Tuesday, April 12, 2016

పద్మనాభ వృత్త గర్భ దండకము.

వివేకానంద నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామివారు ప్రతిష్ఠితులై ఇరువదియైదు వత్సరములయినది. ఈ రజతోత్సవము సందర్భముగా వ్రాసిన
పద్మనాభ వృత్త గర్భ దండకము.
శ్రీమద్వివే కార్ణ వానంద పూర్ణాఖ్య శ్రీమన్నగర్ వాస! శ్రీ భూప! దేవాఢ్య!
ప్రేమన్ మమున్ బ్రోచు భాస్వంతుఁడౌ పంచ వింశత్ ప్రపూర్ణా! ప్రభో వేంకటేశాఖ్య!
నీమంబుతో దుర్ముఖన్ దుర్గతుల్ మాపి నీ శక్తినే జూపి మమ్మేలు దేవార్తి
ప్రేమన్ నినుం గొల్చు భాక్తాళినే బ్రోచి ప్రీతిన్ ప్రవృద్ధిన్ ప్రసాదింతు వీవేర!
క్షేమంబుఁగానీవు క్షేత్రంబునన్ నిల్చికేల్బట్టి మమ్మున్ సదా నిల్పు చుండన్
మేమున్ నినున్ నమ్మి నీమమ్మునన్ నిన్ను మేనన్ మనన్ మన్ననన్ మాన మెన్నన్
కామాదులన్ బాపి ప్రేమాదులన్ జూపికర్తవ్యమున్ జేయఁగా చేయుమీవే!
సామాన్యులన్ మమ్ము సమ్మాన్యులన్ జేయ సద్ధర్మ సద్వర్తనల్ కొల్పితీవే!
మామాధవాశ్రీరమా హృన్నివాసాప్రమాణంబు నీవేరభక్తాళికెన్నన్!
శ్రీమన్మహాదేవ దేవాది దేవాప్రసీద ప్రభోభక్త మందార ధీరాఢ్య!
ధామంబు నీకౌను ధీమంత హృత్పాళి తత్వజ్ఞులెన్నున్ మదిన్ నిన్ను మిన్నన్ 
మామార్గమీవేసమారాధ్యుడీవే రమా వేంకటేశా నమస్తే నమస్తే.
చ. ఇరువది యైదు వర్షము లహీన దయామతి వెల్గి తీ స్థలిన్
దరి నలమేలుమంగయునుతత్వజ పద్మయు తోడు నిల్వగా
సురుచిర మందహాసదయ చూడర నిత్యము నీదు భక్తులన్.
ధర పయి శాస్వితుండవయి దర్శనమీయర నిత్యమిచ్చటన్.

No comments: