Thursday, August 24, 2023

అపురూప అవధాన కళను కాపాడుకుందాం ..... శ్రీ ఎ న్సీహెచ్ చక్రవర్తి.


 "గురువుగారూ!మీరు అవధానంచెయ్యాలి"
"చెయ్యను"
"మాకోసం చెయ్యాలి"
"మీకోసమూ చెయ్యను"
"ఎందుకు చెయ్యరు?"
"నాకా శక్తీ అర్హతా లేవు"
"మీరు ఆశువుగా పద్యాలు చెప్తారు. ఎందుకు చెయ్యకూడదు?"
అవధానం అంటే ఒక్క ఆశుకవిత్వం చెప్పడమే కాదు. ఇంకా కొన్ని ఉండాలి"
"ఏమిటి అవి?"
"సమయస్ఫూర్తి, శాస్త్రపరిజ్ఞానం, ధారణాశక్తి మొదలైనవి అన్నీ ఉండాలి. అంతేకానీ  ఆశుకవిత్వం చెప్పగల్గడo ఒక్కటే కాదు. "
"మీకు అవన్నీ వచ్చండీ. కూర్చోండి. మేము చేయిస్తాం"
"మీరు చేయిస్తారు అన్నదే భయం. నేను చెయ్యాలికదా!!"😃😃
'మరో విషయం చెప్పనా?"
"చెప్పండి!"
"కచ్చితంగా చెప్తే ఒక్కచోట పద్యం తప్పినా ధారణ తప్పినా మొత్తం అవధానం పోయినట్లే!తెలుసా??
అందుకే అవధానం చేసే దమ్మూ,ధైర్యం,ప్రతిభా పాటవాలు నాకు లేవు. " ఇదీ అవధానాలు చూస్తూ కొన్నిసార్లు మా శిష్యులకూ నాకూ జరిగిన యథాతథ సంభాషణ. వారికి ఒక్కటి స్పష్టంగా చెప్పాను. 8 మంది పండితులను challenge చేసి కూర్చోడమే పెద్ద సాహసo.అంత సాహసం నాకు లేదు. అందుకే అంత సాహసాన్ని సంతరించుకున్న అవధానులకూ వారిని తీర్చిదిద్దే శిక్షకులకూ ముందుగా వందనాలు సమర్పిస్తాను.
  తెలుగుభాషకే వన్నె తెచ్చిన సాహిత్యప్రక్రియ అవధానం. ఇది కళ అంటే కళ. విద్య అంటే విద్య. 
ఏ అంశానికి ఆ అంశమే గొప్పది అందులో. ఎందుకంటే అవధాన పద్యం నీరసం కాకుండా రసవంతంగా ఉండేటట్లు అవధానం రసవత్తరంగా సాగేటట్లు   సరసులను అలరించవలసిన బృహత్తర బాధ్యత ప్రధానంగా అవధానిదీ ఆ పిదప ప్రాశ్నికులదీ. 
ఈ కళ(విద్య) కొన్ని తరాలపాటు రసికులను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఎడనెడ అలరిస్తూనే ఉంది. ఈ కళలో పంటలు పండించారు ఎందరో మహానుభావులు. అవధాన చరిత్రలో శాశ్వతస్థానాన్ని సంపాదించినవారు. 
  ఈ అవధానానికి ఒక ప్రమాణ విధానం ఉన్నది. ఒకటి రెండు అంశాలు కొందరు మార్చుకున్నా విధానంలో మార్పు ఉండదు. పూర్వులు ఆ సంప్రదాయాన్ని సుస్థిరం చేసి పెట్టారు--సంగీతకచేరీ లాగానే!! ఆ విధానాలు నేను ప్రత్యేకంగా వివరించనవసరం లేదని భావిస్తాను. 
  అయితే ఇటీవల చూస్తున్న అవధానాల గురించి చెప్పుకోవలసి ఉన్నది. పూర్వం ఆంతటి ఓపిక ఇప్పుడు శ్రోతలకు లేదు. త్వరగా ముగియాలి. రెండు లేక రెండున్నర గంటలు అంటే ఎక్కువే!!పూర్తిగా మూడు గంటలూ కూర్చుని చూసేవారు వ్రేళ్ళసంఖ్యలో ఉంటారు. ఇది అందరికీ అనుభవమే! సమయపాలన చెయ్యకపోడం వల్ల కొంత కాలహరణం జరుగుతున్నది. ఆ పిదప కాల ప్రణాళిక లేకుండడం వల్ల నెమ్మదిగా యథావిథిగా కార్యక్రమం నడుపుతూ ఉండడం వల్ల అవధానం గంటన్నర రెండుగంటల లోపు ముగించాలి. అంటే రెండు ఆవృత్తులు కాగానే 3,4 ఆవృత్తులు ఒకేమారు పూర్తిచేయిస్తున్నారు.అందరూ అంతే!! ఇది సంప్రదాయ భిన్నంగా నడుస్తున్న క్రొత్తపోకడ. ప్రొసీడింగ్స్ కి కాలవ్యవధి తగ్గించుకుని అవధానానికే పూర్తిగా సమయం కేటాయించాలి అనే ఒక స్పృహ లోపిస్తున్నది అనిపిస్తున్నది. నిషిద్ధం 2 పాదాలకూ కుదించుకుపోడం చూస్తున్నాం. అలాగే ఆశువులు రెండు లేక మూడు. ఇలాగే అన్నీ కుదింపు. 
సాధారణంగా అవధాన పద్యాలు కొంత నీరసం గా ఉంటాయి అనే ఒక ప్రథ ఉన్నది. అందులో రసమూ అలంకారమూ వంటివాటికి (ఉంటే ఉండవచ్చు ఎక్కడైనా) పెద్ద ప్రాధాన్యం ఉండదు. అంశాలను ఝటితి స్పూర్తితో చమక్కులతో పూర్తి చేసారా అన్నదే ముఖ్యం అక్కడ. ఇటువంటి అవధానాలలో ఇటీవల వాసి తగ్గింది అనేది వాస్తవం. పైకి చెప్పడానికి సంకోచించినా అంతర్గతoగా అందరూ అనుకునేది.
  ఇది ప్రత్యక్షoగా చూసే/వినే వారికి ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. *ప్రత్యక్షానుభూతి* దీనికి ప్రధాన కారణం.
  కాలం మారింది. ఎక్కువమంది ఇప్పుడు అవధానాలు చేస్తున్నారు. పూర్వంలాగా పద్యాలలో పటుత్వం తగ్గింది. పూర్వులలాగా అంతటి శాస్త్రపరిజ్ఞానం అందరికి ఉండడం లేదు. కొందరి విషయంలో ఎంతోకొంత ఆశువుగా పద్యం చెప్పడమూ నిషిద్ధాక్షరి టెక్నిక్స్ తెలుసుకుంటే చాలు అన్నట్టుగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. గతంలో అప్రస్తుతప్రసంగాలు బాగా సాగేవి. అవధానుల జవాబులూ బాగా ఉండి రంజింపచేసేవి. ఇప్ప్పుడు అంతగా రంజింపచెయ్యడం లేదు అని చెప్పుకోవాలి. అవధానులూ నూటికి నూరు చమత్కారంగా చెప్పడం లేదు. కొందరు ఒక condition పెడుతున్నారు. పాదo అల్లుతూ మధ్యలో ఉండగా అప్రస్తుతం చేయరాదని. పూర్వం ఈ నియమం లేదు. ఇవి ఆధునికంగా వచ్చిన మార్పులు.
ధారణ సమయంలో సంచాలకులు ప్రక్కనుండి కొంత అందించడం మనం చూస్తున్నాం. ఇవి అన్నీ లోపాలు ఎంచడం కాదు.  సమీక్షించడమే!!
  ఇప్పుడు కరోనా పుణ్యమా అని వాట్సాప్ వేదికగా అవధానాలు జరుగుతున్నాయి. ప్రాశ్నికులూ అవధాని టైప్ చెయ్యడం ద్వారా ఇది జరుగుతుంది.  వీటి గురించి చర్చ జరగవలసి ఉన్నది. ప్రత్యక్ష అనుభూతి లేకపోడం ఒకలోపం కాగా నేను చూసిన చాలా అవధానాలు రoజకంగా జరగలేదు. ఒకరిద్దరు మినహాయింపు. ప్రత్యక్షంగా లేనప్పుడు అసలు అవధాని ఒక్కరే అవతల ఉండి పద్యం చెప్తున్నారు అనే విశ్వాసంతో నడిచేది.(కనపడ నంతవరకూ)ఇందులోనూ సంచాలకులు ఎక్కువ పాత్ర పోషించడం గమనించాము. అప్రస్తుతం అనే అంశం ఇందులో అనవసరం అని నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి ప్రత్యక్ష స్పర్శ లేదు కనుక వ్యవధి తొందర లేదు. రెండుగంటల్లో ముగించాలి అనిలేదు. చూచేవాళ్ళు చూస్తూనే ఉంటారు కనుక వ్యవధి పెరిగినా ఇబ్బందిలేదు. ఎదురుగా చూసేటప్పుడు ప్రేక్షకులు పల్చబడితే నిరుత్సాహం కలగవచ్చు. కానీ ఇందులో ఆ ఇబ్బంది లేదు. కానీ అన్ని అవధానాల్లోనూ రెండుఆవృత్తులు కాగానే 3,4 పూర్తి చేయించేస్తున్నారు. సంప్రదాయాన్ని తప్పి ఇలాగ అక్కరలేదేమో అనిపిస్తుంది. అప్రస్తుతం అంశాన్ని తొలగిస్తే లోటూ ఉండదు. నిజానికి దీనిలో ధారణ అన్నదీ అర్థరహితమే(ప్రత్యక్షం కానప్పుడు)
కనుక ఈ విషయాలను ఆలోచించ వలసిఉన్నది. 
 అంతమాత్రం చేత అవధానుల శక్తి సామర్ధ్యాలను శంకించడం కాదు. ముందే చెప్పాను సాహసం చెయ్యగల్గినవారే అవధానులు అవుతారు అని. కాకపోతే ఇందులో ఉన్న సాధకబాధకాలను గురించి మాత్రమే సమీక్ష-అందునా క్రొత్త ప్రయోగం కనుక. 
  విజ్ఞులూ అవధానులూ అందరూ కలసి ఈ వాట్సాప్ అవధానాల విధివిధానాలు నిర్ణయించవలసి ఉన్నది. దీని రంజకత్వానికి కృషిచెయ్యవలసి ఉన్నది.
  
ఒక మిత్రులు ఇటీవల నాతో ఒక చర్చ చేసారు. దానిసారాంశం ఏమంటే అవధానం అనేది ఒక నాటకం అనీ మొత్తంపై ప్రాశ్నికులు అందరూ కలిసి అవధానిని గెలిపించి హైలైట్ చెయ్యడానికి సాగే ఒక తతంగం అనీ!! ఇదే అభిప్రాయం చాలామందిలో ఉందని. దీనితో కొంతవరకూ నేను విభేదించినా ఆధునికంగా ఇది కొంత నిజమా అన్నట్లుగా జరుగుతున్నది. ఎందుకంటే ఆధునికుల పద్యాల్లో దోషాలు బాగానేదొర్లుతున్నాయి.యథాప్రకారంఅందరూఅవధానినిఎత్తికుదేస్తూ ప్రశంసలు గుప్పించేస్తున్నారు. పొగడకపోతే తగ్గిపోతాం అన్న ధోరణే అంతటా కనిపిస్తున్నది. గుణ దోష చర్చ ఎక్కడా లేదు. ఇందువల్ల అవధాన ప్రక్రియ మున్ముందు కవిత్వంతోపాటు పల్చబడుతుందా అనే ఆశoక కలుగుతున్నది. అవధాన విద్య సౌరభాలు చెడకుండా ఎలా కాపాడుకోవాలి అన్నది పరిశీలన జరగాలి.
  కేవలం ఆహ్లాదకరమైన చర్చజరిగి తెలుగు అవధాన ప్రక్రియకు పూర్వవైభవాన్నిసంతరింపచెయ్యాలిఅన్నదేలక్ష్యంకావాలి.రాగద్వేషాలకు అతీతంగా ఇది సాగాలి. నా అనుభవాల ఆధారంగా నేను చెప్పిన అంశాలకు ఎవరి అనుభవాలు వారివిగా జోడించి చెప్పుకోవచ్చు.
   ఇప్పటికీ చాలా రoజకంగా అవధానాలు చేస్తూ ఆ కళకే జీవితాన్ని అంకితం చేసినవారు మన కాలంలోనూ ఉన్నారు. అవధానులను తయారుచేస్తున్న శిక్షకులూ ఉన్నారు. కొందరిపేర్లు చెప్పి కొందరిని మరిస్తే అపచారం అవుతుందని ప్రస్తావన చెయ్యడం లేదు.వారందరి కళా నైపుణ్యాలకూ మనం ప్రణమిల్లుతూ ఆ కళ ఆధునిక కాలంలో రసహీనం కాకుండా చూసుకోవాలి.  అవధాన సంపూర్ణత్వాన్ని కాపాడుకునేందుకు ప్రస్తుతం ఉన్న అవధానులు కృషిచెయ్యాలి.
  కేవలం అవధానవిద్యనూ పద్యవిద్యనూ ఆస్వాదించే అభిమానిగా మాత్రమే ఈ చర్చ చేసాను. అదే నాకున్న అర్హత.

*N. CH. చక్రవర్తి.*

No comments: