పద్య విపంచిని మీటుచు , సద్యశమును కలుగజేయు చక్కని కృతులన్ , హృద్యంబుగ వ్రాసినచో , విద్యాధికులంత మెచ్చు విశ్వము పొగడున్.
Monday, June 20, 2016
Monday, June 6, 2016
మన కంది శంకరయ్య గారి కవితా విపంచి వినిపించిన పద్యాలు.
జైశ్రీరామ్.
ఆర్యులారా!
తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భముగా రవీంద్రభారతిలో116. మంది కవులలో ఒకరిగా కవితా గానం చేసిన మన కంది శంకరయ్య గారి కవితా విపంచి వినిపించిన పద్యాలు.
నవ తెలంగాణ!
సీ. ఎనలేని పాలనం బనయమ్ము వర్ధిల్లె
ననఁ గాకతీయుల ఘనత సాక్షి!
అసమాన సాహిత్య రసమాధురి కురిసె
ననఁగఁ బోతన్న పద్యములు సాక్షి!
ప్రతిలేని శిల్పసంపదలు శోభిలె నని
పలుక రామప్ప దేవళము సాక్షి
సరిలేని పోరాటశక్తికి నెల విది
యన రాష్ట్రసాధనోద్యమము సాక్షి
తే. యిట్టి బహుళప్రశస్తమై యెసఁగినట్టి
నా తెలంగాణ రాష్ట్రమ్ము నవ్యజాగృ
తీ సమారంభకృషిని సంధించి మించి
సర్వతోముఖప్రగతికై సాగు నింక. (1)
కం. శ్రీలకు తావలమై వి
ద్యా లలితకళలు, పరస్పరాత్మీయతలున్
మేలుగ వర్ధిల్లఁగ, మురి
పాల తెలంగాణ ప్రగతి పథమున సాగున్. (2)
కం. కోకిలవలె, మేఘమువలె,
కేకివలెన్, చిల్కవలెను, శ్రీకృష్ణుని వం
శీకృతనినాదగతి, మో
దాకర తెలఁగాణ కవిత యలరించు నిఁకన్. (3)
సీ. బతుకమ్మ బోనాల పాటలు ద్రాక్షాస
వంబయి తన్మయత్వంబు నిడఁగ
ఎముడాల యాదాద్రి కొమురెల్లి దేవుళ్ళ
కరుణామృతమ్ము మేల్గలుగఁ జేయ
రామప్ప లక్నవరమ్ము పాకాల త
టాకముల్ మేటిపంటల నొసంగ
నానాట వర్ధిల్లు నవ్యపరిశ్రమల్
జీవనోపాధికిఁ ద్రోవఁ జూప
తే. సర్వరంగమ్ములందు ప్రశస్త వృద్ధి
నంది, కలలెల్ల సాకారమై చెలంగ,
ప్రజలు పాలకుల్ సత్సమన్వయము గలిగి
సాగ బంగారు తెలఁగాణ సాధ్య మగును. (4)
తే. పెక్కు పోరాటములఁ జేసి విక్రమించి
స్వంతరాష్ట్రమ్ము సాధింపఁ జాలినార
మన్ని రంగాలలో వృద్ధి నందగలము;
నా తెలంగాణ తల్లి వందనము నీకు! (5)
--oOo—
శ్రీ కంది వారికి అభినందనలు.
జైహింద్.
Friday, April 22, 2016
Tuesday, April 12, 2016
పద్మనాభ వృత్త గర్భ దండకము.
వివేకానంద నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామివారు ప్రతిష్ఠితులై ఇరువదియైదు వత్సరములయినది. ఈ రజతోత్సవము సందర్భముగా వ్రాసిన
పద్మనాభ వృత్త గర్భ దండకము.
శ్రీమద్వివే కార్ణ వానంద పూర్ణాఖ్య శ్రీమన్నగర్ వాస! శ్రీ భూప! దేవాఢ్య!
ప్రేమన్ మమున్ బ్రోచు భాస్వంతుఁడౌ పంచ వింశత్ ప్రపూర్ణా! ప్రభో వేంకటేశాఖ్య!
నీమంబుతో దుర్ముఖన్ దుర్గతుల్ మాపి నీ శక్తినే జూపి మమ్మేలు దేవార్తి
ప్రేమన్ నినుం గొల్చు భాక్తాళినే బ్రోచి ప్రీతిన్ ప్రవృద్ధిన్ ప్రసాదింతు వీవేర!
క్షేమంబుఁగానీవు క్షేత్రంబునన్ నిల్చి, కేల్బట్టి మమ్మున్ సదా నిల్పు చుండన్గ
మేమున్ నినున్ నమ్మి నీమమ్మునన్ నిన్ను మేనన్ మనన్ మన్ననన్ మాన మెన్నన్గ
కామాదులన్ బాపి ప్రేమాదులన్ జూపి. కర్తవ్యమున్ జేయఁగా చేయుమీవేర!
సామాన్యులన్ మమ్ము సమ్మాన్యులన్ జేయ సద్ధర్మ సద్వర్తనల్ కొల్పితీవేర!
మామాధవా! శ్రీరమా హృన్నివాసా! ప్రమాణంబు నీవేర! భక్తాళికెన్నన్గ!
శ్రీమన్మహాదేవ దేవాది దేవా! ప్రసీద ప్రభో! భక్త మందార ధీరాఢ్య!
ధామంబు నీకౌను ధీమంత హృత్పాళి తత్వజ్ఞులెన్నున్ మదిన్ నిన్ను మిన్నన్ గ
మామార్గమీవే. సమారాధ్యుడీవే రమా వేంకటేశా నమస్తే నమస్తే.
చ. ఇరువది యైదు వర్షము లహీన దయామతి వెల్గి తీ స్థలిన్
దరి నలమేలుమంగయును, తత్వజ పద్మయు తోడు నిల్వగా
సురుచిర మందహాస! దయ చూడర నిత్యము నీదు భక్తులన్.
ధర పయి శాస్వితుండవయి దర్శనమీయర నిత్యమిచ్చటన్.
Monday, April 11, 2016
నా దుర్ముఖి ఉగాది కవిత
జైశ్రీరామ్.
౧. శ్రీ మేధావు లనన్య సాధ్య సుగుణ శ్రీ జ్ఞాన తేజో నిధుల్,
ప్రేమోద్భాసిత సత్కవీంద్ర
మణులున్, విజ్ఞాన
సంపన్నులున్,,
నా మీదన్ దయఁ జూపు సన్నిహితులున్, నా సోదరీ సోదరుల్,
ప్రేమన్ వందనమాచరింతుఁ
గొనుడీ! ప్రీతిన్
ననున్ గాంచుడీ!
౨. స్వాగతోక్తి గర్భ మత్తేభము. (భావ గోపన చిత్రము)
కరుణోత్పాదుని, జ్ఞాన పూర్ణుని,
త్రిలోక స్వామినా రాఘవున్,
ధరితోత్కార్ముక శోభితున్, బుధ నుతున్,
ద్రై గణ్య వేదాత్మునిన్,
చరితోల్లేఖినమేయ శాంతి కలితున్, సత్ తత్వదున్, సద్ఘృణిన్,
ధరకే యంకితమైన దైవమును, బోధన్ మున్దుగాఁ గొల్చెదన్!
౩. ఆటవెలది త్రిక
గర్భ సీసము.
దుష్ట జనులఁజంపు
దుర్ముఖీ! స్వాగతమ్. – దుర్మద జనపాళీఁ ద్రుంచ రమ్ము.
సజ్జనులను కాచు
సద్భావనను రమ్ము, - గాయకులను కావ కదలి రమ్ము.
సత్యమతులఁ గావ స్తుత్యంబుగా
రమ్ము. – విశ్వ జనులఁ గావ వేగ రమ్ము.
కావ్యతతిని గావ కారుణ్యమున రమ్ము. - సంపద తెలుగింట నింప రమ్ము.
ఆ.వె. సరస సుగుణ గణ్య! నిరపాయవై రమ్ము. - సుజనుల నలరించు శుభద! రమ్ము.
నిరుపమ గుణ ధామ! పరమాత్మవై రమ్ము.
- స్వాగత మిదె గొనుచు వరల రమ్ము.
౪. శా. దుర్మార్గంబులనుండు దుష్ట జనులన్, దుర్మార్గముం ద్రుంచఁగన్,
ధర్మంబున్ నడిపించు సజ్జన తతిన్ ధాత్రిన్
గృపం బెంచఁగన్,
మర్మాత్ముల్ కడ మర్మమున్, మహితులన్ మాన్యత్వమున్ జూపఁగన్,
ధర్మోద్భాసిగ రమ్ము! స్వాగతమిదే్. తత్వార్థ
మేదుర్ముఖీ!
౫. ఉ. దుర్ముఖి నామ మాత్రమున దుర్ముఖి వౌదువొ? సత్య భాస! ఓ
దుర్ముఖి! సత్య సంధులను, దుర్భర జీవ జనాళి వ్రేచు నా
దుర్ముఖపాళి పాలిటనె దుర్ముఖివీవు. నిజంబు.
నీవికన్
దుర్ముఖి నామమున్ మరచి తోడుగనుండుమ
సజ్జనాళికిన్.
౬. చ. వనములు, చందనాది తరు భాసితముల్ భువి, మానవాళి జీ
వనములు, జంతుకోటికిలఁ బ్రాపు,
కవీంద్రులకున్ మనోజ్ఞ భా
వనములు, సన్మునీశ్వర ప్రభావ వివర్ధిత సత్య శాంతి శో
భనములు, కావుమయ్య వనపాళిని. దుర్ముఖి నామ వత్సరా!
౭. చ. కలిత వసంత శోభనల క్రాంతిని వెల్గుచు గణ్యమైన దీ
సులలిత సుందరోజ్వల వసుంధర భారతి. యిట్టి
ధాత్రిపై
మలిన మనస్కులున్, మరియు మానవతా రహితాత్మ దుష్టులున్
వెలయుచునుండిరీవె కని వేల్పులు మెచ్చ నశింపఁజేయుమా!
౮. ఉ. పంట పొలాలనమ్ముకొను వచ్చెడి సొమ్ముకు రైతులాశచే.
నింటను పెంచు ధేనువులనిట్లె
ధనంబునకమ్ముచుండ్రి. నీ
వుంటివి చూడగా నిక మహోద్ధృత భీషణ తీక్ష్ణ
దృష్ఠితో
సుంటలనందరిన్ గదిమి. శోభిలఁ కావుమ ధాత్రి
గోవులన్.
౯. చ. జననిగ జన్మనిచ్చు, సహజన్మను సోదరి ప్రేమజూపు, స
ద్ఘనతర మైత్రి నిల్చు, సహధర్మచరంబున తోడునిల్చు స
ద్గుణవతి స్త్రీ, మహేశ్వరియె. క్రోధముఁ జూపుట కొట్టుచుంట దు
ర్జనులకు నిత్య కృత్యమయె. చంపు దురాత్ముల, స్త్రీలఁ గావుమా!
౧౦. మత్తకోకిల ద్విపద గర్భ సీసము
దేశమున్ గుణ పాళి దీపిత దేవ స - న్నుత దుర్ముఖీ! మానవతను నిలుపు.
దేశమున్ గుణ పాళి దీపిత దేవ స - న్నుత దుర్ముఖీ! మానవతను నిలుపు.
ఆశపెంచుమ సన్మహాత్ముల యందునన్ - కని బ్రోవుమా! నీవు కల్పకమయి.
శ్రీశు వేడుమ! చిద్వశీకృత చిత్తజా - ళిని బెంచగా సత్య ఫలముఁ గనఁగ.
క్లేశసంహతి బాపు. క్లిష్టత లేక వ - ర్తిలఁ జేయుమా! సత్సకల విధేయ!
గీ. నిరుపమానంద సామ్రాజ్య నేతవగుమ! - సిరులు వర్ధిల్లఁ జేయుమా! చిద్విశాల.
కవులు కోరెడి మంచిని కలుఁగ జేసి, - దుర్విధానంబు విడనాడి తోడు నిలుమ!
౧౧. మత్తకోకిల ద్విపద గర్భ సీసము
దుర్ముఖీ! దురితంబు దూరము త్రోసి కా - వుమ లోకమున్ జేయుమమలినముఁగ.
మర్మచిత్తుల నెల్ల మంచిగ మార్చి శో - భిలఁ జేయుమా! నీవు ప్రీతితోడ.
దుర్మదాంధుల మాపి తోడ్పడు స్తుత్య! స - ద్వరమీయుమా మాకు వర్ధిలఁగను.
కర్మదూరులఁ గాల్చి ఖ్యాతిని గ్రాలుమా - భువి సద్గతిన్ బ్రోచు పుణ్య చరిత!
గీ. సజ్జనాళికి సత్వర శాంతిఁ జూపి, - సత్కృపాళికి సద్గతి సరళిఁ గూర్చి,
సద్ద్విజాళిని సంస్కార సరణిఁ దేల్చి - మాటనిలఁబెట్టుమయ్య నా మనవి వినుచు.
౧౨. మత్తకోకిల ద్విపద గర్భ సీసము
శ్రీమనోజ్ఞుఁడ! దేవ! శ్రీనరసింహ! దు - ర్ముఖి వచ్చెరా! కూర్చుమఖిల సుగతి.
ధీమతాళిని కాచి తేజము దిద్ది శో - భను కూర్చ రావేర! భాను తేజ!
నామదిన్ గని చూడు నాథుఁడ! నన్నునీ - కృప దేల్చరావేర! క్షితిని నిలుప.
శ్రీమదాంధ్రులనెల్ల చేకొను శ్రీశ! ధ - ర్మము నిల్పరార! క్షేమమునిడంగ.
గీ. సత్య తేజ సుదుర్ముఖిన్ జయములిచ్చి, - జయజయధ్వానములతోడ సభలు వెలుఁగ
ధీ విశాలురు సత్కవుల్ తేజరిలఁగఁ - జేసి కాపాడరా కొల్పి చిత్ర కవిత.
౧౩. సీ. భూదేవి పులకించు పుష్పగుచ్ఛములను - పూసెడి భూజ సింహాసనమయి.
పసిడివన్నెలు చిందు కుసుమాంగనల్ తేనె దెసలెల్ల చింద మేదినిమునుంగ.
కుసుమాస్త్రునకు తోడు కుదిరె వసంతుఁడు, వాసంతి శోభలు వసుధనిండె.
కోకిల పాటలున్, తాకెడి చిఱు గాలి, సెలయేళ్ళ సవ్వళుల్ చిత్తమొత్త,
గీ. కవుల కవితలు ప్రకృతిని గౌరవింప, సహజ దుర్ముఖి పొంగుచు సమ్ముఖుఁడయె.
సుజన పాళికిఁ గూర్చఁగ శోభ లెలమి దుర్ముఖాఖ్యుఁడు సమ్ముఖోద్భర్మమయ్యె.
౧౪. కంద గర్భ గీత యుత సీస గర్భ కంద మాలిక.
స్మర జనకుని వర సచివుని, - స్మరణ వి --నుత మతులును పరమత హితు లగు/టన్
తరళ జగతి గిరి పురజుల - నిరుపమ --దరహసన మహిమ నెరపు సభల/నే
కరి వరద ! నుత జగతి గిరి - పురజుల -- నియతి చరుల వలపు నిరుపమము/నౌన్.
సురుచిరము సుజన శుభదము - పరహిత -- వర రుచిరము నిహ పర వినుతము/నౌన్.
కంద గర్భ గీతము.
జగతి కనుట ఘన మతులను --గగనమగు - నిజము సుగుణులఁ గని కృప నిలుప--నగును.
ప్రగతిఁ గన జనుల నిలుపర! --జగతిగిరి - ప్రతిభ వెలయఁగ జగతిని! వరలఁ –గనుమ.
జైహింద్. Sunday, April 10, 2016
నిజాంపేట రామాలయంలో జరిగిన అష్టావధానము. . . అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.
జైశ్రీరామ్.
నిజాంపేట రామాలయంలో జరిగిన
అష్టావధానము
అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.
సమస్య: శ్రీ చింతా రామకృష్ణా రావు.
౧. సమస్య:
" హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో."
పూరణ:
శర్మదమైనప్రక్రియల చాల తనర్చెడినాటకంబులో
కర్మలు చ్యు పాత్రలుసుఖంబుగ తాము విరామమొందగా
హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
నర్మ వచోభిరాముఁగ గనన్ దనెసోదరియౌ కతంబునన్.
౨. దత్తపది:
గుడి - బడి - తడి - మడి. పదములు ఉపయోగించి రామాయనాంశము ఐచ్ఛిక ఛందములో.
పూరణ: గుడి వేల్పుల పూజలు రా
బడిరాజరికంబున సుంత భావింపక పు
త్తడిచొక్కపు చారితి యి
మ్మడిముమ్మడి ఖ్యాతి గాంచ మహి రాముండై.
౩. వర్ణన:
శ్రీరామ భావన:
పూరణ:
ఆదర్శ గృహస్థునిగా
సోదరునిగ, సుతుగ, పతిగ, క్షోణింజెలఁగన్
దా దా పుట్టెను రఘుపతి
మేదుర సాధ్వి గను సీత మేదిని వెలగన్.
౪. నిషిద్ధాక్షరి:
తాటక సంహారము:
దృంచన్ సత్తిన్, వీకన్,
బెంచంధీర్తిన్ మనంగపేళ్ళున్ బీళ్ళున్,
మించం శాంతిని తారా
వించెన్ తాటకను దృంచ విజ్ఞత రామున్.
౫. ఆశువు:
వాతావరణ కాలుష్యము:
బొగ్గుపులుసువాయువుగొని పొలియు పసుపు
నింపి ప్రాణవాయువునిచ్చి నిఖిల జనుల
రక్షనము చేయు యిండ్ల నిర్మానములను
మంచములు చేయుటకుపయోగించఁబడెడు
మూలమగుచుండు వృక్షంబుముఖ్యముగను,
దాని ఘనతను తెల్పగా తరమె నాకు?
౬. అప్రస్తుత ప్రసంగము:
౭. గడులు గణితము.
౮. వార గణనము:
జైహింద్.
Saturday, April 9, 2016
Subscribe to:
Posts (Atom)





