జైశ్రీరామ్.
గాజుల మల్లయ్య(దుర్గాదాసు)
కథా మూలం:
ఇది ‘సుమన్’ టివి లో శ్రీమతి రమా రావి గారు చెప్పిన కథ(దుర్గాదాసు) ఆధారంగా......(వారితో ఫోన్ లో మాట్లాడడానికి అవకాశం రాలేదు)
***00000***
శ్లో||శివం హరిం విధాతారం తత్పత్నీ స్తత్సుతాన్ గురూన్
నత్వా సమస్త ప్రత్యూహ శాంతయే మంగళాయచ||
**00000**
శుభోదయం.
మీకోమాట:
మనకు మన దైనందిన వ్యవహారాలలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. కొందరు ‘బాగున్నారా’ అని తిరుగు జవాబు చెప్పేలోగానే వెళ్లి పోతుంటారు.
కొందరు బాగున్నారా అన్నభావన తోనే తలపైకి కిందికీ అలా ఇలా ఊపి వెళ్లి పోతుంటారు. కొందరు మందహాసం వెలువరిస్తారు. మరికొందరు గాఢాలింగనం
చేసుకుంటారు. అలా సుమన్ టివిలో శ్రీమతి రమా రావి గారు చెబుతూ ఉంటే విన్న నన్ను గాఢాలింగనం చేసుకొన్న ఒకానొక కథే యిది.
ఇంకోమాట. మనం ఎన్ని గుళ్లకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నా ఎన్ని తీర్థాలను సేవించినా మళ్లీ మళ్లీ చూడాలని మళ్లీమళ్లీ వెళ్లాలనీ అనిపిస్తూ ఉంటుంది.
నాకీ కథను మళ్లీ వినాలనిపించలేదు. పద్యకావ్యంగా మలచాలనిపించింది. (రమా రావి గారి అనుమతి తీసుకోవాలని ఎన్నో మార్లు ప్రయత్నం చేశాను.
కుదరలేదు) ధైర్యంచేసి ‘ఓం’ అని ప్రారంభించాను ‘స్వస్తి’ అన్నంతవరకు దుర్గమ్మ నన్ను వదలలేదు. ఇందులో గాజుల బేహారినీ నేనే. దుర్గమ్మ చెప్పిన
ఇంటి యజమానినీ నేనే. దుర్గమ్మకు సాక్షాత్తూ తాత తండ్రుల పాత్రలివి. ఇంకొకరికిస్తానా. ఇందులో నాస్వార్థం నాది.
ఈ కావ్యం వ్రాయడంలో నా పాత్ర ఏమీ లేదు. అంతా ఆ దుర్గమ్మదే. ఆ తల్లికి నా చేతులతో నాలుగు గాజులేయడానికీ నిన్నటిదో మొన్నటిదో అట్టులాంటి
భక్ష్యం ఇచ్చి తింటూ ఉంటే చూసి ఆనందించడం వరకే నా ప్రమేయం.
ఆ తల్లికి తాతనూ తండ్రినీ కూడా కావడం ఆ తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని తల నిమరడం ఆ తల్లి చేత తాతా తాతా అని పలుమార్లు పిలిపించుకోవడం చిన్న అనుగ్రహాలా????? పెద్దల ఆశీర్వాదాలు కాని......
విధేయుడు.
కడయింటి కృష్ణమూర్తి..గోవా(నెల్లూరు)
11-5-2025
"నాయనా! దుర్గా దాసూ"
నాంది: ప్రార్థన:
ఉ. శ్రీయుతమైన కావ్యమిది శ్రీకరమైనది దుర్గ తానుగా
శ్రీయుత మైన బాలికగ చిందగ నవ్వులు చింత దూరమై
శ్రీయుత మూర్తు లిర్వురిట శ్రీకర ప్రజ్ఞల సంతరించుచో
శ్రీయుత పద్య పాదములు చింతన లోనికి వచ్చి జేరగన్
శ్రీ యని చుక్క బెట్టితిని చిత్తము రంజిల పండితాళికిన్.-------1
ఉ. శ్రీ యన గౌరియే యనగ శ్రీ యన దుర్గమ కాకపోవునే
శ్రీ యని ప్రార్థనల్ సలుప చిత్రము శ్రీ రఘు రాము దీవెనల్
శ్రీయుతుడాంజనేయుడును శ్రీరమ సీతయు తోడ నిల్వగన్
శ్రీయుతులమ్మనాన్నలును శ్రీకర వాక్కులఁ దాము బల్కగన్
శ్రీ యని చుక్క బెట్టితిని చిత్తము రంజిల పండితాళికిన్.---------2
ఉ. శ్రీ యన శారదాంబ యన శిక్షకు రక్షయె యెంచి చూచినన్
శ్రీ యన గౌరియే మనకు, శిక్షితు లైతిమి తిక్కనార్యుచేన్
శ్రీ యన రామ యే యగును శ్రీలకు ప్రోవయి నిత్యకాంతులన్
శ్రీయుతు లిందరుండగను క్షేమమె యంచును నాదు కావ్యమున్
శ్రీ యని చుక్క బెట్టితిని చిత్తము రంజిల పండితాళికిన్.---------3
ఉ. రేపులు మాపులు న్ననక రేపట తానము రిక్కసాక్షిగన్,
‘మా’ పయి పల్కులున్ నిజము మాకవి ప్రాపవు నెల్లవేళలన్
రేపులు మాపులు న్ననక రేగటి నేలల పంట రీతిగా
క్రేపుల గోవులున్నటుల కేవల వత్సల భావమిచ్చునే.----------4
ఉ. ఊరక వ్రాయుమో యనక యూనిక బాసట యౌచు నిల్చె దా
నూరకె యక్షరమ్ములకు నూపిరు లూదెను ప్రాణమిచ్చుచున్
తారలు తారకేశ్వరుడు దానయి నాకస ముండునంతకున్
తీరుగ నుండు కావ్యమని దీవన లిచ్చెగ నాఖువాహుడే.-----------5
ప్రేరణ; ప్రతిపాదన:
ఉ. ఎక్కడొ వింటినీ కథ నదెంతయు మానస మందు నాటెనే
నిక్కమె బల్కుచుంటి నిదె నీరజ మిత్రుడు సాక్ష్యమిత్తరిన్
చక్కగ సాగ నీ కథకు చాలిన యంతగ పోషకంబులన్
మిక్కిలి ప్రేమ జూపెడిని మీ దయ లుండిన వేసి సాకెదన్.-----6
చం. కథ యొక మాత్రమౌనె యిది? కాదిది; దుర్గమ, దుర్గదాసునిన్
పథమున చక్కగా నడిపి, బాలకు గాజులు వేయ నంపుచో
కథ నొక దానినిన్ నుడివి కర్జము దీరెడు మార్గమెంచుచున్
పథకము నాకు దెల్పి, యిక పద్యమొ గద్యమొ వ్రాసి యిమ్మనెన్. ----7
ఉ. ముందిది వ్రాయగా నగును, ముందటి రోజుల విజ్ఞులెవ్వరేన్
పొందిక మీరగా జదివి పొందెడి ప్రేరణ నా విముక్తికిన్;
మందిని జేర్చగా గలరు, మందస బాధలు దప్పునాకు నీ
చందము నేర్పుతో నడిపి చక్కగ తోషము నంద జేయుమా.-----8
మ.కో. అమ్మ నమ్మక మేమొ యెంచక యప్పుడున్ దల యూపితిన్
నమ్మకమ్మది యమ్మదైనను నాకు వ్రాయక దప్పునా
కమ్మలున్ మరి గంటమున్ దగ కాడి క్రిందకు జేర్చితిన్
కొమ్మలూపిన, కల్పవృక్షము కోరి రాల్చదె పువ్వులన్.-----9
ఉ. చెప్పుట కామె జెప్పినది, చేయుట నాకది నాక పుష్పమే
చెప్పితి నప్పుడప్పుడె విశేషము గాగను విన్న వైనమున్
చెప్పిన విన్నదే తడవు చేసిరి మిత్రులు గంటమూనగా
తప్పక బూనుకొంటినిక తప్పుల నొప్పుల మీరలోర్చుచో. -----10
ఉ. చెప్పుట కామె జెప్పినది, చేయుట నాకది నాక పుష్పమే
చెప్పితి బంధుమిత్రులకు చెప్పిన, వారలు నోటిమాటగన్
చెప్పగ పూనుమింకనన, పూజ్యులు చెప్పిన తప్పదంచు నే
తప్పక బూనుకొంటినిక తప్పుల నొప్పుల మీరలోర్చుచో. ------11
ఉ. తప్పక వ్రాయగా నయిన తల్లికి దండ్రికి చెప్పి వ్రాసినన్
తప్పుల నొప్పులన్ దగిన తావుల వారలు తీర్చి దిద్దరే;
అప్పుల తానమాడితిని అమ్మకు నాన్నకు జెప్పి మ్రొక్కితిన్
జెప్పిన వైనమంతయును జెప్పిరి వారలు మ్రొక్క భారతిన్.------12
సరస్వతి:
ఉ. అంబ! నవాంబుజోజ్జ్వల కరాంబుజ! దుర్గకు మాటయిచ్చితిన్
డంబము జూపగా నగునె, దగ్గర దూరము లెంచబోకుమా
యంబర చుంబి కావ్యమది యంగుళమాత్రుడ, వాగధీశ్వరీ
పంబిన వేడ్కతో నిలిచి ప్రార్థన జేసెద మాట నిల్పుమా.---------13
సరస్వతి అభయం/ఆశీర్వచనం:
చం. కరమున వీణ బూనుచును గానము చేయు విధమ్ము గాంచుచో
"తిరముగ నీకు నిచ్చెద నతీతములైన విశేష ప్రజ్ఞలన్
కరమున గంటమూను మిక కావ్యపు రీతులు శయ్యలొప్పుటన్
వరమిదె యిచ్చితం"చనెడు వాక్కులె వీనుల విందొనర్పగన్-------14
గణపతి:
ఉ. వీనుల విందులయ్యెనవి, విందగ బిల్చితి విఘ్ననాయకున్
కానుక లిచ్చితిన్ వెలగ కాయల, తియ్యని మోదకమ్ములన్
మానక విన్నవించగను మాయమ దుర్గమ వైనమంతయున్
ఏనిక మోము నూచెనపు డేర్పడ జేసితి నాదు సన్నుతిన్----------15
(వింద=అతిథి)
ఉ. పంచమ వేదమొక్క బిగి భాసుర తేజుని వాకులం బడిన్
కొంచె మనంగబోక మరి గంటము నాపక వ్రాయ నశ్రమన్
మించిన వేడ్కతో నమరె మీదగు సామ్యము బాదరాయణి
న్నించుక భావనన్నిలిపి యీకథ సాంతము పండజేయుమా------16
ఉ. తల్లికి ప్రేమ పాత్రుడవు తండ్రికి నన్నిట తోడు నీడయై
చల్లగ లోకమంతయును సాకగ చక్కగ సాయముందువే
చల్లని నీదు చూపులను చాలిన యంతగ నాదు పైననున్
మెల్లగ సాగునీ కథను మెప్పుల బొందగ చేయి వేయవో.-----17
ఉ. అమ్మయె దుర్గమాంబ యిక నన్నిట నన్నిట నాదుకొంటకున్
సుమ్మిది నిక్కమే గనిన సూచిత ప్రాయము లమ్మలెందరే
నిమ్ముగ గాచుచుందురుగ యీ భువి నర్థుల కేది లోటికన్
‘అమ్మ’ ను నమ్మకమ్మొకటె యన్నిట నన్నిట నాదుకొంటకున్. ------18
వ. మందస మందు చిక్కుబడి పోయిన దుర్గమ్మ ఆవేదన. -----19
ఉ. మందసమందు జేర్చి నను మానిత పూజల దన్పు వేడుకన్
సుందర రూపుడొక్కరుడు సూచిత వస్తువు లన్నికూడుచోన్
వందన లెన్నొచేయుచును వాకున బల్కుచు స్తోత్రపాఠముల్
విందగ జేసెనన్నిటను విడ్వగ జేయుట మర్చెనెట్టులో-----20
ఉ. మందస మందున న్నొదుగ మాపులు ఱేపు లవెన్ని పోయెనో
యెందరు పుట్టినారలొ మరెవ్వరు మందస మెత్తి జూడరే
విందగ వచ్చితిన్నిటకు విడ్చుట కెవ్వరు నుద్వసింపరే
మందస మెత్త జేయుటకు మాయను బన్నక దప్పదియ్యెడన్....21
వ. ఇట్లు మందసమందు చిక్కుబడిపోయిన దుర్గమ్మ వెల్వడు నుపాయమును వెదకుచు
మానవ సహజ చాంచల్యములను దలచుచు ఆ చాంచల్యములను బలహీనతలను
సాకుగా జూపి బయట పడదలంచి తన మనమున మెదలిన భక్తుడు దుర్గదాసుడను
గాజుల బేహరి తనయక్కర దీర్చు వాడని భావించి ........................22
మ.కో. ఆడపిల్లకు గాజు లందము నయ్యవే యిపుడక్కరన్
చూడ నందరు చూపెదన్నిట శుద్ధ భక్తుని ప్రేమమున్
వీడులే చెఱ మందసమ్మును వీడి హాయిని బొందెదన్
వాడ వాడల పెద్ద పిన్నలు వచ్చుచోఁ మఱి మెచ్చుచో............23
దుర్గాదాసుని ఊరు:
చం. అదియొక పల్లెటూరు విభవాకృతి నా దివి ప్రోలు బోలుచో
నది యొక పిల్ల కాలువయె నచ్చపు గంగమ జూడ స్వచ్ఛమై
యది యొక దుర్గ మందిరము; ఆదిమమూర్తుల తేజ మందుచో
నదియొక మట్టి కట్టడము; అందొక దాసుడు దుర్గదాసనన్-------24
ఉ. దుర్గను మానసం బనెడు దుర్గము నందున గట్టి వేసె నీ
దుర్గమ దాసొకండు, తన దూఁకలి నెంచడు దుర్గ పూజ, కే
వర్గము వారినైన తన బంధుల మిత్రుల వోలె నెంచుచున్
భర్గుని మెప్పులన్ బడసె భక్తిగ దుర్గకు నాప్తుడౌటలున్. ---------25
దూఁకలి=దుఃఖము
చం. అతడొక వృత్తి ప్రేమికుడు నంతకు మించిన దుర్గ భక్తుడున్
సతతము దుర్గనామమునె చక్కగ జాపము మానడే తరిన్
వితరణ లెన్ని జేసినను వీడ్యము తల్లికి నిచ్చినట్టులే
నతనికి దైవ రూపులరె నక్కలు చెల్లెళులందరందరున్..------26
ఉ. గాజుల బేహరీతడు నిగర్వియు నీమము దప్పడెన్నడున్
వాజుల వేగమౌ మనము వాగెల బట్టుచు భక్తి మార్గమేఁ
దాఁ జను, దుర్గనామమున తన్మయ మొందును రోజురోజునన్
గాజుల బేరమేఁ దనకు గ్రక్కున గూర్చును మేలు మేలనన్ --------27
ఉ. గాజులు వేయు వేళలను గాజుల నమ్మకు వేసినట్టులే
పూజలు జేసినట్టుగను పుణ్యము బొందిన సంతసంబునన్
గాజులు వేసినంతననె కాంతల, బిడ్డల, కాళ్లు మ్రొక్కునే
గాజుల కింత సొమ్మనడు కళ్లకు నద్దుక కొంచునెద్దియేన్.----28
మ.కో. ఆడపిల్లలు గాన వచ్చిన నమ్మ యంచును పిల్చి దాఁ
నీడు పిల్లలనందరందర నిండు ప్రేమగ జూచుచున్
వేడు దుర్గను వారిఁ గావగ వేన వేలుగ మ్రొక్కుచున్
ఆడపిల్లలు గౌరవమ్మున నమ్మలే యను భావనన్---29
ఉ. అమ్మను పూజలందనుప ‘నర్చన మాటలు’ నేర్వకుంటినే
అమ్మను మర్వకుండుటలె యర్చన లౌనని పెద్దలందురే
అమ్మను మర్వనెట్టులగు నమ్మల హస్త విభూషణంబు లే
నమ్ముచు వారి దీవెనల నందుటె నిత్యము నాదుకార్యమై........30
(అర్చన మాటలు=మంత్రములు, స్తోత్రములు వగైరా)
ఉ. అన్నము బెట్టు వేళలవి; అమ్మగ రూపును దాల్తురింతులున్
అన్నము లమ్మచేతివియె ఆ సురభోజన తుల్యమౌటలున్
అన్నమె యన్ని ప్రాణులకు అమ్మను గూర్చునటన్న దోసమే?
యన్నము దింటలున్ దినము నమ్మను దల్వక మేల? చూడగన్.......31
ఉ. నాన్నల నుండి వచ్చినది నాకిది నచ్చిన వ్యాపకమ్మె యౌ
నెన్నిట జూచినన్నిదియె యెక్కుడు జూడగ నమ్మసేవయౌ
పన్నుగ హస్తభూషలను భక్తిగ నమ్మకు వేసినట్టులే
చెన్నుగ నమ్మరూపులకు చేసెద సేవలు నాన్నమెచ్చగన్------32
ఉ. అమ్మకు మ్రొక్కి ముందుగను యాయమ దుర్గకు వందనం బిడున్
సుమ్మిది దుర్గదాసునకు సూత్రము నిత్యము యిల్లు దాటుచో
నిమ్ముగ గాజులేయమను నింతుల కెంతయు భక్తి భావనన్
కొమ్మని తల్లినిం దలచి కోరిన గాజుల నేయు నేర్పునన్. ***33
ఉ. ఇచ్చినదేదొ పుచ్చుకొని, యింతని యంతని బేరమాడడే;
‘నచ్చెన? గాజు’లం చడిగి ‘నచ్చెను బాబయ’ యన్న మాటకే
మెచ్చును, కుందడెప్పుడును, మేలునె కోరును, దుర్గమాంబకున్
హెచ్చిన సంతసంబునను హెగ్గడి కారుడె దేవళంబునన్ ***34
(హెగ్గడికాడు=అంతఃపురపు కావలి వాడు)
వ. ఆ భాగవతోత్తముండైన దుర్గా దాసు తన దైనందిన కార్యక్రమానుసారియై గాజుల మలారమును రెండు భుజముల మీద నటు యిటుగ వేసుకొని చక్కగ
మడతలు బెట్టిన ఎఱ్ఱంచు నల్ల దుప్పటి భుజమున వ్రేలాడుచుండ కిఱ్ఱు చెప్పుల దొడిగికొని ఆరడుగుల చేతి కఱ్ఱను నేలకు తాటించుకొనుచు ఊరూరను
తిరుగుచుండి యొకనాటి మధ్యాహ్న సమయంబున ఒక కొలను గట్టున చెట్టు నీడను మలారము దింపుకొని చెఱువున దిగి చల్లని నీట సేదదీరి తాను తెచ్చుకొన్న
ఫలాహారముల నారగించి ఆ చెట్టు నీడను కాస్త నడుము వాల్చబోవుచుండ.....35
ఉ. చల్లని నీటిగాలి యటు చక్కగ సోకిన మేను వాల్చుచున్
మెల్లని కాలి సవ్వడుల మేల్కని చూపటు సంతరించుచో
నుల్లము మీరగా గనుల కుత్సవముం బలె బిందెతోడుతన్
పల్లము వైపుగా నడచు బాలిక గన్పడ హెచ్చరించుచున్.---36
ఉ. కాలికి యంటునో బురద కాస్తటులాగుమ దుర్గమాంబరో
వాలున జాఱునో బురద, వాలగు రేవది నేను జూపెదన్
బాలిక! యుండుమో యటులె బాగగు త్రోవకు నేను జేర్చెదన్
మేలగు చేతి కఱ్ఱ యిది మేకొని పట్టుము గట్టు జేరుమా.--37
మ.కో. గట్టు జేరిన దుర్గమాంబయె గాజులన్ దగ జూచెలే
చిట్టి తల్లిని జేరబిల్చుచు చిన్ని గాజుల చేతులన్
గట్టిగాజుల నోటిగాజుల ‘కం’గనిన్ మరి మీటుచున్
చిట్టితల్లికి రెండు చేతుల చేర్చి దీర్చెను భక్తితో. ------38
ఉ. కన్నుల నీరు నిండినవి గాంచగ కాంచగ నమ్మనంతటన్
జెన్నుగ చేతులెత్తుచును చేయగ నంజలి నాత డంతలో
పన్నుగ నామె చప్పునను బట్టెను చేతుల దుర్గ దాసునిన్
బిన్నను నేను జూడగను పిచ్చివి తాతయ వద్దు దండముల్..----39
చం. అనుచును చేతులడ్డముగ నట్టిటు ద్రిప్పుచు కంకణ ధ్వనిన్
వినగను జేసె నాతనికి విన్ననె తాతయ గుండె చెర్వయెన్
మను మని మన్మరాలికిని మన్నన లెన్నియొ చేసి యిట్లనెన్
వినగను జేయుమా యికను విందును నీదగు నామధేయమున్. ---40
ఉ. చెప్పెను దుర్గమాంబయని చెప్పగ చప్పున కేలుమోడ్చుచున్
చెప్పుమరొక్కమారనుచు చెప్పిన చెప్పిన చెప్పుమో యనున్
విప్పడు కన్నుఱెప్పలను వించును వించును దుర్గ నామమున్
ఎప్పటి తల్లివీవనుచు నేడుల నేడుల వేడుచుంటినే..
యిప్పటి కయ్యె దర్శనము లీయెడ నీయెడ చాలునింతియే.......41
వ. అతని పారవశ్యమును గని ఆ చిట్టి తల్లి యాతని చేతుల బట్టి యూపుచు
తాతా.. తాతా..యనుచు--------------------------------42
ఉ. నాకును దీవనల్దగును నాన్నకు నాన్నవు నాకు జూడగన్
జేకొని ముద్దు ముచ్చటలు చేతను బెట్టెడి గోరుముద్దలే
నాకవి దీర్చగా దగును నాకులు మెచ్చగ పిచ్చి తాతయా
సాకుడు బిడ్డగా దలచి సాంతము దీర్చుము నాదు వాదునున్.----43
చం. అనగను నిన్న మొన్నటిది అట్టును బోలిన భక్ష్య మొక్కటన్
దినగను నివ్వ జూపినను దివ్యము తాతయ యిమ్ము యిమ్మనెన్
దినుటకు గట్టిగట్టిగను తిన్నను తియ్యగ నుప్పగన్ బలే
వినుటకు పంటి సవ్వడులు వీనుల విందుల జేయ తాతయున్.----44
ఉ. త్రాగను మంచి తీర్థమును తాగొని యమ్మకు చేతికిచ్చుచో
త్రాగగ దుర్గమాంబయును, తన్మయ మొందెను తాత తృప్తితో
బాగుగ నున్నవో యనుచు బాలిక తాతయ కీయమెచ్చులన్
వాగెల బట్టనీయకను వాజుల వేగము నందె చిత్తమున్---------45
వ. అంత నా బాలిక తాతయ్యను గని---------46
మ.కో. సొమ్ములేవియు లేవు నాకడ చొప్పు జెప్పెద దండ్రిదిన్
పొమ్మ యా దరి రచ్చబండకు పొమ్ము దాపటి వైపునన్
గుమ్మమొక్కటి రమ్యమైనది గూడు నయ్యదె మాదెలే
సొమ్ము లీయగ యయ్య నీకట చోద్య మందక నందుమా----47
వ. అనెడి ఆ తల్లిని గని తల్లీ-----------------------------------48
ఉ. సొమ్ములు లేవులే యనకు సొమ్ముల తల్లికి తల్లివౌదువో
సొమ్ములు నేను గోరితిన? సొమ్ముల తల్లివె సర్వ సంపదల్
అమ్మవు లోకమంతటికి అమ్మకు జేసిన నింత సేవకే
సొమ్ములు గోరుటేమియది చోద్యము జూడగ పోయివచ్చెదన్.-----49
ఉ. కాదుర తాతయా వినుము కాసుల వద్దని యాడరాదురా
వాదయె నాకు తండ్రికిని వాకున వల్కడె యల్క బూనెనో
నాదగు మాట కౌ ననడు నన్నును మెచ్చడు బాలనుం గదా
నాదగు ముద్దు మాటలకు నవ్వును లోపల పైకి కోపమున్.-----50
చం. మనసది వెన్నముద్ద మఱి మాటయె గట్టిది నాన్నకెప్పుడున్
కనులవి నన్ను జూడగనె కాగడ జూపిన నేయి చాడుపై
మనసున ప్రేమముండినను మానడొకింతయు బాల శిక్షలన్
మనసది తీపి వంటకము మాత్రము పంటికి సుంత గట్టిదౌ.-----51
ఉ. పిన్నల మెచ్చరాదనును పిల్వడు మెచ్చుల నన్ను నెన్నడే
నన్నుల మిన్నగాదలచి యమ్మకు జెప్పును సంతసంబునన్
జెన్నుగ నంకమందునిచి చెచ్చెర ముద్దుల నారగింతలన్
బ్రన్నన మీరగా కథల బాడుచు నోటను బెట్టు ప్రేమగన్--------52
మ.కో. ప్రేమలెంతయొ కోపమంతయె ప్రేమకోపమె జూడగన్
ప్రేమ జూపును కోపగించును ప్రేమ పాలది మిన్నయౌ
ప్రేమ లెక్కుడు లైననున్ మరి పేద బాధది దుఃఖమే
ప్రేమలుండిన చాలునామరి పేద బాధది వీడకే........53
వ. మా నాన్న ప్రేమయు నట్టిదే; తాతా నీవిపుడా యింటికి వెళ్లుము..... 54
ఉ. నాకిట గాజులేసితని నాన్నకు జెప్పుము జెప్పినంతనే
వాకుల నొప్పబోవడది వల్కు నవేవియొ పొల్లుమాటలన్
రూకల కోసమా యనును రూక్షపు జూపుల పొమ్ము పొమ్మనున్
ఏ కడ నాకు కూతురను? నెక్కడి వాడవు నీవు నీవనున్...........55
ఉ. చేసిన చిన్నతప్పునకు చేసెను రచ్చలు కొట్ట బోయెనో
చేసితి నందునే యనుము చేయర తప్పులు పిల్లలెన్నడున్?
చేసిన తప్పులొప్పులకు చేయుట దండన లొక్క మార్గమా
కాసిని మంచి మాటలును కాసిని ముద్దుల నీయ కష్టమా.------56
వ. నేనును నాన్న కూతురినే గదా. నాకును కోపము వచ్చినది. నాకు కోపము తెప్పించినందులకు
నా గాజులకు డబ్బులీయమందును. అవి నీవు అడిగి యిప్పించుకొన వలయునంతట నా కోపము తీరునను
ముద్దు ముద్దు మాటలకా దుర్గా దాసు హృదయము నిండి పోవ నాదుర్గమ్మ ఇంకను.....57
ఉ. "నాకును కూతురెక్కడను? నాకును సంతతి లేదు పొమ్మనున్"
రూకల కోసమా? యనును, రూపున పెద్ద వబద్ధమేల? నున్
రూకల వెట్టులిత్తు? నను, రూపున కూతురె లేదు లేదనున్
వాకుల కోపగించినను వాతెర కంపము నొందు లేమిచేన్.------58
చం. ఎవడవు నీవురా యనుచు నెచ్చులు వల్కును; నింద జేయకే
సవురది జెప్పు చెప్పినను చక్కగ నిచ్చటి వైనమంతయున్
వివరము గాగ తండ్రికిని; వీనుల జేర్చడు నీదువాదముల్
బవరము గాని ముచ్చటగ బన్నము దీర్చుము కొమ్ము సొమ్ములన్.......59
ఉ. సొమ్ములు లేవు లేవనును, సొమ్ముల జాడను నేను జెప్పెదన్
సుమ్మది నీవు తండ్రికిని సూక్ష్మము గాగను జెప్పు జెప్పినన్
బొమ్మయి నిల్చి జూచు నిను బొక్కస వైనము నెర్గితెట్టులో?
అమ్మయె జెప్పెనో యనుచు నాపయి నాపయి నిట్టులాడుమా.......60
వ. అనుచు ఆ దుర్గమాంబ అతనితో.....61
ఉ. పెద్దది పెట్టెయొక్కటది పెద్దల పెద్దల నాటి దింటిలో
పెద్దల కౌనులే దెరువ పిన్నల కయ్యది భారమౌనులే
పెద్ద ఖరీదు లౌనవియె పెట్టుదు రందున జాగ్రతుండగన్
ముద్దుగ జెప్పితేననుము ముందుగ మందస మెత్త వేడుమా.... 62 .
ఉ. పెట్టెను దీసి చూసినను పెట్టెకు నంతర మందు చిన్నదే
పొట్టిది కుంకుమావృతము పోపుల పెట్టెను బోలినట్టిదౌ
నెట్టన దానినెత్తినను నిక్కుడు నైనది నైన దదొక్కటే
గట్టిది రూక యున్నదట గారపు నీదగు బిడ్డజెప్పెనో........63
(నిక్కుడు=ఉన్నతి)
వ. అనుచు నా రూక కొకవైపున దుర్గమ తల్లి చిత్రముండుననియును చెప్పుము. మీ సంవాదములకు నచ్చట జేరిన యిరుగు పొరుగుల
ముందు ఆ పెట్టెనెత్తి చూసిన తర్వాతి కథ నీవు నడుపుమనిన నా దుర్గాదాసు డా తల్లి ముద్దు మాటలకచ్చెరువందుచు ముందుకు నడువ....64
ఉ. అచ్చుగ నట్టులే జరిగె నచ్చట నాతడు కోపగించుచున్
బిచ్చమదెత్తుటే యొకటి పిచ్చివి మాటల నాడు టిట్టులా
అచ్చపు పిచ్చివాడవుర యాడకు మిట్టివి నాదుముందటన్
యెచ్చట సంతునాకిటను యెచ్చులు వల్కకు పొమ్ముపొమ్మనన్------65.
వ. ఆ యజమాని అట్టులాడుచుండగ విని విస్తుబోవుచు "అయ్యా నేనిచ్చటకు వచ్చినది అంతటి బంగరు తల్లికి జన్మనిచ్చిన వాడు ఏ హిమగిరీంద్రుడో
ఏ సముద్రుడో కావలయును గానీ సామాన్యుడయి యుండడనియును, ఆ మహానుభావుని దర్శన భాగ్యము కలుగుననియు నన్న ఆశతో వచ్చితిని గానీ
అణా కానీ సొమ్ము కోసము కాదు తండ్రీ.. అయినను బిడ్డల యున్నతి కోసము తండ్రులు కోపగించుట సాజమె కానీ బిడ్డలే లేరనుట విడ్డూరము గాదా?
అయినను ఆ తల్లి మీద ఎంతటి కఠినునకైనను అలుక గల్గునా? మీరు నాకు రూకలియ్యక పోయినను నేను బాధపడను. ముందు ఆ మందసమెత్తి చూడుడు,
నే నబద్ధములాడు వాడను గాను, లోభి నసలే గాను. దుర్గ భక్తుడను. ఆ మందసము నందు దుర్గమ రూపు చిత్రితమైన ఒక కాసు యున్నదని ఆ తల్లి చెప్పినది
ఆ తల్లి అబద్ధమాడునా? మందసము నెత్తి జూచిన నిజము తెలియగలదు. నేనాడిన దబద్ధమైన మీకాళ్లకు మ్రొక్కి వెళ్లెదను. ఇది నే నాడిన నుడువుల
నిజ నిరూపణము కొఱకు గానీ, కాసుల కొఱకు గాదింత యేల ఆ తల్లి దర్శన మాత్రముననే నా జన్మ తరించినదా తల్లి చేతులకీ చేతులతో గాజులేసితి నా తల్లి కీ
చేతులతో నారగింపు జేసితి నా చిట్టి తల్లి తల నిమిరి మూర్దాఘ్రాణము గావించితి నామె చేతి గాజుల గలగలలకు పులకరించితి నా యమ్మ మోమున చిందిన
మందహాసమును గాంచి తరించిన నాకీ అణా పైసల మీద ఆశలుండు టెట్టులు తండ్రీ యనుచు --------66
చం. తనువు కడాని తల్లికిని తండ్రియొ తాతయొ తారె యౌటలున్
వినుటనె మేను బొంగినది వెంటనె మీదగు మాట విన్ననున్
కనులను నీరు నిల్చినవి కాదన బోకుడు కాసు లొల్ల నే
వినుకలి నైన దోసమది వింటకు పాపమబద్ధ మెంతయున్.----67
మ.కో. విస్తుబోయిరి యందరందరు విస్తు బోయెనె యాతడున్
పస్తులుండిన నుండవచ్చును పల్కజాలున యెక్కుడుల్
ప్రస్తుతమ్మవు పెట్టెనెత్తిన పర్వు నిల్వదె యూరిదిన్
వస్తు విచ్చటి పెట్టెలోనిది వానికెట్టులు దెల్సెనో.-----68
ఉ. చూతము చూతమో యనిన చూతము చూతము చూతమంచనన్
చేతను బట్టియెత్తిరట చేరగ నల్వురు పెద్ద పెట్టెనున్
మూతల మూతలన్ దెఱచి మూలను జూచిరి సంపుటమ్మునున్
చేతులు కంపమందగను చెచ్చెర దీయగ నయ్య బాపురే!---------69
ఉ. కన్నుల జిమ్ము వెల్గులకు కానగ లేక మరేది యచ్చటన్
కన్నుల నీరు నిండినవి కానగ లోపలి తల్లి రూపునున్
వెన్నున బుట్టెనో భయము వెంటనె దుర్గమ రూపు రూకనున్
కన్నుల కద్దు కొంచనిరి గాజుల బేహరి కిట్టులిట్టులన్--------70
ఉ. "నీకిది యివ్వమంచనెన? నిక్కమ? నిక్కమ? నిక్కమందువా
వాకున చెప్పెనా?" యనగ "వాకున జెప్పెను నన్ను నమ్ముడో
కాకను నాకునెట్టులిది గాంచగ నౌ"నన వారలంతటన్
వాకున మాటరాకయును వాతెర కంపము నొంద నందరున్.-------71
ఉ. ఏకడ నిన్ను జూసినది యేకడ బిడ్డకు భూష లిచ్చితో
ఏకడ భక్ష్యమిచ్చితివి యేకడ నామెను ముద్దు జేసితో
ఏకడ నీరు ద్రావినది యేకడ నీయొడి నాటలాడెనో
ఏకడ నీకు జెప్పినది యేవిధ మట్టుల పేటి వైఖరిన్
ఏకడ నాదు కూతురని యేర్పడ జెప్పెనొ చూపు మాకడన్
ఏకడ యెక్కడో దెలుపు మేమును జూచెద మయ్య ధన్యతన్.....72
ఉ. కూతురె లేదనంటినిగ కూతురు నాకని తండ్రి నేననెన్
తాతగ నిన్ను బిల్చుచును తానయె ముద్దుల మన్మరాలిగా
యీ తగవెట్టు దీరుటలొ యేగెదమాదరి కిప్పుడిప్పుడే
తాతగ నిన్ను బిల్చుటలు తండ్రిగ నాపయి జూపు ప్రేమలున్.----73
చం. నిజమిది నేను పల్కితిని నిక్కము నిక్కము నేనపత్యుడన్
నిజముగ ‘నాయనా’ యనెడి నిక్కపు బిల్పున కేను వాచితిన్
నిజముగ తండ్రి నేననెడి నిక్కము బల్కిన బిడ్డ యెవ్వరో
నిజమది యైన వేళలను నిక్కము ధన్యము నాదు జన్మమే.-----74
చం. బరణిని చేత బట్టుకుని బంధుల మిత్రుల గూడి యాతడున్
పరుగున నీటి పట్టునకు పైనము గట్టగ దుర్గ దాసుడున్
బిరబిర వెంట నేగ నట పిన్నవి పిన్నవి పాదముద్రలే
బురదల గట్టి నేలలను బూమెల బన్నుచు నిట్టులట్టులున్.----75
ఉ. పంకము నందు పద్మముగ పంకము వీడిన సారసమ్ముగన్
పంకము వీడు నేలలను పాడిగ నొప్పెనొ నంబుజమ్ముగన్
వంకను జేరకుండగను వారిజ మైచనె కాలిజాడలున్
అంకము జేరనోపు నిట నంతము జాడలు పంకజాక్షివే..-----76
ఉ. ఇచ్చట జేరబిల్చితిని యిచ్చట ముద్దుల మాటలాడితిన్
ఇచ్చట గాజులేసితిని యిచ్చట రుచ్యము తీపి భక్ష్యము
న్నిచ్చితి నిచ్చటే కనుల నిండుగ నవ్వుల నన్నుదేల్చెనో
విచ్చిన మోమునుం గనుచు విస్మయమందుచు ధన్యుడైతినిన్-----77
ఉ. బంగరు తల్లి మోముగన భాగ్యము గల్గెనె యిప్పు డేమయెన్
చెంగట జేరు భాగ్యమది చెప్పెడి దేమిటి చేయి జారెనే
ముంగల నింక జూచుటలు ముద్దుల మాటలు మృగ్యమై చనెన్
బంగరు తల్లిఁ గాననను భావము గుండెల పిండి జేసెనే. ------78
వ. ఇటుల ఎవరి ఆలోచనల యందు వారుండగ నా యజమాని .....79
ఉ. నన్నును నాన్నగా దలచి నాకడ కొమ్మని నాల్గు పైసలే
మన్నన జేసె దండ్రిగను మాన్యత నాకిక నేమి యుండునో
అన్నుల మిన్న కొక్కతెకు నయ్యగ నయ్యెడి కోర్కె దీరెనో
కన్నుల గాంచనైతినిట కాంచన గాత్రిని ముద్దు జేయగన్-------80
వ. వారట్లు విచారపడుచుండ నక్కడి వైనమంతయును గమనించుచున్న ఓ వృద్ధు కలగజేసుకొని----81
ఉ. మీదగు వాదముల్గనిన మీరలు మీరలు మీరలందరున్
వాదున మంచివారనెడి వైనము దోచెడి చూడ చూడగన్
వాదుల మూలమైన యది వస్తువు రూపది దుర్గమాంబదే
భేదము లెంచబోవకుడు బేహరి చేతిన నుంచి చూడరో. -----82
ఉ. ఎవ్వరి పల్కులివ్వియని యెంతయు విస్మయమంది జూచుచు
న్నవ్వల నొక్క వృద్ధుగని నబ్బురమందుచు వాని పల్కులన్
ఎవ్వరు మీరలీ దరిని నెన్నడు గానము దివ్య తేజము
న్నవ్వల త్రోసిరాజనుచు నబ్బుర మందెడు మీదు గాత్రమున్----83
వ. అనుచు ఆ వృద్ధుని జూచి "అయ్యా తమ పరిచయ"మనగ నా వృద్ధు......84
ఉ. ఏనొక బాటసారినిటు లేగుచు వింటిని మీదు వాదనల్
నేనును దుర్గ భక్తుడనె నెయ్యము భక్తుల యందు సాజమే
యౌనవి దుర్గ మాటలని యౌనుల కాదుల వింటి నాపయిన్
ఏనిక మోము సామి దయ నిందర గాంచితి దుర్గ భక్తులన్......85
చం. నుదుట విబూతి రేకలును నూతన తేజము వాని మధ్యనున్
పెదవులు దాటకుండగను పేర్కొన జేయుచు నేదొ జాప్యమున్
విదితము జేయు వేడుకను విన్గను వారికి జెప్ప బూనుచున్
సదయులు మీరలందరును చక్కగ విన్నను నాదు పల్కులన్.....86
చం. అనియెడి వాని పల్కులవి యచ్చపు దుర్గమ మాటలంబలెన్
కనికని వాని తేజమును కాంచగ నోడుచు నేత్రవిహ్వలుల్
పనిగొని పైడి కాసు గొని భక్తిగ బేహరి చేత నుంచగా
కననయె సర్వ దిక్కులును కాంతుల జిమ్ముచు హ్లాదమొందుచున్.....87
తే.గీ. పుష్కలావర్త మేఘాలు పులకరించ
సన్న సన్నని జల్లులు జాలు వారె
పిల్ల తెమ్మెర పవనాలు పిలిచె; పిలిచి
గంధ మాధుర్య మలరించె బంధురముగ......88
ఉ. గాజుల బేహరంతటను గాంచుచు నాయమ రూపరేఖలన్
గాజుల బేరమింతటిద? కాంచితి నమ్మను జన్మ ధన్యమై
గాజుల వేయునప్పుడును గానగ నైతిని స్పష్ట వైఖరిన్
గాజుల చేతులప్పటివి గానగ నౌనొకొ మాటిమాటికిన్.---89
మ.కో. అమ్మవారను జ్ఞానమేలనొ యప్పుడున్ మరి దోచదో
చెమ్మవారిన కళ్ళ నిప్పుడు చేదుకొంటకు లభ్యమా?
అమ్మ బిల్చిన యప్పుడేమఱి యందుకోవలె ప్రేమమున్
అమ్మరూపది చేతికందెను అమ్మ తానెట దాగెనో----90
ఉ. కన్నుల ధార పాతముగ కాంచన రూపును ముంచి వేయగా
మిన్నున వెల్గ నో మెఱపు మేదిని మున్గెను దివ్య కాంతులన్
అన్నన! యేమి మార్పులని యబ్బుర మందగ వారలందరున్
తిన్నగ నున్నతీర్థమున తిన్నని మంజుల నాద మొక్కటన్ -----91
(తిన్నగ=మనోజ్ఞము)
చం. సలిలములోని చప్పుడది సన్నగ మంజుల కర్ణపేయమై
వెలువడ వారలందరకు వేకువ యందలి పక్షి కూటముల్
కిలకిలలాడు సందడిగ కిన్నెర సానిది పాటదోపగన్
మిలమిల లాడు వెల్గులను మించిన దృశ్యము దోచ నంతటన్.----92
ఉ. మెల్లగ మెల్లమెల్లగను మేదిని కాంతిని ధిక్కరించుచున్
చల్లని వెన్నెలల్ కురియు చందురు నంతటి వెల్గులంబలెన్
మెల్లగ పైకి లేచినవి మెండుగ గాజుల హంగు జూపుచున్
చల్లని రెండు హస్తములు చక్కగ దీవెన లిచ్చుచాడ్పునన్.-----93
వ. ఆ రెండు హస్తములను జూసిన దుర్గాదాసు ఆ చేతులనున్న గాజులే తాను ఇంతకు మునుపు వేసిన
గాజులని యానవాలు పట్టి ఆనందాతిరేకమున్నూ భక్తిభావమున్నూ పెనవేసికొన కన్నులు చెమర్చి.......94
ఉ. చూడగ నవ్వె గాజులవి చూడుడు నేనును వేసినట్టివే
చూడగ నట్టివే యిచట చూడుడు పోల్చుడు గాజులవ్వియే
వేడుక మీరగా దనకు వేసితి నమ్మగ దల్చి భక్తిగన్
పోడిమి మీరగా దనను పోల్చెద నామెయు పైకి వచ్చినన్----95
చం. అతడటులాడు చుండఁ గని యచ్చట నందరు విస్తుబోవుచు
న్నితనిదె పుణ్య భాగ్యమన నీతడు నోచిన నోములెట్టివో
వితరణ లేమి జేసెనొకొ వింటిమ కంటిమ దుర్గమాంబయే
యితనికి దానె వత్సలత నీవిధి దర్శన మిచ్చి బ్రోచుటల్------96
చం. దరిసెన మంతియేన మరి దానుగ కోరుచు సేవలందెనే
దరిసెన మంతియేన మరి దానుగ నెక్కెను నంక పీఠమే
దరిసెన మంతియేన మరి దానుగ కోరెనె భూష లీతనిన్
దరిసెన మంతియేన మరి దానుగ కోరెను భోజ్యమీతనిన్
దరిసెన మంతియేన మరి దానుగ బిల్చెను తాత యంచునున్
దరిసెన మంతియేన మరి దానుగ నిల్చెనె మన్మరాలుగన్
దరిసెన మంతియేన మరి దారిని జూపెను భాగ్యమందగన్
దరిసెన మిచ్చి యీతనికి దానుగ నూరికి దీవనల్లిడెన్
దరిసెన మాత్రమీతనిది దండిగ గూర్చును భోగభాగ్యముల్
దరిసెన మమ్మ భక్తులది దానయి జూపదె ముక్తి మార్గముల్.----97
ఉ. కూతురు లేదు లేదనెడు కోర్కెను దీర్చగ వచ్చె దుర్గయే
కూతురు నాకు లేదనెడు కోర్కెయు బోయెను పూర్వ పక్షమై
కూతురు దుర్గమాంబయయె కోరిక దీరె నదృష్టవంతుడన్
కూతునకిచ్చు దీవెనలు కూతురె నాకిడె నేను ధన్యుడన్------98
చం. ఇదియొక దుర్గమాంబ కథ యిందున తండ్రులు యిద్దరామెకున్
సదయులు వారలిద్దరును చక్కగ దీర్చిరి తండ్రి పాత్రలన్
సదయులు మీరలందరును చక్కగ విన్నను నిష్ఠ నేర్చినన్
పదములు మోక్షమార్గమున పాడుచు నాడుచు జేరు; జెప్పితిన్.---99
కం. ‘తాతా లడ్డ’ని తింటిని
మాతామహి పాయసమును మరిమరి తింటిన్
తాతల వయసది నిండెను
ఈతావున పొత్తమిచ్చి ఈగెద ఋణమున్. ---100
స్వస్తి.
బుధజన విధేయుడు
కడయింటి కృష్ణమూర్తి..గోవా(నెల్లూరు)
(ఆవాహన జేసి ఉద్వాసన చెప్పక పోయినట్లయితే దేవతలకైనను వచ్చు పాట్లు)
జైహింద్.