జై శ్రీరామ్.
చంపకభారతీశతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
చంపకభారతీశతకము. 22 / 2 2వ భాగము 106 నుండి సాంతము పద్యములు.
గూఢ పంచమపాద గోమూత్రికా బంధ చంపకమాల
నిరవధిగా సుకృత్యముల నిన్నె గ్రహించఁగఁ జేయ, భారతిన్
నిరుపమ రామ కృష్ణ యన నేర్పు వహింతును గాదె శారదా!
నిరుపమ? రాణ గాంచి కని నే నిట నెంచనె నీ మహద్ధృతీ
శ్వర సుమనోజ్ఞ తేజము? వివర్ధిలు దీవెగ ధాత్రి భారతీ ! 106.
భావము.
ఓ హంసాసనా! సాటిలేని జననీ! ఓ శారదాంబా! అవధియే లేకుండా
మంచిపనులందు నిన్నే గ్రహించునట్లు చేసినచో భారతావనిలో సాటిలేని
రామకృష్ణ అని అందరూ అనుకొను విధముగా నిపుణతను కలుగుదును కదా!
ఆ విధముగా రాణ గడించి, ఆ నిపుణతతో చూచి, ఇచ్చట నేను నీ గొప్ప గా
వహించిన మహనీయ ఈశ్వరుని మనోజ్ఞమయిన తేజమును గుర్తించకుందునా?
ఆవిధముగా నేను చేయుటచే వర్ధిల్లునది నీవే కదా తల్లీ!
గూఢ పంచమ పాదము.
నిరుపమ రామకృష్ణ కవి నేర్పు గ్రహించగ నీదె భారతీ!
భావము.
ఓ భారతీ మాతా! సాటిలేనిదైనటువంటి ఈ రామకృష్ణ కవి చిత్రకవితా నైపుణ్యము
అది నీదైన నిపుణతయేనమ్మా.
చ. ఘనముగ చిత్ర బంధ వర గర్భ కవిత్వమునష్టకంబులో
వినుతిగ వ్రాయ గోరిరిట విజ్ఞులు పూజ్య వరాష్టకాల స
ద్వినుతులు. వ్రాసినాడ నిట విజ్ఞతతో నరసింహునానతిన్.
ప్రణుతులు వారిలో శుభదవై మము గాంచెడి నీకు, భారతీ! 107.
భావము.
ఓ నీలజంఘా! బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహ రామ శర్మ మహోదయులు
చంపక భారతీ శతకమును చూచి, చిత్ర, బంధ, గర్భ కవిత్వములతో
అష్టోత్తర శతకముగా పూర్తి చేయమని కోరగా వారి ఆదేశము మేరకు నిన్ను
ప్రార్తించి, నీ ప్రభావముచే పై ఎనిమిది పద్యములు వ్రాసితిని తల్లీ!
ఆ మహనీయునిలో శుభదవై యుండి మమ్ములను చూచెడి నీకు
నా నమస్కారములు తల్లీ!
చ. నిరతము మంగళంబులగు నిర్మల భారతమాతకిద్ధరన్.
నిరుపమ భారతీయతను నిత్యము మంగళముల్ వహించుతన్
కరుణ గుణాలవాలమగు గణ్యులపాళికి మంగళంబు. సుం
దర వర భాషణామృత! మదంబరొ మంగళ మీకు భారతీ! 108.
భావము.
ఓ బ్రహ్మ విష్ణు శివాత్మికా! ఈ ధరపై భారతమాతకు నిత్యము మంగళములు
ప్రాప్తించుచుండును గాక. సాటిలేని భారతీయతను మంగళదేవత
ఆవహించుగాక. కరుణామూర్తులయిన సజ్జనుల సమూహమునకు మంగళములు
ప్రాప్తించుగాక. సుందరమగు అమృత భాషణాస్వరూపిణీ! ఓ భారతీ!
నా తల్లీ! నీకు మంగళమగుగాక.
క. మూర్తీభవించె శతకము
కార్తికము విశుద్ధ విదియ ఘన మన్మధనా
డార్తిగ చంపక భారతి,
కర్తను నే రామకృష్ణ కవి నిల చింతాన్. స్వస్తి. తే. 13 - 11 - 2015.
ఒక్క రోజులో రచించిన చంపక భారతీశతకము సంపూర్ణము.
ఏతత్ సర్వం శ్రీవాగ్దేవీ చరణారవిందార్పణమస్తు.
జైహింద్.