Sunday, January 7, 2018

బాల భావన. 77వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
77) తల్లి చేతి ముద్ద పిల్లలకనురాగ  -  బంధమరయఁ జేయు, బ్రతుకఁ జేయు.
     తల్లి ప్రేమ కొలుపు మల్లెల మనసును.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి చేతితో పెట్టే భోజనము పిల్లలకు ప్రేమ బంధమును తెలియఁ జేయును. బ్రతుకునట్లు చేయును. తల్లి ప్రేమ మాలో మల్లెల వంటి మనసును కలుగఁ జేయును.
జైహింద్.

Friday, January 5, 2018

బాల భావన. 76వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
76) ఎవరి శక్తి నెన్న నెవరికి సాధ్యము?  -  బాలలందు శక్తి ప్రబలకున్నె?
     శోధనమున భావి మేధావులము మేము  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఎవరి యొక్క అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యముల నెవరు గుర్తించఁ గలరు? బాలలలో కూడా శక్తి ప్రబలి ఉండునని తెలుసుకొన వలెను. భావి కాలమున పరిశోధనలను చేయు మేధావులము మేమే కదా!
జైహింద్..

Thursday, January 4, 2018

బాల భావన. 75వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
75) మమ్ము త్రోసిపుచ్చి మా మాట వినరేల?  -  మాకు విలువ లేదొ? మనసు లేదొ?
     మమ్ము కూడ మీరు సమ్మతిఁ గనుఁడయ్య?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్మల్ని లక్ష్య పెట్టకుండా మా మాటలను గ్రహింపరేమి? మాకు మీ మధ్య విలువ లేదా? మమ్మల్ని కూడా మీరు సమ్మతితో చూడండి.
జైహింద్.

Wednesday, January 3, 2018

బాల భావన. 74వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

  జైశ్రీరామ్.
74) పిన్నలమగు మేము పెద్దవారిని పోలి   -  చూడఁ గలము. చూచి చెప్పఁ గలము.
    చూచి చెప్పనిండు తోచిన భావన.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలమైన మేము కూడా పెద్దవారిలాగే వినకలము, దానికి స్పందించి మా అభిప్రాయము కూడా చెప్పఁగలము. మమ్మల్ని కూడా ఏమి జరుగుచున్నదో చూడనివ్వండి, చూచి చెప్పనివ్వండి.
జైహింద్.

Friday, December 22, 2017

బాల భావన. 73వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

  జైశ్రీరామ్.
73) పెద్దవారి నడుమ పిల్లలమగు మేము   -  చెప్పు మాట వినరు. తప్పనుదురు.
     మమ్ము చెప్పనిండు. మా మాటవినుఁడయ్య  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాటలాడుకొనుచున్నప్పుడు మేము ఆ మాటలు విని స్పందించి మా అభిప్రాయమును చెప్పుటకు ఉత్సహిస్తున్నప్పుడు మమ్మల్ని మీరు అడ్డుకొని, అలా మధ్యలో మాటాడ కూడదు, తప్పు అని మా నోరు నొక్కివేతురు. మమ్మల్ని కూడా మా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి. మా మాట కూడా కొంచెం వినండి..
జైహింద్.

Thursday, December 21, 2017

బాల భావన. 72వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

  జైశ్రీరామ్.
72) ఆడుకొనెడి మమ్మునల్లరి యని తిట్టి  -  చేయనీరు. మాదు చేవఁ గనరు.
     ఆట పాటలొసగు నద్భుత మేధను.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము ఆడుకొనే సమయమున మమ్ములను చూచి మీరు అల్లరి చేస్తున్నారేమిటి అని తిట్టుచుందురు. మమ్ములను ఆడుకోనివ్వరు. మీరు ఏ  ఆట పాటలను అల్లరి అంటున్నారో ఆ ఆట పాటలు మాకు అద్భుతమైన మేధా సంత్తిని కలుఁగఁ జేయును.
జైహింద్.

Tuesday, December 19, 2017

బాల భావన. 71వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
71) మీరు చదివి చెప్ప మేలగు కొంచెమే.  -  మేము చదివి నేర్వ మేలు హెచ్చు.
    మమ్ము చేయనిండు మా మేధ గాంచుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
                    

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా కొఱకు మీరే చదువుతూ, మాకు బోధించుతూ ఉన్నట్లైతే ఫలితము కొంచెం మాత్రమే ఉంటుంది. అదే మీరు మమ్మల్ని చదవి చెప్పమనినచో మా మేధా శక్తి మీకు తెలియును.
జైహింద్.