత్ర! తపనాబ్జ నేత్ర! మునిజ
గీ:-నాభి వందిత! గాధేయ యజ్ఞ పాల! రావణాంతక! శ్రీ యాది దేవ! యనుచు
బ్రతి పద ప్రథమాక్షర పంక్తి సంజ్ఞ తెలియగా వ్రాసె.శుభ లేఖ జలధి విభుడు.
తాత్పర్యం సుబోధకమేగదా!
" మమ పుత్రికా వివాహమునకు సహచర సమేతముగా రా శ్రేయాదిదేవా! "
ఎంత చమత్కారంగా శుభలేఖ వ్రాయించాడో కవి చూచారా! ఇతని కావ్యాలన్నీకూడా చమత్కారాల సమాహారంగా చెప్పవచ్చు. సమయం చిక్కినప్పుడు మరో పద్యం గ్రహిచుదాం.
నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
పద్య విపంచి.

Tuesday, September 9, 2008

వినాయక వర్ణన

సర స్వతీ నమస్తుభ్యం.
సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు పెక్కురున్నారు. ఆంద్ర భాషామతల్లి సేవలోపునీతులవుతున్నారు.
వారిని చుసి మనం ఉప్పంగిపోతాం. మనకీ అనిపిస్తుంది వారిలాగా మాతాదాలనీ, వారిలాగా పద్యాలు వ్రాయాలని. .
" సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్న వేమన పలుకు మనకి తెలియంది కాదు.ఐతే ప్రయత్నం చేయకుండా ఏదీ సాధ్యం కాదు. మనమూ ప్రయత్నిద్దాం.
ముందుగా కొన్ని అనుసరణీయాంశాలు. :-మనకి గద్యనయినా పద్యాన్నయినా అర్థస్ఫురణ కలిగేటట్టు చదువ గలగాలి.
ఆతరువాత సాధ్యమయినన్ని ఎక్కువ పద్యాలు చదవాలి. ఛందస్సులో వ్రాయాలనుకుంటే ఛందస్సులో గల పద్యాలు చదివినట్లయితే ఛందస్సులో సులభంగా వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.
నేటి మీ ప్రయత్నానికి నాన్డి పలుకుతారా ! ఐతే వినాయక నవరాత్రులు సందర్భంగా మనం వినాయకుని వర్ణిస్తూ మీకు వచ్చిన ఛందంలో వ్రాసి పోస్టు చేయండి.. ఎదురుచూడనామరి?
నేటి విషయం వినాయక వర్ణన నిర్విఘ్నమస్తు.
చింతా రామ కృష్ణా రావు. .
నమస్తే. రాబోతున్న 21-9-2008 వ తేదీనే గురజాడ జయంతి.ఈ జయంతి సందర్భంగా అతని జన్మ స్థలమైన సర్వసిద్ధిరాయవారంలో అతని జయన్తివేడుకలు జరుపుతున్నాం. ఆ ప్రజా కవి స్ఫూర్తితో మనం కూడా మన రచనలతో గురజాడ అడుగు జాడలలో నడిచే వారికి ప్రోత్సాహాన్నిద్దాం. " ఆధునిక కవితా వైతాళికుడు " మన గురజాడ.
ప్రాచీన సంప్రదాయానువర్తులు గేయాల్ని సంప్రదాయవిరుద్ధ రచనలుగా గణించి ఆదరిమ్పకున్దురుగాక. యదార్థానికి ప్రాచీన గ్రంధస్థ భాష పంచదార పానకంలాగా పరిమిత ప్రయోజనం కలది. వాడుక భాష మంచినీరులాగా బహుళ ప్రయోజనం కలది.ఈ సత్యాన్ని గ్రహించారు కాబట్టే గిడుగు, గురజాడ మున్నగువారు వ్యావహారిక భాషా ఉద్యమానికి నడుం కట్టారు.కృతకృత్యులయ్యారు. అలాగని వారు ఛందో బాహ్యంగా కవితలు చేసారనుకోవడం సరికాదేమో. గురజాడ గేయాలలో మాత్రా ఛందస్సు గోచరిస్తుంది. " దేశమును ప్రేమించుమన్నా.....మంచి అన్నది పెంచుమన్నా...... వట్టి మాటలు కట్టిపెట్టోయ్....... గట్టి మేల్ తలపెట్టవోయ్. ఇది పరిశీలిస్తే లయ బద్ధమయిన మాత్రా బద్ధత కనిపిస్తుంది. ఇది ఛందో బద్ధం కాదని యెలాగనగలమ్?దీనిని సంప్రదాయచందాల్లో " మత్తకోకిల " తో తైపారువేసి చూసుకోవచ్చు. .......
మత్త :-పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక రోళ్ళు పీటల నొక్క ప్రోవిడి యెక్కి చే
పెట్టజాలక కుండక్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడ పాలు చేరల పట్టి ద్రావె తలోదరీ. ....................ఇది భాగవతం లోని పద్యం. ...కొంచం పరిశీలించి చుడండి. అంట వరకు ఎందుకు. ఛందో నిబద్దం కాని లేదా మాత్రానిబద్ధం కాని కవితలు ప్రజల నాల్కలమీద నర్తన ఏ రకంగా చేయగలవు? అంటే వాడుక భాషోద్యమం ఛందస్సుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని, వాడుక భాషను బహుళ ప్రయోజనాన్ని ఆశించి నడిపిన ఉద్యమమని అనుకో వచ్చునేమో. .........అటు ప్రాచీనులకు విరుద్ధం కాని, ఇటు వ్యావహారిక విరుద్ధం కాని విధంగా వ్యవహారిక ఛందో బద్ధ కవిత్వం సముచితమనిపిస్తోంది. మరి మీరేమంటారు?
గురజాడ రచనల స్ఫూర్తితో వెలువడే మీ రచనలకై నేనెదురు చూడనా?మళ్ళీ కలుసుకొందాం. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
ఆంధ్రామృతం.