జై శ్రీరామ్.
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.
దర్శనం నాటక వ్యాసాల రచయిత
ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు
అభినందన
పంచరత్నములు.
రచన ... చింతా రామకృష్ణారావు. తే. 21 - 6 - 2026.
శా. శ్రీమన్మంగళ మూలవంశజుఁడు రాశీభూత చైతన్యమౌ
ధీమంతుండగు మల్లికార్జునుఁడు ఖ్యాతిన్ దర్శనంబన్ మహో
ద్ధామంబై వెలుగొందు వ్యాస చయమున్ తా వ్రాసెనుప్పొంగుచున్,
శ్రీమంతంబగు వీరి వ్యాసచయమున్ బ్రీతిన్ బఠింపన్ దగున్.
చ. పరహిత దర్శనంబిది, ప్రభాకలితుండగు మల్లికార్జు నా
క్షర సముదాయమిద్ది, మది గాంచఁగనౌ పదునాలుగంశముల్,
మురియుచు నాటకాంశములు ముచ్చటగా రచియించినారు, శ్రీ
కరులగు మల్లికార్జునులు, గౌరవమొప్పఁ బఠించి, పొంగితిన్.
సీ. తెలుఁగులో నాటకంబుల రచనంబున పరిణామ విధమును వ్రాసినారు,
తొలి తెల్గు నాటక కళనొప్పు క్రీడాభిరామమున్ దెలిపిరి ప్రేమతోడ,
సురభి నాటకశోభఁ జూపిరి, శ్రీ కందు కూరి నాటక శోభఁ జూపినారు,
నలశుభద్ర విజయ కళనెన్ని చెప్పిరి, తిలకు నాటకములు తెలిపినారు,
గీ. అల యినాక్ నాటకములందు దళిత శోభ,
మహిత రాసాని నాటక మధురిమమును,
సీమ నాటక పద్ధతిన్ బ్రేమ వ్రాసి,
నాటకార్ణవ మధనుఁడైనారు వీరు.
ఉ. ఇంకను వ్రాసి పెక్కిటి ననేక విధంబులు దర్శనంబునన్
పొంకను గొల్పినారు తన పుస్తకమున్ బఠియించువారికిన్,
శంకరు సత్ కృపన్ గనిన సన్నుత సద్కవి మల్లికార్జనుం
డింకను పెక్కు గ్రంథములనేక శుభోద్గతి వ్రాయుగావుతన్.
ఉ. మంగళమౌత మూల మహిమప్రద మల్లిక వంశమంతకున్,
మంగళమౌత నాటక సమంచిత లోకజనాళికిద్ధరన్,
మంగళమౌత పూజ్యులకు, మంగళముల్ కవి పండితాళికిన్,
మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశమాతకున్.
మంగళమ్...... మహత్..... శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైహింద్.
No comments:
Post a Comment