Friday, November 17, 2017

బాల భావన శతకము. 44 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
44) మద్య మాంసములను మా ముందు సేవించ- మేము నేర్చుకొనమె మిమ్ముఁ జూచి?
     మంచి తిండి తినుఁడు, మంచివే త్రాగుడుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మా ముందే మద్య మాంసాదులను సేవించుచుండగా, మిమ్ములను చూచి మేము నేర్చుకొనమా? మీరెల్లప్పుడు మంచి తిన తగిన పదార్థములనే తినుచు, త్రాగఁ దగిన పానీయములనే త్రాగుచుండుడు. అది ఉభయులకు శ్రేయస్కరము.
జైహింద్.

Thursday, November 16, 2017

బాల భావన శతకము. 43 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
43) నచ్చినట్టివెల్ల వెచ్చించి కొని, తినితినఁగఁ జేయ మాకు తెలియునెట్లు
     తినఁగ నేవి తగునొ? తినరానివేవియోపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీకు నచ్చిన తినుబండారములనన్నిట్టిని మీరు ధనము వెచ్చించి కొని, తినుచు మాకును తినుఁడని పెట్టుదురు. మీరు మాకు ఆ విధముగా అలవాటు చేయుటచే ఏవి తిన తగినవో, ఏవి తిన రానివో మాకు ఏవిధముగా తెలియును?
జైహింద్.

బాల భావన శతకము. 42 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
42) మంచి త్రోవలోన మము నడిపించుచు  మంచి మాటలాడి మంచి నేర్పి
     మంచి మార్గమెంచి యుంచుఁడు మమ్ములపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్ములను మీరు మంచి త్రోవలో నడిపించండి. మంచిగా మాతో మాటలడండి. మంచి మార్గాన్నే మీరు యెంచి మమ్ములను ఆ మార్గమున ఉంచండి.
జైహింద్.

Wednesday, November 15, 2017

బాల భావన శతకము. 41 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
41) ఆడరాని మాట లాడెడి మీ నుండి  పాడు మాటలెల్ల పట్టు మమ్ము.
     మంచి మాట లాడి మంచిగా పెంచుడీపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాటలాడ కూడనివి మీరు మాటలాడు చున్నచో  ఆ పాడుమాటలన్నియు మా మనసుకు పట్టివేయును. మేమునూ అటులే పాడుమాటలాడుటకు అలవాటు పడిపోక మానము. కాబట్టి మీరు ఆడ తగిన మంచి మాటలే మాటలాడుచు మమ్ములను మంచిగా పెంచండి.
జైహింద్.

Tuesday, November 14, 2017

బాల భావన శతకము. 40 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
40) చూడరానివెల్ల చూడగా చూడగా  కనులలోన నిలుచు కానఁ బడుచు
     చూపఁ దగినవెల్ల చూడుఁడు. చూపుఁడుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చూడ రాన్ వాటినే మనము చూడగా చూడగా ఆ దృశ్యములు మన కన్నులను వీడిపోక అలా కనులు మూసినా తెరచినాకనపడుతూనే ఉంటాయి. కాబట్టి చూడ తగిన వాటినే మీరు చూడండి అట్టివే మాకునూ తప్పక చూపించండి. 
జైహింద్.

Monday, November 13, 2017

బాల భావన శతకము. 39 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
39) చదువరాని చెత్త చదువగా చదువగా  మనసు ఖిలము చెంది మైల పడును.
     మైల పడిన మదిని మముఁ జూడ మనసౌనెపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చదువరాని వాటిని చదువు చుందురు. అట్లు చదువుట వలన మనసు చెడి మలినమునొందును. అట్టి మలినమైన మనసుతో మమ్ము చూచుటకు వారికి ఏ విధముగా మనసు కలుగును? సిగ్గనిపించదా?
జైహింద్.

Sunday, November 12, 2017

బాల భావన శతకము. 38 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
38) పిల్లల కను గప్పి బిడియము విడనాడి  చేయరాని పనులు చేయుచున్న
     పెద్దలన్న ప్రేమ పెరుగునెట్టులు మాకుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చిన్న పిల్లల కంట పడకుండా, సిగ్గు విడిచి, చేయ రాని పనులు చేయుచుందురు. అట్టి పెద్దలపై మాకు ప్రేమ ఏవిధముగా పెరుగును?
జైహింద్.