జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 14 / 2 2వ భాగము 66 నుండి 70వ పద్యము వరకు.
చ. సుజనులఁ జేర్చి సచ్చరిత శోభిలఁ గూర్చెడి తల్లివీవు. నా
విజయపరంపరన్ వెలుఁగు విశ్వవిధాతవు వేదమాత! నీ
వజునకు రాణివీవయి శుభావహవైతివి వానికమ్మరో!.
ప్రజలకు మేలుగూర్చుమిల పాపవిదూరులఁ జేసి. భారతీ! 66.
భావము.
ఓ పద్మ లోచనా! మంచి ప్రవర్తనను సుజనులందు చేర్చి వారిని శోభిల్లునట్లు
చేసెడి తల్లివమ్మా. ఓ వేదమాతా! నీవు నా విజయ పరంపరలో ప్రకాశించు
సృష్టినున్న బ్రహ్మ పదార్థము నీవేనమ్మా. బ్రహ్మరాణివైనావు. అతని
శుభములకు మూలమైనావు. ప్రజలను పాపములనుండి దూరముగా ఉంచి
మేలుకూర్చుమమ్మా.
చ. కవన సుధాపయోధిని ప్రకాశితమౌనటు, కావ్యరాజమే
నివసనమై రహిన్ నిలుచు నిత్య శుభాస్పద శారదాంబ! చి
ద్భవ నుత బంధ సత్కవిత భావన చేసెడు సత్కవీశులే
జవమును గల్గు సత్కృతులు సన్నుతి వ్రాయఁగ నేర్త్రు, భారతీ! 67.
భావము.
ఓ విద్యారూపా! కవనసుధాసాగరమున ప్రకాశించునట్లు కావ్యరాజమే నివాసముగా
కలిగి రహించు నిత్య శుభములకు తావౌన శారదాంబా! ఆత్మ భవమయెడి
బంధకవితా సమూహమును భావించెడి మంచి కవీశ్వరులే మంచి వేగముతో
కవిత్వమును పొగడబడునట్లుగా వ్రాయ నేర్చుదురమ్మా.
చ. మరిమరి వేడుచుంటినని మారము చేసితి నంచు నన్నునే
మరచుట నీకు కాని పని. మద్ధృదిమందిరవాసివైనని
న్నరయుచు వేడకుండనెటులన్యుల వేడుదు? చెప్పవమ్మ . సు
స్థిరమతి నీయుమమ్మ నిను దీక్షఁగ కొల్చెదనమ్మ, భారతీ! 68.
భావము.
ఓ విశాలాక్షీ! మిక్కిలిగా అడుగుచుంటినని, మారాము చేయుచుంటినని నన్ను
మరచుట నీకు సాధ్యము కాని పని. నాహృదయ మందిర వాసివైన నిన్ను అరసి
వేడుట మాని ఇతరుల నెట్లు వేడఁగలనమ్మా? నీవే చెప్పుము. నేను నిన్ను
స్థిరముగా కొలిచెదను నాకు సుస్థిరమైన మతిని ప్రసాదించుము.
చ. తెలివి యనంగ నేది? యది తెల్లమె నీవని నగ్న సత్యమే.
తెలివి యదేలతప్పు? నది తెల్లమె నీవది వీడిపోవుటన్.
తెలివిగ నీవు కల్గి నిజ తేజమునన్ మది నిల్చుదేని నే
తెలియఁగ సత్కవిత్వరుచి దిక్కులనింపుదునమ్మ. భారతీ! 69.
భావము.
ఓ బ్రహ్మజా! తెలివి అంటే ఏమిటి?అది నీవే అన్నది స్పష్టమైన
నగ్న సత్యమేనమ్మా. మరి అటువంటి తెలివి మాకు ఎందుకు తప్పును?
అదియు స్పష్టమే నీవు మమ్ములను వీడి వెళ్ళిపోవుట వలననే అని.తెలివిగా
మాలో నీవే ఉండి నీ ప్రకాశముతో మాలో ఉందువేని నేను సత్కవిత్వపు
తేజమును అందరికీ అర్థమగునట్లుగా దిక్కులనంతటా నింపుదునమ్మా.
చ. విధికి నమస్కరించెదను. విద్యలరాణి కృపాబ్ధినున్ననే
నధిక ధనాఢ్యుఁడౌ హరికి,, నార్త జనావన సాంబమూర్తికిన్,
మధుర మనోజ్ఞ భావన సమాధి యవస్థను నిల్చి మ్రొక్కెదన్
వ్యధలకు దూరమై శుభమహాకృతి కర్తగఁ జేయ. భారతీ! 70.
భావము.
ఓ మహా ఫలా! విద్యలరాణి కృపా సాగరముననోలలాడుచున్న నేను వ్యధలకు
దూరమై శుభ మహాకృతికర్తగ చేయుట కొఱకు మిక్కిలి ప్రపత్తితో విష్ణుమూర్తికి,
ఆర్తజనులను కాపాడు శివునకు, బ్రహ్మదేవునకు నమస్కరించెదను.
జైహింద్.
No comments:
Post a Comment