పద్య విపంచిని మీటుచు , సద్యశమును కలుగజేయు చక్కని కృతులన్ , హృద్యంబుగ వ్రాసినచో , విద్యాధికులంత మెచ్చు విశ్వము పొగడున్.
Saturday, April 9, 2016
Friday, April 8, 2016
“దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్”
జైశ్రీరామ్.
“దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్”
"శ్రీరామకవిచంద్రుని నేను రెండవ శ్రీనాధునిగా నామనస్సులోఅనుకొందును …ఇక్కవి సహజపాండిత్య విషయముననే కాక భాగవతాంధ్రీకరణప్రసక్తియందుఁగూడ బోతరాజు గారే! ఈయనసరసకవి,విద్వత్కవి,ఆశుకవి,దాత,న ేత.... 19వ శతాబ్దమున నుదయించిన యాంధ్రకవులలో నిట్టికవి మృగ్యుడు. ఇన్నియదృష్టములు సంఘటించిన కవి లేనే లేఁడు." ఇవి దాసు శ్రీరామకవి కవితా కౌశల్యాన్ని కొనియాడుతూశతావధాని బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు అన్నమాటలు. ప్రముఖన్యాయవాది, సంఘసంస్కర్త, వాగ్గేయకారుడు, మహాకవిగా 19 వ శతాబ్దములోఆంధ్రదేశంలో సంగీత,సాహిత్య,సాంస్కృతిక రంగాలను,సంఘసంస్కరణోద్యమాలను ప్రభావితము చేసిన బహుముఖ ప్రఙ్ఞాశాలి దాసు శ్రీరాములు ఏప్రిల్ 8, 1846న కూరాడ గ్రామంలో జన్మించారు.కృష్ణాజిల్లా,ముదినేపల్లి మండలంలో అల్లూరిఅగ్రహారీకులు,సంపన్నకుటుంబీకులు కన్నయ్య, కామమ్మ పుణ్యదంపతులకుఏకైకసంతానం. స్వయంకృషితోనే విద్యాభ్యాసం చేస్తూ సంస్కృతాంధ్ర భాషల్లోపండితులై ప్రబంధాలు, పురాణాలు, నాటకాలు, శతకాలు,ధర్మశాస్త్రగ్రంధాలు,కృతులు,జావ ళీలు,పదములు,యక్షగానాలు మొదలైన వైవిధ్య ప్రక్రియలలో ముప్పదికి పైగా గ్రంధాలు రచించారు. వారి రచనలో చివరదిమకుటాయమానమైన శ్రీ దేవీభాగవతము. ఆశుకవితాధారగా ఐదున్నర నెలలస్వల్పకాలంలో అనువదించారు.
శ్రీరాములు గారు అసామాన్యమైన మేధస్సుకలవారు. 'గీర్వాణపీఠం'గా పేరుపొందిన ఆకిరిపల్లి లో అప్పటి నూజివీటి సంస్థానాధీశులు ఏర్పరిచిన నెలకు 8 అణాల ఉపకారవేతనంతో (1858 సం.లొ) పదినెలలు ఉండిసంస్కృత వ్యాకరణం నేర్చుకోవటమే కాకుండా , అష్టావధాన, శతఘంటకవనాలలో సిద్ధ హస్తులైనారు. ప్రప్రథమంగా అష్ఠావధాన ,శతావధానరచనాసంవిధానాన్నిఆంధ్ర దేశానికి పరిచయం చేసి, విస్తృత ప్రచారం కల్పించినఘనాపాఠి నూజివీడు సంస్థాన విద్వాంసులు, విద్వాన్ మాడభూషివెంకటాచార్యుల వారు (1835-1897) 12 ఏళ్ళ బాలుడైన శ్రీరాములు యొక్క ఆశుకవితా పాటవానికి, వ్యస్తాక్షరీ ప్ర్రక్రియలో ప్రతిభకు ముగ్ధుడై ఆశువుగా“దాసురామ కవితా లీలాబ్ది నోలలాడితిన్."అంటూ ఈపద్యం చెప్పి ఆశీర్వదించారు.
"పది రెండేడుల యీడునం గవితఁ చెప్పంబూని వ్యస్తాక్షరీ
విదభిఖ్యాతిఁ బొసంగి లేఖ కశత వ్రీడాకరంబైన మే
రఁ దుదిన్ బద్యము లల్లి సద్గణిత హోరాశాస్త్రసామర్ధ్యముల్
వెదజల్లం దగు దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్."
జైహింద్.
శ్రీ దుర్ముఖ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రచన : `అవధానరత్న` డా.మాడుగుల అనిల్ కుమార్
జైశ్రీరామ్,
మిత్రులందరికీ శ్రీ దుర్ముఖ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
శ్రీ దుర్ముఖ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పద్యరత్నములు.
రచన : `అవధానరత్న` డా.మాడుగుల అనిల్ కుమార్
శా.శ్రీమన్మన్మథనామవత్సరము యిచ్చెన్ సౌఖ్య సంపత్తులన్
ప్రేమించెన్ వసుధాతలంబు అటుపై వీడ్కోలు పల్కెన్ తగన్
రామారత్నము లక్ష్మి వెంటబడ దౌర్భాగ్యంబులన్ బాపుచున్
శ్రీమద్దుర్ముఖ నామ వత్సరము విచ్చేసెన్ ప్రమోదమ్ముగన్ || . 1
ప్రేమించెన్ వసుధాతలంబు అటుపై వీడ్కోలు పల్కెన్ తగన్
రామారత్నము లక్ష్మి వెంటబడ దౌర్భాగ్యంబులన్ బాపుచున్
శ్రీమద్దుర్ముఖ నామ వత్సరము విచ్చేసెన్ ప్రమోదమ్ముగన్ || . 1
ఉ. కోకిల శ్రావ్యకంఠమది క్షోణిజనమ్ముల నిద్ర లేపుచున్
వ్యాకులమెల్లబాపుచునుగాది దినమ్మును గుర్తుజేయగా
చీకటి దొల్చి భానుడు ప్రసీదుడునౌచు వసంత మాసముం
జేకొనివచ్చె సంతసిల శ్రీయుత దుర్ముఖ వత్సరాబ్దిలో || .2
వ్యాకులమెల్లబాపుచునుగాది దినమ్మును గుర్తుజేయగా
చీకటి దొల్చి భానుడు ప్రసీదుడునౌచు వసంత మాసముం
జేకొనివచ్చె సంతసిల శ్రీయుత దుర్ముఖ వత్సరాబ్దిలో || .2
సుగంధి : వానలేక మన్మథాఖ్య వర్షమందు కర్షకుల్
దీనులైరి ఆత్మహత్యలే శరణ్యమంచు నీ
వైనదీర్చుమోయి వారి బాధ దుర్ముఖాబ్ది ! స
న్మానమందుచున్ ఉగాది మంగళంబు పల్కెదన్ || .3
దీనులైరి ఆత్మహత్యలే శరణ్యమంచు నీ
వైనదీర్చుమోయి వారి బాధ దుర్ముఖాబ్ది ! స
న్మానమందుచున్ ఉగాది మంగళంబు పల్కెదన్ || .3
ఉ.పోవును దుఃఖముల్ జరుగనున్నది శ్రేయములెల్లవేళలన్
చేవయొసంగు రైతులకుఁ చేనులు పండెడు వర్షపాతమే
కావలయున్ ధరిత్రి చిరకాలమభీప్సిత సస్యపూర్ణమౌ
దీవెనలిచ్చెడున్ తిరుపతీశ్వరుడే నవదుర్ముఖాబ్దిలో || .4
చేవయొసంగు రైతులకుఁ చేనులు పండెడు వర్షపాతమే
కావలయున్ ధరిత్రి చిరకాలమభీప్సిత సస్యపూర్ణమౌ
దీవెనలిచ్చెడున్ తిరుపతీశ్వరుడే నవదుర్ముఖాబ్దిలో || .4
కవిరాజవిరాజితము :
సురుచిరపల్లవ శోభనుఁదోడ్కొని చూతమహీరుహముల్ ధరణిన్
పురజనగేహము ముంగిలి భాగము ముచ్చటగొల్పగ తోరణమై
వరరుచిరంబగు వన్నెలముగ్గులు భావ్యము నూత్నయుగాదిఘడిన్
కరవునుఁ దీర్చెడు కావ్యముఁగూర్చెడు కాలము
మారెడు దుర్ముఖిలో || .5
సురుచిరపల్లవ శోభనుఁదోడ్కొని చూతమహీరుహముల్ ధరణిన్
పురజనగేహము ముంగిలి భాగము ముచ్చటగొల్పగ తోరణమై
వరరుచిరంబగు వన్నెలముగ్గులు భావ్యము నూత్నయుగాదిఘడిన్
కరవునుఁ దీర్చెడు కావ్యముఁగూర్చెడు కాలము
మారెడు దుర్ముఖిలో || .5
తే.గీ.
ఈ వసంతము గాదెలు నిండి యింపొసంగు
నదులుఁ బరవళ్ళుఁ ద్రొక్కుచు ముదముఁగూర్చు
షడ్రసోపేతమైనపచ్చడియె మాకు
ఆరు ఋతువులునానందమందజేయు. 6
ఈ వసంతము గాదెలు నిండి యింపొసంగు
నదులుఁ బరవళ్ళుఁ ద్రొక్కుచు ముదముఁగూర్చు
షడ్రసోపేతమైనపచ్చడియె మాకు
ఆరు ఋతువులునానందమందజేయు. 6
**********జైహింద్ *******
Thursday, April 7, 2016
ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ష్టూడియో యన్ లో . . .
జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశ్శివాయ.
ఆర్యులారా!
నూతన తెలుఁగు సంవత్సరాగమన శుభవేళలో మీకందరికీ నా శుభాకాంక్షలు.
శ్రీదేవీ హృదయాబ్జ భృంగ విలసచ్ఛ్రీ మన్మహావిష్ణువే
మోదంబున్ మిముఁ గాచుఁగావుత! మహత్పుణ్యంబు చేకూర్చుతన్,
బాధల్ కానని భక్తితత్పరతయున్, భద్రాత్మయున్, భాగ్యమున్,
శ్రీదేవీ కరుణార్ద్రదృష్టి కలుగన్ జేయున్ సదా దుర్ముఖిన్.
శుభాకాంక్షలతో
మీ
చింతా రామకృష్ణారావు.
ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ష్టూడియో యన్ లోనేను పాల్గొనిన హాస్యావధానం ప్రసారమౌతుంది. అవకాశం ఉంటే చూడగలరేమోనని తెలియజేయుచున్నాను.
జైహింద్
Wednesday, April 6, 2016
బళ్లారి. జోళదరాశిలో అష్టావధానము. అవధాని డా. మాడుగుల అనిల్ కుమార్.
జైశ్రీరామ్
అష్టావధానము
స్థలం : జోళదరాశి, బళ్లారి.
తేది : 03/04/2016 సమయం : సాయంత్రం 6.00 గంటలకు
సంచాలకులు : త్రిభాషావధాని డా.జోస్యుల సదానందశాస్త్రి గారు
అవధాని : అవధానరత్న డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్
అవధానానికి ముందు చెప్పిన పద్యాలుశ్రీ గుత్తి నారాయణ రెడ్డి సాహితీ పీఠంవ్యవస్థాపకాధ్యక్షులు
శ్రీ గుత్తి చంద్రశేఖరరెడ్డి గారి గురించి :
ఆయత దానధర్మములకాస్పదులై జనులెల్ల మెచ్చగా
స్వీయ యశమ్ము శాశ్వతము వెల్గగ శ్రీయుత చంద్రశేఖరుం
డీ యజనమ్ముఁ దల్చుచునభీప్సిత సాహితి పీఠమేర్పడం
జేయ కళాసరస్వతి వసింపగగల్గె ధరిత్రి గుత్తి నా
రాయణ రెడ్డి పుత్రుడని ప్రాజ్ఞుడటంచు నమస్కరించెదన్.
సంచాలకులు శ్రీ సదానంద శాస్త్రి గారిని గురించి :
అనవద్యంబగు సంస్కృతాంధ్రములయందష్టావధానక్రియన్
ఘనసత్కారములందియున్ ప్రవిలసత్ కర్ణాటభాషన్ఒగిం
జనునట్లున్ యవధానమున్ నిలిపె తానై శ్రీ సదానందశా
స్త్రిని సంచాలకు సన్నుతింతు మది యాశీర్వాదముల్ గోరుచున్.
ముఖ్య అతిథి శ్రీ కృష్ణదేవరాయలు గురించి :
శ్రీమాన్యంబగు ఆరవీటి కులవార్ధిన్ చంద్రుడై ధాత్రిలో
ప్రేమస్వాంతుడునై ఉదారమతియై విద్వత్సభాధ్యక్షులై
ధీమంతుండగు కృష్ణరాయలలరన్ తేజోయశోపేతులై
నేమంబొప్ప నమస్కరింతునితనిన్ నిశ్శ్రేయసమ్మొందగన్.
అవధాన ప్రారంభము :
1.నిషిద్ధాక్షరి :
గిరిజా కళ్యాణం :
శ్రీ వాక్కైయుండుదువో
నీవే నిన్ భద్రుతోనె నేనెంతున్ భో
కావించెద కళ్యాణము
భావింపుము నాదు శుభము భవ్యా గౌరీ!
2.దత్తపది :
శ్రీ కృష్ణునికి ఇప్పుడు సభలో ముఖ్య అతిథిగా ఉన్న శ్రీ కృష్ణదేవరాయలుకు ఉన్న సామ్య,భేదములను
కల్లు, బీరు, సార,రమ్ము అనే పదాలతో చంపకమాలలోవర్ణించాలి.
తరుణికి రాధకల్లుడయి తాఁ మురిపించుచు నాడు కృష్ణుడే
వెరవక బీరులెల్లరల పీచమడంచుచు రుక్మిణిన్ గొనెన్
మరుసటిజన్మ వీరలిట మాన్యులునై మనసార మెచ్చగా
పరిణయమాడిరేకయగు పత్నిని రమ్మని కృష్ణరాయలే.
3. సమస్య :
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్ .
దీర్ఘముగాకపోవునొకొ ? ధీరులు మెచ్చుచు దీవెనివ్వరే
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్
ఘుర్ఘురులెన్ననేల? తరిగొండను వంశజ వేంగమాంబకున్
వార్ఘనులైనవారెగద ! పాయదదెప్పుడు పండితోత్తమా !
4.వర్ణన :
మేమిచ్చిన అంశాలకు మీరు చెప్పిన పద్యాలను మెచ్చుకొని
మేఘుడు వర్షించినట్లు వర్ణించాలి.
పృచ్ఛకోత్తములెల్లరు వేడ్కమీర
ప్రశ్న వేయంగ నాదైన పాండితిగని
పుష్ప వర్షంబుగురిపించెపో ఘనుండు
వసుధ పండితులెల్ల శెభాషనంగ.
5.ఆశువులు :
1.గుత్తి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సాహితీ పీఠాన్ని
చంద్రశేఖరరెడ్ఢి గారు వృద్ధిలోకి తెస్తున్నారని వర్ణించాలి.
గుత్తి నారాయణుడు తానుగోరుకొనుచు
సాహితీపీఠముంగూర్చె మోహనముగ
చంద్రశేఖరరెడ్డియు సాదరముగ
పెంచిపోషించె పండితుల్ భేషనంగ.
2. శ్రీ రామేశాంజనేయ స్వామిని స్తుతిస్తూ పద్యం చెప్పాలి.
శ్రీరామున్ జనకాత్మజాహృదయనీరేజాతమార్తాండు, దు
ర్వారప్రోత్థిత రావణాద్యసుర క్రూరవ్రాత సంహారు, శ్రీ
మారుత్యాది సమస్తభక్త వరదున్ మందస్మితాస్యున్ సదా
శ్రీ రామేశహనూమతాలయ నివాసింగొల్తునిష్టాప్తికై.
6.వ్యస్తాక్షరి :
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
7. పుష్ప గణనం: 12
8.అప్రస్తుత ప్రసంగము
అవధానానంతరం కృతజ్ఞతలు తెలియజేస్తూ -------
జోళదరాశి గ్రామమున సూరిజనుల్ అవధాన కార్య స
మ్మేళనమాదరమ్ముగజుమీ జరిపించిరి, శ్రీ సరస్వతీ
కాళికలక్ష్మి మువ్వురును ఖాయముగా జయమందజేసిరే
పాలునుఁ బంచుకొండనుచు పల్కెద మీకిదె ధన్యవాదముల్.
దీనితో అవధానం మంగళాంతమైంది.
ఇంత అద్భుతంగా అవధాన ప్రతిభాపాటవాలను కనబరచి ప్రేక్షకులను రంజింపఁ జేసిన డా.మాడుగుల అనిల్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమమును నిర్వహించిన గుత్తి వంశజులైన శ్రీ చంద్రశేఖరరెడ్డిగారిని మనసారా అభినందిస్తున్నాను. అత్యంత నైపుణ్యముతో కార్యక్రమమును రక్తికట్టించిన సంచాలకులవారికి నా నమోవాకములు.
జైహింద్.
Subscribe to:
Posts (Atom)





