Showing posts with label నా రచనలు. Show all posts
Showing posts with label నా రచనలు. Show all posts

Tuesday, December 9, 2025

రాఘవ శతకము ఆర్కైవ్.కం లోను,స్క్రిబ్డ్ లోను ప్రకటించబడినవి. ఇది ఆలింకులు.

జైశ్రీరామ్.

Hello,

Congratulations! Your book రాఘవశతకము has been successfully published on Pothi.com. It is now available on Pothi.com's store at https://store.pothi.com/book/self-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%98%E0%B0%B5%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81/.


Notes from the review team

INFO: The INTERIOR colorspace was adjusted.

INFO: The COVER file was flattened to fix transparency.

INFO: The COVER colorspace was adjusted.

Useful links you may need going forward

Updating Your Book

If you need to update your book, please follow these instructions.Hello,

Congratulations! Your book రాఘవశతకము has been successfully published on Pothi.com. It is now available on Pothi.com's store at https://store.pothi.com/book/self-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%98%E0%B0%B5%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81/.


Notes from the review team

INFO: The INTERIOR colorspace was adjusted.

INFO: The COVER file was flattened to fix transparency.

INFO: The COVER colorspace was adjusted.

Useful links you may need going forward

Updating Your Book

If you need to update your book, please follow these instructions.

రాఘవ శతకము ఆర్కైవ్.కం లో ప్రచురించారు.  అలాగే స్త్రిబ్డ్ లో కూడా ప్రచురించారు. ఆ లింకులు ఇచ్చుచుంటినండి

https://ia803409.us.archive.org/0/items/rs-combined/RS-combined.pdf

అలాగే స్త్రిబ్డ్ లో కూడా ప్రచురించారు.

https://www.scribd.com/document/963352872/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%98%E0%B0%B5%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%82-108-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81-%E0%B0%B5%E0%B1%83%E0%B0%A4-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B

జైహింద్.

Monday, December 1, 2025

వైద్యం వారికి తోపెల్లవారి సభలో నా చిత్రకవితాంజలి.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

శ్రీ తోపెల్ల వారిచే బ్రహ్మశ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారికి 

సాహితీచిత్రగుప్త బిరుదు ప్రదానము జరిగిన సందర్భముగా

చిత్రకవితాంజలి.

రచన.  చింతా రామకృష్ణారావు.


శా.  శ్రీమన్మంగళ వైద్యమన్ గృహమునన్ శ్రీవేంకటేశుల్ శుభ

శ్రీమార్గాద్భుత సత్ప్రవర్తనపరుల్ చెల్వొంద జన్మించి స

చ్ఛ్రీమద్భాసుర సత్కవిత్వమున సచ్చిత్రంపు సత్ సాహతీ

భూమిన్ జూపిన చిత్రగుప్తునిలపై పోషింపుమా శ్రీహరీ!


చతుర్వింశత్యధిక ద్వివిధకంగ గీత గర్భ చంపకమాల.

వర గుణ భాగ్యధా! విజయ వర్ధన చిత్రకవిత్వరూపధా!

స్తిర ఘనుఁడా! లసన్ మతిని దీప్తిని గొల్పెడి మాన్య సారథీ!

పర గణుఁడా! నతుల్, వినుత  వైద్య నయాన్వయ వేంకటేశ! మా

చిర వినుతాక్షరా! జయము చిందును మీదు ప్రశాంత శోభతోన్.


చం.  వరపురుషోత్తమార్యులకు భాసిలు కృష్ణమకున్ జనించి స

న్నిరుపమ కీర్తి గొల్పితివి నీవరవంశజులెల్లఁ బొంగగన్,

సరిగన లేరు నీకనగ చక్కని చిత్ర కవిత్వ శోధనన్

ధర వెలుగొందితీవు, శుభదాయక నిన్ను శుభాళి చేరుతన్.


షడర బంధ్ శార్దూలము. 

3వ వృత్తములో (రా-మ-కృ-ష్ణ-క-వి)

6వ వృత్తములో (సు-క-వి-వై-ద్యము) 

వృత్త కేంద్రమున (వి)

ధన్యా! రా, మన సు న్నసత్క వి కిలన్ దా వై నకృ ష్ణ!  క్ష మా

గణ్యా! ఞ్జు ల ల్ప నా క వి కృతిన్ గ ద్య ప్ర భా ల్ప మున్

పుణ్యా కృ ష్ట సు వి ద్య నిమ్ము వి  ధి గా భో! ము ద్దుగా విష్ణు! మా

మాన్యా మా ధ వ! భో గ భాగ్య పు గతుల్, మా న్యత్వ మున్ గొల్పుమా.


సీ.  శ్రీనివాసశతక, చెన్నరాయ శతక, జయ సుదర్శనచక్ర శతక, తెలుఁగు

భాషాశతకనామ భాస్వత్కృతుల్ ద్వాద శంబమోఘంబుగా సన్నుతముగ

వ్రాసి, వ్యాసములెన్నొ వాసిల్లగా వ్రాసి, లెక్కయేలేనన్ని పెక్కు కృతులు

చిత్రకవిత్వాన చెలఁగువాటిని గొని, చిత్రించి జనులకు చేర్చినావు.

తే.గీ. పెక్కుబిరుదులు నినుఁ జేరె, నిక్కముగను,

సాహితీచిత్రగుప్తుఁడన్ సార్థకమగు

బిరుదు తోపెల నీకిచ్చె, వరలుమిలను.

మంగళంబులు నీకు సన్మంగళములు.

మంగళం           మహత్           శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.

నా సౌందర్యలహరిపై బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాత రాజారావుగారు అనుగ్రహించిన. ... సంశబ్దనం.

జైశ్రీరామ్. 

నా సౌందర్యలహరిపై

అవధాన భారతి. సాహితీ చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి. స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్. 92913 33880.

వారు అనుగ్రహించిన

సంశబ్దనం.


     పద్యరచనలోనెన్నెన్ని మార్గములున్నవో- అన్నింట తన ప్రతిభాపాండితీవైభవముతో నడిచి- తనతో బాటు మరికొందరిని నడిపించి- శ్రీ భారతీ పద పద్మారాధకులుగా నిలిచిన వారు శ్రీ చింతా రామకృష్ణారావుగారు.


    వీరి చిత్తవీథి యందు నొక భావన మెరుపుతీగవలె మెరసిన వెంటనే దానినొక రసవత్తర కావ్యముగా రచించి- తెలుఁగువారికి నందించుట యనునది యొక దీక్షగా తలంచినటుల - వీరు వ్రాసిన కావ్య పరంపరల ద్వారా మనము తెలిసికొన వచ్చును. వీరి ప్రోత్సాహముతో మరికొందరు పద్య ప్రేమికులు పద్య రచయితలై వీరివలె గ్రంథములు రచించి భాషాసేవ చేయుచున్నారు.


     శ్రీ చింతావారి కలమునుండి జాలువారిన మరొక అద్భుత కావ్యము 'ఆంధ్రసౌందర్యలహరి." ఇది యనువాద కావ్యము. సాక్షాత్ శంకర స్వరూపమైన ఆదిశంకరాచార్య విరచితమగుసౌందర్యలహరి" ని వీరు తెలుగున పద్యకావ్యముగా రచించుటయే కాక మూలశ్లోకములకు తెలుఁగు ప్రతిపదార్థమును భావమును వ్రాసి మనకునందించినారు.


     ఒకరి కావ్యమను మరోకవి మరియొకభాషలో ననువదించుటకు - తదనువాద కవికి రెండు భాషలందు తగినంత పట్టుండవలయునుమూలకవి భావమును చక్కగా గ్రహించవలెను. ఉన్నదున్నట్టుగా భావ వ్యక్తీకరణ చేయవలయును. "కాళిదాసు కవిత్వము కొంత- నాకైత కొంత అన్నట్లుగా వ్రాయ కూడదు. సహజ భావన పాఠకులుమెచ్చు కొనునట్లుండవలెను.

ఏతద్విషయమున శ్రీ చింతావారు శ్రీశంకరుని భావముననుసరించియే- శ్లోకములకు పద్యములందించినారు. ఆయా ప్రతి పద్యమూ శంకరుని ప్రతిపాదిత భావమునే ప్రకటీకృతము చేయుచున్నది.


మొదట శ్రీగౌరీ ప్రార్థనాపద్యమునందే

శా.  శ్రీమన్మంగళ! శాంభవీ జనని!  హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!

సామాన్యుండనునీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్

నీమంబొప్పఁ దెనుంగు చేసెదనతుల్నీవే లసద్వాణిగాఁ

బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.

అంటూ తాను సామాన్యుఁడనని, శ్రీ శంకరుని సౌందర్యలహరి అసామాన్యమని, ఆంధ్రానువాదము చేయుచుంటినని నీవే లసద్వాణిగాఁ బ్రేమన్ వెల్గుమంటూ  అనువాదమును ప్రారంభించి- అమ్మదయతో - అసామన్యమగు రీతిగా పద్యములను వ్రాసి తన ప్రతిభను వినయ మతితో తెలియఁజేసారు.


శంకరభగవత్పాదుల తొలి శ్లోకమగు శివశ్శక్త్యా యుక్తో యది భవతి ని మనోజ్ఞముగ అమ్మాఅంటూ త్రిమూర్తుల కర్తవ్యములను వారలకబ్బిన శక్తులకు నీవే మూలమనుచు చక్కని పదములతో రచించినారు.


42వ శ్లోకమగు గతైర్మాణిక్యత్వం…..ధిషణామ్.” ను అనువదించునపుడు పద్యమునందు చూపిన పద శైలి మూలశ్లోక భావమున కంటె మరింత గొప్పగానున్నది.


60వ శ్లోకమగు సరస్వత్యాస్సూక్తీ”….కినొనరించిన పద్యానువాదము ప్రశంసనీయముపద్యమెత్తుగడలోనే వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు  అంటూ శ్రీ చింతావారు తనకున్న సంస్కృతభాషాపాండితీశోభను అసామాన్యమగు రీతిగా మనముందు కనబరిచినారు.


90వశ్లోకమున  దదానే…..చరణతామ్.”  అను శ్లోక అనువాదమునందు తుమ్మెదను సుకాండి యను పదప్రయోగమును జూపి తమకున్న పర్యాయపద ప్రయోగ చాతురిని ప్రదర్శించినారు.


నివేదనలో సౌందర్యలహరి మరియు తానొనర్చిన పద్యానువాదమునందలి పద్యములను పాఠకులు చదివినచో కవియైన నన్నుచదివిన చదువరులనెల్లరను దయతో చూడుమనిఫలశ్రుతిని వెల్లడి చేసినారు.


ఇలా వంద శ్లోకములకు వంద పద్యములువంద ప్రతిపదార్థములువందభావములను వ్రాసి శ్రీ రామకృష్ణారావు శ్రీ శంకరుల కృపకుఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల దయకు పాత్రులైనారు.


కం.  చింతా యను పద భావమె

చింతించుట యగునుమీరు చిత్తమునందున్

సంతతము చింత చేయుచు,

సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.


కం.  ఎన్నని వ్రాయుదురయ్యా!

ఎన్నగ మీ ప్రాయ మెంతయెసగెడు చిత్తం

బున్నట్టి శక్తి సంపద

లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!


కం.  పద్దెములెన్నివిధంబులొ

యద్దెస మీ గమనముండునాలోచనముల్

తద్దిశ మెరయున్ గావ్యం

బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.


కం.  పుంభావ భారతీ యని

సొంపుగ పిలువంగ తోచుసుందరమతితో

న్నింపుగనను మన్నించుచు

కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!


చక్రాల లక్ష్మీ రాజారావు

19.10.24  

జైహింద్.

Tuesday, September 2, 2025

గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.

 ఓం శ్రీమాత్రే నమః🙏🏻

గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. 

శాంకరీ శతకము.

ఓం గం గణపతయే నమః


1.ఓం గజాననాయ నమః

శా.  శ్రీమద్గణ్య *గజాననా!* సువదనా! శ్రీ పార్వతీ నందనా!

నీమంబొప్ప శతాధికంబుగలవౌ నీ గౌణనామంబులన్

శ్రీమన్మంగళముల్ రచించుటకునై చేపట్టితిన్ వ్రాయగా,

ప్రేమన్ బద్యములల్లఁజేయుమయ, దారిన్ జూపుచున్, శాంకరీ! 


2.ఓం గణాధ్యక్షాయ నమః

మ.  ధరణిన్ శ్రీగణనాధుడంచన *గణాధ్యక్షా!* నినున్ మానవుల్,

పరమానందము నొంది నీవు విలసద్భక్తిన్ మెచ్చుచున్ బ్రేమతో

సరిలేనట్టి శుభాళినే గొలుపుచున్ జక్కంగఁ గాపాడుచున్

బరితుష్టిన్ గలిగింతువయ్య! ప్రణతుల్, భాసించు శ్రీ శాంకరీ!


3.ఓం విఘ్నరాజాయ నమః

మ.  శుభముల్ గొల్పెడి *విఘ్నరాజ!* ప్రణతుల్ శోభస్కరా! నీవు నా

కభయంబిచ్చిన చాలునయ్య! నిరతంబర్చించుచున్  నేను నీ

ప్రభనే పద్యములందు నిల్పెదనయా! ప్రఖ్యాతినే తెల్పగా

సభలన్ నీ వరపద్య సత్ పఠనమే సాక్ష్యంబుగాన్, శాంకరీ!


4.ఓం వినాయకాయ నమః

చం.  మహిత *వినాయకా!* ప్రజలు మన్ననఁ బొందగ నెంచుచుండి నీ

మహిమను చాటునట్టి వరమంత్రసమన్విత నామపద్యముల్

స్పృహఁ గొనుచున్ బఠించెదరు శ్రీకరసత్ఫలమార్గమంచు, ని

న్నహరహమున్ స్మరించెద నహంబును బాపుము నాకు, శాంకరీ!


5.ఓం ద్వైమాతురాయ నమః

మ.  విను  *ద్వైమాతుర!* కర్ణపేయముగ నే విన్పించు పద్యాళినే,

తనువున్, జిత్తము, చేతనంబు నొకటై తాదాత్మ్యమై నీ ద్యుతిన్

గనగాఁ జేసెడి గౌణనామములనే గన్పింపఁ బద్యాళిలో

వినయంబొప్పగ వ్రాసినాడ,  విలసద్విజ్ఞానదా! శాంకరీ!


6.ఓం ద్విముఖాయ నమః

చం.  *ద్విముఖ!* గణాధిపా! ప్రముఖ విశ్వశుభంకర!  పార్వతీసుతా!

సముచిత రీతి నిన్ గొలుచు సద్వరశక్తి నొసంగుమయ్య! క్షే

మము జనపాళికిన్ గొలుపు మంత్రము నీ మహనీయ నామమే,

సముదిత రీతి లోకులను చల్లగ చూడుము నీవు శాంకరీ!


7.ఓం ప్రముఖాయ నమః

చం. *ప్రముఖ!* మనంబునన్ నిలుము,  భావనఁ జేయగనిమ్ము నిన్ను,  నా

సమయము నంత నీ వినుత సచ్చరితంబు నెఱుంగ నీయుమా

నిమిషము వ్యర్ధమైన నది నిల్వక తాను గతించిపోవుగా

సమయము నెంచి కావు నను చక్కగ నీవు, మహాత్మ! శాంకరీ!


8.ఓం సుముఖాయ నమః

మ.  *సుముఖా!* ప్రేమగ చూచుదైవమని నిన్ శుద్ధాంతరంగంబుతో

క్షమతో సన్మునులెల్లఁ గొల్తురయ! యోగక్షేమముల్ నిత్యమున్

నిమిషంబందునె గొల్పువాఁడవనుచున్ నీ శక్తినే యెన్నుచున్

గమనింపంగదె భక్తితత్పరుల నో గణ్యాత్ముఁడా! శాంకరీ!


9.ఓం కృతినే నమః

మ.  *కృతి!* నే నేకృతి వ్రాయఁ బూనినను మున్ బ్రీతిన్ నినున్ గొల్తు నో

నుతపాదాబ్జ! మహత్వశక్తినపు డేనున్ గాంచగా సాధ్యమౌన్

క్షితి నా కావ్యము లెన్ని భక్తియుతులై కీర్తించుచున్ నెవ్వరేన్

ధృతిమంతుల్ పఠియించిరేని శుభులై దీపింతు రో  శాంకరీ!


10.ఓం సుప్రదీపాయ నమః.

చం.  ప్రణతులు *సుప్రదీప!* తనరారగఁ జేయము భక్తపాళినే,

గణుతి వహించునట్లు గుణగణ్యులు గౌరవమొందునట్లుగా

ప్రణవమహత్స్వరూప! పరిపాలన చేయుచు మంచి నిల్పుమా,

గుణగణనాభిరాములను కూర్మిని కావుమ నీవు, శాంకరీ!


11.ఓం సుఖనిధయే నమః

ఉ.  ధీపటిమప్రదా! *సుఖనిధీ!* నినుఁ గొల్చెద భక్తి నిల్పి, నీ

రూపవిశేషముల్ మహిత రోచియుఁ దెల్పఁగ నెట్లు సాధ్యమౌన్?

ప్రాపితమైన జ్ఞానమున పద్యములందు రచించుచుంటి, న

న్నాపదలొందనీక  నహర్నిశలున్ గనుమయ్య, శాంకరీ!


12.ఓం సురాధ్యక్షాయ నమః

ఉ.  అక్షయమైన జ్ఞానము మహత్తర రీతిని గొల్పు మో *సురా

ధ్యక్ష!* జయాస్పదంబుగు పదంబులనొప్పెడి పద్యసంహతిన్

శిక్షణమిచ్చి నామదికి శీఘ్రమె నేడు రచింపఁ జేయుమా,

రక్షణ నీవె గొల్పుటను రాజిలుచుంటిని ధాత్రి శాంకరీ!


13.ఓం సురారిఘ్నాయ నమః

శా.  విఘ్నాళిన్ నశియింపఁజేసి జయముల్ ప్రీతిన్ బ్రసాదించు మా 

విఘ్నేశా! శుభ మంగళాంగ విలసద్విజ్ఞాన తేజా! *సురా

రిఘ్నా!* నామది శత్రుషట్క మమరెన్, బ్రీతిన్ దొలంగించు మ

ర్శోఘ్నంబున్ గొనిదెత్తు నీకొఱకునై, శోభస్కరా! శాంకరీ!

(అర్శోఘ్నము=మీగడపెరుగు) 


14.ఓం మహాగణపతయే నమః

చం.  ధనములు, ధాన్యముల్, సుఖము ధాత్రిని నిత్యము కావు శ్రీ*మహా

గణపతి!* నీప్రభాసమున గణ్యమహత్కర కావ్యసత్కృతుల్

మను కడదాక ధాత్రిపయి మన్నన లొందుచు, సద్విదార్చితా!

మనునటు చేసి యీ కృతిని మంచిని నిల్పుమ ధాత్రి,  శాంకరీ!


15.ఓం మాన్యాయ నమః

శా.   ఓ *మాన్యా!* గణనాథ! దివ్యగతి మా కొప్పారగా నిమ్ము,  నీ

ప్రేమన్ జూపుము భక్తపాళిపయి యావిర్భావమై యాత్మలన్,

శ్రీమంతంబగు భక్తి నిమ్ము, విజయశ్రీలన్ గనం జేసినన్

ధీమంతుల్ నిను నమ్మి కొల్తురురిలపై దీక్షన్ సదా, శాంకరీ!


16.ఓం మహాకాలాయ నమః

శా.  హేలన్ లోకజనాళినేలుదువు నీవిచ్ఛన్ శుభాప్తిన్,*మహా

కాలా!* నీ సరి లేరుగా వరదుఁడా! కామ్యర్థదా! వ్రాలెదన్

మ్రోలన్ నిన్ గని మ్రొక్కగన్, జయనిధీ! పుణ్యప్రదా! దేవరా! 

స్థూలామోఘ శరీర! మేల్గొలుపు, ధీశుల్ మెచ్చగా  శాంకరీ!


17.ఓం మహాబలాయ నమః

మ.   విలసద్రూప! *మహాబలా!* కరుణతో విఘ్నంబులన్ బాపుమా,

విలువల్ పెంచు గుణప్రదీప్తినిడుమా, విశ్వాత్మ! నీ యందునన్

కలుగం జేయుమ నమ్మకంబు, త్రిజగత్కల్యాణ సంపత్కరా!

బలమున్ గొల్పి జగద్ధితంబు గొలుపన్ వర్తింపనీ, శాంకరీ!


18.ఓం హేరంబాయ నమః

శా.  *హేరంబా!* వినుతప్రభా! కొలుతు నిన్నేకాగ్రతన్ నిత్యమున్,

స్మేరాంభోరుహసమ్ముఖా! శుభములన్ సిద్ధింపగాఁ జేయరా, 

శ్రీరమ్యాక్షర భావనా సుధనె యాశింతున్ నినున్ గొల్వగన్,

ధీరస్వాంతమునీయ వేడెదనయా! దీపింపగా, శాంకరీ!


19.ఓం లంబజఠరాయ నమః

చం.  సుజనులఁ బ్రోచు వాఁడవను సూక్తినిజంబు జగంబునందు, *లం

బజఠర!* నాదు మంచి కని, వర్ధిలఁ జేయర, భక్తిఁ గొల్పరా,

ప్రజలకు మేలుచేయు గుణ వర్ధన చేయర,  ధర్మవర్తినై

భజనలు చేయఁ జేయర సభక్తిగ నిన్ గని,  భవ్య  శాంకరీ!


20.ఓం హ్రస్వగ్రీవాయ నమః

మ.   సహజాతంబులు మాన్పరావుగద,  *హ్రస్వగ్రీవ!* నీ సత్ కృపన్

మహిమన్ జూపి నశింపఁ జేయుమయ దుర్మార్గంపు దుర్వర్తనల్,

స్పృహలోనుండగఁ జేయుమా సతము, నిన్ సేవింపఁగాఁ జేయుమా,

యిహమున్, సత్పర సత్ఫలంబునిడుమా,  హృద్యంబుగా,  శాంకరీ!


21.ఓం మహోదరాయ నమః

చం.  వినుత *మహోదరా!* కనఁగ విశ్వము మొత్తము నీదు కుక్షిలో

ఘనముగ నొప్పియుండెనొ? జగన్మయ తేజము నీస్వరూపమై

ప్రణవమహాకృతిన్ ముఖము భాసిలుచుండుటెఱుంగుచుంటి, నే 

ననితరభక్తి తత్పరత నంది వసింపగనిమ్ము,  శాంకరీ!


22.ఓం మదోత్కటాయ నమః

ఉ.  త్రోవవు నీవె మా కిల  *మదోత్కట!*  కావగ నీకెసాధ్యమౌన్,

భావనభక్తిపూర్ణమయి వర్ధిలగా మదినెంచియుంటి, నీ

సేవలు చేయు నాకు, వికసింపగఁ జేయుము బుద్ధి సత్ కృపన్,

జీవము నీవెయంచెఱుకఁ జెన్నుగఁ గొల్పుము దేవ!  శాంకరీ!


23.ఓం మహావీరాయ నమః

ఉ.  సారవిహీన లోకమును శాశ్వతమంచు భ్రమించు నన్ *మహా

వీర!* మనంబునన్ నిలిచి ప్రీతిని సత్యము నెన్నఁ జేయుమా, 

భారము నీది, నా బ్రతుకు భద్రతనొప్పి శుభాస్పదంబుగా

తీరము చేరఁ జేయుమయ! ధీర శుభంకర! భవ్య  శాంకరీ!


24.ఓం మంత్రిణే నమః

ఉ.  నామది నుండు *మంత్రి!* శుభనామ! దయాపర! శ్రీగణేశ్వరా!

క్షేమము సౌఖ్యమున్ శుభము సిద్ధిలఁ జేయుమ భక్తపాళికిన్,

బ్రేమను పంచి సజ్జనులు వెల్గునటుల్ మది నెన్ని చేయుమా,

కామితసత్ప్రదా! సుగుణగణ్యులఁ గావుమ, భవ్య శాంకరీ!


25.ఓం మంగళస్వరాయ నమః

ఉ.  పారము చేర్చు సుస్వరము భక్తుల కోంకృతి*మంగళస్వరా!* 

చేరెను నీముఖాబ్జమున చెన్నుగ నోంకృతి రూపుఁ దాల్చి, వి

స్తారమనోజ్ఞభావ పరిసర్పిత సుస్వరపూర్ణ తేజ! సం

సారమునుండి కావుమయ,  సన్నుతిచేసెదనయ్య! శాంకరీ!


26.ఓం ప్రమధాయ నమః

మ.  *ప్రమధా!* నిన్ స్మరియించ నంతటనె సంప్రాప్తించు సంతోషముల్,

శమియించున్ మదమత్సరాదులు, భళా! సంస్తుత్య పాదప్రభా!

క్రమమున్ దప్పక నిత్యకృత్య ఘటనన్ కల్యాణ భాగ్యప్రభన్

బ్రముదంబున్ గలిగించుమా శుభకరా! భాగ్యప్రదా!  శాంకరీ!


27.ఓం ప్రథమాయ నమః

చం.  మరువగ లేము నిన్ను  *ప్రథమా!* యొనరించెడి కార్యమెద్దియేన్

నిరుపమ! నిన్నె కొల్తుమయ! నిత్యశుభంకర! రమ్య పూజ్య దే

వర! కరుణాలవాల! వరభావద! శ్రీగణనాయకా! నతుల్,

కురవకు వ్యర్థముల్, భువిని కోరెద నీ పద సేవ,   శాంకరీ!


28.ఓం ప్రాజ్ఞాయ నమః

ఉ.  ప్రజ్ఞను గొల్పు దేవుఁడవు  *ప్రాజ్ఞ!* శుభాకర శ్రీ గణేశ్వరా!

అజ్ఞులమయ్య మేము, పరమార్థమెఱుంగము, నీ మహాద్భుత

ప్రజ్ఞనెఱుంగుటెట్లు? మదిరంజిల నిన్ను నుతించుటెట్లు? మా

యజ్ఞత బాపినన్ గొలువనౌను నినున్, శుభనామ! శాంకరీ!


29.ఓం విఘ్నకర్త్రే నమః

చం.  త్వరపడి  మేము నిన్ మరచి,  తప్పునొనర్చిన, *విఘ్నకర్త!*  మా

మరపును విస్మరించి పరమార్థము నెంచుచు  కావగా మమున్

నిరుపమ! రమ్ము సత్వరమె, నిండు మదిన్ గరుణించి ప్రేమతో

స్మరణకు వచ్చి నీవు పరమంబుగ కావుము మమ్ము, శాంకరీ!


30.ఓం విఘ్నహంత్రే నమః

చం.  ప్రణతులు *విఘ్నహంత!* రసభావ సమృద్ధిని కావ్యమందు గుం

భనముగ నొప్పఁ జేసి, వరభక్తుల చిత్తములన్ స్పృశిం పగా

ఘనముగఁ జేయుమయ్య! గుణగణ్యులు పద్యములందు నిన్ గనన్,

మనమున పొంగుదీవె, వరమై మము కాతువు, దివ్య  శాంకరీ!


31.ఓం విశ్వనేత్రే నమః

ఉ.  విశ్వమునెల్ల చూచెదవు వేల్పుగ కావగ *విశ్వనేత్ర!* నీ

సుస్వరపూర్ణ మంత్రమును  శోభిలు చిత్తమునన్ బఠింపగా

శాశ్వత సత్ప్రవర్తనము సన్నుత కీర్తి జయంబు లబ్బునో

శశ్వదనంతతేజ! మనసార నుతించెద నిన్ను, శాంకరీ!


32.ఓం విరాట్పతయే నమః

ఉ.  రాజితపూర్ణ చంద్రముఖ! రమ్యగుణప్రద! యో *విరాట్పతీ!* 

సాజము మానవాళికి నశాంతిని గొల్పెడి కోర్కెలిద్ధరన్,

బూజలు మానుచున్ గలుషపూర్ణమనంబుల క్రాలుచుంద్రు, నీ

రాజనమిచ్చు మమ్ము గని రాజిలఁ జేయుమ! దివ్య శాంకరీ!


33.ఓం శ్రీపతయే నమః

ఉ.  *శ్రీపతి!* సుందరప్రముఖ!  చిత్త సరోజమునందు నీవు మా

ప్రాపుగ నిల్చియుండి  తరరారగఁ జేయుమ భక్తి భావనల్,

హే పరమాత్ముఁడా! జగతి నేలెడి నీవె గ్రహించి మమ్ములన్

నీపయి భక్తి కొల్పుమయ, నిర్మల చిత్తములిచ్చి, శాంకరీ!  


34.ఓం వాక్పతయే నమః

ఉ.  సన్నుత  *వాక్పతీ!*  ప్రథిత సంస్తుతసుందరభావపూర్ణ  సం

పన్న పదప్రయోగములు పట్టుగ నీ శతకంబునందునన్

మున్నుగ నేను నేననుచు ముందున నిల్చిలిఖింపమంచనన్

పన్నుగ చేయుమయ్య! వరభావ సమృద్ధిగనుండ,  శాంకరీ!


35.ఓం శృంగారిణే నమః

ఉ.  భారవహుండవీవెకద పన్నుగ కొల్చెడి భక్తపాళికిన్,

నేరము లెన్ని చేసినను నేర్పున మార్చుచు వారిబుద్ధి,  *శృం

గారి!* మనోజ్ఞనామ! శుభకార్యగుణాఢ్యులుగా మలంచుమా,

నీ రమణీయ సద్గుణము నేరను వర్ణనఁ జేయ, శాంకరీ!


36.ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఉ.  *ఆశ్రితవత్సలా!*  జనులకాశ్రయమిచ్చెడి నీ పదాళి నా

కాశ్రయమీయకుండునెటు? లంచిత రీతిని భక్తి నెంచుచున్,

విశ్రమమెన్నకుండ ప్రభవింపఁగ నీవిట పద్యపాళిలో

సుశ్రవణప్రపేయముగ శోభిల వ్రాసితి, చూడు, శాంకరీ!


37.ఓం శివప్రియాయ నమః

చం.  శివునకు ప్రీతిపాత్రుఁడవు, చిన్మయ తేజుఁడ! యో *శివప్రియా!*   

ప్రవరగుణాఢ్యులన్ గనెడి భవ్యుఁడవంచు శివుండు మెచ్చు నిన్,

శ్రవణము చేయుమా కృపను చక్కగ నాకృతి, సద్విదాంవరుల్

జవమున వచ్చు పద్యములు చక్కగ మెచ్చగ చూడు,  శాంకరీ!


38.ఓం శీఘ్రకారిణే నమః

ఉ. శ్రీకర!  *శీఘ్రకారి!*  ప్రవచించెడి వక్తలు నాదు పద్యముల్

ప్రాకటమొప్ప సత్ సభల భక్తిని పాడఁగఁ జేయుమయ్య,  నా

పోకడ చిత్ర పద్య గతి, పొత్తమునందిట పోవనవ్విధిన్,

నీకడ నిల్చి వ్రాసితిది, నీకె సమర్పణ, కొమ్ము,  శాంకరీ!


39.ఓం శాశ్వతాయ నమః

ఉ. శాశ్వతమిద్ధరిత్రిని యసంభవమెన్నగ, దేవ! *శాశ్వతా!*

శాశ్వతమీవె యౌదువయ శంకరనందన! పార్వతీసుతా!

విశ్వము కాదు శాశ్వతము,  ప్రీతిని నీ పదమాశ్రయించినన్

శాశ్వత ముక్తిఁ గాంచనగు సజ్జన వందిత దేవ! శాంకరీ!


40.ఓం బలాయ నమః

చం.  ఫలితములెంచకుండ, వరభక్తి సమన్విత నిత్యసేవలన్

కలుషితభావనా రహిత గణ్యగుణాఢ్యులు చేయఁ జూచినన్

సులలిత దివ్యతేజ! *బల!* చూరగొనంగను నౌను నీ కృపన్,

కలుగగఁ జేసి నాకును ప్రకాశము గొల్పుము, దివ్య శాంకరీ!


41.ఓం బలోత్థితాయ నమః

చం.  బలమని పొంగిపోవుదుము భాగ్యవశంబున వచ్చు మజ్జకున్,

నిలుచునొ శాశ్వతంబుగ గణించుచునుండెడి మజ్జ మాకు? ని

స్తుల బలమీవె మాకుఁ గన, ధూర్తులఁ మాపెడి యో *బలోత్థితా!*

యలసితి జీవితంబున, ప్రయాసగ నెంచక కావు, శాంకరీ!


42.ఓం భవాత్మజాయ నమః

చం.  భవమును బాపు శక్తివయ, భాస్కర తేజుఁడ! శాంభవీ సుతా!

భవునకుఁ బ్రీతిపాత్రుఁడవు, భక్తిని గొల్పెడి యాఖువాహనా!

కవుల కవిత్వశక్తివయి కల్పన చేసెడి యో *భవాత్మజా!*

జవమును, భావనాసుధను  చక్కగనిమ్ము, గణేశ! శాంకరీ!


43.ఓం పురాణపురుషాయ నమః

ఉ.  సన్నుతుఁడా!  *పురాణపురుషా!*  మహిమాన్విత! నీకు మ్రొక్కెదన్,

నన్ను భవాబ్ధినుండి కరుణన్ గడఁ జేర్చుము, జ్ఞానబోధనే

క్రన్ననఁ గొల్పి, నా మదిని కావుము, సత్య పథంబుఁ జేర్చుమా,

మన్ననఁ జేసి నా కృతిని మంచిగ నందుము దేవ! శాంకరీ!


44.ఓం పూష్ణే నమః

చం.  జయమగు నీకు *పూష!* కవిచంద్రుల శక్తిగ నిల్చు దైవమా!

జయమగు నీదు భక్తుల ప్రశస్త మహాద్భుత శక్తికిన్ సదా,

జయమగు నీ సుధామధుర శ్రావ్య సుచిత్ర కవిత్వ ధారకున్,

జయమగు నీదు సృష్టికిని, సన్నుత దేవర! భవ్య  శాంకరీ!


45.ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః

శా.  జీవంబీవుగ నుండి కాచెదవుగా,  శ్రీ *పుష్కరోక్షిప్తవా

రీ!* వాగ్భాసుర! మోదకప్రియ! శుభశ్రీతేజమున్ గొల్పుమా,

భావావేశము, భక్తి , శక్తి , విషయోద్భాసప్రభావీక్షణా

జీవచ్ఛక్తిని గొల్పుమయ్య కృపతో, శ్రీమంతుఁడా!   శాంకరీ!


46.ఓం అగ్రగణ్యాయ నమః

మ.  మము పాలింపుమ,  *యగ్రగణ్యా!*  శుభముల్ మాకున్ బ్రసాదింపుమా,

సముదంచిత్ ప్రభ లోనఁ గొల్పి, శుభముల్ సాధింపనిమ్మా కృపన్,

క్రమబద్ధంబు జీవనంబు నిడుమా, కల్యాణ సద్భావనల్

ప్రముదంబందగ నాకు నిమ్మ, శుభదా! ప్రఖ్యాతిగా ,  శాంకరీ!


47.ఓం అగ్రపూజ్యాయ నమః

మ.  నిను సేవించెద *నగ్ర పూజ్య!*  పరమున్ నే గోరుచున్ నిస్తులా!

ధన ధాన్యంబు లవేలనయ్య?  యిపుడీ తత్త్వంబె యోగ్యంబు, నీ

కనుసన్నన్ బ్రభవించు కష్ట సుఖముల్, కారుణ్యమున్ జూపి, నన్

గొననిమ్మా పర సత్పదంబు, కన నీకున్ శోభయే, శాంకరీ!


48.ఓం అగ్రగామినే నమః

మ.  పరమున్ గోరరె  *యగ్రగామి!* యిలలోఁ బ్రఖ్యాతి నార్జించియున్,

నిరపాయంబగు  సాధనా గరిమచే నిత్యాగ్రగామి ప్రభల్

వరమై చేరఁగ జేయుమంచడగు, సంభాసించుచున్ ధాత్రిపై,

పరమార్థంబునొసంగువాడ! జగతిన్ భాసింపనీ, శాంకరీ!



49.ఓం మంత్రకృతే నమః

శా.  వేదోద్భాసిత దివ్యశక్తిఁ గన నీవే!*మంత్రకృత్!* దేవరా!

నా దారిన్ సరి చేయుమయ్య, వినుతానందంబు నందింపగా,

వేదార్థంబు లెఱుంగ నేను,  నిను భావింతున్ సదా భక్తితోన్,

మోదంబున్ గని కావుమయ్య జన సత్ పూజ్యుండ! మా శాంకరీ!


50.ఓం చామీకరప్రభాయ నమః

శా. శుభసందేశములిచ్చునట్టులుగ, నీశున్ గొల్చు సత్ పద్ధతిన్,

శుభ సత్ కాంక్షలె చిత్తమున్ గలుగగా , శుద్ధాంతరంగంబు, నా

కభయంబిమ్మయ యిచ్చుచుంటివని, యో గణ్యుండ!  *చామీకర

ప్రభ!* నిన్ గొల్చెద భక్తితోడ, కనుమా, భక్తిప్రభన్   శాంకరీ!


51.సర్వాయ నమః

శా.  *సర్వా!* నిన్ మది నిల్పినన్ శుభములే సర్వత్ర కాంచంగ నౌ

నుర్విన్,  నిన్ మది నిల్పు పండితులు దీనోద్ధారకా! ధన్యులే,

సర్వస్వంబును నీవె యంచు తలపన్ సత్కార్య సంసిద్ధియౌన్,

సర్వానర్థములంతమై శుభములన్ సాధింపనౌన్, శాంకరీ!

 


52.ఓం సర్వోపాస్యాయ నమః

మ.  ఉదయాద్రిన్ ప్రభవించు సూర్యుఁడవు  *సర్వోపాస్య!*నిన్ గొల్చెదన్,

సదయన్ భక్తులనేలు దైవమ! మనశ్శాంతిన్ బ్రసాదింపుమా,

ముదమారన్ కృతి నందుమా భవహరా! పూజించెదన్ నిన్ను, నా

మదిలో నిల్చి శుభంబులిమ్మ, విలసన్మంత్రార్థ! శ్రీ శాంకరీ!



53.ఓం సర్వ కర్త్రే నమః

మ.  వినుతింతున్ విను *సర్వ కర్త!*  విలసద్విజ్ఞాన సంపత్తి సా

ధనచే లభ్యమగున్, జయంబులొసగున్ తథ్యంబుగా ధాత్రిపై ,

వినగన్ గర్తవు నీవె సర్వమునకున్, విద్వజ్జనుల్ గాంత్రు నీ 

ఘనతన్ శ్రీ గణనాయకా! నిజముగా, కావంగ రా! శాంకరీ!



54.ఓం సర్వనేత్రే నమః

మ.  కనుమీ లోకము *సర్వనేత్ర!* దురితుల్ కారుణ్యమేలేక  స

జ్జనులన్ మోసము చేయుచుండి రకటా, కాంచంగలేరేల? భా

వననైనన్ వరపుణ్యపాపచయమే ప్రాప్తించునంచెంచరే,

మననీకాదురితాళినే యణచుమా, మా దైవమా! శాంకరీ!

  


55.ఓం సర్వసిద్ధిప్రదాయ నమః

మ.  జయగంటారవముల్ పొనర్చి, గుడిలో  సత్ సేవతో దేవునిన్

నియతిన్ గొల్వ జయంబులందుకొననౌన్ నిత్యప్రభాపూర్ణ! స

త్ప్రియమార్గంబున సిద్ధిఁ గాంచుటకుగాన్   శ్రీ *సర్వసిద్ధిప్రదా!*

భయదూరుండయి భక్తి నిన్ గొలువనౌన్, ప్రఖ్యాతుఁడా! శాంకరీ!



56.ఓం సర్వసిద్ధియే నమః

చం.  గజముఖ!  *సర్వసిద్ధి!*  మము కావగవచ్చెడి నీకు మ్రొక్కెదన్

నిజమగు భక్తియుండినను, నీవె కనుంగొని వత్తువయ్య, నీ

నిజమగు భక్తరక్షణము నేనునెఱుంగుదునయ్య, నీ కృపన్

ప్రజలకెఱుంగచెప్పెదను, భక్తి వశంకర! దివ్య  శాంకరీ!


57.ఓం పంచహస్తాయ నమః

చం.  కుడుములునుండరాళ్ళు నల కూర్మిని పట్టెడి *పంచహస్త!* నీ

కడుగకమున్నె భక్తతతి హాయిగనిత్తురు, నీదు హస్తముల్ 

కుడువగనన్నిటిన్ గొనును, గొప్పగఁ జూపెడి నీ ప్రమోదమున్

బడయగ ముద్దుగా గనెడి భక్తులఁ గావుము దేవ శాంకరీ!


58.ఓం పార్వతీనందనాయ నమః

ఉ.  సుందర శోభనాంగుఁడ! వసుంధరనొప్పెడిపత్రి తెచ్చి నీ

ముందున నిల్చి భక్తతతి పూజలు చేసినఁ బొంగిపోవు నీ

వందరి దైవమంచు ప్రజ హాయిగఁ గొల్తురు నిన్ను *పార్వతీ

నందన!* నీకృపన్ బ్రజను నమ్మి శుభంబిడుమయ్య,  శాంకరీ!


59.ఓం ప్రభవే నమః

చం.  వినుతిగ నీవదెట్లు ప్రభవించితి వో *ప్రభవా!* దయామయా!

వినుతులు చేయ భక్తులవి వీనుల విందుగ నాలకించుచున్

ఘనముగ కోర్కెలన్నిటిని గౌరవమొప్పఁగ తీర్తువయ్య!నం

దనుఁడయి పార్వతీసతి కనంత శుభంబిడినావు.  శాంకరీ!


60.ఓం కుమారగురవే నమః

చం.  అగణిత! మా నివేదన ననంత *కుమారగురూ!* వినంగదే,

జగమున మంచిచెడ్డలను చాల చూడగ మేము, కావునన్

బ్రగణిత మార్గమందు మము వర్తిలఁ జేయుచు మాదు మార్గమున్

సుగమముచేయుమయ్య,  మము శోభిలఁ జేయగ శ్రీద!  శాంకరీ!


61.ఓం అక్షోభ్యాయ నమః

శా.  *అక్షోభ్యా!* జయమార్గమున్ గనగ మోహాదుల్ విడన్ జేసి, మా

కక్షయ్యంబగు జ్ఞానతేజమిడుమా, హాయిన్ బ్రసాదింపుమా,

శిక్షాశాస్త్రవిధానమున్ గరపుమా సిద్ధింపఁచేయంగ నా

మోక్షంబున్, ముదమార నీవు కనుమా, ముక్తిప్రదా!  శాంకరీ!


62.ఓం కుంజరాసుర భంజనాయ నమః

మ.కో.  కోవెలందున కాక నీవిల *కుంజరాసుర భంజనా!*

భావమందు వసించుచుండెడి భక్తవత్సల! సత్ప్రదా!

శ్రీవదాంవర సేవితా! నిను చేరనీ నను చిత్ ప్రభన్,

ద్రోవచూపుము నిన్నుఁ జేరగ, దూర్వపూజిత! శాంకరీ!


63.ఓం ప్రమోదాయ నమః

మ.కో.  మోదమందగ నుండుమయ్య, *ప్రమోద!* మా మదులందునన్,

ఖేదముల్ విడఁ జేయువాఁడ! సుఖించవచ్చును తృప్తిగా, 

సేదతీరును మాకు నీకృపచేత, నక్షరతేజుఁడా!

మాదు చిత్తము మల్లెపూవని మంచి గాంచుము, శాంకరీ!


64.ఓం మోదకప్రియాయ నమః

మ.కో.  *మోదకప్రియ!* మేము ముందుగ పూజలన్ నిను గొల్వగా

సాదరంబుగ స్వాగతింతుము, సన్నుతించుచు శాశ్వతా!

నీ దరిన్ సుఖశాంతులుండును, నీవె మార్గము మాకిలన్,

రాదదేలనో భక్తి నీపయి, రక్షసేయుము, శాంకరీ!


65.ఓం కాంతిమతే నమః

చం.  తలతుము *కాంతిమంత!* నిను తప్పక పుస్తకమున్ బఠించుచోఁ

దలచెడి వేళలందు, వరదాతవటంచును, శ్రద్ధఁ గొల్పమం

చలసటఁ బాపుమంచు, పరమార్థ పథమ్మును చూపుమంచు, మా

తలపులు గాంచి తీర్చుమయ, తప్పక శ్రీకర దివ్య శాంకరీ!



66.ఓం ధృతిమతే నమః

చం.  సతతము నిన్నె కొల్తుమయ సాధన చేసెడి వేళలందునన్ 

మతిపడి నిన్నె దేవ!*ధృతిమంత!* జయంబులనిత్తువంచు, నీ

యతులిత భక్తపాలన మనంత శుభంబులనిచ్చు మాకు, నిన్

స్తుతి నొనరించు నేర్పునిడి, శోభిలఁజేయుము మమ్ము,  శాంకరీ!


67.ఓం కామినే నమః

ఉ.  *కామి* జయంబు నీకగుత, కమ్మని యావడ, పాయసమ్ము, సత్

ప్రేమను స్వీకరింపుమని వేడిగ నిప్పుడె చేసినాము, మే

మేమియు కోరఁబోము, పరమేశ్వరపుత్రుఁడ! రావయా కృపన్,

నీమది వెన్నపూసయన నిల్చెదవీవె కృపాబ్ధి!  శాంకరీ!


68.ఓం కపిత్థవనప్రియాయ నమః

చం.  పిలిచితి నేను నిన్నిట*కపిత్థవనప్రియ!* కావ రావయా!

అలసితి జీవితమ్మునను, హాయినొసంగుము చిత్త శాంతికై

నిలువుము నాదు చిత్తమున, నిర్మలమానసమిచ్చి కావుమా,

కలుషవిదూరమార్గమున కమ్మగ నిల్పుము, దివ్య శాంకరీ!


69.ఓం బ్రహ్మచారిణే నమః

చం.  అనుపమ! *బ్రహ్మచారి!* కరుణాకర! లోకశుభంకరా! కృపన్

వినుతులనాలకించి కను విస్త్రుతభక్తివిశేషమెన్నుచున్,

నిను మదినమ్ము భక్తులకు నీవె శుభంబులనీయకున్నచో

మనములఁ గ్రుంగిపోదురయ, మానక కావుము నీవు,  శాంకరీ!


70.ఓం బ్రహ్మరూపిణే నమః

చం.  సువిదిత! *బ్రహ్మరూప!* శుభ సుందర సూనృత వాక్ప్రబంధమై

భవితకు శోభకూర్చుటకు బంగరుబాటలు వేయ రావయా,

ప్రవిమల చిత్తవృత్తి, వరభావసమృద్ధిని కల్గఁ జేయగాన్,

జవమును సత్వమున్ గొలుపఁ జక్కగ కావగ రమ్ము,  శాంకరీ!


71.ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః

మ.  శుభదా!మమ్ములఁ గావ నీవె కల వంచున్*బ్రహ్మవిద్యాదిదా

నభు!* సత్సమ్మతిఁ గొల్తుమయ్య నిను, జ్ఞానంబిచ్చి చేకొమ్ము మ

మ్మభయంబిచ్చుచు రక్షసేయుమిల మోహాదుల్ విడన్ జేయుచున్,

శుభసంప్రాప్తము నీ కృపన్ గలుగుగా, చూడంగ రా, శాంకరీ!


72.ఓం జిష్ణవే నమః

చం.  కృపఁగను *జిష్ణు!* నీవలన కీర్తి శుభంబులు కల్గుచుండు, మా

కుపకృతి చేయుదైవమని యుత్సుకతన్ భజియించుచున్న మా

తపననెఱింగి రమ్ము మము తప్పక కావగ నీవు మాదు భా

వ పరిమళంబులందుమయ, భాస్కరతేజ! శుభుండ! శాంకరీ!


73.ఓం విష్ణుప్రియాయ నమః

మ.  నుత *విష్ణుప్రియా!* భక్తబాంధవుఁడ! నేనున్ నీకు నైవేద్యముల్

ప్రతిపద్యంబున భావగుంభనముగా భక్తిన్ సమర్పించుచున్

మతిమంతుండుగ మెల్గుచుంటినయ, యీ మాత్రంపు నాశక్తి నీ

యతులంబైన కృపారసమ్ముననె, స్నేహాధీనుఁడా!  శాంకరీ!


74.ఓం భక్తజీవితాయ నమః

మ.కో.  శ్రీకరుండవు.  *భక్తజీవిత!* చిత్త తేజము నీవెగా,

మాకు నెల్లెడ కాపువై వరమార్గదర్శిగ నుందువే,

లేకపోవును భక్తి శక్తియు, లేకపోవును యుక్తియున్,

నీ కటాక్షమె కల్గియుండిన నిల్పు మమ్మది, శాంకరీ!


75.ఓం జితమన్మథాయ నమః

చం. వర *జితమన్మథా!* శుభద! ప్రార్థన చేసెద నాలకింపుమా,

పరహితమెన్నుభావనలు, భక్తిమహత్తరశక్తిఁ గొల్పుచున్,

నిరుపమసత్కవిత్వమున నిర్మలభావ సంమృద్ధితోడ నే

సురుచిర గ్రంథరాజమును శోభిలవ్రాయఁగఁ జూడు,  శాంకరీ!


76.ఓం ఐశ్వర్యకారణాయ నమః

శా.  గుణపుష్టిన్, నుత మంత్రపుష్టియును  సాద్గుణ్యంబుకాన్ జన్మమే

ప్రణుతింతున్ నిను, గొల్పుమయ్య! కృపతో వాగ్భాస! *ఐశ్వర్యకా

రణ!* నాలోన మహత్తరంబుగ, జగద్రక్షైక దీక్షాకృతీ!

గుణగణ్యుల్ ధరవర్ధిలన్ గనుమయా, కూర్మిన్ ప్రభూ! శాంకరీ!


77.ఓం జ్యాయసే నమః

ఉ.  *జ్యాయస! *భక్తరక్ష! గుణ సంస్తుతి పద్యములందుఁ జేసెదన్,

న్యాయపథంబునన్ నిలిచి నవ్యమహత్తర ధారనెన్ని నీ

వీయగ నాకు నిత్తరి మహేశ్వరి పుత్రుఁడ! సత్కృపాంబుధీ!

వ్రాయగలేని వేగమున, భాస్కరసన్నిభతేజ!  శాంకరీ!


78.ఓం యక్షకిన్నర సేవితాయ నమః

మ.కో.   *యక్షకిన్నర సేవితా!*హృదయాచలాగ్ర సుసంస్థితా!

రక్ష నీవె  నిరంతరంబును, రమ్యగాన విలోల, స

ద్దీక్షతో శతకంబు వ్రాసితి దివ్య నీ మహిమంబుచే,

మోక్షమిచ్చెడి గ్రంథమియ్యది పూర్తిగా కన,   శాంకరీ!


79.ఓం గంగాసుతాయ నమః

మ.  నుత *గంగాసుత!* వందనంబులివిగో, నోరార నిన్ గొల్చుచున్

క్షితి నేఁ జేయుచునుంటి, నీవు కొనుమా, నీ నామ సంకీర్తనల్

మతిమంతుల్ శతకంబునందు చదువన్ మాన్యత్వమున్, ముక్తియున్,

క్షితి సత్ కీర్తియు గొల్పుమయ్య కృపతో, శీఘ్రంబుగా  శాంకరీ!


80.ఓం గణాధీశాయ నమః

శా.  ఆశాబద్ధములయ్యె జీవితములో యానందరూపా!  *గణా

ధీశా!* పాశములన్ త్యజించు గుణమున్ బ్రీతిన్ బ్రసాదించుమా,

లేశంబైనను పుణ్యపాప ఫలముల్ లేకుండ నాకాత్మలో

శ్రీశానాద్భుత భక్తిభా వమిడుమా శ్రీమంతుఁడా! శాంకరీ!


81.ఓం గంభీరనినదాయ నమః

ఇంద్రవంశము వృత్తము..... త త జ ర..... యతి .. 7.

నేనెంతు *గంభీరనినాద!*  నీ కృపన్,

నేనెంతు నిన్  నాదు నిజాత్మశక్తిగా,

నేనెంతు నీరూప నిజప్రభావమున్,

నేనెంతు నిన్నేను గణించు, శాంకరీ!


82.ఓం వటవే నమః

ఉ.  ఓ *వటు!* నిన్ స్మరించి పరమోన్నత సత్యపథంబుమెట్టినన్

భావజునిన్ జయించనగు, భక్తిగ గ్రంథములల్లగానగున్,

చేవను జూపి చిత్రకవిశిల్పముతో కృతి వ్రాయగానగున్,

దీవనలిచ్చి కాచుదువు దిక్కయి మాకిలనీవె, శాంకరీ!


83.ఓం అభీష్టవరదాయ నమః

ఉ.  హారతులో *యభీష్టవరదా!* కొని నన్ను కృతార్థుఁ జేయుమా,

సారసపాళి పద్యములు చక్కని మాల్యము నీకు నందుమా,

స్మేరముఖారవింద! వరసిద్ధివినాయక భక్తపాలకా!

కోరను నిన్ను కల్ములను, కూర్మిని గాంచెడివాఁడ! శాంకరీ!


84.ఓం జ్యోతిషే నమః

మ.  వెలుగున్ *జ్యోతి!* యనుగ్రహించు కరుణన్, విఖ్యాత సద్వర్తనన్

కలుగన్ జేయుము, సత్యవాక్పటిమ, సత్కల్యాణ వాక్చాతురిన్,

వెలుగన్ జేయఁగఁ జేయుమయ్య కృతులన్, విశ్వాత్మ! నిన్ గొల్చెదన్,

గలలోనైనను దుష్ప్రవర్తకునిగా కానీకుమా,  శాంకరీ!


85.ఓం భక్తనిధయే నమః

చం.  పొరపడి నేను *భక్తనిధి!* పొందికగా నిను వ్రాయకుంటినో?

సరియగు సత్పదంబులను చక్కగనెంచి రచింపకుంటినో,

నిరుపమమైన నీ ద్యుతిని నేను రచింపగ చాలనైతినో?

హరసుత! మన్ననంబునను హాయిగ నిద్ది గ్రహించు, శాంకరీ!


86.ఓం భావగమ్యాయ నమః

చం.  సురుచిర! *భావగమ్యా!* పరిశోధనచేయుచు నిన్ గ్రహించినన్

పరమపథంబు తథ్యమయ, పట్టుగ నీకు నమస్కరించినన్

నిరుపమ పద్య సద్రచన నేర్పుగ వచ్చు రచింపనెంచినన్,

తరుణమునెంచి కావుమయ, ధన్యతఁ గూర్చుమ నాకు,  శాంకరీ!


87.ఓం మంగళప్రదాయ నమః

ఉ.  మంగళ భావనల్ కొలిపి మంగళ పద్యచయంబుఁ గొల్పుచున్,

మంగళకారకుండుగ, సమస్త జగద్ధిత మంగళాత్ముగా

పొంగుచు చేయుమయ్యనను పూజ్య శుభాస్పద! *మంగళప్రదా!*

బెంగలు పాపి కావుమయ, విశ్వశుభంకర దేవ! శాంకరీ!


88.ఓం అవ్యక్తాయ నమః

శా.  *అవ్యక్తా!* శుభకారకా! శుభములేనాశింతు నీనుండి, స

త్కా వ్యప్రాభవమీవెయౌచు నిలుమా కల్పాంతముల్ నిల్పుమా,

సువ్యక్తంబునొనర్పజాల నిల నీ సుజ్ఞాన తేజంబునే

భవ్యంబైనమహోత్తమద్యుతిగ నిన్ భావింతు నో శాంకరీ!


89.ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

కనక కామినీ వృత్తము. ... జ త స లగ. ... యతి 6.

కృపాబ్ధి!*యప్రాకృత పరాక్రమా!*

సుపర్వమై తోచు మసమానుఁడా!

ప్రపత్తి భావాశ్రయ శుభాస్పదా!

ప్రపంచ మీవే వరుఁడ! శాంకరీ!


90.ఓం సత్యధర్మిణే నమః

చం.  ప్రగణిత! *సత్యధర్మి! వరభావ సమృద్ధిని కొల్పుమయ్య! నే

నగణిత కావ్య సద్రచన నందఁగ జేయగ నీకు వ్రాసి, సొం

పుగ నది యొప్పునట్టులుగ పూర్తిగ చేయుమనంత తేజమా!

సుగుణగణాభిరాములిది శోభిలుచుండెననంగ, *శాంకరీ!


91.ఓం సఖయే నమః

చం.  కొలిచెద నయ్య నేను *సఖ!*  గొప్పగ, సన్నుత కావ్యరాజమున్

వెలయఁగఁ జేయఁ జేయు నిను విజ్ఞతతోడ వివేకమొప్పగా,

పలుచన చేయకయ్య నను భాసిలుపండితపాళి మధ్యనన్,

నిలిము మనస్సరోజమున,నిత్యముగా వరభావ! శాంకరీ!


92.ఓం సరసాంబునిధయే నమః

ఉ.  ఆదరమొప్పఁ గొల్తు*సరసాంబునిధీ!* మహనీయ పెన్నిధీ!

ఖేదమె లేని జీవితము, కీర్తిసుచంద్రిక లందఁ జేయుమా,

మోదముతోడ నిన్ గొలుతు, పూర్ణశుభంకర! లోక శంకరా!

సాదరమున్ గ్రహింపుచు నశాంతిని పాపుము నీవు, శాంకరీ!


93.ఓం మహేశాయ నమః

ఉ.  వందనమో *మహేశ!* జనవందితదివ్యపదారవింద! సం

క్రందన సూతి నిన్ గొలిచి కౌరవమూర్ఖులనే జయించె, ని

న్బొంద దలచినన్ మదిని పూర్తిగ నీకె నొసంగుటొప్పు, నా

కందుము నీవు నిన్ గొలుతు నందముగా, కరుణాబ్ధి! శాంకరీ!


94.ఓం దివ్యాంగాయ నమః

శా.  *దివ్యాంగా!* శరణంటి నేను కృపతో దీవించుమా నన్ను,  నీ

దీవ్యద్రూపము నాకు చూపుమయ నన్ దేల్పన్ మహేశాగ్రణీ!

కావ్యంబందునఁ గల్గు నీవె కవియున్, కావ్యంబు, తేజంబునున్,

సవ్యంబై విలసిల్లఁ జేయుమయ, ధీశా! నాయకా!  శాంకరీ!


95.ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ప్రసృమర కరా వృత్తము..... న స య లగ. ... యతి .. 8.

నిలుమ *మణికింకిణీ మేఖలా!*

వెలుగు మదిలోన, విశ్వాక్షుఁడా!

కలుగ శుభముల్ ప్రకాశింపుమా,

మలినములుబాపుమా  శాంకరీ!


96.ఓం సమస్త దేవతామూర్తయే నమః

ఉ.  ఆర్తి గ్రహింపుమయ్య,  పరమాత్ముఁడ నీవు *సమస్త దేవతా

మూర్తి!* మనంబునన్ వెతలు ముప్పిరి గొంచు హసింపఁ జొచ్చె, దు

ర్వార్తలు,  దుష్ట చేష్టలు నవారితదుర్గతులెన్నియెన్నియో

యార్తిని గొల్పుచుండి నడయాడును నా మది, మాపు,  శాంకరీ!


97.ఓం సహిష్ణవే నమః

చం.  వినుత *సహిష్ణు!* నీకుఁ గల వీనులు మా మొరలాలకించి, మా

వినుతులనందఁజేయుటను ప్రీతిగ నీవు పరిష్కరింతువే

యనయము మమ్ము వేల్చు , పరిహారము చేయుము మార్గమెన్నుచున్,

జనహితమెన్ని కోరెదను, చక్కగ కావుము, దేవ! శాంకరీ!


98.ఓం సతతోత్థితాయ నమః

ఉ.  ఉత్సుకతన్ వెలుంగ,  *సతతోత్థిత!* నన్ గని కావుమయ్య! సద్

వత్సలతన్ మమున్ గనెడి భవ్యుఁడవీవెగ శ్రీ గణేశుఁడా!

సత్సుఖమన్న నీతలపె, శాంతిని కొల్పును మాకు నిత్యమున్,

వత్సరవత్సరంబు నిను భక్తిగ గొల్తుము, దివ్య  శాంకరీ!


99.ఓం విఘాతకారిణే నమః

ఉ.  మచ్చికనుంటివంచు నిను మన్ననఁ జేయక నుజ్జగించినన్

ఖచ్చిత మీవు కోపమున గర్జనచేసి *విఘాతకారి!* హా!

ముచ్చెమటల్ వహించునటు! పూర్తిగ చేయుదు వందుచేతనే

మచ్చికతోడ నిన్ గొలిచి మన్ననలందుదుమయ్య, శాంకరీ!


100.ఓం విశ్వగ్ధృశే నమః

మ.  వెలుగున్ శక్తిగ మాకునిచ్చు వరదా!  *విశ్వగ్ధృశా!* సంస్తుతుల్,

కలుగన్ జేయుము మాకు భక్తి తమపై కారుణ్యతేజోనిధీ!

తెలివిన్ గొల్పెడి దేవుఁడీవె నర జాతిన్ గాచి రక్షింపుమా,

కలకాలంబు సుఖంబునిమ్మ దయతో గణ్యంబుగా,  శాంకరీ!


101.ఓం విశ్వరక్షాకృతే నమః

ఉ.  ఆకృతిగొన్న శాంతమన నద్భుతరీతిని యొప్పి,  *విశ్వర

క్షాకృతి!* మాపయిన్ గృప ననంతముగా కురిపించుచుందువే,

శ్రీకరమైన తుండమది శ్రేయములన్ విరచించు, శాంత ర

త్నాకర! వందనంబులయ! ధన్యుఁడనైతిని నేను శాంకరీ!


102.ఓం కళ్యాణగురవే నమః

మ.  నుత *కళ్యాణగురూ!* త్వదీయ మహిమల్ నోరార వర్ణించితిన్,

క్షితి నీ సాటి కనంగనేరనయ, నా కీర్తిన్ ప్రవర్ధించు నీ

సితమందారముఖారవిందమహిమన్ చెప్పంగ సాధ్యంబొకో?

మతిమంతుండుగనుండనిమ్ము నను, సమ్మాన్యంబుగా,  శాంకరీ!


103.ఓం ఉన్మత్తవేషాయ నమః

శా.   ఓర్పున్ గొల్పుము నాదు చిత్తమున కో *యున్మత్తవేషా!* ధరన్

నేర్పున్ గొల్పుము జీవనంబు గడుపన్, నిత్యప్రదీపా, మదిన్

దర్పంబన్నది చేరనీక, కనుచున్ ధైర్యంబు కల్గించుమా,

కర్పూరంబుగ హారతిత్తు మదినే గణ్యాత్ముఁడా, శాంకరీ!


104.ఓం అపరాజితే నమః

ఉ.  ఓ *యపరాజితా!* జయ మహోజ్వల తేజము కావ్యకన్యకున్

శ్రేయము గూర్పనీయుమయ,  శ్రీకర శ్రీగణనాథ! క్షేమమున్,

న్యాయవివర్ధనంబు, పరమార్థమునందున భక్తి శక్తులన్, 

ధ్యేయముతోడి వర్తనము తీర్పుగనిమ్ము గ్రహించి, శాంకరీ!


105.ఓం సమస్త జగదాధారాయ నమః

శా.  దారిన్ జూపుమయా*సమస్త జగదాధారా!* నమోవాకముల్,

సూరాగ్రేసర! నీస్వరూపము గనన్ చోద్యంబుగానుండు, మా

తీరున్ మార్చగ నుంటివా యటుల? భక్తిన్ గొల్పి రక్షింతువా?

హేరంబా! శుభమంగళంబులగుతన్ పృథ్విన్ సదా,  శాంకరీ!


106.ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

శా.  శశ్వత్ సత్సుఖదాయివైన వరదా! శాంతాత్మ! పూజ్యుండ!   *స

ర్వైశ్వర్యప్రద!* ముక్తి నాకొసగుమా,  ఆనంద సంవర్ధకా!

శశ్వత్ సన్నుత కీర్తి దాయివగుచున్, శాంతిన్ బ్రసాదింపుమా,

విశ్వాసంబున గొల్తు నిన్ గణపతీ! ప్రీతిన్ మదిన్, శాంకరీ!


107.ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః

కనక కామినీ వృత్తము. ... జ త స లగ. ... యతి 6.

తరింతు *నాక్రాంత చిదచిత్ప్రభా!*

స్మరించుచున్ క్షేమమును గాంతు నిన్,

భరింపుమా దేవ నను పూర్తిగా,

స్థిరంబుగా చూచి నిలు శాంకరీ!


108.ఓం విఘ్నేశ్వరాయ నమః

శా. శ్రీ *విఘ్నేశ్వర!* మంగళంబులగు నీ విఖ్యాత భక్తాళికిన్,

సేవా భావనఁ గల్గు జీవతతికిన్ క్షేమంబు సిద్ధించెడిన్,

నీవారాదులు పండి లోకులకిలన్ నిత్యంబు ప్రాప్తించెడున్,

నీ వాఁడన్ శుభమంగళంబులిడుమా, నిన్గొల్తు నో శాంకరీ!


ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః  

అష్టోత్తర శత నామాంచిత పద్యార్చన సమాప్తమ్.

స్వస్తి ప్రజాభ్యః.

ఏతత్ సర్వం శ్రీ గణేశ్వరార్పణమస్తు.

చింతా రామకృష్ణారావు.

శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సర భాద్రపద శుద్ధ అష్టమీ భానువారం.

తే. 31 - 8 - 2025.

జైహింద్.

Tuesday, April 22, 2025

శాంభవీ శతకము మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు. ... రచన చింతా రామకృష్ణారావు. ... రచించిన తేదీ. 20 - 4 - 2025.

జైశ్రీరామ్.  

ఓం శ్రీమాత్రే నమః.

శ్రీ రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః

శాంభవీ శతకము  

మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు.

ప్రతీ పాదమునందలి ఆఖరి మూడు క్షరములు తొలగించి చూచినచో 

మా జగదంబ! మకుటముతో కూడిన 

మద్ధ్యాక్కఱ శతకము అగును.

౧)  శ్రీగణనాథునిన్ గొలుతు, చిత్తమునందున నిల్పి, ప్రేమతో

జాగృతిఁ గొల్పి నామదిని చక్కఁగ నిన్ గనఁ జేసి, గొప్పగా,

నీ గుణరాజమున్ దెలిపి, నిన్ను రచింపఁగఁ జేయఁ గోరుచున్, 

యోగమె నీవు గర్భ కృతి నొప్పుట మా జగదంబ! శాంభవీ!


౨)  సుందరభావనాకలిత సూనృత వాక్సుధనిమ్ము, నీ కృపన్,

చందన చర్చలన్ గలుగు చల్లదనంబునొసంగి, నిత్యమున్

డెందములందు నీ ద్యుతిని లీలగ నిల్పువిధాన నొప్పగా

బంధుర బంధ సత్కవిత వ్రాసెద, మా జగదంబ! శాంభవీ!


౩)  శ్రీకర చక్రరాజమున చిద్వరరూపిణి వీవె,  చూడగా,

లోకములన్నిటన్ వెలుగు శ్లోకప్రసిద్ధవగణ్య తేజమా!

నీకరుణాకటాక్షములు నేఁ గనుచుంటిని మాన్య! నిత్యమున్,

హే కరుణాలవాల! పరమేశ్వరి మా జగదంబ! శాంభవీ!


౪)  శ్రీకరుణాలవాల! విధుశేఖరు రాణివి నీవు, నిత్యమున్

నీకరుణా కటాక్షములు నిల్పు జనాళిని ధాత్రి, నెమ్మితోన్,

మోకరిలున్ జగమ్ములవి, పూజ్య! త్వదీయపదాళి నెన్నుచున్,

శ్రీకరమంచు, నిన్ గొలుతు, చిత్ప్రభ! మా జగదంబ! శాంభవీ!


౫)  లోకములన్నినొక్కటయి లుబ్ధతఁ గొల్పగవచ్చు, నీకృపన్

నీ కమనీయ దృక్కులవి నేఁ గన జాలినఁ జాలు, నీశ్వరీ!

శ్రీకరమైన సద్గుణమె చేరును నా మదిలోన, భక్తుఁడన్

నీకు సమర్పితంబయితి నేనిల,  మా జగదంబ! శాంభవీ!


౬)  వాక్కులరాణివౌచు వర వాగ్ఝరినిచ్చెద వీవె, సత్ కృపన్,

నిక్కము సత్కవిత్వమది నీ కృప చేతనె గల్గు, వ్రాయగా

స్రుక్కగ లేదు నే నెపుడు శోభిల నిన్ బ్రవచించి, భక్తితో

మక్కువతోడ వ్రాసితిని, మాతరొ! మా జగదంబ! శాంభవీ!


౭)  మక్కువతోడ నాశివుఁడె మానక నిన్ ధరియించె, నమ్మరో

చక్కని లోకమాతవని సన్నుతిఁ జేయుచు పొంగు చుండి తాన్,

నిక్కము నీవు కల్గిననె నీ విభుఁడొప్పు జగాన, నిత్యుఁడై,

మ్రొక్కెద నీకు, నన్ గనుచు ప్రోవుమ, మా జగదంబ! శాంభవీ!


౮)  అక్షయ మైన నీదయ ననారతమొందిన చాలు,  నీశ్వరీ!

రక్షణ మాకునెల్లెడలఁ, బ్రాపుగ నిల్చుచునుండు, ప్రేమతోన్,

మోక్షము కోరనేల? వరముక్తి యె నీ కృప మాకు, గాంచగా

నీ క్షితి నీవె నన్ గనెడి యేలిక, మా జగదంబ! శాంభవీ!


౯)  శ్రీకరమైన నీ స్మరణ చిత్తము చేయుచునుండ, నమ్మరో!

యాకలి దప్పులే కనము, హాయిగ నిన్ గనుచుండగా భువిన్,

భీకరమైన బాధలును భీతిలి వీడుచు పోవు, మమ్ములన్,

నీకరుణన్ వెలింగెదను, నేనిల, మా జగదంబ! శాంభవీ!


౧౦)  లోక హితార్థ మీ కృతి విలోకన చేయగ నమ్మ,  భక్తితో

లోకులు నిన్ను నమ్ముచు, ప్రలోభము వీడి పఠింప నీకృతిన్

నీ కృప నొంద నేర్తురు, గణించి పఠింపఁగఁ జేసి, కావుమా,

నా కృషి సత్ఫలంబునిడ, నన్ గను మా జగదంబ! శాంభవీ!


౧౧)  జ్ఞానమనంగ నీవె గుణ గణ్యవు నీవె కనంగ, నమ్మరో!

గానమునందు మాధురివి కానగ నీవె వినంగ నౌనదే,

ప్రాణము నీవె యౌచు పరివర్ధనఁ జేసెద వీవె, మమ్ములన్,

నీ నయదృక్కులన్ నిలుతు నేనిల, మా జగదంబ! శాంభవీ!


౧౨)  శాస్త్రచయంబు నందు గుణసాంద్రత నీవె గణింప గానిలన్,

శస్త్ర మహత్వశాస్త్రముల సన్నుతినొప్పుదువీవె, చూడగా,

విస్తృతమైన చర్చలను వెల్గుదువీవె జగాన, నిత్యమున్

విస్తృతిఁ గొల్పు భక్తినిల, వేడెద, మా జగదంబ! శాంభవీ! 


౧౩)  భారముగా గణింపకుము, భద్రత గొల్పుము మాకు, ప్రేమతో

భారము నీదెకావున, సపర్యలు చేయగనిమ్ము మమ్ములన్

నీరజ పత్రనేత్ర! కరుణించుము మాపయి నీవు , నిత్యసు

స్మేరముఖాంబుజా! వినుతి చేయుదు,  మా జగదంబ! శాంభవీ!


౧౪)  నాదరి నుండు వారు కరుణారస చిత్తులె చూడ, శైలజా!

నీ దరినున్న నామనసు నిశ్చలమై వికసించుచున్ లసన్

మోదము గూర్చు సద్వినుత పూజ్జ్యులకెల్ల సతంబు, సన్నుతుల్

రాదగువారు నీదరికి ప్రాజ్ఞులు  మా జగదంబ! శాంభవీ!


౧౫)  చేరగనిమ్ము నన్ను, విరచింపఁగ నిన్ గనుచుండి, సత్కృతుల్,

కోరగనిమ్ము నీకృపను, కూర్మిని, లోక హితంబు నిత్యమున్

నేరుపు మీరఁ గూర్పగను, నిత్యవసంతము నీవె, చూడగా

కారణమీవె సృష్టికిని కావుము మా జగదంబ! శాంభవీ!


౧౬)  తారలు మింటనుండియును తప్పవు సద్గతి నుండి యెప్పుడున్,

కారణ మీవె యట్టులవి కట్టడినొప్పి రహింప, మింటిపై,

నీ రమణీయ తేజమవి, నిత్యము గాంచెదమమ్మ, పొంగుచున్,

సూరివరుల్ వచించుటను, శోభిలు మా జగదంబ! శాంభవీ!


౧౭)  దారయు పుత్రికల్ సుతులు  ధాత్రిని నీ  జనితంబె చూడగా,

ధీరత నొప్పి నిన్ గొలిచి తీరుగ వారిని పెంచి, తుచ్ఛమౌ

కోరికలన్ త్యజించి, నినుకూర్మిని చేరఁగనౌను, వ్యగ్రునై

కోరను లంపటంబులను, గొప్పగు మా జగదంబ! శాంభవీ!


౧౮)  మారు వచింపకమ్మ! గుణమాంద్యుఁడ నీ ధర నెన్న నీవె నన్

జేరగనిమ్మ నీ దరికిఁ, జేతినొసంగుము కావ గాననున్,

నేరమె యౌనుగాక నిను నేనిది కోరుట చూడ నమ్మరో!

భారము జీవితమ్మయెను, భద్రద! మా జగదంబ! శాంభవీ!


౧౯)  ధీరగుణంబు సన్నగిలె, తేజము వాసె ధరిత్రి పైన సు

స్మేరముఖంబు వాడె నిలఁ జేసిన పాపమదేమొ? చండికా

కారణమేమొ నేనెఱుఁగ, కావుము నన్నిక నీవె, నిన్ను నే

కోరనిహంబు, సత్ పరమె కోరెద, మా జగదంబ! శాంభవీ!


౨౦)  చారు సులోచనా! స్మృతుల సారము నీవె గణింప నెత్తరిన్,

ధీరత వీవె చూడగను, తేజము నీవె కనంగ, నన్నిటన్

శారదరాత్రులందు గల చల్లదనంబది నీవె యెప్పుడున్

దారి కనంగ నీవె కద, తల్లిరొ! మా జగదంబ! శాంభవీ!

 

౨౧)  చిత్రవిచిత్రమౌ జగతిఁ జేసెడి మా పనులందు నెన్నగా

నాత్రమె యుండుఁ గాని, పరమార్ధము నెంచగలేము, నిక్కమౌ

సూత్రము నీవెయైతివని చూడఁగఁ జాలము మేము నిన్ను నే

స్తోత్రము చేయుదున్ గనుమ శోభిల, మా జగదంబ! శాంభవీ!


౨౨)  విద్యలవెన్నియో కలవు విశ్వమునందున చూడ, ధాత్రిపై

సద్యశ హేతువై  జగతి సంస్తుతి నొప్పెడిదైన గొప్పదౌ

విద్య యనంగ నిన్ దెలుపు విద్యయె విద్య గణింపు, నిచ్చునా

విద్యవు నీవె , కన్నులను వెల్గుము మా జగదంబ! శాంభవీ!


౨౩)  వేదమనంగనేది? పరవిద్యయె వేదమ? తల్లి! నిత్యమున్,

మోదముతోడ నిన్ దెలుపు మూలమె వేదము, నన్ను నెత్తరిన్

నీ దరి చేర్చు వేదమె గణింపగ వేదమనందు నమ్మరో!

వేదసువేద్య! నన్ గనఁగ వేడెద, మా జగదంబ! శాంభవీ!


౨౪)  కండబలంబు తగ్గినది, కాంచెడి శక్తియు తగ్గె కంటికిన్,

మెండగు గర్వమే యణగె, మేదిని నాశయువీడె భూమిపై

నండగ నీవె యుండి, మహిమాన్విత! కావుమ నన్ను నీ కృపన్,

పండిత భావ మోమదుగ? భద్రద! మా జగదంబ! శాంభవీ!


౨౫)  ఎట్టుల జన్మమెత్తితినొ? యేమి యొనర్చితొ నేను నింక నా

కట్టెదుటన్ నినున్ గనుచు కమ్మగ కొల్చితొ? లేదొ? నోటితోఁ

బట్టుగ నొక్కమారయిన భక్తిగఁ బిల్చితొ లేదొ?  గాంచితే?

యెట్టులఁ జేయఁ జేసితివొ యీశ్వరి! మా జగదంబ! శాంభవీ!


౨౬)  సన్నుతి చేసెదన్ జనని చక్కఁగ నొప్పుగ నిన్ను, నెంచుచున్

గ్రన్నన నీవె చేరఁదగు గమ్యము మాకుఁ గనన్ గ నీశ్వరీ!

మన్ననఁ జేసి నా నుతు లమందశుభాకరవౌచు ప్రేమతో

క్రొన్నెలతాల్పురాణి! గొను, కోరితి, మా జగదంబ! శాంభవీ!


౨౭)  మంచినె చూడఁ జేయుమిల, మంచినె చేయగనిమ్ము, నీ కృపన్

మంచినె వీనులన్ వినగ మంచిగ చేయుము నీవు, మా మదిన్

మంచి యనంగ నీవె, గుణమాన్యులు నీవె కనంగ ధాత్రిపై

మంచిగ నిన్ను చేరెదను, మాతరొ! మా జగదంబ! శాంభవీ!


౨౮)  కారణమౌదు వీవె వర కార్యము నీవె మదంబ! చూడగా

నీరజపత్రనేత్ర! గణనీయ ఫలంబది నీవె, యీశ్వరీ!

యారసి సత్ప్రవర్తననె యంచిత రీతి నొసంగి ప్రేమతో

దూరము చేసి మా భ్రమను, తోచుమ, మా జగదంబ! శాంభవీ!


౨౯)  కల్పన చేసి లోకములు, కారణమైతివి నీవె, సృష్టికిన్,

స్వల్పమనన్యమాయ పరివర్ధనచేసితి వీవె,   చూడగా

కల్పక మీవె యౌచు, కృత కర్మఫలంబులఁ గాల్చి మమ్ములన్

నిల్పెడి నిన్ను, నేఁ గొలుతు, నేర్పున మా జగదంబ! శాంభవీ!


౩౦)  లాలన చేసి భక్తులకు లక్ష్యము చూపుదువీవు, నిత్యమున్,

శ్రీలలితాపరాత్పరివి, చిత్తములందు వసించి, ప్రేమతో

జాలిగ మమ్ము చూచుచును చక్కగ కాతువు నీవె మమ్ములన్,

పాలన చేయు నిన్ గొలుతు, పార్వతి! మా జగదంబ! శాంభవీ!


౩౧)  గమ్యము లేని జీవితము గౌరవహీనమె చూడ, నమ్మరో!

సౌమ్యవు నీవు, నిన్ గనుచు చక్కని గమ్యమునెంచి నిత్యమౌ

రమ్య మనోజ్ఞ మార్గమున రాజిల నొప్పుగ నుండఁ జేయగా

కామ్యము లెల్ల వీడునటు కాంచుము,  మా జగదంబ! శాంభవీ!


౩౨)  అంబ నవాంబుజోజ్వల! పదాంబుజ సేవ నొనర్తు నీకు నా

సాంబుడు మెచ్చు నేనిటులఁ జక్కగ చేయుచు నుండ, సేవలన్,

కంబుసుకంఠి! నీ స్మరణ కాల్చును కర్మ ఫలంబు, నీవు మా

డంబము పాపి చూపుము కటాక్షము,  మా జగదంబ! శాంభవీ!


౩౩)  ధర్మమనంగనెయ్యది? య ధర్మము నెంచగ నేది? యౌనొ? యా

మర్మమనంగ నేది? పరమంబెటులెంచుట యౌను? తెల్పుమా

కర్మలఁ వీడు మార్గమును కానగఁ జేయు నదేది? భైరవీ!

మర్మము వీడ తెల్పుము సమస్తము, మా జగదంబ! శాంభవీ!


౩౪)  ప్రాణము పంచ భూతములొ? ప్రాణము కన్బడదేల? నో మహా

ప్రాణులు సంచరింతురిల, ప్రాణము పోవుటదేల కల్గునో?

జ్ఞానము తోడ ప్రాణమును కావగ లేమదియేల? చెప్పుమా,

ప్రాణము నీవె యౌదువొ? విభాసిత!   మా జగదంబ! శాంభవీ!


౩౫)  సంతతి నీకు మేము, గుణసన్నుత నీ కృప గల్గ ధాత్రిపై

శాంతియు సత్యమున్ శుభము సర్వ సుఖమ్ములు కల్గు చుండెడున్,

సంతసమొప్ప నిన్ గొలువ సాధ్యమె యన్నియు మాకు, నెప్పుడున్,

సుంత యనుగ్రహించి మము చూడుము, మా జగదంబ! శాంభవీ!


౩౬)  సద్గతిపొంద నీకృపయె సాధనమెన్నగ మాకు నిద్ధరన్,

సద్గతిఁ గూర్ప  దుర్గతిని చక్కగ పాపు నిజంబు చూడగా,

సద్గుణగణ్యవీవనుచు సన్నుతి చేయుచునుంటినమ్మరో!

మద్గతి వీవె, కావుమిల మాతరొ!    మా జగదంబ! శాంభవీ!


౩౭)  సారమతిన్ జగజ్జనని! సత్వగుణంబులెఱింగి,  జ్ఞానియై

స్మేరముఖారవిందుఁడయి మేదిని వెల్గెడువాఁడు నేర్పుగా

పారమునంటు ధ్యేయమున, భక్తియె మార్గము చూడ, నింతకున్

గోరెద భక్తి నిమ్మనుచు కూర్మిని,  మా జగదంబ! శాంభవీ!


౩౮)  స్వల్పమె యౌత భక్తి,, గుణ సన్నుత నిన్ గణియింప జాలినన్

వేల్పులు మెచ్చుచుందురుగ, వేయి విధంబు లవేల? మాకహో

నిల్పిన చాలు నిన్ మదిని, నిస్తుల భాగ్యము లబ్బు  భార్గవీ!

కల్పిత మీ జగమ్ము, నను కావుము,    మా జగదంబ! శాంభవీ!


౩౯)  సామ్యత లేదు నీదు గుణ సన్నుతి చేయగ నెంచ నాకిలన్,

సౌమ్య లసత్ స్వరూపిణివి, సద్గుణ పాళివి నీవు, భ్రామరీ!

గమ్యము చేర్చి మమ్ము నిల కావుము నీవె కృపాబ్ధి! నెమ్మితో

రమ్య గుణాఢ్య! నీ స్మరణ ప్రాపగు,    మా జగదంబ! శాంభవీ!


౪౦)  ఏ శుభ వేళలో నిను ననేకవిధంబులఁ గావ భక్తితో

నాశగ సంస్మరించితినొ, యా శుభవేళ నుతంబు చూడగా,

క్లేశములెల్ల దూరమయె, కీడులు వాసె, నిజంబు నెన్నితిన్,

నీ శరణాగతుండ, గను నిత్యము,    మా జగదంబ! శాంభవీ!


౪౧)  అమ్మరొ! నీ పదాబ్జము లనంత శుభావహ మంచు, నమ్మితిన్

నెమ్మనమందునన్ గొలుతు నేర్పున నిత్యము నేను, మంగళా!

రమ్ము మనంబునన్ నిలిచి రక్షణఁ గొల్పుము నాకు, నిత్యమున్,

నెమ్మిని గాంచుమా నను గణించుమ, మా జగదంబ! శాంభవీ!


౪౨)  జాతకముల్ గణించెదరు శాస్త్రవిధానమునెన్ని ధాత్రిపై,

వ్రాతలు మార్చ నేర్చితిరె  వాసిని గాంచినవారు? నేర్పుతో,

మా తలనుండు వ్రాతలవి మా కనుభోగ్యమె యౌను, చూడగా

ఖ్యాతిగ నీవె మార్చుదువు, కాళిక! మా జగదంబ! శాంభవీ!


౪౩)  నేను నినున్ దలంచుటకు నీ దయ కావలెనమ్మ, నమ్ముమా,

జ్ఞానము నీ వొసంగిననె గౌరవ మొప్ప దలంతు నెమ్మితో,

ప్రాణము నీవెయై  ఘనతరంబగు మాయను ముంచి యుంచుచున్,

మౌనము తోడఁ జూచెదవు, మాతరొ! మా జగదంబ! శాంభవీ!


౪౪)  జీవిత మేల యిచ్చితివి? చేసిన కర్మలె చేసి నిత్యమున్

భావియె లేక పాపముల వార్ధిని మున్గుచు నుండి కర్మచే

త్రోవ యెరుంగ రాని కడు దుర్మతి నొప్పుచు నుండి, భూమిపై

జీవితమంతవ్యర్థముగ చేయనొ? మా జగదంబ! శాంభవీ!


౪౫)  కన్నుల తోడఁ గాంచి నిను గౌరవ మొప్ప భజించి, పొంగుచున్,

మిన్నగు నీ గుణంబులను మేలుగ పల్కుచు నుండి, నేర్పుతో

సన్నుతి తోడ నిన్ గొలిచి సత్వగుణంబును గల్గి, యుండి, సన్

మన్నననొప్పుటొప్పుఁ గద? మాలిని!  మా జగదంబ! శాంభవీ!


౪౬) చాలను నిన్ భజింపగను చాలను నేను స్మరింప నీ కృపన్,

జాలను పూజ చేయ నిను, చాలను నిన్ గని పొంగ నిద్ధరన్,

జాలను పద్య సద్రచన సన్నుతిఁ జేసి రహింప, సాత్వికీ!

చాలుదు కోర్కెలన్ దెలుప సన్నుత!  మా జగదంబ! శాంభవీ!


౪౭)  మాన్యత నొప్పుచున్, దురభిమానము వీడుచు నుండి,  ధాత్రిపై

గణ్యముగా మెలంగుచు, నగ ణ్యవు నిన్నునెఱింగి నిచ్చలున్

ధన్యతతోడ జీవితము దాటగఁ జేయుచు నొప్పు గణ్యులౌ

మాన్యులు ధన్యజీవనులు. మంగళ!  మా జగదంబ! శాంభవీ!


౪౮)  సారవిహీన జీవితము చక్కని నీ స్మృతినొప్పి, గణ్యులై,

శూరులునై, మహాత్ములయి శోభిలుచుండిరి ధాత్రి, కర్వరీ!

స్మేర ముఖాబ్జ! నిన్ గనెడి సిద్ధులు ధన్యులు, చూడనిద్ధరన్,

కోరెద నిన్ శుభంబులను గొల్పగ,   మా జగదంబ! శాంభవీ!


౪౯)  లాక్షణికోత్తముల్ సకల లక్షణముల్వచియించుచుండియున్,

రక్షణమార్గమెన్నుచు పరంబును తెల్పఁగ లేరు, మాకిలన్,

మోక్షమునిత్తు వీవెయని పూర్తిగ చెప్పగ లేరు, నీవెగా

దక్షత నొప్పి మమ్ము గను తల్లివి,   మా జగదంబ! శాంభవీ!

 

౫౦)  జంతువులున్ భజించునిను  చక్కగ సేవలు చేసి కోవెలన్

శాంతిగనుండు మౌనులును సన్నుతులై నిను గొల్త్రు, జ్ఞానులై

అంతయు నీ కృపామృతమె యందరిభాగ్యము నీవె చూడగా

పంతము వీడి కావు నను పాటల!   మా జగదంబ! శాంభవీ!


౫౧)  జయమగు నీకు నెల్లెడల సన్నుత దేవి! శుభంబు కల్గెడున్,

జయమగు నీదు చూపునకు, శాంతతనొప్పును గాక నిత్యమున్,

జయమగు నీదు భక్తులగు సద్గుణపాళికి ధాత్రి జీవనీ!

జయము లొసంగు మాకును, ప్రశస్తిగ  మా జగదంబ! శాంభవీ!


౫౨)  వినయవిధేయతల్ గొలిపి వెల్గగఁ జేసితివమ్మ నీవు నన్,

మననము చేయుచున్ మదిని మన్ననఁ గాంచెద నిన్ను నెప్పుడున్,

ఋణముల నుండి ముక్తిఁ గని  నేన్ నినుఁ జేరెదనమ్మ, కౌశికీ!

ఘనతను గొల్ప కావుమిల కామ్యద!   మా జగదంబ! శాంభవీ!


౫౩)  జననివి, సత్యమార్గమున చక్కగనుంచుమ మమ్ము ప్రేమతో,

మనమున నిల్చి నీవు గుణ మాన్యునిగా నను తీర్చి దిద్దుచున్,

ధనముగ గౌరవంబునిడి తస్కరబాధను బాపి, నీకృపన్

మనునటు చేయుమమ్మ! పరమంబదె, మా జగదంబ! శాంభవీ!


౫౪)  వరముగ లభ్యమైతివని వర్ణన చేసితి నిన్ను, నేను, నే

భరమని నీకు తోచితినొ భక్తిని  గాంచవు నీవు, నన్నిలన్,

నిరుపమ సద్దయాన్వితవు నీవె కృపన్ నను గాంచు, చుండుమా

వరములు నీదు సత్ కృపయె భాగ్యము  మా జగదంబ! శాంభవీ!


౫౫)  కవనమునందు నీ యునికి  గాంచుదురుత్తములెన్ని, ప్రేమతో,

శ్రవణకుతూహలంబుగప్రశస్తిని పాడుదురర్ధి, తోడుతన్,

కవిగను నేను పొంగుదును కల్పనఁ జేసినదీవె యౌటచే

భవహరణంబుఁ జేసి  మది వర్ధిలు మా జగదంబ! శాంభవీ!


౫౬)  స్మరహరు రాణి వీవు, మనసార భజించెద నమ్మ నిన్ను నేన్,

పురహరునట్లె భక్తులకు భుక్తిని గొల్పుదు వమ్మ నిచ్చలున్,

కరుణరసాలవాలమ! సుఖంబుగ నిన్ గననిమ్ము, నెమ్మితో,

పరమ వివేక సౌరభము పంచుము మా జగదంబ! శాంభవీ!


౫౭)  జతనము చేసి వ్రాయుటది సాధ్యము కాదుగ నిన్ను నెంచుచున్?

నుతమగు రీతి నేఁ దెలుప నోచిన పుణ్య ఫలంబె, యౌనుగా,

యతులిత వీవు నీ కృప ననారత మొందెద నమ్మ, మ్రొక్కుచున్,

క్షితిని శుభాళినే గొలిపు శేముషి!  మా జగదంబ! శాంభవీ!


౫౮)  జననివి నిన్ స్మరింపగనె సద్గుణ మబ్బును మాకు! గొప్పగా,

ఘనమగు కార్యకర్తలుగ గౌరవమందుదుమమ్మ, యెప్పుడున్,

ప్రణవమె నీదు రూపమొకొ? వర్ధిలఁ జేయును మమ్ము నెత్తరిన్,

సునిశిత బుద్ధి నిమ్ము నినుఁ జూచెద మా జగదంబ! శాంభవీ!


౫౯)  సరగున వచ్చి నీవు మము చక్కగ కావుము ధాత్రి పొంగగా,

పరమ పవిత్ర భావ మిడి పాడిగ వర్ధిలనిమ్ము, మమ్ములన్,

సురుచిర పద్య సద్రచన శోభిలఁ జేయగనిమ్ము, ప్రేమతో,

కరుణరసార్ణవా!  కనుచు కావుము  మా జగదంబ! శాంభవీ!


౬౦)  జయదవటంచు నమ్మితిని,  సన్నుత భావనతోడ నిన్నునేన్,

భయమును పాపు శక్తివని భక్తిని గొల్చెదనమ్మ నిత్యమున్,

నయవర మార్గ దర్శి వని నా యెద నిన్ విడలేను , నీవె సత్

ప్రియముగ కావుమమ్మ నను వేల్పుగ  మా జగదంబ! శాంభవీ!


౬౧)  నిరుపమమౌ దరిద్రమున నిత్యము మ్రగ్గెడి వారు, ధాత్రిపై

దరి కనలేక దుఃఖమున దారిని తప్పెడివారు, బాధతో

స్మరణము చేసి నిన్నిలఁ బ్రశాంతత నిమ్మని వేడ వెంటనే

కరుణను కాచుచుండెడి సుగణ్యవు,  మా జగదంబ! శాంభవీ!


౬౨)  పరమ దయాస్వరూపిణివి, బాభ్రవి! నిన్ను దలంతు, నిత్యమున్

సురుచిర సుందరోజ్వల విశుద్ధకవీశ్వరి వీవె, యమ్మరో,

ధరణిని బాపి బాధలను ధర్మము నిల్పుము నీవు, కర్వరీ!

చరణములంటి మ్రొక్కెదను, సన్నుత! మా జగదంబ! శాంభవీ!


౬౩)  శ్రుతిచయమాశ్రయించి నిను శోభిలె దేవతలౌచు సృష్టిలో,

నుతమగు మార్గదర్శకమనూనవిధంబుగ జేయు, చున్ సదా

గతమును వర్తమానమును  కల్గెడి భావిని చూపు నేర్పుతో,

మతిఁ గన నీవె వేదములు మానిత! మా జగదంబ! శాంభవీ!


౬౪)  కలతల మూలకారణము కల్లగ నొప్పెడి సృష్టి చూడగా,

వెలవెలబాటె శేషమగు విశ్వము నమ్మిన మాకు, నమ్మరో!

సులలితభావనల్ శుభము శోభిల గొల్పగరాదొ? నిత్యమై

వెలసిన నిన్ను గొల్వనగు వేల్పుగ,  మా జగదంబ! శాంభవీ!


౬౫)  అమలిన భావనాగరిమ నందముగా నిడు మమ్మ! నిత్యమున్

క్షమయు నహింసయున్ గొలిపి కావుము కాలుని నుండి నేర్పుతో,

ప్రముదముతోడ నిన్ గొలిచి వర్ధిలునట్లొనరింపు సత్ కృపన్,

నిముసము కూడ నిన్ మరువ నేరను,  మా జగదంబ! శాంభవీ!


౬౬)  మనుటకు నీవె జీవులకు మార్గము నిత్యము చూడ నిద్ధరన్,

ప్రణవమె నీవు, జీవులను ప్రాణము నీవె కదమ్మ! నేర్పునన్,

ఘనతర సృష్టి సాగుటకు కారణ మిద్దియె కాంచ పాటలా!

వినుతి నొనర్తు, కావుమము వేల్పగు  మా జగదంబ! శాంభవీ!


౬౭)  నరకమనంగ నయ్యె భువి, న్యాయము కానగ రాదుగా కనన్,

పరమ పవిత్ర భావులకు బాధలె దక్కుచు నుండె నిత్యమున్,

వరములొసంగు దేవతవు, వర్ధిలు ధర్మము నీవె, సంస్కృతిన్

వరలఁగఁ జేయ హైందవము వర్ధిలు,  మా జగదంబ! శాంభవీ!


౬౮)  కమలదళాయతాక్షివిగ,  కాంచగఁ జాలఁగ లేవొ? దౌష్ట్యముల్,

విమలమనోజ్ఞమానసుల వేల్పువు నీవెగదమ్మ! నిత్యమున్,

కుములుచునున్నవారలను, కూర్మిని గాచుట పాడి కాదొకో?

ప్రముదమునేలు మీ జగతి,  భద్రద! మా జగదంబ! శాంభవీ!


౬౯)  ననుఁ గను కల్పవల్లివని నా సఖులెల్ల గణింత్రు, వారు నా

మనమున నిన్ను నెన్ని  యభిమానముతోఁ గనుచుంద్రు ప్రేమతో,

వినయవిధేయతల్ గొలిపి  పృథ్విని నిల్పిన నిన్ను నెన్ని నే 

ఘనముగఁ జూపనెంచితిని కామ్యద!  మా జగదంబ! శాంభవీ!


౭౦)  సహృదయ సోదరీమణులు, సన్నుత సోదరులుండి నన్నిటన్

మహిత కవి ప్రకాండునిగ మన్నన చేయుట, చూడు మమ్మరో!

సహచరులిట్లు నీ మహిమ చక్కగ  గాంచుట వింత కాదుగా,

మహిమను వారినేలుమిక మంచిగ,  మా జగదంబ! శాంభవీ!


౭౧)  కులసతు లెందరో మిగుల కూర్మిని గాంచుదు రమ్మ, నీవలెన్,

సులలిత భావనా కలిత సుందర సద్గుణు లెన్న గాభువిన్,

కలుష విదూరులందరిని కావుమ నేర్పుగ నీవు నిత్యమున్,

నిలుచుచు వారి చిత్తముల, నిర్మల! మా జగదంబ! శాంభవీ!


౭౨)  చెప్పుడుమాటలన్ వినుచు చేయగరానివి చేసి దుష్టులై

తప్పుగనున్నవారలను దండన చేసెడి తల్లి! మ్రొక్కెదన్

తప్పులు చేయనీయకుము, ధర్మము నిల్పుము ధాత్రి పైన నా

తప్పులు మన్ననన్ గనక తప్పదు, మా జగదంబ! శాంభవీ!


౭౩)  ధర్మము నిప్పువంటిదది దాగదు దాచిననంద్రు పెద్దలే

మర్మముతోడ ధర్మమును మాయము చేయుచునుండి ధాత్రిపై

ధర్మమధర్మమే యనుచు తప్పుగ చెప్పుటదేల నీశ్వరీ!

కర్మలు మార్చి ధర్మమును కావుము మా జగదంబ! శాంభవీ!


౭౪)  నుతమతులైనవారల కనూనజయంబిడుమమ్మ  నిత్యమున్,

బ్రతుకగ లేనివారలకు భద్రతఁ గొల్పుమ నీవు ప్రేమతో,

చితికిన జీవితమ్ములను చిందర చేయక నిల్పు మమ్మరో!

గతుకగ లోటు గొల్పకుమ కామ్యద! మా జగదంబ! శాంభవీ!


౭౫)  రచనలు పెక్కు చేసితి వరంబుగ నీవె యొసంగ ధాత్రిపై,

సుచరిత నెన్ని చూపితిని శోభిల పాఠకు లెల్ల నన్నిటన్,

ప్రచురణ చేసి రార్యులు ప్రపంచమునందున చూప మెప్పుగా

నచలజ! నీవు కొల్పిన మహత్వమె, మా జగదంబ! శాంభవీ!


౭౬)  ఆత్మయనంగనేది? పరమాత్మయె యాత్మయనంద్రు, నిక్కమా?

స్వాత్మసుదర్శనంబయిన నార్యుల  లోకమె వేరు చూడగా,

నాత్మను చూపి సందియమునంతము చేయగదమ్మ, నాకిలన్,

స్వాత్మనెఱింగి వర్తిలుదు నమ్మరొ! మా జగదంబ! శాంభవీ!


౭౭)  వయసు గతించుచుండు నిల ప్రాయము పైఁబడుచుండు నిత్యమున్,

భయము జనించుచుండు బహు పాపపు కార్యములెంచి, ప్రేమతో

నయమగు మార్గవర్తనను నాకు నొసంగ వదేల? చెప్పుమా,

ప్రియముగ నేలు నన్నుఁ గృప వేగమె, మా జగదంబ! శాంభవీ!


౭౮)  నుతమతులైనవారల ననూన దయామతి గావు, మమ్మరో,

క్షితిపయి ధర్మమున్ నిలుప, కీర్తిని గొల్పుము నీవు సన్నుతిన్,

బ్రతుకు నొసంగు మమ్మ! వరభావన లిచ్చుచు నుండి, సమ్మతిన్

స్థితిని రహింపఁ జేయుమ ప్రసిద్ధిగ, మా జగదంబ! శాంభవీ! 


౭౯)  లోపము సృష్టిలో కలదొ? లోకుల నున్నదొ తెల్పు మమ్మరో!

శాపమొ భారతావనికి? శాత్రవులెందరొ చూడు కూల్చగన్

కోపమురాదొ నీకుఁ? గని క్రూరుల నొంచ వదేమి చిత్రమో?

శాపము పాపి కావుమిల చక్కఁగ మా జగదంబ! శాంభవీ!


౮౦)  ఘనత వధాన సత్క్రియకుఁ  గల్గగఁ జేయుమదంబ! సంస్తుతుల్,

జనులకు పద్య విద్యపయి చక్కని బోధను గొల్పి భక్తితో

ఘనులగు సద్వధానులకు గౌరవమీయఁగఁ జేసి, ధాత్రిపై

వినుతిగ కావుమా నుతకవిత్వము మా జగదంబ! శాంభవీ!


౮౧)  మంచికి  చెడ్డకున్ చెలిమి మాకు రహింపదు చూడ వేలనో,

సంచిత పాపపుణ్యములు సత్క్రియలన్విడఁ జేసి, నేర్పుతో

మంచిగ లోకమందున సమంచిత రీతిని నిల్పి శైలజా!

గాంచగ నీకు పుట్టుకను, కావుమ,   మా జగదంబ! శాంభవీ!


౮౨)  నీ కృప పొందఁ గల్గితిని, నిన్ను స్మరించుచునుండి నిత్యమున్,

లోకుల మంచి చూచి  మదిలోననె పొంగుచునుంటినమ్మరో

నీకు కృతజ్ఞతల్ తెలుప నేరను కారణ మీవె నన్నిలన్

సాకెడి తల్లివైన గుణ సన్నుత!  మా జగదంబ! శాంభవీ!


౮౩)  వినుతపురాణ గాధలకు పెక్కులు మార్పులు చేసి ధర్మమున్

కనఁదగు దారి మూసి, కొరగాని విధంబుగ చేసి, రద్దిరా

మనము కరుక్కుమంచనగ మాన్యులకున్ ఖలపాళి దుష్టులై

వినుమ! స్వధర్మమున్ నిలుపు వేల్పుగ  మా జగదంబ! శాంభవీ!


౮౪)  భారము నీదె మాజనని భద్రతనీవె కనంగ మాకిలన్,

ఘోరము చేయువారలను కూర్మిని గాంచకు మమ్మ, ధీరతన్

శూరతఁ గొల్పి భక్తులకు, శోభిలఁజేయుమనన్య!  శాంతమున్

జేరగనీక దుష్టులను చీల్చుమ, మా జగదంబ! శాంభవీ!


౮౫)  పరమత ధర్మమేల? మన భారతదేశముపైన, చెప్పుమా,

వరగుణభాస భారతము వర్ధిలె నాడు ప్రశస్తి నొప్పుచున్,

కరుణను చూపి కావుమిక కమ్మని భారతినెన్ని ప్రేమతో,

నిరుపమ! నిన్ను గొల్చెదను నిత్యము,  మా జగదంబ! శాంభవీ!


౮౬)  స్త్రీలను మాతృమూర్తులుగ చిత్తములన్ గనినారు, దివ్యులే,

కాలము మారిపోయినది, గౌరవభావము తగ్గె నేలనో?

పాలన చేయువారికిది పట్టదదేలనొగాని, ధాత్రిపై

క్షాళన చేయఁజేయుమ లసన్మణి! మా జగదంబ! శాంభవీ!


౮౭)  కొండలనుండువారలకు కొల్పుట ధర్మము దారి,  వారలన్

బండలవోలె గాంచుటది పాడియుకాదుగ చూడ వారికిన్

మెండుగ సౌఖ్యముల్ గొలిపి, మేలును గూర్చుట పాడి, శైలజా!

అండగ నుండి కావు మిల నార్తిని  మా జగదంబ! శాంభవీ!


౮౮)  విద్యగడింపగా ధనము వేలను లక్షలె యౌను నేడిటుల్

సద్యశమొప్పనొప్పునది సంస్కృత భాషయు లేదు చూడగన్,

పద్యములాయె మృగ్యము, ప్రభావ దీనతనొందె చూడగా,

వేద్యము నీకు, కావుమిల ప్రీతిగ  మా జగదంబ! శాంభవీ!


౮౯)  చక్కని సంస్కృతిన్ గొలుపు సంస్కృతభాషను నిల్పు, ధాత్రిపై,

దక్కును శాస్త్రసంపదలు, దక్కును పూర్వుల విద్య ప్రేమతో

మక్కువతోడ శ్లోకములు మంచిగ నేర్పుము నీవె, శైలజా!

వాక్కులె వాఙ్మయమ్మగుచు వర్ధిలు, మా జగదంబ! శాంభవీ!


౯౦)  నామది నిల్చి నీవు కరుణన్ రచియింపఁగఁ జేసి ప్రోచితే

నేమముతోడ నేడిటుల, నీకు నమస్కృతులమ్మ! సంస్కృతిన్

ధీమతులెల్ల కాచునటు తేజము గొల్పుమ నీవు, వారికిన్,

హే మహిమాన్వితా! వరమహేశ్వరి! మా జగదంబ! శాంభవీ!


౯౧) మాగురుదేవునానతియు మాన్యులు మెచ్చెడి మంచి, నిత్యమున్,

నేగణియించి నిన్ గనుచు నిశ్చల భక్తిని చేసి పండితుల్

బాగనునట్లు కావ్యములు భక్తిని వ్రాయుచునుంటి, ప్రేమతో

నే గణుతింతు నిన్ మదిని నేర్పున,  మా జగదంబ! శాంభవీ!


౯౨)  కవివరు లెందరో కలరు, కావ్యపరంపర గొల్పి ధాత్రిపై

రవికి సమానులౌచు తనరారెడువారు జగాన, నిత్యులై

ప్రవరులు వారు, సన్నుతులు వారికి నో జగదంబ, నీ కృపన్

గవితలు నిల్పుమీవె కని న్యాయము, మా జగదంబ! శాంభవీ!


౯౩)  ప్రవరులు పండితోత్తములు వర్ధిలు గాత జగాన, నిత్యమున్,

నవ కవితా వతంసులు ననంత పరిశ్రమ తోడ వెల్గుచున్

కవనము పండఁ జేసి కలికాలము పాపుచునుంద్రు,  భక్తితో,

భవితను వారికిమ్ము పరివర్ధిల మా జగదంబ! శాంభవీ!


౯౪)  జీవులలోన శక్తివి, ప్రసిద్ధిని గొల్పెద వీవె నిత్యమున్,

భావనలన్ సృజించెదవు, భానుని తేజము నిచ్చి నీ కృపన్,

సేవలు గొంచు, మా వినతి చేఁ గొనుమమ్మరొ నీవు, ప్రేమతో,

సేవిత పాద నిన్ గొలుతు శ్రీకర మా జగదంబ! శాంభవీ!


౯౫)  కనుమిల రామకృష్ణుఁడను,  కమ్మగనేడిది వ్రాసి భక్తితో

గొనుమని నీకొసంగితిని కూర్మిని నీకృప చేత నమ్మరో!

ప్రణతులు నీకు, నీ పతికి, భాగ్యద వీవె గణించు నాకృతిన్,

ఘనతయె గల్గ నీదె యది, కామ్యద! మా జగదంబ! శాంభవీ!


౯౬)  శాంభవి పేర వ్రాసితిని సన్నుతి నీ శతకంబు, గాంచుమా,

శంభుఁడు కూడ మెచ్చునటు చక్కగ వ్రాయగఁ జేసి నీకృపన్

దంభము లేని నాపయి ననారత ముండగఁ జేసి వెల్గనీ

శంభుని రాణి! నన్ గనుమ, సన్నుత! మా జగదంబ! శాంభవీ!


౯౭)  జయమగునమ్మనీకు గిరిజా!  కృతినొప్పగ నుండి వెల్గనీ,

నయవరవర్తనల్ నిలిపి, న్యాయము నిల్పుచునుండు మెప్పుడున్,

భయములు వీడఁ జేయుము, స్వభావమె నీవుగ మారు మన్నిటన్,

క్షయమె యెఱుంగనీక ధర కావుము, మా జగదంబ! శాంభవీ!


౯౮)  చిత్రకవిత్వ తత్త్వమును చిత్తములందున నిల్పు మమ్మరో!

పాత్రులుగా నొనర్చుచును భక్తులఁ గావుమ నీవు ప్రేమతో,

నాత్రము లేని జీవన మనంత శుభంబుల నిమ్ము దుద్దురా!

పాత్రుఁడ నమ్మ, నన్ గనుము భాగ్యద! మా జగదంబ! శాంభవీ!


౯౯)  నా తలిదండ్రులన్ దలతు నా కృతి చూచుచు మెచ్చ నెంచుచున్,

ఖ్తాతిని గొల్పు మిత్రులను గౌరవమొప్పదలంతు నీశ్వరీ!

ఖ్యాతిగ చిత్తమందలి నయాన్విత నాసతి నెంతు నాత్మలోన్,

నీతిగ నిల్పు నిన్ గొలుతు నీశ్వరి! మా జగదంబ! శాంభవీ!


౧౦౦)  మంగళమూర్తివీవు పరమంబది చూడగ నీవె సృష్టిలో

మంగళముల్ సృజించెదవు, మాన్యతఁ గొల్పగ మాకు నిద్ధరన్,

మంగళసాంబునెంతు మది, మంగళరూప భవాని నీకు, సన్

మంగళమౌత యీకృతికి, మంగళ! మా జగదంబ! శాంభవీ!


౧౦౧)  అమ్మవు వ్రాయఁ జేసితివి, అమ్మయి రక్షగ నిల్చి నేడిటుల్,

కమ్మని భావనా పటిమ గౌరవ మొప్పఁగఁ గొల్పి నేర్పుతో

నెమ్మది నిల్చి నీవె కరుణించి రచించితివమ్మ, కైకొనన్,

సమ్మతి నంకితమ్మిడితి చక్కగ, మా జగదంబ! శాంభవీ!


౧౦౨) భారత భూమి శోభిలుత,  భద్రత నొప్పుత ధాత్రి నిత్యమున్,

ధీరులు పండితోత్తములు తేజముతోడ రహింత్రు భూమిపై,

స్మేరముఖాంబురాసులగు స్త్రీలకు నొప్పు శుభాళి యెల్లెడన్,

శ్రీకర సత్కవీశులను చేరుము మా జగదంబ! శాంభవీ!


౧౦౩)  నాది గణింప లేదిచట నా జనయిత్రిది శక్తియంతయున్,

వేద నిధాన మామె, తెరువే జగదంబ కనంగ నన్నిటన్,

మోదముతోడ నీరచన పూర్తిగ నెవ్వరు గాంత్రు వారికిన్

బాధలు దూరమై శుభము వర్ధిలు, మా జగదంబ! శాంభవీ!


౧౦౪)  తన మదిలోని శత్రులను తానె జయించిన చాలు, నన్నిటన్

ఘనముగ సంభవించు శుభ కల్పనలెన్నగ నొప్పి, నిత్యమున్,

ప్రణవ మహా ప్రపూజ్యవగు భాస్కర తేజమ! తల్లి, యాత్మలో

వినయముతోడ మ్రొక్కెద, సువిస్త్రుత! మా జగదంబ! శాంభవీ!


౧౦౫)  చైత్రము నుత్తరార్థమున సప్తమి నాడు రచించినాడ, సత్

పాత్రుఁడనంచు నిల్పితివి భక్తిగ వ్రాయగఁ జేసి, ప్రేమతో,

స్తోత్రము లొప్పు గర్భకృతి శోభిలఁ జేసిన తల్లి! దీనికిన్

మాతృక వీవె మా జనని! మాన్యవు,  మా జగదంబ! శాంభవీ!


౧౦౬) నలుబది మూడు గ్రంథములు నా జనయిత్రి! రచించి నేనుగా

సులలిత భావనా గరిమ శోభిలఁ గొల్పుచు నాకు, నిద్ధరన్,

కులసరి తోడు లేదనుచు కూర్చొనఁ జేయక నిల్పు చుంటివా?

చలితమనంబునన్ నిలుచు చల్లని  మా జగదంబ! శాంభవీ!


౧౦౭)  తప్పులు నావె యౌను, ఘనతన్ గొన వ్రాయను నేను మాతయే

యొప్పుగ వ్రాయఁ జేయుట ననూన ప్రశంసలు నీకె, నమ్మరో!

గొప్పయదెట్లు నాకగును? కోరుచు వ్రాసినదీవె యౌటచే, 

చెప్పిన నీకె యీ సుకృతి, శ్రీన్మయ  మా జగదంబ! శాంభవీ!


౧౦౮)  మంగళమీకు పాఠకుఁడ! మంగళముల్ కవులార! మీకిలన్, 

మంగళమీకు శ్రీ ధరుఁడ! మంగళమమ్మరొ! వాణి! నిత్యమున్

మంగళమమ్మ విష్ణు సతి! మంగళమమ్మరొ ధాత్రి! మాలినీ! 

మంగళమమ్మ నీకు, శుభమంగళ!  మా జగదంబ! శాంభవీ!


ఆ జగన్మాత ఈ రోజు నాచేత వ్రాయించుకొనిన శాంభవీ శతకము సమాప్తము.

చింతా రామకృష్ణారావు  ...  తే. 20 - 4 - 2025.


ఏతత్ సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.

జైహింద్.