Thursday, October 19, 2017

బాల భావన శతకము. 13 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
13) శ్రవణ పుటములందు చప్పుళ్ళు పడుచుండ  చదువుచున్నఁగాని మదికి పోదు.
    చదువుచున్న మాకు సహకరింపరదేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే సమయంలో మీరు అవసరమున్నవాటిని గూర్చి, అవసరము లేనివాటిని గూర్చి మాటాడుకొంటూ ఏవేవో చప్పుళ్ళు చేస్తుంటారు. మా ఏకాగ్రతకు భంగం వాటిల్లుతోంది కదా? మాకు మీరు చదువుకొనేటందుకు ఎందుకు సహకరించడం లేదు?
జైహింద్.

Wednesday, October 18, 2017

బాల భావన శతకము. 12 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
12) దూర దర్శనమున దుర్భర ఘన శబ్ద  కలుషమునకు మనసు కలత చెందు.
    శబ్దమెక్కువున్న చదువుట సాధ్యమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శనములో చూచే కార్యక్రమాలు స్వరమునధికము చేసి వినుచున్న కారణముగా దుర్భరమైన ఆధ్వని కాలుష్యమునకు మా మనసు కలత చెందుతుంది కదా? అంత శబ్దములో చదువుట మాకు సాధ్యమగునా?
జైహింద్.

Tuesday, October 17, 2017

బాల భావన శతకము. 11 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
11) దూర దర్శనమును మీరు చూచుచు మమ్ము - మెదలకుండ చదువు చదువుమనిన
   మనసు నిలుచునెటుల? మాకది సాధ్యమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శన యంత్రము ద్వారా కార్యక్రమములను చూస్తూ, మమ్మల్ని కదలకుండా మెదలకుండా చదవమంటారు. మీరు చూస్తున్న కార్యక్రమాలు అక్కడే ఉంటున్న మేము చూడకుండా, ఆశబ్దము వినకుండా మమ్ములను మేము ఎలా నిరోధించుకొనగలము? ఈ విషయమును మీరెందుకు ఆలోచించరు?
జైహింద్.

Monday, October 16, 2017

బాల భావన శతకము. 10 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
10) చదువుకొనెడి వేళ చదువుకోనీయక  పనులు చెప్పి మమ్ము పంపు మీరు
    చదువు వెనుకఁబడిన, చవటగా చూతురాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనవలసిన సమయంలో చదువుకోనీకుండా ఏవో పనులు మాకు చెప్పి మా చదువుకు ఆటంకము కలిగిస్తారు. ఆ కారణముగా మేము చదువులో వెనుకబడుసరికి మేము పనికిరాని చవటలమన్నట్లుగా మీరు చూస్తారు. ఇదేమైనా బాగుందా?
జైహింద్.

Sunday, October 15, 2017

బాల భావన శతకము. 9 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
9) మాకు నచ్చు విద్య మమ్మెంచుకోనీక  మీకు నచ్చుదాని మాకు పులుమ
    మాకు రాకపోవు. మాదోషమాయదిపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!మాకు నచ్చిన చదువును మమ్ములనెంచుకోనీకుండా మీకు నచ్చిన విద్యను మాచే బలవంతముగా నేర్పింతురు., ఆ విద్య మాకు రాక పోతే అది మా తప్పా?

జైహింద్.

Saturday, October 14, 2017

బాల భావన శతకము. 8 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
8) తోటివారితోడ సాటిగా మముఁ జేయ  నబ్బనట్టి విద్య నరయఁ జేసి,
    ఫలము దక్కకున్న పనికిరామనుదురాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ తోటివారి పిల్లలను చూచి వారితో మమ్ములను పోల్చుకొంటూ మమ్మల్ని కూడా వారిలాగా చేయడం కోసం మా కు అబ్బనట్టి విద్యను బలవంతముగా నేర్పు చున్నారు. అది మాకు అబ్బక, మీరు కోరుకొన్న ఫలితము దక్కకపోవుసరికి మమ్ములను పనికి రారు అని పలికి కించపరచుదురా? ఇది న్యాయమేనా?
జైహింద్.

Friday, October 13, 2017

బాల భావన శతకము. 7 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
7) పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి  పలుకునటులఁ జేయ పలుకఁ గలము.
   పద్యమొక్కటైన పలుక నేర్పరదేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా చేతికి రాతి పలక వ్రాసుకొనుటకు ఇచ్చి, మా చేత పద్యాలు మీరు వ్రాయించి చదువునట్లు చేసినచో మేము ఆ పద్యములు చెప్పఁగలము కదా. మీరు చక్కని తెలుఁగుపద్య మొక్కటైనా మాకు నేర్పరెందులకు?
జైహింద్.