Friday, October 13, 2017

బాల భావన శతకము. 7 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
7) పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి  పలుకునటులఁ జేయ పలుకఁ గలము.
   పద్యమొక్కటైన పలుక నేర్పరదేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా చేతికి రాతి పలక వ్రాసుకొనుటకు ఇచ్చి, మా చేత పద్యాలు మీరు వ్రాయించి చదువునట్లు చేసినచో మేము ఆ పద్యములు చెప్పఁగలము కదా. మీరు చక్కని తెలుఁగుపద్య మొక్కటైనా మాకు నేర్పరెందులకు?
జైహింద్.

Thursday, October 12, 2017

బాల భావన శతకము. 6 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
6) అక్షరాలునేర్పి యవధులు కనఁ జేయ   శ్రద్ధతోడ మేము చదివి, కనమె?
    బొమ్మ చూపి చదువు రమ్మన్న వచ్చునాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు మీరు సక్రమముగా వర్ణమాల నేర్పి, మంచి చెడ్డలను చూపినచో మేము శ్రద్ధతో చదువుకొని, మీరు చెప్పినవి గ్రహింపలేమా? బొమ్మలు చూపించుతూ చదువు చెప్పుచున్నచో మాకు ఏవిధంగా చదువు అబ్బుతుంది?
జైహింద్.

Wednesday, October 11, 2017

బాల భావన శతకము. 5 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
5) నేర్వవలసినపుడు నేర్పక మమ్ముల  నేర్పు లేదటంచు నింద చేసి
    పదుగురు విన మమ్ము వదరుచుందు రదేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఏది ఎప్పుడు నేర్పాలో అప్పుడు నేర్పక ఆ తరువాత మేము ఆ విషయములను నేర్చుకోలేదంటూ పదిమందిలోనూ అవమానపరుస్తూ మాటాదురుకదా! అది సరియగు పనియేనా?
జైహింద్.

Tuesday, October 10, 2017

బాల భావన శతకము. 4 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
4) ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరుహద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.
    హద్దు లెల్ల నేర్ప శ్రద్ధగా నేర్వమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్ము గారము చేసి, ఏది చేయ వచ్చునో ఏది చెయ్య కూడదో అనే వాటికి సంబంధించిన హద్దులు చెప్పరు. తెలియక పోవుటవలన మేము హద్దులు దాటినచో మమ్ములను దండింతురు. మీరు మాకు ఆ విషయములను వివరించి చెప్పినచో మేము శ్రద్ధగా నేర్చుకొందుముకదా!
జైహింద్.

Sunday, October 8, 2017

బాల భావన శతకము. 3 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
3) మదిని నిలుప లేక మన్నింప వేడుచు  తెలుపుచుంటిమయ్య తెలియుఁడయ్య
    మనసు కలత పెట్టు మా బాధలన్నియు  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా మనసులను కలత పెట్టుచున్న మాకు బాధగా అనిపించుచున్న విషయములను మనసులో దాచుకొన లేక మీకు తెలియ జెప్పు చున్నాము. అవి మీరు తెలుసుకొన కోరుచున్నాము.
జైహింద్.

Friday, October 6, 2017

బాల భావన. ( నీతి శతకము 1 వ పద్యము.) రచన: చింతా రామ కృష్ణా రావు

జైశ్రీరామ్.
బాల భావన.
నీతి శతకము )
రచన: చింతా రామ కృష్ణా రావు
1) శ్రీశు మదిని నిలిపి ప్రేమగా మము చూచి  కావుమా యని  మది కరఁగ వేడి,
   పెద్దలైన మిమ్ము ప్రీతితో కొలుతుము   పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. శ్రీమత్ జ్ఞాన సుసంపన్నులైన ఓ పెద్దలారా! శ్రీమన్నారాయణుని మా మదిలో నిలిపి ప్రేమగా మమ్ములను చూచి కాపాడుమా యని అతని మనసు కరిగే విధముగా ప్రార్థించి, పెద్దలైన మిమ్ములను ప్రేమతో కొలుచుదుము.
సశేషమ్..
జైహింద్.