Tuesday, April 5, 2016

చందానగర్లో జరిగిన డా.మలుగ అంజయ్య అష్టావధానము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! చందానగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో తే.౦౫-౪-౨౦౧౬ న
సాయంత్రం ౬ గంటలనుండి:౩౦ నిమిషముల వరకు
                       అవధానరత్న డా.మలుగ అంజయ్య శతావధానిగారి
                                అష్టావధానము
జనరంజకముగా జరిగింది.
 
సంచాలకులు: శ్రీ చింతా రామ కృష్ణా రావు.
౧. ఆశువు: శ్రీ ప్రభాకరరావు.
విషయము:
దైవభక్తుఁడు ప్రసాదం తిని అరటి తొక్కను మార్గమధ్యమున పడవేయగా రక్షకభటుడు శిక్షించుట.
పూరణ:
ఏడు కొండల వెంకన్న యిక్కడున్న -  రక్ష. రక్షక భటులకు, రాజ్యములకు,
మోడువారిన భారతిన్ మోడి వచ్చి, - స్వచ్ఛమని చెప్ప వినవేమి సాధుశీలి.
౨. దత్తపది: శ్రీ మాచవోలు శ్రీధర్రావు.
విషయము:
నయనతార - తమన్నా - సమంతా - కాజల్. పదములుపయోగించి ఉగాది వర్ణన.
పూరణ:
నయన తారల మెప్పించు వయన మిదియె. - ధర తమన్నది తప్పుగా తలచి చూడ 
వింతకాఁ జల్లులిలపైన శాంతిఁ గూర్చు - దోసమంతయు తీర్చుమా దుర్ముఖమ్మ.
౩. సమస్య: శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి.
కొట్టెడు పతిఁ గోరుచుండు కోమలి యెపుడున్.
పూరణ:
తిట్టక యడిగినవన్నిటి - నట్టే తామందఁ జేసి హాయిని కూర్చే
గట్టిగ తనతోఁ దగ యూ - కొట్టెడు పతిఁ గోరుచుండు కోమలి యెపుడున్.
౪. వర్ణన:   శ్రీ శివరాత్రి యాదగిరి.
విషయము: నిర్వీర్యమౌతున్న పల్లెలు దుస్థితి.
పూరణ:
యువకులు భవితకై యూరూరు వెడలుచు - నగరముల్ చెరుచు నవ్యమనిరి.
నదులెల్ల యది కాంచి ముదమును వీడంగ - పచ్చని పైరులు బాధ పడెను.
యిల్లిల్లు సెల్లులు వెల్లువై ప్రభవిల్ల - పక్షి జాతులవెల్ల పయన మయెను.
గో జాతి తమ గోడు నేజాతికిం జెప్ప - ఫలమేమి యని చెప్పి పయనమయెను.
యెవరు నాకున్నారు? యేమయ్యె నాపల్లె - లని వృక్షములు కూడ యవని వీడె.
చల్ల చల్లని పల్లెలు సవురు తప్పి - గోడు గోడంచు యీనాడు గోల సేయ
జాన పదులెల్ల కవితలు సాగి పాడ - తల్లి పల్లెను కాపాడ అరలి రండి.
౫. నిషిద్ధాక్షరి: శ్రీ వాడ్రేవు వేంకట సత్యప్రసాద్.ఆంజనేయుని సముద్ర లఘనము.
పూరణ:
వాయువునందే నిత్యం - పాయకనింగిన్ సరసర ప్రాకియు దూకెన్.
వాయువునందను వార్ధిని - వ్రాయగ రామాయణంబు రంజులునందున్. 
౬. ఛందోభాషణ: శ్రీ ఘట్టి కృష్ణమూర్తి.
శ్రీ ఘట్టివారు చేసిన ఛందోభాషణమునకు దీటుగా అవధాని ప్రత్యుత్తరం ఇచ్చి అందరి హృదయాలలోను అత్యున్నతంగా నిలుచుట ముదావహం.
౭. అప్రస్తుత ప్రసంగము: శ్రీ కే.యల్. కామేశ్వరరావు.
శ్రీ కే.యల్.కామేశ్వర రావు గారి చెణుకులకు బెణకక అప్రస్తుతాన్ని కూడా ప్రస్తుతానికి అన్వయిస్తూ అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు మన అవధాని.
౮. వార గణనము: శ్రీ మంగిపూడి వేంకటరమణమూర్త భాగవతార్.
అడిగిన తేదీలు అవధాని చెప్పిన వారములు.
31-12-2016 - శనివారము.
16-01-2016 - శనివారము.
24-  5-2016 - మంగళవారము.
26-10-2016 - బుధవారము.
ఒక్కతేదీకి కూడా వారం చెప్పడంలో తప్పన్నది దొర్లకపోవడం అవధాని యొక్క అవధాన పాటవానికి నిదర్శనం.
ఈ సందర్భంగా అవధానంలో పాల్గొనిన పృచ్ఛకులు తమ స్థాయిని ఏమాత్రం దిగజారనీయకుండా ఆత్మవిశ్వాసంతోప్రశ్నించి, సమాధానం కూడా సభారంజకంగా రాబట్టడంలో కృతకృత్యులయినందుకు వారినందరినీ మనసారా అభినందిస్తున్నాను. కృతకృత్యులైన అవధానిని కూడా మనసారా అభినందిస్తూ ఇంకా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అవధానాలలో ప్రజా హృదయాలను దోచుకొంటూ, తెలుగు తల్లి కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేయగలగాలని మనసారా కోరుకొంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరిగే విధంగా ఏర్పాటులొనరించిన చందానగర్ శ్రీ వేంకటేశ్వరదేవస్థాన కమిటీకి, శ్రీమాన్ టీ. రామస్వామి యాదవ్ గారికి కృతజ్ఞతలు మనసారా తెలియఁ జేసుకొంటున్నాను.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.

No comments: