Tuesday, November 26, 2024

చంపకభారతీశతకము. 15 / 22వ భాగము 71 నుండి 75 వ పద్యము వరకు. రచన. చింతా రామకృష్ణారావు. సంగీతము, గానము శ్రీమతి వల్లూరి సరస్వతి. యూట్యూబ్ ప్రచురణ శ్రీమతి స్వేతవాసుకి.

 జై శ్రీరామ్.

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

చంపకభారతీశతకము.  15 / 2 2వ భాగము 71 నుండి  75వ  పద్యము వరకు.


చ.  పరవశమైతి నీ కృపకు భద్రతఁగొల్పెడి భవ్య తేజమా!

నిరుపమ సాధనా పటిమ నీ కృపచేఁ బ్రభవించునమ్మ. నిన్

మరిమరి వేడుకొందు నను మంచిని వీడగనీక కావుమా.

సురుచిర భక్తి తత్పరత శోభిలఁజేయఁగ నిమ్ము. భారతీ! 71.

భావము. 

ఓ త్రయీమూర్తీ! భద్రతను కలుఁగఁ జేసెడి ఓ తేజస్వరూపమా! నీ కృపకు నేను 

పరవశించితిని. నీ కృప వలననే నిరుపమైన సాధనా పటిమ నాకు 

లభించినదమ్మా. నా నుండి మంచి వీడిపోకుందా కాపాడుమని నేను నిన్ను 

మరీమరీ వేడుకొందును. శోభిలుటకు కొఱకు ప్రకాశవంతమయిన భక్తితత్పరతను 

నాకు కలిగించుము తల్లీ.


చ. చదువులతల్లికిన్ శుభము, సద్గురు పూజ్య మహత్వ భారతీ

హృదయ మనోజ్ఞ సత్కవన  సృష్టి విధాతలకెల్ల శోభనం

బధిపతులైన పీఠపతులందరికిన్ శుభసంహితోన్నతుల్ 

పదిలములౌత యంచనెడు పండిత పాళిని కావు. భారతీ! 72.                                           

భావము. 

ఓ త్రికాలజ్ఞా! చదువులతల్లికి శుభమగుగాక, సద్గురు పూజ్యులయిన 

గొప్పభారతీదేవి హృదయవర్తులగుకవితా బ్రహ్మలకు,శుభములుపీఠాధిపతులకు

శుభములు అనుచుచూచెడి పండితులనుకాపాడుతల్లీ.


చ. శిశువుల జ్ఞాన సంపదను చిందరవందర చేయుచుండి రీ

పశువుల వోలె వర్తిలెడు పాంసులనాగరికంబు నేర్పుచున్. 

నిశితముగా కనుంగొనుమ. నిత్య దరిద్రుల నుండి కావుమా

శశివదనా! కృపం గనుమ చక్కగ బాలలనెన్ని, భారతీ! 73. 

భావము. 

ఓ త్రిగుణా మాతా! పశుప్రవృత్తి కలిగిన దుర్మార్గులు అనాగరిక ప్రవృత్తిని 

నేర్పుచు శిశువుల జ్ఞాన సంపదను ధ్వంసము చేయుచున్నారమ్మా.వీరు నిత్యము 

దరిద్రపు లక్షణములతో ఉండు దుర్మార్గులు.నీవు నిశితముగా చూచి 

వారిబారినుండి శిశువులను కాపాడుము. 


చ. అణువు కదల్పనౌనె పరమాత్మకునైన భవత్ ప్రతాపమున్ 

గొనకొని స్వీకరింపక, నిగూఢ మహాద్భుత శక్తివీవు, నిన్

వినయముతోడ గొల్చుటనె వేద్యమగున్ బరమాత్మ సృష్టియున్.

సునిశిత దృష్టి నాకునిడి చూపుమ దైవ బలంబు భారతీ! 74. 

భావము. 

ఓ శాస్త్ర రూపీ! నీవి నిగూఢముగానుండెడి అద్భుతమైన శక్తివమ్మా. 

పరమాత్మునికైననునీ ప్రతాపమును స్వీకరించనినాడుఅణువునైనను కదల్చుట 

సాధ్యమా? నిన్ను గొప్పగా వినయముతో కొలిచినప్పుడే ఈ పరమాత్మ సృష్టి 

అర్థమగునమ్మా.నాకు సునిశిత దృష్టి ప్రసాదించి,దైవబలమును కనఁజేయుమమ్మా.


చ. సరసవిదూరమౌ కవిత సద్గురు తేజముఁ జూపఁబోదు.నీ

చరణ పయోరుహంబులను సన్నుతి సేసి భవత్ ప్రతాపమున్

నిరుపమమంచు నెంచి కవి నేర్పున వ్రాయ రసాద్భుతంబగున్

భరమును నీపయిన్ నిలిపి భక్తిగ వ్రాసితినమ్మ. భారతీ! 75.                                               

భావము. 

ఓ శుంభాసుర ప్రమథినీ! రసహీనమైన కవిత్వము సద్గురువు యొక్క తేజస్సును 

ఏనాడునూ అందుకొనలేదు. నీ పాదపద్మములను నుతించి, నీ ప్రతాపమును 

సాటి లేనిదిగా భావించి నిపుణతతో వ్రాసినచో రసాద్భుతముగా ఒప్పునమ్మా. 

నీపై భారముంచి ఈ శతకమును వ్రాసితినమ్మా.

జైహింద్.

No comments: