Sunday, November 5, 2017

బాల భావన శతకము. 31 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
31) పుస్తకాలు పట్టి కుస్తీలు పట్టుటే  నిత్యకృత్యమాయె. నిదుర లేక
    మనసు గాడి తప్పి, మరతుము. కనరేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము పుస్తకాలను చేతితో పట్టుకొని వాటితో కుస్తీలు పట్టుతూ చదవడమే మాకు నిత్యకృత్యమైపోయింది. ఈ కారణం గాకు నిద్దురపోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. తీరని నిద్దుర మత్తుతో మనసు గాడి తప్పుతోందిచదివినది గుర్తుండటం లేదు. ఈ విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
జైహింద్.

శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన నాగ శ్రీ బంధ కందము

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మన సాహితీ బంధువు శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు కవి విరచించిన 

నాగ శ్రీ బంధ కందము 
చక్కగా ఉన్నది. చూడఁగలరు.
మా స్వగ్రామము(గవరపేట)లో ప్రతీ దీపావళికి గౌరిదేవిని మా దేవాలయము నందు ప్రతిష్టించి, ఒక మాసము అమ్మవారు మా పురజనుల పూజలందుకొనును. ఇటువంటి గవరపేటలందు సంబరాలు(క్షణములు) అంబరాన్ని అంటుతాయి.
శ్రీకారబంధము

కం. శ్రీ గౌరి! హృదయ శంకరి
గా, గాంధర్వి! దయతోడఁ గాంచుము తల్లీ!
యీ గవరపేట లందు స్వ
రాగాల క్షణము లిడుదుము, ప్రణయము నందున్!
స్వస్తి.
పొలిమేర మల్లేశ్వరరావు.
బంధకవితాభిలాషులగు శ్రీ మల్లేశ్వరులకభినందనలు.
జైహింద్.

Saturday, November 4, 2017

బాల భావన శతకము. 30 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
30) ఆట పాటలాడి యమ్మతో నాన్నతో  ప్రేమ పంచుకొనిన క్షేమమొప్పు.
     నట్టి ప్రేమ మాకుఁ గిట్టదా? దక్కదా?   పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  ఆడుతూ పాడుతూ అమ్మా నాన్నలతో ప్రేమగా హాయిగా ఉండడం మాకెంతో ఇష్టం. అది మాకు ఎంతో క్షేమమని మీకు తెలియదా? అటువంటి ప్రేమ మాకు కిట్టదా? ఇక మాకు దక్కదా? ఆ ప్రేమ మాకు అందని ద్రాక్షయేనా?
జైహింద్.

Friday, November 3, 2017

బాల భావన శతకము. 29 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
29) గొప్ప దేశ భక్తి కొలిపెడి పాటలు  మప్పి, దైవ భక్తి మప్పుడయ్య.
     దేశ సేవ చేసి దీపించు ఘనులారపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  దేశ శేవ చేసి ప్రకాశించు మహాత్ములారా! గొప్ప దేశ భక్తిని మాలో కలిగించే పాటలను మాకు నేర్పండి. దైవ భక్తిని మాలో కలిగించండి.
జైహింద్.

Thursday, November 2, 2017

బాల భావన శతకము. 28 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
28) నడక చేతకాని బుడుతలమగు మాకు  కాళ్ళు మోయలేని జోళ్ళవేల?
     పుస్థకమ్ములేల బోధనలవి యేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము నడవడమే సరిగా రాని చిన్న పిల్లలము కదా! అలాంటి మా యొక్క పాదాలకు మోయలేనంత బరువుండే పాదరక్షలు ఎందుకు చెప్పండి? పుస్తకాలను చూపిస్తూ కాక బొమ్మల్ని చూపిస్తూ చేస్తున్న బోధ మాకేమి లాభం చేకూరుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా?
జైహింద్.

Wednesday, November 1, 2017

బాల భావన శతకము. 26 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
26) పుస్తకములు మాకు బస్తాలతో యిచ్చి  మూపుపైన పెట్టి మోయమనిన
     మోయు బరువు చేత మొద్దుగా మారమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చదువు పేరు చెప్పి మేము మోయలేనన్ని పూస్తకాలు కొనిపించి, పెద్ద బస్తాలవంటి సంచీలో ఉంచి మా వీపుపై పెట్టి మోయిస్తున్నారు. ఈ బరువు మోయడం వల్ల మేము మొద్దుబారిపోతున్న విషయమెప్పుడైనా మీరు ఆలోచించారా? పుస్తకాలు ఎక్కువ ఉంటేనే బాగా చదివిస్తున్నామన్న భావన తల్లిదండ్రులలోను ఉపాధ్యాయులలోను తొలగి పోవాలి.
జైహింద్.

బాల భావన శతకము. 27 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
27) మస్తకంబు చెడును మణుఁగుల బరువున్న- పుస్తకములు మోయ. బుడుతలమయ

     వెన్నుపూస విఱుగు. వినిపించుకోరేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మణుఁగులకొద్దీ బరువు గల పుస్తకాలను మోస్తుండడం వల్ల మా బుర్ర చెడిపోతోందికదా! మేము చిన్న చిన్న పిల్లలము కదా! మా వెన్నుపూస విరిగిపోదా? మీరీ విషయం ఎందుకు గ్రహించటం లేదు?

జైహింద్.