Tuesday, April 5, 2016

చందానగర్లో జరిగిన డా.మలుగ అంజయ్య అష్టావధానము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! చందానగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో తే.౦౫-౪-౨౦౧౬ న
సాయంత్రం ౬ గంటలనుండి:౩౦ నిమిషముల వరకు
                       అవధానరత్న డా.మలుగ అంజయ్య శతావధానిగారి
                                అష్టావధానము
జనరంజకముగా జరిగింది.
 
సంచాలకులు: శ్రీ చింతా రామ కృష్ణా రావు.
౧. ఆశువు: శ్రీ ప్రభాకరరావు.
విషయము:
దైవభక్తుఁడు ప్రసాదం తిని అరటి తొక్కను మార్గమధ్యమున పడవేయగా రక్షకభటుడు శిక్షించుట.
పూరణ:
ఏడు కొండల వెంకన్న యిక్కడున్న -  రక్ష. రక్షక భటులకు, రాజ్యములకు,
మోడువారిన భారతిన్ మోడి వచ్చి, - స్వచ్ఛమని చెప్ప వినవేమి సాధుశీలి.
౨. దత్తపది: శ్రీ మాచవోలు శ్రీధర్రావు.
విషయము:
నయనతార - తమన్నా - సమంతా - కాజల్. పదములుపయోగించి ఉగాది వర్ణన.
పూరణ:
నయన తారల మెప్పించు వయన మిదియె. - ధర తమన్నది తప్పుగా తలచి చూడ 
వింతకాఁ జల్లులిలపైన శాంతిఁ గూర్చు - దోసమంతయు తీర్చుమా దుర్ముఖమ్మ.
౩. సమస్య: శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి.
కొట్టెడు పతిఁ గోరుచుండు కోమలి యెపుడున్.
పూరణ:
తిట్టక యడిగినవన్నిటి - నట్టే తామందఁ జేసి హాయిని కూర్చే
గట్టిగ తనతోఁ దగ యూ - కొట్టెడు పతిఁ గోరుచుండు కోమలి యెపుడున్.
౪. వర్ణన:   శ్రీ శివరాత్రి యాదగిరి.
విషయము: నిర్వీర్యమౌతున్న పల్లెలు దుస్థితి.
పూరణ:
యువకులు భవితకై యూరూరు వెడలుచు - నగరముల్ చెరుచు నవ్యమనిరి.
నదులెల్ల యది కాంచి ముదమును వీడంగ - పచ్చని పైరులు బాధ పడెను.
యిల్లిల్లు సెల్లులు వెల్లువై ప్రభవిల్ల - పక్షి జాతులవెల్ల పయన మయెను.
గో జాతి తమ గోడు నేజాతికిం జెప్ప - ఫలమేమి యని చెప్పి పయనమయెను.
యెవరు నాకున్నారు? యేమయ్యె నాపల్లె - లని వృక్షములు కూడ యవని వీడె.
చల్ల చల్లని పల్లెలు సవురు తప్పి - గోడు గోడంచు యీనాడు గోల సేయ
జాన పదులెల్ల కవితలు సాగి పాడ - తల్లి పల్లెను కాపాడ అరలి రండి.
౫. నిషిద్ధాక్షరి: శ్రీ వాడ్రేవు వేంకట సత్యప్రసాద్.ఆంజనేయుని సముద్ర లఘనము.
పూరణ:
వాయువునందే నిత్యం - పాయకనింగిన్ సరసర ప్రాకియు దూకెన్.
వాయువునందను వార్ధిని - వ్రాయగ రామాయణంబు రంజులునందున్. 
౬. ఛందోభాషణ: శ్రీ ఘట్టి కృష్ణమూర్తి.
శ్రీ ఘట్టివారు చేసిన ఛందోభాషణమునకు దీటుగా అవధాని ప్రత్యుత్తరం ఇచ్చి అందరి హృదయాలలోను అత్యున్నతంగా నిలుచుట ముదావహం.
౭. అప్రస్తుత ప్రసంగము: శ్రీ కే.యల్. కామేశ్వరరావు.
శ్రీ కే.యల్.కామేశ్వర రావు గారి చెణుకులకు బెణకక అప్రస్తుతాన్ని కూడా ప్రస్తుతానికి అన్వయిస్తూ అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు మన అవధాని.
౮. వార గణనము: శ్రీ మంగిపూడి వేంకటరమణమూర్త భాగవతార్.
అడిగిన తేదీలు అవధాని చెప్పిన వారములు.
31-12-2016 - శనివారము.
16-01-2016 - శనివారము.
24-  5-2016 - మంగళవారము.
26-10-2016 - బుధవారము.
ఒక్కతేదీకి కూడా వారం చెప్పడంలో తప్పన్నది దొర్లకపోవడం అవధాని యొక్క అవధాన పాటవానికి నిదర్శనం.
ఈ సందర్భంగా అవధానంలో పాల్గొనిన పృచ్ఛకులు తమ స్థాయిని ఏమాత్రం దిగజారనీయకుండా ఆత్మవిశ్వాసంతోప్రశ్నించి, సమాధానం కూడా సభారంజకంగా రాబట్టడంలో కృతకృత్యులయినందుకు వారినందరినీ మనసారా అభినందిస్తున్నాను. కృతకృత్యులైన అవధానిని కూడా మనసారా అభినందిస్తూ ఇంకా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అవధానాలలో ప్రజా హృదయాలను దోచుకొంటూ, తెలుగు తల్లి కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేయగలగాలని మనసారా కోరుకొంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరిగే విధంగా ఏర్పాటులొనరించిన చందానగర్ శ్రీ వేంకటేశ్వరదేవస్థాన కమిటీకి, శ్రీమాన్ టీ. రామస్వామి యాదవ్ గారికి కృతజ్ఞతలు మనసారా తెలియఁ జేసుకొంటున్నాను.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.

తేది : 03/04/2016: సాయంత్రం 6.00 గంటలకు జరిగిన అష్టావధానము.

జైశ్రీరామ్.
అష్టావధానము
అవధాని : అవధానిరత్న డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్
స్థలం : జోళదరాశి, బళ్లారి. సంచాలకులు : త్రిభాషావధాని డా.జోస్యుల సదానందశాస్త్రి గారు
తేది : 03/04/2016
సమయం : సాయంత్రం 6.00 గంటలకు
1.నిషిద్ధాక్షరి :
గిరిజా కళ్యాణం :
శ్రీ వాక్కైయుండుదువో
నీవే నిన్ భద్రుతోనె నేనెంతున్ భో !
కావించెద కళ్యాణము
భావింపుము నాదు శుభము భవ్యా గౌరీ!

2.దత్తపది : కల్లు,  బీరు,  సార, రమ్ము  అనే పదాలతో చంపకమాలలో శ్రీ కృష్ణునికి ఇప్పుడు సభలో ముఖ్య అతిథిగా ఉన్న శ్రీ కృష్ణదేవరాయలుకు ఉన్న భేదమును వర్ణించాలి.
తరుణికి రాధకల్లుడయి తాఁ మురిపించుచు నాడు కృష్ణుడే
వెరవక బీరులెల్లరల పీచమడంచుచు రుక్మిణిన్ గొనెన్
మరుసటిజన్మ వీరలిట మాన్యులునై మనసార మెచ్చగా
పరిణయమాడిరేకయగు పత్నిని రమ్మని కృష్ణరాయలే ||
3. సమస్య :
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్ II
దీర్ఘముగాకపోవునొకొ ? ధీరులు మెచ్చుచు దీవెనివ్వరే
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్
ఘుర్ఘురులెన్ననేల? తరిగొండను వంశజ వేంగమాంబకున్
వార్ఘనులైనవారెగద ! పాయదదెప్పుడు పండితోత్తమా !

4.వర్ణన : మేమిచ్చిన అంశాలకు మీరు చెప్పిన పద్యాలను మెచ్చుకొని మేఘుడు వర్షించినట్లు వర్ణించాలి.
పృచ్ఛకోత్తములెల్లరు వేడ్కమీర
ప్రశ్న వేయంగ నాదైన పాండితిగని
పుష్ప వర్షంబుగురిపించెపో ఘనుండు
వసుధ పండితులెల్ల శెభాషనంగ.
5.ఆశువులు :
1.గుత్తి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సాహితీ పీఠాన్ని చంద్రశేఖరరెడ్ఢి గారు వృద్ధిలోకి తెస్తున్నారని వర్ణించాలి.
గుత్తి నారాయణుడు తానుగోరుకొనుచు
సాహితీపీఠముంగూర్చె మోహనముగ
చంద్రశేఖరరెడ్డియు సాదరముగ
పెంచిపోషించె పండితుల్ భేషనంగ.

2. శ్రీ రామేశాంజనేయ స్వామిని స్తుతిస్తూ పద్యం చెప్పాలి.
శ్రీరామున్ జనకాత్మజాహృదయనీరేజాతమార్తాండు, దు
ర్వారప్రోత్థిత రావణాద్యసుర క్రూరవ్రాత సంహారు, శ్రీ
మారుత్యాది సమస్తభక్త వరదున్ మందస్మితాస్యున్ సదా
శ్రీ రామేశహనూమతాలయ నివాసింగొల్తునిష్టాప్తికై ||

6.వ్యస్తాక్షరి :
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

7. పుష్ప గణనం: 12

8.అప్రస్తుత ప్రసంగము.
జైహింద్.

Sunday, April 3, 2016

కవి శ్రీ మాచవోలు శ్రీధరరావుగారికి సత్కారము.

జైశ్రీరామ్.
కవి శ్రీమాచవోలు శ్రీధర్ గారికి జగద్గిరి గుట్టలో శ్రీ చైతన్య కళానికేతన్ సాహితీ సంస్థ శ్రీ దుర్ముఖి ఉగాది సందర్భముగా నిర్వహించిన కవి సమ్మేళనములో జరిపిన సన్మాన ఛాయా చిత్రము.
శ్రీధర రావుగారికి అభినందనలు.
కళానికేతన్ అధ్యక్షులు శ్రీ శివరాత్రి యాదగిరి గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

Friday, April 1, 2016

అష్టావధానమకు ఆహ్వానము.

జైశ్రీరామ్.
ఆహ్వానము.
సాహితీసమితి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్శేరిలింగంపల్లి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భముగా నిర్వహించు
అష్టావధానము.
అవధాని .. .. అవధానరత్న డామలుగ అంజయ్య శతావధాని.
తేది05 - 4 - 2016. మంగళవారంసాయంత్రం  5 గంటలకు.
వేదికశ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం., చందానగర్.
ప్రారంభ సమావేశం.
అధ్యక్షులు ; శ్రీమూగల ప్రతాప రెడ్డి గారుసాహితీసమితి గౌరవాధ్యక్షులు.
ప్రారంభకులు : శ్రీమతి డా.శరజ్జ్యోత్స్నారాణి గారుఆచార్యులు ; కేంద్రీయ విశ్వవిద్యాలయముహైదరాబాదు.
ముఖ్య అతిథి ; శ్రీ తమ్మినేని అన్నిరాజు గారు.
గౌరవ అతిథులు ; శ్రీ ఎన్.అశోక్ కుమార్.
శ్రీ గొట్టుముక్కల బ్రహ్మానందం గారు,
డాశ్రీ చంద్రభూషణ్ గారు.
శ్రీ అత్తెల్లి వీరకాంతం గారుసాహితీ సమితి అధ్యక్షులు. రంగారెడ్డి జిల్లా
శ్రీ రాపోలు విశ్వాసరెడ్డి గారుసాహితీసమితి అధ్యక్షులు.శేరిలింగంపల్లి(మం)
ప్రార్థన. : శ్రీ కడియాల ప్రభాకర్ గారుప్రముఖ ఆధ్యాత్మికవేత్త.
సంయోజకులు ; శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్.అవధానరత్న డా.మలుగ అంజయ్య 
శతావధానిగారి
అష్టావధానము
      సంచాలకులు ;         శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు.
                              ఆశువు :                 ప్రొశర్మ గారు
                         దత్తపది ;                 శ్రీ శ్రీధర్ గారు.
                         సమస్య ;                 శ్రీ చిక్కా రామదాసు గారు.
                              వర్ణన :                    శ్రీ శివరాత్రి యాదగిరి గారు.
                         నిషిద్ధాక్షరి :              శ్రీ వాడ్రేవు సత్యప్రసాద్గారు .
                         ఛందోభాషణ :            శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు.
                         అప్రస్తుత ప్రసంగము ;  శ్రీ కామేశ్వరరావు గారు.
                         వార గణనము ;         శ్రీ మంగిపూడి వేంకటరమణమూర్త
                                                              
సహృదయ సాహితీ ప్రియులందరూముందుగావిచ్చేసి అవధాన కార్యక్రమమునపాల్గొని
భావితరాలకు అందించాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. 
కన్వీనర్, తాడిబోయిన రామస్వామియాదవ్9440053859        
                     కార్యదర్శిఎం.రామమోహన్ రావు 9866605378                         జైహింద్.

Sunday, January 31, 2016

ఓటు దండకము . . . గోలకొండ పత్రిక 24-5-1934

జైశ్రీరామ్.
ఓటు దండకము ---గోల్కొండ పత్రిక సంపాదకులు.
క. నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ; నిజముగ సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా గతివి పతివి నిజముగ ఓటర్!
శా. లావొక్కింతయులేదు;ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్దప్పెను మూర్చవచ్చె; తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
ఓటే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే వోటర కావవే వరద సం రక్షించు భద్రాత్మకా-
దండకము
మహా భాగ్యనగరాన మా పూర్వపుణ్యాన మే మెన్నియో యేండ్లు చూడంగ చూడంగ మా బాల్యమున్ యౌవనత్వంబు
మా ప్రాయముల్ మనో దార్ఢ్యముల్ క్రుంగుచున్ పొయి వృధ్ధాప్యమున్ పొంది వెండ్రుకల్ తెల్లనై ముప్పయారేండ్లు అటు గడ్చి ఇటు గడ్చి
ఈనాటికిన్వచ్చె యీ కొత్త ఖానూను మా గోర్కెలీడేర మా జన్మముల్ ధన్యతన్ బొందె నో బల్దియా శాసనంబో ఇదే నీకు వేవేల దణ్ణాలు
కైకొమ్ము తల్లీ వినో వొటరా--
మూడేండ్ల(ఐదేండ్ల) కోసారి నీ పాదపద్మంబులం గొల్చి నిన్ను నే దలచెదన్ నే పిలిచెదన్ నీ కటాక్షంబునన్ జూడవే దాతవై బ్రోవవే దగ్గిరన్
నిల్వవే స్వామి నిన్నెంచ నే నెంతవాడన్ దయా దృష్టి వీక్షింపవే నా ఓటు నాకిచ్చి నన్నెట్టులైనన్ సఫాయీకమేటీకి మెంబర్నుగా
జేసినన్ జాలు నా వంశమున్ దేశమున్ ధన్యతం బొందు ఆ మీద నా పూర్వపుణ్యంబు నా చాకచక్యంబు నా భావి భాగ్యంబు నా తంత్ర
నాదంబు సవ్యంబుగా నున్నచో ఆ నిచ్చెనంబట్టి ఎంతైన పైబైకి ఎగబ్రాకగావచ్చు ఎన్ని హాట్ హోములైనన్ భుజింపంగ ఆటంకముల్లేవు
రాజ మాన్యుండగావచ్చు పేదసాదల్ భయంబంద అటు తిర్గి ఇటు తిర్గి ఎంతెంత పేరైన నే పొందగావచ్చు కొద్ది యుద్యోగులన్ శక్తి
యున్నంత ఏడ్పించగావచ్చు వీలుగా నున్నచో కొద్ది మేల్జేసి షాభాషు షాభాషు అనిపించుకోవచ్చు ఏవైన లాభాలు సాధించుకోవచ్చు
కాబట్టి యెట్లైన నీ ఓటుతో గూడ బంధుమిత్రాది వర్గంబు ఓట్లన్ని నాకు నిప్పింపుమా నన్ను రక్షింపుమా లేమి పోగొట్టుమా దీనునిన్
బ్రోవగా దిక్కు నీవే గదా నీవేకులంబందు జన్మంబుగానీ నీ స్పర్స నీ చూపు నీ తీరు మొదలైన నీదే సమస్తంబు అస్పృస్యమౌ గాని
సాక్షాత్ పరబ్రహ్మ రూపంబుగా నుండు నీ ఓటు మాత్రంబె నిత్య సంపూతమై నెగడు లోకంబులన్ సంసారమున్ బాసి సౌఖ్యంబులన్ రోసి
నిద్రహారంబులన్ నీతి నియమంబులన్ నిత్యకృత్యంబులన్ మాని సర్వంబు వర్జించి యోగీశ్వరుంబోలి నీ దీక్షతో నుండి నీ ఓటు
వాంచించెదన్ నిన్ను యాచించెదన్ ఓటే సమస్తంబు ఓటే ప్రశస్తంబు ఓటే మహా ముక్తి ఓటే పర బ్రహ్మ తధ్ధారివైనట్టి ఓటర్ మహాదేవ
నమస్తే ! నమస్తే! నమః.
[గోలకొండ పత్రిక 24-5-1934]
జైహింద్.