జైశ్రీరామ్
ఈశావాస్యోపనిత్ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారిపద్య భావములు
శాంతి మంత్రః
ఓం. పూర్ణమద: పూర్ణమిదం - పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ - పూర్ణమేవావిశిష్యతే
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
శాంతి మంత్రము
కం. పూర్ణము బ్రహ్మము జగ మిది - పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్
పూర్ణం బగు నీ జగతికిఁ - బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
శాంతి మంత్రము
భావము. ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
1 వ మంత్రము.
ఈశావాస్య మిదంసర్వం - యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తే న భుంజీథాః - మాగృధః కస్య స్విద్ధనం.
కం. భగవంతుడు భువి మాఱుచు - నగపడు నీ ప్రతిపదార్ధమందును నుండెన్
తగ నది త్యాగము చే నిపు - డె గాచికొను; మిది యెవరి ధనంబౌ. 1
భావము. జగతి యందు మార్పుచెందు నిది యంతయుఁ బరమేశ్వరునిచే నిండియుండెను. దానిని త్యాగముచే నిన్ను రక్షించుకొనుము. దేనిని గోరకుము . ఇది యెవరి ధనము ?
సంస్కృతమున "ఈశావాస్య " అని మొదలు పెట్టఁబడుటచే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చెను. అవిద్యను అజ్ఞానమును నశింపఁ జేయునది గాన ఉపనిషత్తు అని వ్యుత్పత్తి.
No comments:
Post a Comment