Saturday, November 11, 2017

బాల భావన శతకము. 37 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
37) తమ సుఖంబు కాంచు తమ బిడ్డ సుఖములో  తల్లిదండ్రులిలను ధర్మమనుచు.
     కన్న వార లనిన కరుణకు ప్రతి రూపుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల సుఖములోనే తమ సుఖమును కూడా చూచుకొందురు. ఇదియే ధర్మమని వారు తలంతురు. భూమిపై అట్టి తల్లిదండ్రులు కరుణకు ప్రతి రూపులే.
జైహింద్.

Friday, November 10, 2017

బాల భావన శతకము. 36 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
36) బద్ధకమ్ముతోడ పట్టించు కోకుండ  కాలమును గడిపెడి కన్నవారు
     మార్గదర్శకులుగ మాకెట్టులగుదురుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కాలము వాలా విలువైనది. అట్టి కాలము గడిచి పోవుచున్నదని గ్రహించుకోకుండా బద్ధకముగా గడిపే తల్లిదండ్రులు ఉన్నట్లైతే వారు మాకు మార్గదర్శకులెలా అగుదురు?  (Time sence) కాల వివేచన కలిగి ఉండి బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉంటూ కాలంతోపాటు నడుస్తూ మమ్మల్ని నడిపించే తల్లిదండ్రులే మాకు ఆదర్శము
జైహింద్.

Thursday, November 9, 2017

బాల భావన శతకము. 35 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
35) చూడఁ దగిన మంచి చూపుచు, మామది  వీడనట్టి నీతి పెంచి, మీరు
     మంచి మార్గమునను మము నడిపించరేపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చూడ తగినటువంటి మంచివాటిని మాకు చూపుచు, మా మనస్సును వీడిపోని నీతిని మాలో పెంచి, మమ్ములను మంచి మార్గమున మీరు నడిపించలేరా?
జైహింద్.

అనంతపురంలో అష్టావధానం. అవధాని. బ్రహ్మశ్రీ మాడుగుల అనిల్ కుమార్.

జైశ్రీరామ్.

ఈ అవధాన కార్యక్రమం నిరుపమానంగా సంపన్నమవాలని మనసారా కోరుకొంటూ నిర్వాహకులకు, అవధాని గారికి, పృచ్ఛకాళికి సంచాలకులకు, సభాసదులకు శుభకాంక్షలు ముందుగానే తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.

Wednesday, November 8, 2017

బాల భావన శతకము. 34 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
34) దూరదర్శనమున దూర భాషణమున  కాలమెల్ల పుచ్చు కన్న వారు
     పిల్లల మదిఁ బ్రేమ పెరుఁగ నెట్టులొనర్త్రుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  దూర దర్శన కార్యక్రమములు చూచుచు దూర శ్రవణము ద్వారా నిరంతరము ఇతరులతో సంభాషించుచు కాలమును గదుపునట్టి తల్లిదండ్రులు ఇక పిల్లల మనసులో ప్రేమ నేవిధముగా పెరుగునట్లు చేయుదురు? వ్యర్థమైన దూర దర్శన కార్య క్రమములు చూచుట వారికి తగదు. అటులనే వ్యర్థమైన సంభాషణలు చేయుచూ కాల యాపన చేయక పిల్లలతో ప్రేమగా అవకాశము కల్పించుకొని ఎక్కువ కాలము గడి పిల్లలలో ప్రేమ కలిగించవలెను.
జైహింద్.

Tuesday, November 7, 2017

బాల భావన శతకము. 33 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
33) మంచి మాటలాడి మన్నన నుండెడి  తల్లిదండ్రులున్న ధన్యమదియె.
     తప్పుచేయకుండ గొప్పగా మెలగుడో  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మంచిగా మాటాడుతూ మన్ననలందుతూ ఉండే తల్లిదండ్రులు కలిగి ఉండుట కంటే ధన్యత మాకేమున్నది? తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుడు పనులకొడికట్టకుండా గొప్పగా ప్రవర్తించవలసి ఉన్నదని గ్రహింతురుగాక.
జైహింద్.

Monday, November 6, 2017

బాల భావన శతకము. 32 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
32) తెల్ల కాగితాలు పిల్లల మనసులు  మమ్ము పట్టి మీరు మప్పుచుండ
     మంచి చెడులు కనుట మాకెట్లు సాధ్యముపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా మనస్సులు తెల్లకాగితములవలె నిష్కళంకంగా ఉంటాయి. మాకు మీరు మప్పుచున్నవాటిని మేము గ్రహింతుము. వాటిలో ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుసుకొనుట మాకు సాధ్యము కాదుకదా? కావున మంచి విషయములే మీరు మాకు నేర్పాలని మేము మీకు గుర్తుచేయనక్కర లేదు కదా?
జైహింద్.