మేలిమిబంగారం
మన సంస్కృతి
సూక్తిమౌక్తిక
సాహస్రము
శ్లో. గజాననం భూత గణాధి సేవితమ్ - కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్ - నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్.
తే.గీ. శ్రీగజానను, జీవాళి
సేవలు గొను, - ఘన కపిత్థజంబూఫలఖాదికి, నుమ
కంటివెలుగైన, దుఃఖముల్ కాల్చునట్టి - యాత్మ గణపతి పదములకంజలింతు
క. గజ వక్త్రు, పార్వతీసుతు, - విజయదు, జంబూ కపిత్థ ప్రియ ఫల ఖాదిన్,
భజియించి, వాని పదములు - నిజమనమున నిలిపి నతులు నేనొనరింతున్.
భావము. గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖ వినాశ కారకుడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను.
* -
* - *
శ్లో. అంగం గలితం పలితం ముండం - దశనవిహీనం జాతం తుండం
వృధ్ధో యాతి గృహిత్వా దండం - తదపి న ముంచత్యాశాపిండం.
తే.గీ. తనువు చిక్కు, తల నెఱియు, దంతతతియు - ఊడు, నడువ దండముఁ గొను, వడుకుచుండు
నట్టి వృద్ధత్వమొందియు నతులమైన - యాశ వీడదు, పెఱుగుచుండదియె వింత.
భావము. శరీరము కృశించి, చిక్కి ముడతల పడినను, తల పూర్తిగా నెరసి పోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసియైనను, ముసలి తనం వచ్చి కర్రను పట్టుకుని గాని నడువలేక పోయినను ఆశమాత్రము అతనిని వదలదు.
శ్లో. అంజలిస్తాని పుష్పాణి వాసయంతి కరద్వయం ౹
అహో సుమనసాం ప్రీతిర్వామదక్షిణయో: సమా౹౹
తే.గీ. కరములన్ జేరు పుష్పముల్ కలుగఁ జేయు - రెండు చేతులకున్ దావి మెండుగటులె
మంచివారిని చెడువారనెంచకుండ - ప్రేమగా జూతురందరిన్ ధీమహితులు.
ఆ.వె. దోసిటగల పూలు వాసన కలిగించు - రెండు చేతులకును నిండుగాను.
సుజనులట్టులుండు, చూపరు భేదంబు. - కుడిని యెడమ నొకటె కూర్మి చూపు.
భావము. చేతిలో ఉన్న పువ్వులు భేదం లేకుండా రెండు చేతులను సుగంధ భరితంగా చేస్తాయి. అలాగే సహృదయులు చెడ్డవారని,
మంచివారని బేధం లేకుండా సమంగా ప్రేమిస్తారు.
శ్లో. అ కరుణత్వ మకారణ విగ్రః - పరధనే పరయోషితి చ స్పృహా
సుజన బంధు జనే ష్వసహిష్ణుతా - ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనాం.
తే.గీ.
దయయె లేకుండు. కలహించు భయములేక. - పరుల ధన, స్త్రీల నాశించు. పరవశించు.
కారణము లేక ద్వేషించు ఘనుల, మిత్ర - వరుల, దుష్టుని. సహజాత మరయ నిదియె.
భావము. దయాగుణము లేక పోవుట, అ కారణముగా అందరితో కలహించుట, పరుల ధనమును స్త్రీలను కోరుకొంటూ వాటితో పరవశించుట, గొప్ప వారిని, మిత్రులను కారణము లేకుండానే ద్వేషించుట మొదలగు యిటువంటి గుణములు దుర్మార్గులకు పుట్టుకతోనే వచ్చును.
శ్లో. అకర్తవ్యేష్వసాధ్వీవ - తృష్ణా ప్రేరయతే జనం
తమేవ సర్వ పాపేభ్యో - లజ్జా మాతేవ రక్షతి.
ఆ.వె. సాధ్వి కాని వనిత చందమౌనత్యాశ. - చేయరాని పనులు చేయఁ జేయు.
కన్నతల్లి యట్లు కాపాడు సల్లజ్జ, - చెడును చేయనీక నడుపు చుండు.
భావము. దుష్ట స్త్రీ వలె , అత్యాశ - మానవులను చేయరాని పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. లజ్జ (సిగ్గు) మాత్రం కన్నతల్లి వలె వారిని సమస్తపాపాలనుండి (చెడు పనులు చేయనీయకుండా) కాపాడుతుంది.
శ్లో. అకామాన్ కామయతి యః, కామయానాన్ పరిత్యజేత్
బలవంతం చ యో ద్వేష్టి తమాహుః మూఢచేతసమ్.
క. ఇష్టపడని వారినిష్టపడుచు, తన - నిష్టపడెడివారినిష్టపడక,
బలునితోడ వైరములు పెట్టుకొని చెడు - మూర్ఖుడెపుడు. కనుడు పూజ్యులార!
భావము. ఎవడు తనను ఇష్టపడనివారిని ఇష్టపడతాడో, ఎవడు తనను ఇష్టపడేవారిని వదలుకుంటాడో, ఎవడు బలవంతునితో వైరం పెట్టుకుంటాడో వానిని మూఢాత్ముడు అంటారు.
శ్లో. అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్ప్యతే
తదేవ కాల ఆరబ్ధం మహతేஉర్థాయ కల్ప్యతే.
క. సమయము గని పనులు మనము - సముచితముగ సలుప సుఫల చయము కన నగున్
సమయము విడి సలుపు పనులు - సముచిత ఫలమొసగవు కద! సమయము కననౌన్.
భావము. సమయంకాని సమయంలో ప్రారంభించిన పని కర్తకు ప్రయోజనాన్ని కల్పించదు. అదే పనిని సరియైన కాలంలో ప్రారంభిస్తే అతనికి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
శ్లో. అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.
తే.గీ. పరుల సంతాప హేతువై ప్రబల రాదు. - చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ - ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము. ఇతరులకు సంతపము కలిగించకయు, ఖలులతో సహవాసము చేయకయు, గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధమ్. అసాధుమ్ సాధునా జయేత్.
జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేనచాஉనృతమ్.
తే.గీ. కోపమును శాంతిచే గెల్చుకొనగవచ్చు. - సాధువృత్తినచే గెల్తుమసాధుతతిని,
పిసినితనమును దానాన పెకల వచ్చు. - నృతముతోడనె గెలుతుమనృతమునిలను.
తే.గీ. కోప విరహిత బుద్ధిచే కోపి మనసు, - సాధు గుణమున దుష్టునసాధు మతిని,
లోభినీవిని, మరియు నీ లోని సత్య - మున నసత్యమున్ విజయించి ముక్తి గనుడు.
భావము. శాంత స్వభావముతో క్రోధమును జయింప వచ్చును. సాధు స్వభావముతో అసాధుస్వభావమును జయింప వచ్చును. పిసినిగొట్టుతనమును దానముతో జయింప వచ్చును. అబద్ధమును సత్యముతో జయింప వచ్చును.
10. శ్లో. అక్షరద్వయ మభ్యస్తం - “నాస్తి నాస్తీ”తి యత్పురా
తదిదం “ దేహి దేహీ ”తి - విపరీతముపస్థితమ్.
ఆ.వె. నాస్తి నాస్తి యని యనాథులకీయమి
నాటి లోభితనము నేటి ఫలము.
దేహి దేహి యనుచు దేవురింపఁగ వచ్చు.
దాన ధర్మబుద్ధి దైవ గుణము.
భావము. పూర్వం “నాస్తి, నాస్తి ” అనే రెండక్షరాలు నేర్చిన ఫలితంగా ఇపుడు “దేహి,దేహి” అనవలసిన విపరీత స్థితి ఏర్పడింది ! (పూర్వం ఎవరికీ దానం చేయకపోవటం వల్ల , ఇపుడు యాచించే స్థితి సంక్రమించింది.
11. శ్లో. అగచ్ఛన్ వైనతేయోఽపి - పదమేకం న గచ్ఛతి
యోజనానాం సహస్రాణి - శనైర్గచ్ఛేత్ పిపిలికాః.
తే.గీ. ఒక్క యడుగైన వేయక నిక్కవముగ
వెడలేడుగరుఁడుడైన విశ్వమందు,
చీమమెల్లగా నడచుచు చేరుకొనదె
వేలయోజనాల్ గతియించు వలయు చోటు.
భావము. ప్రయత్నం-కదలిక లేనిదే గరుత్మంతుడైనా అంగుళం ముందుకు పోలేడు.
అదే చీమలు క్రమశిక్షణ, నిబద్ధతో మెల్ల మెల్లగా వేలకొలది యోజనాలను దాటిప్రయాణిస్తాయి.
శ్లో.
అగజానన పద్మార్కం - గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం - ఏకదంత ముపాస్మహే
క. అగజ ముఖాంబుజ దినకరు, - గణిత గజముఖుని, సతము భక్తుల కోర్కెల్
జగమున నొసగెడి మహితుని - సుగుణదుఁడగు నేకదంతు, శుభదు భజింతున్.
తే.గీ. యజ్ఞవాటిక కింటికి,అఖిల పుణ్య - క్షేత్రములకు,వృద్ధులు, గురు, శిశుల, గర్భ
వతుల, రాజుల దేవులన్ వట్టి చేతు - లనిల గనగ పోరాదంద్రు వినయ మతులు
భావము.(అగ జ)పార్వతి ముఖపద్మమును వెలిగింపఁ జేయు సూర్యుఁడువంటి వానిని, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని ఉపాసింతుము.
శ్లో. అగ్రతః చతురో వేదా: - పృష్ఠతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమ్ ఇదం - క్షాత్రం శాపాదపి శరాదపి.
తే.గీ. నాల్గు వేదముల్ పఠియించి నలువఁ బోలి,
వెనుక శర ధనువులఁ దాల్చు విప్రవరుఁడు,
ధర్మ రక్షకై దీవిం చధర్మముపయి
నస్త్రమును వేయు, నతనికి నంజలింతు.
భావము. నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొది ని ధరించి, చేతిలో ధనుస్సు తో ఉన్న బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు శరమూ ప్రయోగించగలడు. ఆశీర్వాదమూ ఇవ్వగలడు అస్త్రమూ సంధించగలడు. ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు. సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరించుచున్నాను.
శ్లో. అగ్నిదో గరదశ్చై - శస్త్రోన్మత్తో ధనాపహః
క్షేత్ర దార హరశ్చేతాన్ - షడ్విధా నాతతాయినః .
తే.గీ. అగ్ని విషములు బెట్టెడి అధముల, మఱి - ఆయుధంబునజంపెడి అశుభ పరుల,
క్షేత్ర దారల హరియించు కౄరుల, గని - ఆతతాయిగ చెప్పగ నర్హమగును.
భావము. ఇంటికి కాని, సంసారములో కాని అగ్గి పెట్టే వారినీ, పరులపై విష ప్రయోగము చేసే వారినీ లేదా విషము గ్రక్కే వారినీ, ఆయుధముతో దాడి చేసే వారినీ, భూములనపహరించే వారినీ, భార్య నపహరించే వారినీ, ఆతతాయిలు అని అన వచ్చును.
శ్లో. అగ్నిహోత్రం గృహం క్షేత్రం - గర్భిణీం వృద్ధబాలకౌ ,
రిక్తహస్తేన నోపేయాత్ , - రాజానాం దైవతం గురుమ్ .
తే.గీ. వట్టి చేతుల పోరాదు వసుధపైన - అగ్నికార్యంబు, స్వగృహంబు, నఖిల క్షేత్ర
ములు, గురున్, గర్భిణిన్, వృద్ధు, భూపు, దైవ, - బాల దర్శనార్థము పోవుచో. భవ్యులార!
భావము. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి, సమర్పించ వలెను.
శ్లో. అగ్నిహోత్రఫలా వేదాః శీలవృత్తఫలం శ్రుతమ్l
రతిపుత్రఫలా నారీ దత్తభుక్తఫలం ధనమ్ll
తే.గీ. వేద ఫల మగ్ని యందున
వేల్చుటెయగు,
సత్ప్రవర్త
ఫలమగు శాస్త్రములకు,
పతిని గూడిపుత్రినిగాంచు
టతివఫలము,
ధనము నకు దాన భోగముల్ తగిన ఫలము.
భావము. "వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్పించడమే. శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన.
స్త్రీ సంగమానికి ఫలం సుఖసంతానం కలగడమే. ధనానికి ఫలం దానం చేయడం,
అనుభవించడమూను!
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
క. జరయును, మరణము లేనటు
ధర విద్యా ధనములందెదరు కనఁ బ్రాజ్ఞుల్.
మరణము దరి కొనినటులుగ
చరియింతురు ధర్మములనుసరణీయమెదే.
తే.గీ. ముసలితనమును మృతియునుపొందననుచు
ధనము విద్యయు సాధించి మనుట శుభము.
మృత్యు ముఖముననున్నట్లు నిత్యమునిలను
ధర్మవర్తన మెలగుట ధర్మమర్తయ.
ఆ.వె. ముసలితనము, మరణము తనకు లేనట్లు
ధనము విద్య లరసి గొనుత నరుడు.
మృత్యువమరుటెఱిగి నిత్యంబు ధర్మము
చేయుచుండుటొప్పు. చేయుడయ్య.
తే.గీ. మరణమన్నది లేనట్టి
మహితునివలె
ప్రాజ్ఞుఁడాస్తిని విద్యను పడయవలయు
మృత్యు వొందుట
ముందున్న సత్యమనుచు
ధర్మ మొనరించగావలె మర్మము విడి.
తే.గీ. ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే ఆలోచనతో - విద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు పోవటానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ధర్మాన్ని ఆచరించాలి.
శ్లో. అజ్ఞానాత్ యది వా మోహాత్ కృత్వా కర్మ విగర్హితం
తస్మాద్విముక్తి మన్విచ్ఛన్ ద్వితీయం న సమాచరేత్.
తే.గీ. జ్ఞాన హీనత చేతనో కామ, మోహ
మదములను చేసి, దుష్కృత్య వ్యధను పొంది,
మదిని చింతించు వారలు మరల నటుల
చేయకుండిన సరిపోవు. శివుఁడు మెచ్చు.
భావము. అజ్ఞానంతో గానీ, మోహం వల్ల గానీ ఒక నింద్యమైన పనిని చేసి, దాని నుండి విముక్తి పొందదలచిన వారు అలాంటి పని మరొకసారి చేయకూడదు.
శ్లో. అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమః శ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథా உనలః (భాగవతము 6-2-18)
తే.గీ. గడ్డి మేటునె యగ్గి తా కాల్చినట్లు
తెలిసి హరి యను భక్తుల,తెలియకుండ
హరిని పలికెడి భక్తుల దురిత తతిని
కాల్చివేయును. హరినామ ఘనత గనుమ.
భావము: అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును.
శ్లో. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యో మతి మాన్నర:
సర్వత: సారమాదధ్యాత్ పుష్పేభ్యైవ షట్పద:
తే.గీ. శాస్త్రమదిచిన్నదయినను చాలపెద్ద
దయిననున్ గాని గ్రహియించునరసి జ్ఞాని,
చిన్నదని పెద్దదని పూలనెన్నకుండ
తేనె గ్రహించు తుమ్మెద తీరునరయ.
భావము. బుద్ధిమంతుడైన వాడు చిన్న శాస్త్రములు, గొప్ప శాస్త్రముల నుండి తుమ్మెద
పూవుల నుండి మకరందమును సేకరించినట్టు సారమును స్వీకరిస్తాడు.
21. శ్లో. అణుమాత్ర మనస్తస్మా - దాశా నామ లతోద్గతాl
తస్యా నాలముపఘ్నాయ - భువనాని చతుర్దశ ll
తే.గీ. మనసు కాంచగ నణువంత మసలు దాని
యందుఁ గోరిక లత, తా నమందగతిని
యెదుగుచుండును, గన చాల వెదుగు దానిఁ
గాయఁ బదునాల్గు లోకముల్, కమల నయన!
భావము. మనసు అనేది ఒక అణువంతది. ఆ మనసులో ఆశ అనే లత పెరుగుతుంది. అది విశాలంగా అల్లుకోవడానికి పదునాలుగు లోకాలు చాలవుగదా!
శ్లో. అతి కామాత్ దశగ్రీవః – అతి లోభాత్ సుయోధనః,
అతి దానాత్ హతః కర్ణః, – అతి సర్వత్ర వర్జయేత్.
ఆ.వె. కామ లోభ దాన కర్మంబు లమితమై
రావణ కురుపతులు నీవి కర్ణు
డిలను చంపఁబడిరి. మెలగుట మంచిది
మితిని మీరకుండ క్షితిని జనులు.
భావము. మితి మీరిన కామముచే రావణాసురుఁడును, మితి మీరిన లోభ గుణముచే సుయోధనుఁడును, మితిమీరిన దానగుణముచే కర్ణుఁడును భూమిపై చంపఁ బడిరి. కావున ఏ విషయములోనూ మితి మీరి ప్రవర్తించుట మంచిది కాదు.
శ్లో. అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.
తే.గీ. చనువు పెఱుఁగ నలక్ష్యము సంభవించు.
నిరత మేగ ననాదరణీయులవరె?
జీర్ణ గంధపు మ్రానుల చేత వంట
భిల్ల వనితలు చేయరే? విరివి చేసి.
భావము. పరిచయము ఎక్కువయినకొద్దీ అలక్ష్యభావము పెఱుగును. అస్తమాను వస్తూ పోతూ ఉంటే అట్టివారిపై అనాదర భావము పెఱుగును. మలయ పర్వతములపై లభించెడి చందనదారువు మనకెంతో అపురూపమైనది. అట్టి మంచి గంధపు చెట్టు కర్రను అక్కడ నివసించే కోయ స్త్రీ వంట కట్టెలుగా ఉపయోగించుచుండును కదా!
శ్లో. అతి రమణీయే కావ్యే పిశునోన్వేషయతి దూషణాన్యేవ.
అతి సుందరేపి వపుషి వ్రణమేవహి మక్షికా నికరః.
క. దుష్టుఁడు నిరతము తప్పుల
నిష్టంబుగ వెదకుఁ గృతుల నేర్పడు గుణముల్
స్పష్టంబుగ కనుట మదికి
కష్టంబగు. కనగ మక్షికాన్యాయమిదే.
భావము. ఈగ అందమైన శరీరముపై వ్రాలుటకిష్టపడదు. సరికదా వ్రణములపై వ్రాలుటకే ఎంతో ఇష్టపడును. అటులనే అతి రమణీయ కావ్యమున దుష్టుఁడు దోషముల కొఱకే అన్వేషించును. గుణములున్నను గ్రహింపనేఱడు కదా!
శ్లో. అతి రూపోద్ధతాత్ సీతాஉతిగర్వా ద్రావణో హతః,
అతిదానాద్బలి ర్బద్ధశ్చాతి సర్వత్ర వర్జయేత్.
క. అతి గర్వముచే రావణు
డతి సౌందర్యమున సీత, యతి దానముచే
క్షితి బలియును, బాధ పడిరి.
అతి అన్నిట విడువ వలయు నరయుఁడు సుజనుల్.
భావము. ఆపూర్వమైన సౌదర్యం వల్ల సీత ఇక్కట్ల పాలైంది. మితిమీరిన గర్వంవల్ల రావణుడు నిహతుడైనాడు. పరిమితి లేని దానంవల్ల బలి చక్రవర్తి బంధింపబడ్డాడు. కనుక అతి అన్నివేళలా విడిచిపెట్టవలసిందే.
శ్లో. అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్.
తే.గీ. ఆత్మనెఱుఁగఁగ జిజ్ఞాసనలరు సుమతి
బ్రహ్మ విద్యలో నిపుణుని, భక్త సులభు
ననుపమాన దయాపరు నరసి వానిఁ
శిష్యుఁడై తాను గురువును చేర వలయు.
భావము. ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక ఉత్తముఁడైన గురువును సమీపించాలి.
శ్లో. అత్యల్పమపి సాధూనాం - శిలా
లేఖతి తిష్టతి।
జల లేఖేన నీచానాం - యత్ కృతం తత్ వినశ్యతి॥
తే.గీ. సాధు జనులకు చేసెడ దేదియైన
రాతిపై వ్రాతవలె నిల్చు ధాత్రిపయిన,
నీచులకు చేయునుపకృతి నీటిపైన
వ్రాతవలెమాయునప్పుడే, భవ్యులార!
(రాతి - ధాత్రి.సంయుతాసంయుత ప్రాస)
భావము. సజ్జనులకు చేసిన ఏ చిన్న ఉపకారమైనా అది రాతిమీద గీసిన గీతలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కొంచెము ఉపకారానికే వారు ఎల్లప్పుడూ కృతజ్ఙులై ఉంటారు. మరి నీచులున్నారే, వారికి ఎంత పెద్ద మేలు చేసినప్పటికీ నీటిమీద గీసిన గీతలా అది అప్పుడే నశించిపోతుంది.
శ్లో. అదండ్యాన్ దండయన్ రాజా ,దండ్యాంశ్చైవాప్యదండయన్
అయశో మహదాప్నోతి నరకం చైవ గచ్ఛతి.
క. దోషిని శిక్షింపక ని
ర్దోషిని శిక్షించుటరయ దోషాన్విత మీ
దోషము చేసిన నరకము.
ధ్యాసఁ గలిగి మెలఁగుట మన ధర్మము. కనుడీ.
భావము. నిర్దోషులను దండించి,దండింప దగినవారిని దండింపని రాజు గొప్ప అపకీర్తిని పొందటమే కాక,నరకానికి పోతాడు.
శ్లో. అదృష్టపూర్వా బాహవః సహాయాః సర్వే పదస్థస్య భవంతి వశ్యాః
అర్ధాద్విహీనస్య పదచ్యుతస్య భవంతి కాలే స్వజనోపి శత్రుః
తే.గీ. రెండు చేతులా గడియించు చుండువాని
కండగానుందురందరూ. అట్లు కాక
వట్టి చేతుల నుందుమా ఒట్టు రారు
దరికినొక్కరూ నిజమిది.మరువరాదు.
భావము. అదృష్టం మనకి కలసి వచ్చినంతసేపూ రెండుచేతులా సంపాదిస్తున్నంతసేపూ బయటివాళ్ళు అందరూ మన అడుగులకు మడుగులొత్తుతారు. అర్ధవిహీనస్య అంటే డబ్బు లేనప్పుడు పదవి పోయినప్పుడు అదే స్నేహితులు బంధువులు శత్రువులుగా మారిపోతారట... దీనినే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు భజగోవిందం లో ఇలా చెప్తారు.
శ్లో. అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహం చ దానం చ శీలమే తత్ప్రప్రశన్యతే (సంస్కృత మహాభారతం 12 - 156
- 21)
తే.గీ. త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
తే.గీ. కరణములు మూటిచే వైరి కాక యుంట,
దయను వర్తిలుచుండుట ప్రియము తోడ,
దాన సద్గుణౌఁడుచునీ ధరణి నుంట
శీలవంతుల లక్షణ జాలమరయ.
తే.గీ. జీవ కోటిపై విద్రోహ చింత లేక,
దయకు రూపముగా నిల్చి, దాన విరతి
కలిగియుండుట శీలంబుగా గణింత్రు
బుధులు. కనుడయ్య విజ్ఞాన పూర్ణులార!
తే.గీ. త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
భావము. ప్రాణులన్నిటి యందు మనోవాక్కాయ కర్మలచే వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు, దానముచేయుటయు శీలముగా ప్రశంసింపబడుచున్నది.
శ్లో. అధీత్య చతురో వేదాన్ - సర్వశాస్త్రాణ్యనేకశః|
బ్రహ్మతత్వం న జానాతి - దర్వీ సూపరసం యథా||
తే.గీ. బ్రహ్మ తత్వంబు నెఱుఁగని వారు నాల్గు
వేదములనెఃత చదివినన్ విలువ లేదు.
శాస్త్రములనెన్ని నేర్చినన్ జ్ఞాని కాడు.
పప్పుచారున గరిటయట్లొప్పు కనగ.
భావము. వేదములను బాగుగా చదివినప్పటికీ,సర్వశాస్త్రములను అనేకమార్లు అద్యయనం చేసినప్పటికీ పరబ్రహ్మతత్త్వమును అర్ధం చేస్కొని వాడు పప్పు లేక చారు యందలి గరిటె లాంటివాడగుచున్నాడు.
శ్లో. అనంతరత్న ప్రభవస్య యస్య - హిమం న సౌభాగ్య విలోపి జాతమ్ l
ఏకో హి దోషో గుణ సన్నిపాతే - నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ll కు.సం. 1-2
తే.గీ. రత్నరాశులు కల హిమాలయము కీర్తి
మంచు పోకార్పఁగా నేరదెంచి చూడ.
దోషమొకటైనగుణములఁ జేసి మాయు.
మచ్చలవి చంద్ర కాంతిలో మఱఁగిపోవె.
భావము. చంద్రునిలోని మచ్చ చంద్రుని తెల్లని కిరణాలతో కలసిపోయినట్లు‘ ఎన్నో రత్నరాశులకు , వృక్షరాజములకు నిలయమైన హిమవత్పర్వతములో మంచు నిండియుండట యనే ఒక దోషము లెక్కింప దగినది కాదు. అనంత గుణరాశిలో ఒక్క దోషమున్నను అది గుణములలో కలిసిపోవును.
శ్లో. "అనన్తరత్నప్రభవస్య యస్య, - హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్,
ఏకో హి దోషో గుణసన్నిపాతే, - నిమజ్జతీందోః కిరణే ష్వివాంకః" (కుమారసంభవము.)
క. గుణ సంహతినొకదోషము
కనఁబడు. గుణంబు చెడదు. ఘనతనె యొప్పున్.
కనఁబడు వెన్నెలె. యందన
కనుమరుగగు గాదె మచ్చ? కాంచఁగ మనకున్.
భావము. సుగుణములు కుప్పలు కుప్పలుగా నున్నపుడు ఒకదోషమున్నను అది వానిలో మునిగి కలిసిపోవును గాని వస్తువునకు కళంకము తెచ్చిపెట్టనేఱదు. ఉదా- సుధాకరుని కిరణములయందు నల్లనిమచ్చ.
శ్లో. అనంత శాస్త్రం బహు వేదితవ్యం - స్వల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః.
యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివాంబు మిశ్రమ్.
తే.గీ. ఎఱుగఁ దగు శాస్త్రములు పెక్కులిహమునందు.
కాల మల్పము కావున కలియుగమున,
హంస నీటిని విడి పాలనరయునట్లు,
సారమున్నట్టి శాస్త్రముల్ చక్క గొనుడు.
తే.గీ. శాస్త్ర మెఱుగ ననంతము సమయ మల్ప
మధిక మాటంకములు కాన హంస యెట్లు
పాలుమాత్రమె గ్రహియించి ప్రబలు? నట్ల
మంచి మాత్రమె గ్రహియించి మహిమ గనుడు.
భావము. శాస్త్రములు అనంతముగ నున్నవి. తెలియ తగినది చాలా ఉన్నది. కాలమా స్వల్పముగా నున్నది. విఘ్నములా అనంతముగా కలుగుచునే ఉండును.కావున హంస ఏ విధముగా పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచి వేయునో అదే విధముగా మనము కూడా కావలసినంతమట్టుకు సారభూతమైన దానిని స్వీకరించ వలెను.
శ్లో. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ - పురుషాః పశుబుద్ధయః |
ప్రాగల్భ్యాద్వక్తుమిచ్ఛంతి - మంత్రిష్వభ్యంతరీకృతాః ||(వాల్మీకి రామాయణం)
తే.గీ. రాజు నమ్మిన బంటులే ప్రాభవమును
నిలుపుకొన, నెఱుగనివియుఁ, దెపుచుంద్రు
వాక్పటుత్వంబుజూపుచున్, వారి వలన
రాజునకువచ్చు నష్టము, రామచంద్ర!
భావము. రాజు నమ్మిన మంత్రుల్లో పశుబుద్ధిగలవారూ ఉంటారు.
శాస్త్రార్థం తెలియకున్ననూ వారు తమ వాక్పటుత్వంతో రాజుకు
సలహా ఇవ్వటానికి ఇష్టపడతారు.
శ్లో. అనభ్యాసే విషం శాస్త్ర మజీర్ణే భోజనం విషమ్ ।
మూర్ఖస్య చ విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషమ్ ॥
తే.గీ. విద్య విషమిల నభ్యాసవిరహితునకు,
అగ్నిమాంద్యునకన్నమే యగును విషము,
మూర్ఖునకు గోష్టి విషమిలన్ బూజ్యులార!
యువతి విషమగు ముదిమికి నోపలేక.
భావము. అభ్యసము చేయని వానికి శాస్త్రము విషతుల్యము. అజీర్ణముగా ఉన్నవానికి భోజనం విషతుల్యము. మూర్ఖునికి విద్యాగోష్ఠి విషతుల్యము. ముసలివానికి యువతి విషతుల్యము.
శ్లో. అనవాప్యం చ శోకేన - శరీరం చోపతప్యతే
అమిత్రాశ్చ ప్రహృష్యన్తి - మా స్మ శోకే మతిం కృథా:
(విదురనీతి)
తే.గీ. దుఃఖపడినంత దొరకదు దూరమైన
దేదియైనను, తాప మహితము మిగులు,
శత్రువులు సంతసింతురు, జయనిధాన!
మెలగుమీవు దుఃఖము వీడి, మేలు గనుము.
భావము. శోకించినంత మాత్రాన కోరిన వస్తువు లభించదు. శరీరమా తాపము చెందును. శత్రువులు సంతసించెదరు. అందువలన నీ మనస్సును శోకము వైపు మళ్ళించకుము. దేనికీ దుఃఖింపకుము.
శ్లో. అనాయాసేన మరణం - వినా దైన్యేన జీవనమ్
దేహాంతే తవ సాన్నిధ్యం - దేహిమే పరమేశ్వరమ్||
తే.గీ. కష్టదూరమౌ మరణంబు కరుణనిమ్ము,
దైన్య దూర జీవనమును దయనొసగుము,
పాపపుణ్యాల ఫలములు వాయఁజేసి
నేను మరణించు వేళ నన్ నీవె కొనుము.
తే.గీ. నిరుపమాననాయాసంపు మరణమిమ్ము,
దైన్యహీనంపు బ్రతుకును దయనొసగుము,
దేహమునువీడు వేళను దేవదేవ
నీదు సాన్నిధ్యమొసగుము, శ్రీధరుండ!
భావము. ఓ పరమేశ్వరా(రీ)! నాకు కష్టము లేని మరణమునే ప్రసాదించుము. దైన్యమెఱుగనట్టి జీవనమే దయతో నొసంగుము. నన్ను పాపపుణ్యముల ఫలశూన్యునిగా చేసి దేహము విడుచు వేళలో నీలోనికి నన్ను చేర్చుకొనుము.
శ్లో. అనాలోక్య వ్యయం కర్తా - అనాథః కలహప్రియః
ఆతురః సర్వకార్యేషు - నరశ్శీఘ్రం వినస్యతి.
చాణక్యనీతి.
తే.గీ. చింతచేయక వ్యయమును చేయువాఁడు,
కలహమునకు తానొక్కఁడే వెడలువాఁడు
నన్నిపనులఁ దొందరపాటునున్న వాఁడు
నట్టి నరుఁడు నశించునో యమరవినుత!
భావము. ముందువెనుకలు చూచుకొనకుండా ధనమును వెచ్చించు వాఁడు, ఒంటరిగా కలహమునకు సిద్దపడువాఁడు, అన్నిపనులయందు ఆతురతతో ప్రవర్తించువాఁడు, ఐన నరుఁడు నశించిపోవును.
శ్లో. అనిచ్ఛంతోఽపి వినయం - విద్యాభ్యాసేన బాలకాః |
భేషజేనేవ నైరుజ్యం - ప్రాపణీయాః ప్రయత్నతః ||
(హరిహర సుభాషితం)
తే.గీ. రోగమును బాపు యత్నించి రోగికిలను
వైద్యుఁ డటులనే బాలుండు విద్యనేర్వ
బాధపెట్టుచున్ననుగాని మోదమలర
నేర్పవలె విద్య కృషిచేసి నేర్పు తనర.
భావము. రోగికి చికిత్స చేయడానికి నిరంతర ప్రయత్నం చేసి ఔషధం ఇచ్చి రోగాన్ని పరిహరించినట్లే, పిల్లలు ఇష్టపడకపోయినా వారికి ప్రయత్నపూర్వకంగా విద్యను అభ్యసింపజేసి మంచి నయమూ, నీతులూ నేర్పాలి.
శ్లో. అనిత్యాని శరీరాణి, విభవో నైవ శాశ్వతః ౹
నిత్యం సన్నిహితో మృత్యుః, కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹
కం. నిత్యంబు కాదు దేహము,
నిత్యంబులు కావయ ధరణిని విభవంబుల్,
మృత్యువు చేరువనుండును,
నిత్యముధర్మార్జనంబు నెరపఁగవలయున్.
భావము. మన దేహాలు శాశ్వతము కావు. నాశనం పొందుతాయి. అటులనే మన వైభవాలు కూడా శాశ్వతం కావు. చావు ఎపుడు మనకు దగ్గరగా ఉంటుంది. కావున ధర్మమును సంగ్రహించుట మన కర్తవ్యము.
శ్లో. అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్,
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః.
క. ఉత్సాహమె శ్రేయస్కర
ముత్సాహమె సుఖము గన మహోత్కృష్టంబు
న్నుత్సాహమె నడుపు మనల
నుత్సాహము వీడవలవ రుత్తమపురుషుల్.
భావము. అనిర్వేదమే శ్రేయస్సుకి మూలం, పరమ సుఖం. అనిర్వేదమే మానవుణ్ణి అన్ని కార్యములలోను ముందుకు నడిపిస్తుంది. అనిర్వేదమే అన్నింటిని సఫలం చేస్తుంది.
శ్లో. అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్ - అల్పశ్చ కాలో బహుశ్చ విఘ్నాః ।
యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివామ్బుమధ్యాత్ ॥
తే.గీ. ఎఱుఁగ వలసిన గ్రంథము లెన్నొ కలవు,
కాలమల్పము, విఘ్నముల్ కలుఁగుచుండు,
క్షీరనీరంబులను హంస క్షీరముగొను,
మంచినట్టులే గొనవలె మనము, నరుఁడ!
భావము. చాలా గ్రంథాలు ఉన్నాయి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, కానీ సమయం పరిమితంగా ఉంది. మరియు అనేక అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి మనం హంస యే విధముగా క్షీరనీరముల మిశ్రమము నుండి క్షీరమును మాత్రమే గ్రహించునో అట్టులే మనము కూడా సారవంతమైనవాటినే గ్రహించవలెను.
శ్లో. అన్నదానం మహా దానం, విద్యా దానం తతః పరమ్.
అన్నేన క్షణికా తృప్తిః, యావజ్జీవంచ విద్యయా.
తే.గీ. అన్నదానంబు ఘనతరమెన్ని చూడ.
అంతకన్న విద్యాదాన మధిక తరము.
అన్నమున కల్గు సంతృప్తి యా క్షణమునె.
విద్య శాశ్విత తృప్తిని వెలయఁ జేయు.
భావము. అన్నము మహా ఘనతరమైన దానము. విద్యా దానము అంతకంటెను ఘనతరమైనది. అన్నదానము కలిగించే తృప్తి తాత్కాలికమైనదే. విద్యాదానము కలిగించే తృప్తి జీవితమంతయు ఉండును.
శ్లో. అన్నపూర్ణే సదాపూర్ణే! - శంకర ప్రాణవల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం! - భిక్షాం దేహీ చ పార్వతీ!
తే.గీ. అన్నపూర్ణ! సదాపూర్ణ! యమర వినుత!
శంకరప్రాణ వల్లభా! సరసిజాక్షి!
జ్ఞాన వైరాగ్యములు మాలుఁ గలుగఁ జేయ
పార్వతీ! భిక్షనొసగుమ, ప్రణుతులమ్మ!
భావము. అన్నపూర్ణాదేవీ! ఓ సదాపూర్ణ స్వరూపిణీ! దేవతలచే
ప్రశంసింపఁబడు ఓ తల్లీ! శివంకరుఁడయిన శంకరుని ప్రాణేశ్వరీ!
నాకు హ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు భిక్షను ప్రసాదించుమమ్మా!
శ్లో. అపరాధం సహేతాల్పం తుష్యేదల్పేஉపి చోదయే
మహోపకారాంశ్చాధ్యక్షాన్ ప్రగ్రహేణాభిపూజయేత్.
తే.గీ. అల్ప దోషంబు మన్నింపనగును కనుమ,
అభ్యుదయమల్పమున్నచో నరసి పొగడు,
మేలు చేసిన వారిని మెచ్చుకొనుచు
గౌరవించుము. పొందుము గౌరవంబు.
భావము. చిన్న పొరపాటును క్షమించాలి. అల్పమైన అభ్యుదయానికైనా సంతోషించాలి. మహోపకారం చేసిన వారిని గౌరవించాలి.
శ్లో. అపరాధో న మే உస్తీతి నైతద్విశ్వాస కారణం
విద్యతే హి నృశంసేభ్యో భయం గుణవతామపి.
క. అపరాధము చేయని నా
కపరాధము చేయరితరులనుకొనఁ దగదోయ్.
నెపమెన్నక చేతురు మీ
కపరాధముదుశ్చరితులహర్నిశలు కనన్.
భావము. నాయందు అపరాధమేమియు లేదు, నాకేమి భయమని సజ్జనుడు ఏమరుపాటుగా ఉండుట తగదు. గుణవంతులకైనా క్రూరులవల్ల భయం కలుగుతుంది.
శ్లో. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరి ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మయద్ధరేః.
తే.గీ. తనదు ధర్మము విడనాడి యనవరతము
కృష్ణు తలచునతడు ద్వేషి కృష్ణునకును.
ధర్మ సంస్థాపనార్థియై తనకు తానె
యెన్ని జన్మలనెత్తెనాపన్నబంధు.
తే.గీ. చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.
తే.గీ. చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.
భావము. తాము చేయవలసిన కర్మలను ఆచరింపక “కృష్ణా, కృష్ణా ” అంటూ కూర్చునేవారు - హరిద్వేషులు, పాపులు అవుతారు. హరి - ధర్మకార్యాచరణకే అనేక జన్మలను(అవతారాలను) ధరించాడుకదా.
శ్లో. అపి స్వర్ణ మయీ లంకా - న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి.(రామాయణము)
తే.గీ. లక్ష్మణా!స్వర్ణపూర్ణమే లంక ధాత్రి
నైననున్ నాకు రుచియింప దనుపమమగు
జననియున్ జన్మ భూమియున్ సమము చూడ
స్వర్గమును మించి గొప్పవి, జయనిధాన!
భావము. సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !
శ్లో. అపూర్వః కోపి కోశోఽయం - విద్యతే
తవ భారతి|
వ్యయతో వృద్ధిమాయాతి - క్షయమాయాతి
సఞ్చయాత్||
తే.గీ. శారదా! నీ నిరుపమకోశగృహమందుఁ
గలుగు సంపద ఘనమమ్మ, ఖర్చుచేయ
బెఱుగుచుండును తరుగదు వింతగాను,
వాడకున్నచో వ్యర్థమౌన్వసుధపైన.
భావము.
అమ్మా సరస్వతీదేవి! నీ కోశాగారంలో ఉన్న విద్య (జ్ఞానము) అనే సంపద అపూర్వమైనది.
అది ఖర్చు పెడితే పెరుగుతుంది, దాచుకుంటే/వాడకపోతే నిరుపయోగమవుతుంది.
శ్లో. ఆపూర్యమాణమచలప్రతిష్ఠం - సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే - స శాన్తిమాప్నోతి న కామకామీ||
తే.గీ. చేరుచున్నను సతతంబు నీరు జలధి
నిశ్చలంబుగనుండును నిరుపమగతి,
భోగభాగ్యముల్ చేరినన్ పొంగిపోక
కోరికలు లేని ప్రాజ్ఞుని తీరునొప్పి.
భావము. "సముద్రం నింపబడుతూనే ఉంటుంది.... నిశ్చలంగా ఉంటుంది. జలం దానిలో చేరిననూ దానిని కదిల్చలేవు... అదే రీతిగా భోగాలు తనలో ప్రవేశించినప్పటికీ నిర్వికారంగా ఉండే స్థితప్రఙ్ఞుడే.... కోరికలకు దూరమై సుఖశాంతులను పొందగలడు".
శ్లో. అపృష్టో உపి హితం బృయాత్, యస్య నేచ్చేత్ పరాభవం,
ఏష ఏవ సతాం ధర్మో, విపరీత మతొஉన్యథా.
క. ఇతరుల మంచిన కోరిన,
సతతము హితమును తెలుపుచు చక్కగ నడుపున్
క్షితిపై సద్గుణ గణ్యులు.
మతిమంతుల మార్గ మిదియె, మహితంబిదియే.
భావము. ఎవరికి పరాభవము జరగకూడదని కోరుకుంటావో, వానికి హితమును అడుగక పోయినను చెప్పాలి . ఇదియే సత్పురుషుల ధర్మం. అడుగలేదు కదాని హితమును చెప్పక ఊరకుండిన అది అధర్మము.
శ్లో. అభివాదయేత్ వృధాంశ్చ, దద్యాచ్చైవాసనం స్వకమ్,
కృతాంజలి రుపాసీత, గచ్ఛతః పృష్ఠతోన్వియాత్.
తే.గీ. పెద్దవారిని కనుగొన్నఁ బ్రీతితోడ
వందనము చేసి యాసనమందు నిలిపి,
ప్రీతితోడుత పలికి విఖ్యాతి మెలఁగ
సంతసింతురు వారు. నిన్ సన్నుతింత్రు.
భావము. వృద్ధులకి నమస్కరిచడం, నీ ఆసనమును వారికి ఇయ్యటం, అంజలి బద్ధుడవైయుండి, వారు వెళ్ళునప్పుడు వెనుకనే కొంత దూరము సాగనంపాలి.
శ్లో. అభ్యాసానుసారీ విద్యా - బుద్ధిః కర్మానుసారిణీ.
ఉద్యోగానుసారిణీ లక్ష్మీః - ఫలం భాగ్యానుసారిణీ.
తే.గీ. ఎంత అభ్యాసమును చేయ నంతె విద్య
కర్మకొద్దియె బుద్ధియు కలుగు నిజము.
లక్ష్మి ఉద్యోగమును బట్టి లభ్యమగును.
భాగ్యమును బట్టి కలుగును ఫలము కనుఁడు.
భావము:- చేసిన అభ్యాసముకొద్దీ విద్య ప్రాప్తించును. బుద్ధి యనునది మన కర్మననుసరించి ప్రవర్తించును. చేయుచున్న ఉద్యోగము కొద్దీ ధనము ప్రాప్తించును. మనము పొందే ఫలితాలు మన భాగ్యముననుసరించియే యుండును.
శ్లో. అమృతం చైవ , మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మోహాదాపద్యతే మృత్యుః , సత్యేనాపద్యతేஉమృతమ్. (ఆది శంకరులు)
క. మృత్యువు నమృతము కనపడు
సత్యము. మన దేహమందె సహవసియించున్
మృత్యువు మోహము వలనను
సత్యముచే నమృత శక్తి సరసత నిలుచున్.
తే.గీ. నిత్యమమృ తము మృత్యువు నిశ్చితముగ
దేహమున నుండు దేహికి. దేహికుండు
మోహమునమృత్యువబ్బును.మోహి కాక
సత్యదర్శికి యమృతంబు సంభవించు.
భావము. అమృతము, మృత్యువు ఈ రెండూ మన శరీరంలోనే ఉన్నాయి. మోహం వల్ల మృత్యువు , సత్యం వల్ల అమృతత్వము కలుగును.
శ్లో. అమృతం సద్గుణా భార్యా - అమృతం బాలభాషితం
అమృతం రాజసమ్మానం - అమృతం మానభోజనమ్.
తే.గీ. భార్య గుణవతి యమృతంబు భర్తకెపుడు,
బాలభాషణమృతంబు పద్మనాభ!
రాజ సన్మానమమృతంబు పూజ్యులకును,
పరిమితాహారమమృతము భక్తవరద!
భావము. మంచిగుణం గలదైన భార్య అమృతం వంటిది. చిన్నపిల్లల ముద్దుమాటలు అమృతసమాన మైనవి. రాజు వల్ల గౌరవం పొందడం అమృతంతో సమానం. కొలత ప్రకారం పరిమితంగా చేసే భోజనం అమృతం వంటిది.
శ్లో. అయం నిజ: పరో వేతి గణనా లఘుచేతసాం
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
తే.గీ. అతఁడు నావ్యక్తి. నావ్యక్తి యితడు కాడ
నుచు పలుకుదురజ్ఞానులనుపమ గతిని.
విశ్వవిజ్ఞాతలందరున్ విశ్వజనుల
నెల్లరిని తన వారిగా నెన్నుదురయ.
క. నావారా? పైవారా?
ఏవార?లటంచు హీను లెంతురు ప్రజలన్.
భూవలయ సంస్థిత ప్రజ
నావారని తలతు రెపుడు నయత నుదారుల్.
భావము. వీడు నావాడు, వీడు పరుడు అనే పరిగణన అల్పమనస్కులకు ఉంటుంది. ఉదార ప్రవర్తనగలవారికి మాత్రం ఈ ప్రపంచమే ఒక కుటుంబం.
శ్లో. అయం హి కృత నిర్వేశో జన్మకోట్యంహసామపి
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7)
క. హరి యను నామోచ్చారణ
హరియించును పాతకముల నసదృశ ఫణితిన్.
హరియే కనబడు లోపల,
హరియే కనిపించు బయట హరి భక్తులకున్.
భావము. సమస్త పాపములను నశింపజేయుటయే హరి నామము యొక్క ప్రప్రథమ ధర్మము.
దానికి ప్రమాణం ఏమనగా అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను. ఇది కోరు మనవుడు సాధన చేయ వలెను
కళ్ళు మూసినప్పుడు ధ్యానంలోను, కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగితే సాధన సార్ధకమైనట్లే.
శ్లో. అయమేవ పరోధర్మః, ఇయమేవ విదగ్ధతా
ఇదమేవ హి పాండిత్యం, యదాయాన్నాధికో వ్యయః.
క. మితముగ వ్యయమును చేయుటె
యతులిత సద్ధర్మమును, మహన్నిపుణతయున్.
క్షితి పాండిత్యమునదియే
సతత మితవ్యయపరులకు సౌఖ్యంబబ్బున్.
భావము. ఆదాయాన్ని మించి వ్యయం చేయకూడదు అనేదే శ్రేష్ఠధర్మం. అదే నైపుణ్యం.అదే పాండిత్యం.
శ్లో. అర్థానామార్జనం కార్యం, వర్థనమ్ రక్షణం తథా,
భక్ష్యమాణో నిరాదాయః సు మేరురపి హీయతే.
క. ఆర్జింప వలయు ధనమును,
ఆర్జించిన దాని పెంచి, యరయుచు సుఖమువ్
వర్జించి రక్ష సేయుక,
ఆర్జన విడి తినిచునున్న హరియించుకుపోన్.
భావము. ధనమునార్జించుట కర్తవ్యము. ఆ ధనమును వృద్ధి చేయుట రక్షించుట అవసరము. సంపాదించకుండా ఉన్నది తింటూ కూర్చున్నచో మేరు పర్వతమైననూ తరిగిపోవును.
శ్లో. అరాచకే హి లోకే உస్మిన్ సర్వతో విద్రుతే భయాత్
రక్షార్థ మస్య సర్వస్య రాజాన మసృజత్ప్రభుః.
తే.గీ. రాజు లేనట్టి రాజ్యాన ప్రజలు జడుచు
కాన రాజ్యంబుఁ గావగ జ్ఞాన భరితు
రాజుగా చేసె రక్షింప ప్రజలనెల్ల.
ఎంత దయనీయుడోకదా యీశ్వరుండు!
భావము. రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలు అన్నివిధాలా భయంతో విచలితులౌతారు. అందుకే లోకమంతటినీ రక్షించటానికి దైవం రాజును సృష్టించాడు.
శ్లో. అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే
ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః.
తే.గీ. అతిథిదేవుఁడు పాత్రుడై యలరు చున్న
శతృవైనను మన్నించి చక్క గనుము.
నరకవచ్చిన వానిపైకరుణ జూపి
నీడ నిచ్చునువృక్షము నిరుపమముగ.
భావము. ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి. తనను నరకటానికి వచ్చిన వానికి కూడా చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా.
శ్లో. అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||
తే.గీ. అశుభములు నాశనంబౌత, యఖిల దురిత
భయములిల నాకు నశియించి. పరమ శాంతి
కలుగ చేయుత గ్రహములు కరుణ జూచి,
మంగళంబులు కూర్చుత మహితముగను.
భావము. అరిష్టములు నశించు గాక. పాపములు, భయములు తొలగు గాక, నాకు శాంతి, శుభము కలుగు గాక, గ్రహముల యనుగ్రహము నాకు కలుగు గాక. గ్రహములు నాకు మంగళప్రదులగుదురు గాక.
శ్లో. అర్థాతురాణాం న గురు ర్న బంధుః, - కామాతురాణాం న భయం న లజ్జా,
క్షుధాతురాణాం న రుచి ర్న పక్వం, - విద్యాతురాణాం న సుఖం న నిద్రా.
క. ధన రతులకు గురు, బంధులు
ననయము కామాతురులకునన భయ, లజ్జల్.
పెనుక్షుధులకు రుచి, పక్వము,
ఘన విద్యార్థికి కునుకు సుఖములుండవుగా.
భావము. ధనదాహం గలవాడికి గురువు లేడు, బంధువూలేడు. కామాతురునికి భయము, సిగ్గూ లేవు. ఆకలితో సతమత మౌతున్నవాడికి రుచి లేదు, ఉడికినదా, లేదా ? అనే ప్రశ్నయు లేదు. విద్య కొఱకు ఆతురత పొందువానికి సుఖము, నిద్రా లేవు.
శ్లో. అర్థానామార్జనే దుఃఖ - మార్జితానాం చ రక్షణే
ఆయే దుఃఖం వ్యయే దుఃఖం - ధి గర్థం దుఃఖభాజనమ్॥
తే.గీ. ధనమునార్జింపగా దుఃఖమనుభవమగు.
దాని దాయంగ దుఃఖము ధరణి పైన.
పెంచ, వెచ్చింప దుఃఖము, భీతిఁ గొలుపు
దుఃఖ దాయిని ధన వాంఛ దూరమగుత.
క. ధన సంపాదన దుఃఖము,
ధన రక్షణ దుఃఖమయము,
ధన మొదవు నెడన్,
ధనమది ఖర్చగు వేళను,
మనకౌనది దుఃఖమయము,
మదిఁ గనుడయ్యా.
భావము. ధనము సంపాదించునప్పుడు దుఃఖం. సంపాదనను కాపాడుకొనేప్పుడు దుఖం. సంపాదించినది వృద్ధి కాలేదని దుఃఖం. ఉన్న ధనం ఖర్చయి పోతోందని దుఃఖం. కావున దుఃఖ కారకమైన ధనము నింద్యము.
శ్లో. అర్థేన కిం కృపణహస్త గతేన తేన ? - రూపేణ కిం గుణ పరాక్రమ వర్జితేన ?
జ్ఞానేన కిం బహుజనైః కృత మత్సరేణ? - మిత్రేణ కిం వ్యసనకాల పరాఙ్ముఖేన ?
తే.గీ. లోభియైనట్టి ధనికుచే లాభమేమి?
సుగుణ, ధైర్య విహీనుని శోభ యేల?
కలిత విద్వేష పూర్ణుని జ్ఞానమేల?
సమయమప్పుడు నిలువని సఖ్యుఁ డేల?
భావము. లోభి చేతిలో ఉన్న ధనం వల్ల ఏమి ప్రయోజనం ? సద్గుణము, పరాక్రమము లేని వాని అందము వల్ల ఏమి ప్రయోజనం ? ఎందరియందో ద్వేషం పెంచుకొనే వాని జ్ఞానం వల్ల ఏమి ప్రయోజనం ?ఆపద సమయంలో ముఖం చాటుచేసే స్నేహితుని వల్ల ఏమి ప్రయోజనం ?
శ్లో. అలసస్య కుతో విద్యా ? - అవిద్యస్య కుతో ధనం ?
అధనస్య కుతో
మిత్రం ? - అమిత్రస్య కుతస్సుఖమ్
?
తే.గీ. బద్ధకిష్టులు విద్యలఁ
బడయునెట్లు?
విద్యలేకున్న ధనలక్ష్మి
వెలయునెట్లు?
ధనము లేకున్నమిత్రాళి
దరియునెట్లు?
మిత్రహీనుండు సుఖముగ
మెలగునెట్లు?
తే.గీ. బద్ధకిష్టికి సద్విద్య పట్టువడదు.
విద్య లేకున్న ధనమెట్లు పెరుగు మనకు?
ధనము లేకున్న మిత్రులు దరికి రారు.
మిత్ర తతి లేక సుఖమెట్లు మిగులు మనకు?
భావము. బద్ధకము కలవానికి విద్య ఎక్కడిది ? విద్య లేని వానికి ధనం ఎక్కడిది ? ధనం లేని వానికి మిత్రుడెక్కడ ? మిత్రుడు లేని వానికిసుఖమెక్కడ ?
శ్లో. అల్పాక్షర రమణీయం యః - కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ
బహువచన మల్పసారం యః -కథయతి విప్రలాపీ సః
క. తేలిక పదముల తోడనె
మేలుగ భావంబు తెలుపు మేధావి కనన్.
చాలగ పలుకును, భావము
తేలదు కన వదరుబోతు, తెలియఁ బలుకుడీ!
క. తక్కువ పలుకుచు భావము
నెక్కువ కనఁజేయు మహితుఁడెచ్చటనైనన్.
ఎక్కువ పలుకుచు భావము
తక్కువ కనఁజేయు వదరు ధరణిని కనగా.
భావము. కొద్దిపాటి తేలికమాటలతో ఎవడు అందంగా మాట్లాడుతాడో వాడే నిశ్చయంగా మాట్లాడటం తెలిసినవాడు. ఎవడు సారహీన విషయాలను అతిగా మాట్లాడుతూ చెప్తాడో వాడు వదరుబోతు.
శ్లో. అర్చన కాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా
చిన్తనకాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా!
తే.గీ. అర్చనము వేళ రూపంబు నమ్మ నిలుచు,
స్తోత్రమును జేయ శబ్దమై శోభిలు మదిఁ,
జింతనము సేయ ప్రాణమై చెలఁగు జనని,
తత్వమెన్నుచో సర్వంబు తానె యగును.
భావమి. జగన్మాత పూజా సమయంలో ‘రూపం’ లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’ లోనూ,
చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’ లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది.
శ్లో. అవశ్య మనుభోక్తవ్యం - కృతం కర్మ శుభాశుభమ్।
కృతకర్మక్షయో నాస్తి - కల్పకోటిశతైరపి॥
ఆ.వె. అనుభవింప వలయు నశుభ,శుభఫలము
లాచరించు కర్మ మోచనకును,
కల్పశతముకోటి గడచిపోయినకాని
యనుభవింపవలయునట్టికర్మ.
తే.గీ. శుభలశుభములేవైన చూడ మనము
చేయు కర్మల ఫలములే మాయఁబోవు,
కల్పకోటిశతములైన కాన మనము
తప్ప దనుభవించక ధరన్ ధర్మమిదియె.
భావము:- చేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించవలసినదే.
వంద కోట్లకల్పాలకు కూడా చేసిన కర్మ అనుభవించకుండా క్షీణించదు.
శ్లో. అవాహూతః ప్రవిశ్యతి అపృష్టో బహుభాషతే,
అవిస్యస్తే విశ్వసితి మూఢ చేతా నరాధమః. (విదురనీతి)
తే.గీ. మూఢమతి నరాధముఁడు తా పోవుచుండు
పిలువకున్నను పరగృహంబలుసుఁడగుచు,
నడుగకున్నను మాటాడునధికముగను,
నమ్మకూడని వారిని నమ్ముచుండు.
భావము. మూఢ మతియగు నరాధముడు పిలువబడకయే పరులకడకేగును,
ఎవ్వరెమియు అడగకకున్నను అధికముగా మాటలాడును, నమ్మగూడని వారిపై
విశ్వాసముంచును.
శ్లో. అవిచార్య న వక్తవ్యం - వక్తవ్యం సువిచారితం|
కించ తత్రైవ వక్తవ్యం - యత్రోక్తం సఫలం భవేత్||
తే.గీ. మాటలాడరాదు మదివిచారింపక,
మంచిదనిన మాట మాటాలాడు,
మాటచెల్లుననిన మంచిగా మాటాడు,
విలువకలుహు నీదు ప్లుకుకపుడు.
భావము. ఆలోచించకుండా మాట్లాడరాదు....బాగుగా ఆలోచించి మాట్లాడవలెను....
ఎక్కడ మాట్లాడితే మాటకు తగిన విలువ మరియు ప్రయోజనం ఉంటుందో
అక్కడే మాట్లాడవలెను.
శ్లో. అవిధేయో భృత్యజనః - శఠాని మిత్రాణి నిర్దయః స్వామీ
వినయరహితా చ భార్యా - మస్తకశూలాని చత్వారి.
తే.గీ. మాట విననట్టి పనివాడు, మదిని మెలగి
మోసగించెడి మిత్రుఁడు, భూమిపైన
దయయె లేనట్టి యజమాని, ప్రియము లేని
మాట విననట్టి భార్యయు మదికి బాధ.
భావము. మాట వినని పనివాళ్ళు, మోసం చేసే మిత్రులు, దయలేని యజమాని, వినయం లేని భార్య - ఇవి నాలుగు తలనొప్పులు.
శ్లో. అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ న విందతి
ససంతోషస్తథా నిత్యం త్రీణి శిక్షేత్ గార్ధభాత్.
క. నిరతము బరువును మోయుట,
వెరవక వేడికి చలికిని బ్రీతి మనుటయున్,
గరపును గాడిద మనలకుఁ
జరియింపఁగ వలయు నటుల చక్కగ మనమున్.
భావము. విశ్రాంతి లేకుండా భారం మోయుట, చలి ఎండలకు చలించకుండా వుండుట, నిత్యము సంతోషముగా నుండుట, ఈ మూడు లక్షణములు మనము గాడిద నుంచి నేర్చుకొనవలెను.
శ్లో. అవ్యాకరణమధీతం , భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణం
భేషజమపథ్య సహితం త్రయమిదమకృతం వరం న కృతమ్.
తే.గీ. పూర్ణ విద్యను నేర్వమిన్ పోకు చదువ.
భిన్నమైనట్టి పడవలో వెళ్ళఁ బోకు.
పత్యమును చేయ లేనిచో వలదు మందు.
పూర్ణ మనమున పని చేయఁ బూన వలయు.
భావము. వ్యాకరణాన్నిసమగ్రంగా చదవకపోవటం, పగిలిన పడవతో నదిని దాటాలనుకోవటం, పథ్యం లేకుండా ఔషధాన్ని సేవించాలనుకోవటం అనే మూడు పనులకు అసలు సిద్ధపడకపోవటమే మంచిది.
శ్లో. అశ్వం నైవ , గజం నైవ , వ్యాఘ్రం నైవ చ నైవ చ
అజాపుత్రం బలిం దద్యాద్దేవో దుర్బలఘాతక: !
క. బలియివ్వరు అశ్వంబును
బలియివ్వరు గజము వ్యాళ వ్యాఘ్రంబులిలన్
బలియిత్తురజంబు నహో!
బలహీనునె బలి యొనరుచు పరమాత్ముండున్
భావము. లోకంలో ఎంతో బలం ఉన్న గుఱ్ఱాన్నికాదు, ఏనుగును కాదు, పులిని కానేకాదు , కేవలం బలం లేని ఒక మేకపిల్లను బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలురనే హింసిస్తాడు కాబోలు !
శ్లో. అశ్వస్య లక్షణం వేగః - మదో మాతంగ లక్షణమ్ |
చాతుర్యం లక్షణం నార్యాః - ఉద్యోగం పురుష లక్షణమ్ ||
(మహాసుభాషితసంగ్రహః)
తే.గీ. వేగమశ్వలక్షణమగు విశ్వమునను,
మదము గజలక్షణంబగు మహిని జూడ,
నేర్పు స్త్రీ లక్షణంబగు నేలపైన,
నిరతముద్యోగమే తగు పురుషులకును.
భావము. వేగం
అనేది గుర్రానికి
లక్షణము.
గర్వం అనేది
ఏనుగుకు లక్షణము. చాతుర్యం అనేది
స్త్రీలకు లక్షణము. ఉద్యోగం అనేది
పురుషులకు లక్షణము.
శ్లో. అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం.
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ. ….వరాహ పురాణం
తే.గీ. రావి, నిమ్మ, మఱ్ఱి, ప్రాతుమొక్కొక్కటి,
రెండు లుంగుషములు, రెండు దాడి
మముల నామ్ల ద్రువులు మహినైదు పూజాతి
చెట్లు పదియు పెంచ చెలఁగు సుగతి.
భావము. ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
శ్లో. అష్టాదశ పురాణానాం - సారం వ్యాసేన కీర్తితమ్
పరోపకారః పుణ్యాయ - పాపాయ పరపీడనమ్
తే.గీ. వ్యాసుడష్టాదశపురాణరాశిలోన
నొక్కి చెప్పెను గట్టిగా నిక్క నిజము
పరుప హింసించ పాపంబు పట్టుకొనును,
పరులకుపకారమిల పుణ్యఫలము గొలుపు.
భావము. “పరోపకారమే పుణ్యం – పరపీడనమే పాపం” అని వ్యాస మహర్షి
తాను రచించిన అష్టాదశ (18) పురాణాలలోని సారాన్నంతా రెండే రెండు
మాటల్లో చెప్పాడు. కావున, ఇతరులకు- మేలు చేయుట, కీడు చేయకుండుట
- అను ఈ రెండు సూత్రాలను మానవులు సర్వదా మనసునందు ని
లుపుకొని ఆచరించవలెనని భావన.
శ్లో. అసంపన్నః కథం బంధుః ? అసహిష్ణుః కథం ప్రభుః ?
అనాత్మవిత్ కథం విద్వాన్ ? అసంతుష్టః కథం సుఖీ ?
గీ. పేద యింటికి బంధువుల్ పోదురొక్కొ?
ఓర్పు లేకున్న రాజెట్టులుర్వినేలు?
కనక పండితుల్ దైవమున్ ఘనులగుదురె?
తుష్టి లేకున్నసుఖములు తోడ నున్నె?
భావము. సంపన్నుడు కాకపోతే బంధువెలా అగును ?(సంపన్నులకందరూ బంధువులమని చెప్పుకుంటారు ) ఓర్పు లేనివాడు రాజెట్లగును? పరమాత్మ స్వరూపం తెలియనివాడు విద్వాంసుడెట్లగును? సంతృప్తి లేనివాడు ఎలా సుఖముకలవాడగును?
శ్లో.అసంభవం హేమమృగస్యజన్మ - తథాపిరామో
లులుభేమృగాయ
ప్రాయః సమాపన్నవిపత్తికాలే - ధియోపిపుంసాం
మలినాభవన్తి.
తే.గీ. సంభవింపదు బంగారు ఛాయ జింక
తెలిసియున్
రాముడద్దానిఁ దేవనేగె,
నాపదలు వచ్చు
వేళలో నధికులకును
బుద్ధి మాలిన్యమున్
బొందు పుడ్మిపైన.
భావము. సృష్టిలో బంగారుజింకయొక్కపుట్టుక
అనునది సంభవముకానిది.అయిననూ సకలసద్గుణసంపన్నుడైనరాముడు కూడా బంగారుజింకొరకు ఆశపడ్డాడు.ఆపదలుసంభవించేసమయమాసన్నమైనపుడు
,మహాత్ములుకూడా సదసద్వివేకమును కోల్పోతారుకదా.లోభము ఎంతయో చెడ్డగుణముకదా.
శ్లో. అసమ్భావ్యం న వక్తవ్యం - ప్రత్యక్షమపి దృశ్యతే।
శిలా తరతి పానీయం - గీతం గాయతి వానరః॥
తే.గీ. వీటిలో రాయి తేలుట నీవు కనిన,
కోతి పాడుట వినినను నీతిఁ గనుము,
కంటికెదురిగా నీకది కనఁబడినను
పలుకఁబోకు మసంభవమ్ములను నీవు.
భావము. నీవు ప్రత్యక్షంగా చూచినప్పటికీ అసంభవమైన వాటిని ఎన్నడూ ఇతరులతో చెప్పవద్దు. నీటిపై రాయి తేలింది. కోతి పాటలు పాడింది' అంటే ఎవ్వరైనా నవ్వుతారేకాని నమ్మరు.
శ్లో. అసహాయః సమర్ధోపి తేజస్వీ కిం కరిష్యతి?
నిర్వాతే జ్వలతే వహ్నిః స్వయమేవోపశామ్యతి.
ఆ.వె. పరుల తోడు లేక బలవంతుఁడైనను
చేయ లేడు పనులు చేవ చూపి.
గాలి తోడు లేక ఘనమైన యగ్నియు
నారిపోవుఁ గాదె దారి లేక.
భావము. శూన్యంలో అగ్ని తనంతట తానే ఉపశమిస్తుంది, కారణం తనకి తోడుగావుండవలసిన గాలి, ఆమ్లజని తగినంత మోతాదులో దొరకక తనంతతానే ఆరి పోతుంది. అలాగే ఎంతటి సమర్ధుడైనా తేజోవంతుడైనా ఇంకొకరి సహాయం లేకపోతే ఏమీ చేయ లేడు.
శ్లో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద?
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో!
ఆ. సాధ్యమవని దానిసాధించెదవు నీవు.
సాధ్యమవనిదేది సరస! నీకు.
రామ దూత! కృపను రాజిల్లుదువునీవు.
నాకు జయము కొలిపి నన్నుఁ గనుమ.
భావము. అసాధ్యాన్ని సుసాధ్యం చేయ సమర్థుఁడవైన ఓ శ్రీమ దూతవైన ఓ హనుమంతుఁడా! నీకు అసాధ్యమేమున్నది చెప్పుము. నీవు కృపా సముద్రుఁడవు. నా పనులన్నిటినీ నాకు సుసాధ్యము చేయుమని ప్రార్థించుచున్నాను.
శ్లో. అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం!
హిమాలయే హర శ్శేతే! హరి శ్శేతే మహోదధౌ!
ఆ.వె. సార హీనమైన సంసారమందున
సార పూర్ణమత్త వారి యిల్లు.
హరుడు హిమ గృహమున, హరి పాల కడలిని
నిండు మనముతోడ నుండెఁ గాదె!
భావము. సార హీనమైన యీ సంసారమునందు అత్తవారిల్లే (మామగారిల్లే) సారవంతంగా ఉంటుంది. అందుకే గదా పరమ శివుడు తాను తన అత్తవారిల్లైన (మామగారిల్లైన) హిమాలయ పర్వతముపై కైలాసమున నివసించుచున్నాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా తన అత్తవారిల్లైన(మామగరిల్లైన) పాల కడలలోనే నివసిస్తున్నాడు? ఎంత సారవంతమైనవి కకపోతే అలా ఉంటారు?
శ్లో. అసారే ఖలు సంసారే - సుఖభ్రాన్తిఃశరీరిణామ్౹
లాలాపానమివాఙ్గుష్ఠే - బాలానాం స్తన్య విభ్రమః.
క. వ్రేలును చీకుచు తానది
పాలని భ్రమియించు బిడ్డ పగిదిని మనమున్
పేలవమగు సంసారమె
మేలనిభ్రమియింతుముకద మిధ్యాజగతిన్.
భావము. ఎటువంటి సారమూ లేని ఈ ప్రపంచంలో ఏదో ఏదో సుఖం ఉందని మానవులు భ్రాంతి పడుతూ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటూ ఉంటారు . అది ఎలాంటిది అంటే బొటనవేలు నోట్లో పెట్టుకుని తన లాలాజలాన్నే చప్పరిస్తూ చనుపాలు తాగుతున్నాం అనుకునే పసిపిల్లవాడి భ్రాంతి వంటిది. ఇక్కడ మెలిక ఏమిటంటే ఆవిధంగా భ్రాంతి పడిన పిల్లవాడిని చూసి తల్లి కాసేపటికి వాడి ఆకలి తెలుసుకుని పాలు ఇస్తుంది . కానీ మానవుడు ఒకసారి ఈ జన్మ వృధా చేసుకుంటే ఇక మానవ జన్మ అసంభవం.
శ్లో. అస్థిరం జీవనం లోకే అస్థిరం ధనయౌవనం,
అస్థిరం దారపుత్త్రాది ధర్మః కీర్తిర్ద్వయం స్థిరమ్॥
గీ. అస్థిరంబిల జీవన మస్థిరములు
ధనము, యౌవనము, సుతులు, ధర్మ పత్ని,
స్థిరము ధర్మంబు, కీర్తియు, పరమ పథము
చేరు మార్గంబులివ్వియే ధీరులకిల.
భావము. ప్రాణము, ధనము, యౌవనము, భార్యాపుత్రాదులు సర్వము అస్తిరమైనవే, ధర్మము, కీర్తి ఈ రెండే స్థిరమైనవి.
శ్లో. అహన్యస్తమయాంతాని, ఉదయాంతా చ శర్వరీ
సుఖస్యాంతం సదా దుఖం, దుఖస్యాంతం సదా సుఖమ్.
క. ఉదయం బస్తమయంబున
నుదయంబున నస్తమయమునొందెడుచ్యుతి. స
న్మధుర సుఖాంతము దుఃఖము
వ్యధభరదుఃఖాంతము సుఖ మరయుఁడు నిజమున్.
భావము. పగలు– సూర్యాస్తమయంతో, రాత్రి – సూర్యోదయంతో అంతమౌతాయి. సుఖము పిదప ఎప్పుడూ దుఃఖము, దుఃఖము పిదప ఎప్పుడూ సుఖమును ప్రాప్తించుట తథ్యము.
మంత్రము. అసుర్యా నామతే లోకా - అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తి - యేకే చాత్మహనో జనాః. (ఈశావాస్యోపనిషత్ ౩)
తే.గీ. రక్కసుల లోకముకు చూడ నిక్కముగను
గాఢమైనట్టి చీకటిన్ గప్పి యుండు,
నాత్మహంతులందుదు రట్టిలోక
మును గనంగను నాత్మహననము వలదు.
భావము. రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.
శ్లో. అహింసా పరమో ధర్మః
- తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం - అహింసా పరమార్జనమ్.(మహాభారతం)
తే.గీ. పరమధర్మ మహింసయంచరయవలయు,
పరమ తపమహింసయే నిరుపమమది,
జ్ఞానమనగ నహింసయే కనఁగ మనము,
గొప్ప సాధనమె యహింస, కువలయమున.
భావము. అహింస గొప్ప ధర్మము. అదే గొప్ప తపము. అదే మంచి ఙ్ఞానము. అదే గొప్ప సాధనము.
శ్లో:- అహింసా ప్రథమం
పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం,
క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః
పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం
విష్ణో:ప్రీతికరం భవేత్.
చం. విమల యహింసయున్ మరియు
వెల్గెడి యింద్రియ నిగ్రహంబు,భూ
తములెడ నంతులేని దయ, తాల్మియు, శాంతి, తపంబు, ధ్యానమున్,
ప్రముదము గొల్పు సత్యమను భాసిలు పుష్పచయంబు, వీటితో
సుమధుర భావనన్ హరిని శోభిలఁ గొల్చిన ప్రీతి చెందెడున్.
భావము:- అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై
తపించుట, పరమాత్మ ధ్యానము, సత్యనిరతి అనే ఎనిమిది విధములైన పుష్పములతో హరిని ఆరాధిస్తే
చాలా సంతోషిస్తాఁడు హరి.
శ్లో. అహింసా సత్యమస్తేయం - అకామ క్రోధ లోభతా
భూత ప్రియ హితేహాచ - ధర్మోయం సార్వ వర్ణికః.
ఆ.వె. హింస వీడి, పరమ హితము, సత్యము బల్కి,
ధ్యాస పరుల సొమ్ము కాస పడక
కామ క్రోధ లోభ కలుషిత మవకుండ
ప్రాణి కోటి మంచి బడయుతనుత!
భావము.హింస చేయకుండుట, సత్యమే పలుకుట, ఇతరుల ద్రవ్యమున కాశ పడకుండుట, కామ క్రోధ లోభములను జయించుట, సమస్త ప్రాణుల హితమునే మనసా వాంఛించుట, ఇవి యన్నియు అన్ని కులముల మనుజులునూ సర్వదా ఆచరించు చుండ వలసినట్టి సాధారణ ధర్మములు సుమా.
శ్లో. అహో తమ ఇవేదం స్యా - న్న ప్రజ్ఞాయేత కించన !
రాజా చే న్న భవేల్లోకే - విభజ సాధ్వసాధునీ ||
(వాల్మీకి రామాయణం 2.67.36.)
ఆ.వె. మంచిచెడులుతెల్పు మహితాత్ముఁడగు రాజు
ధరను కలుగ వలెను తప్పకుండ,
లేకపోయెనేని లోకంబె చీకటి
మంచిచెడ్డలెవ్వరెంచి చెప్పు?
భావము. మంచి చెడులను విడమరచే రాజు లోకంలో లేకపోతే, ఏదీ ఏమీ తెలియకుండా పోగలదు. అంతా చీకటితో మూసుకు పోగలదు
శ్లో. ఆకారైరింగితైర్గత్యా - చేష్టయా భాషణేన చ l
నేత్రవక్త్రవికారైశ్చ - లక్ష్యతేఽన్తర్గతం మనః ll
తే.గీ. వ్యక్తమగునట్టి యింగితం బాకృతియును,
భాషణము, చేష్ట, మనదైన వ్యవహృతియును,
కనుల ముఖమున గనఁబడు కవళికలును
తెలుపు మనలోని భావనల్ తెల్లమవగ.
భావము. ఆకారముచేత, ఇంగితముచేత, నడవడికచేత, వ్యవహారముచేత, మాటలచేత మరియు కళ్ళలో, ముఖములో కలిగే మార్పులచేత మనస్సులోని భావం తెలియజేయబడును.
శ్లో. ఆకాశాత్ వాయు ప్రభవః, శరీరాత్ సముచ్చరన్, వక్త్రముపైతి నాదః।
స్థానాన్తరేషు ప్రవిభజ్యమానో వర్ణత్వమాగచ్ఛతి యః స శబ్దః॥
తే.గీ. వాయువాకాశమునఁ బుట్టి పలుకఁబడును
దేహమందుండి, వక్త్రాన దివ్య నాద
మగుచు, స్థానములను బట్టి యగును వర్ణ
ముగను. శబ్దమందురు దాని నిగమ విదులు.
భావము. ఆకాశమునుండి వాయువు ప్రభవించును. శరీరమునుండి ఉచ్చరింపఁబడి, ముఖముద్వారా ద్వనిరూపమున వెల్వడును. స్థానాంతరములనుండి విభజింపఁబడినవి అక్షరములుగా ఏదైతే వెలువడుచున్నవో అదియే శబ్దము.
శ్లో. ఆక్రోశపరివాదాభ్యాం - విహింసంత్యబుధా బుధాన్ |
వక్తా పాపముపాదత్తే - క్షమమాణో విముచ్యతే || (విదురనీతి)
తే.గీ. మూఢులాక్రోశధూషణల్ బుధులు బాధ
పడునటులఁ జేయుచుండుటన్ బాపచయము
బుధుల నుండి మూఢులఁ జేరు, బుధులు యోర్మిఁ
బాప ముక్తులై, సన్ముక్తిఁ బడయుదురయ!
భావము.
మూఢులు పండితులను దూషణలతోనూ, తప్పుడు ఆరోపణలతోనూ బాధిస్తారు. దూషించేవాడు సత్పురుషులలో
ఉండే తక్కువ పాపాలను కూడా తన దూషణలకు వినిమయ రూపంలో స్వీకరిస్తాడు. తద్వారా క్షమాగుణంతో
ఉన్న సత్పురుషుడు పాపాల నుండి విముక్తి పొందుతాడు!
శ్లో. "ఆగమాపః ప్రజా దేశః - కాలః కర్మ చ జన్మ చ.!
ధ్యానం మంత్రోఽథ సంస్కారో, - దశైతే గుణహేతవః".!! (మనుస్మృతి)
తే.గీ. దైవము, పరిసరము, పని, త్రాగు నీరు,
దేశమును, జన్మ, కొనునుపదేశ, మంత్ర,
ధ్యాన విషయమున్, మనుకాల మను పదియును,
వ్యక్తి గుణముల మూలముల్, భక్తిపూర్ణ!
భావము. ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము. ఈ పదిన్ని వ్యక్తులలోని గుణము లకు కారణము లగుచున్నవి.
శ్లో. ఆగమార్థంతు దేవానాం - గమనార్థంతు రాక్షసాం
కురు ఘంటా రవం తత్ర - దేవతాహ్వాన లాంఛనం.
తే.గీ. దేవతల రాక కొఱకని తృప్తిఁ గొలుప,
రాక్షసుల పోక కొఱకు, పరాకు లేక
గంట వాయించు టొప్పును, గర్భ గుడిని,
దేవ తాహ్వాన పద్ధతి తెలియఁ దగును.
భావము. పూజా సమయంలో మనం పూజించే దేవతలు అక్కడికి రావడం కొఱకు, మన బాహ్యాంతర ప్రదేశాల నుండి రాక్షసులు పోవడం కొఱకు, గంట మ్రోగించ వలెను. దేవతల నాహ్వానించు లక్షణము ఇదేసుమా.
శ్లో. ఆచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి
స్వయం ఆచరతే యస్మాత్తస్మాదాచార్య ఉచ్యతే.
క. శాస్త్రంబులనుసరించుచు,
శాస్త్రాంబులు బోధఁ జేసి, చక్కఁగ ప్రజలన్
శాస్త్రంబులాచరింపఁగ
శాస్త్రజ్ఞులు చేయుదురిల సత్యాచార్యుల్.
భావము. శాస్త్రము ఆకళింపు చేసుకొని వారు ఆచరించుచుారి బోధనల ద్వారా యితరులను ఆచరింప చేసేవారేఆచార్యులు అని చెప్పఁబడినది.
శ్లో. ఆత్మాత్వం గిరిజామతి స్సహచరా: ప్రాణాశ్శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితి:
సంచార: పదయో: ప్రదక్షణవిధి: స్తోత్రాణి సర్వాన్గిరో
యద్య త్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం ||
శా. నీవే యాత్మవు, బుద్ధి దుర్గ, స్వజనుల్ నీవైన నా ప్రాణముల్,
భావింపన్ గుడి నాశరీరమయ, సేవల్ నీకు నా కార్యముల్,
దేవా నిద్ర సమాధి, నా నడకయే దీపించు నిన్ చుట్టుటల్,
నావాక్కుల్ గన స్తోత్రముల్, గొనుమయా! నావర్తనల్ సేవగా.
భావము.
ఓ పరమేశ్వరా! నా ఆత్మవు నీవే . నా బుద్ధిగిరిజయే. నా పంచప్రాణములు సహచరులే.
నా శరీరమే యిల్లు. నా విషయోపభోగరచననలే నీకు నేను చేయు పూజ. నా నిద్రయే సమాధి.
నా పాదములు ఇటునటుతిరుగుటయే నీకు నేను చేయు ప్రదక్షిణలు.
నేను నిత్యమూ పలికెడి నా మాటలే నీకు నేను చేయు స్తోత్రములు.
నేను యేయే కర్మలనొనరించుచుంటినో అదంతయూ నీ ఆరాధనయే.
నీవు నన్ను అనుగ్రహించుము.
100. శ్లో. ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
దారిద్ర్య దుఃఖ రోగాణి బంధన వ్యసనాని చ.
తే.గీ. దేహికపరాధతరులబ్ధ దీన
ఫలము
లిలను దారిద్ర్య
దుఃఖములేల్చు రోగ
బంధనములువ్యసనములుబాధఁ గొలుపు.
దేహి యపరాధ
దూరుడై తిరుగ వలయు.
భావము. జీవులయొక్క "స్వయం కృతాపరాధం" అనే వృక్షానికి - దారిద్ర్యం,దుఃఖం , రోగాలు , బంధన ప్రాప్తి , వ్యసనాలు అనేవి ఫలాలు.
101. శ్లో. ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః - ఆత్మైవ రిపురాత్మనః l
ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ - కృతస్యాపకృతస్య చ ll (మహాభారతమ్)
తే.గీ. తనకు తానెయౌ బంధువు, తనకు తానె
శత్రువరయఁగ నరునకు, ధాత్రిపైన
చేయుచున్నట్టి మంచికి చెడ్డ కరయ
నాత్మయే సాక్షి మనిషికి, నాత్మఁగనుము.
భావము. " మంచిపని చేసినా, చెడ్డపని చేసినా.....మానవుడు తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షియగుచున్నాడు."
శ్లో. అదత్తేత్యాగతా లజ్జా
- దత్తేతి వ్యథితం మనః |
ధర్మస్నేహాంతరే న్యస్తాః
- దుఃఖితాః ఖలు మాతరః ||
(ప్రతిజ్ఞాయౌగంధరాయణం)
ఆ.వె. పెళ్ళికాని కూతులిళ్ళలో నుండినన్,
పెళ్ళి జరిగి వారు వెళ్ళిరేని,
తల్లి మనసు సిగ్గునల్లల్లనాడుట
దుఃఖమొందును, సుదతులకు దిగులె.
భావము. ఎదిగిన ఆడపిల్లకు పెళ్ళికానంతవరకు తల్లికి సిగ్గుగావుంటుంది.
పెళ్ళయితే కూతురిని విడచివుండటానికి తల్లి మనసు బాధపడుతుంది.
ఇలా ఒక వైపు కర్తవ్యమూ, మరోవైపు మమత - ఈ రెంటి నడుమ చిక్కుకొన్న
తల్లుల మనస్సు దుఃఖిస్తుంది.
శ్లో. ఆదానస్య
ప్రదానస్య కర్తవ్యస్యచ కర్మణః
క్షిప్ర మక్రియ మాణస్య కాలః పిబతి సంపదః.
తే.గీ. ఇవ్వ దలచిన వెంటనే యిచ్చుట తగు.
పుచ్చుకొననెంచ వెంటనే పుచ్చుకొనుడు.
కాలహరణంబు చేసిన కాలగతిని
ధనము హరియింపఁబడవచ్చు తలచిచూడ.
భావము. తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా అది వెంటనే చేసేయాలి. అలాకాక అప్పుడో ఇప్పుడో అనుకుంటే కాలం ఆ సంపదని మింగేస్తే ఆ మీదట ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవడము ఉండదు.
శ్లో. అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి మనస్సత్వేన శుద్ధ్యతి|
విద్యాతపోభ్యామాత్మాచ బుద్ధిః ఙ్ఞానేన శుద్ధ్యంతి||
తే.గీ. నీటి చేతను దేహము, నెమ్మి మనసు
సత్వ గుణమున శుద్ధి యౌన్ సత్యమిదియె.
తపము, విద్యల నాత్మయు, తనరు బుద్ధి
జ్ఞానమున శుద్ధి పొందును సరసులార!
భావము. నీటిచేత అంగములు, శరీరము శుద్ధినొందును. సత్వగుణముతో మనస్సు శుద్ధిని పొందును. విద్యచేత, తపస్సు చేత ఆత్మ శుద్ధి కలుగును. ఙ్ఞానముచేత బుద్ధి శుద్ధిని పొందును.
శ్లో. ఆదౌ చిత్తే తతఃకాయే సతాం సంపద్యతే జరా
అసంతాతు పునః కాయే నైవ చిత్తే కదాచ న.
తే.గీ. సుజన పాళికి వార్ధక్య శోభ మదికి
చిన్నతనమునె వచ్చును మన్ననముగ.
వరసు చేతనె పాపికి వచ్చు ముదిమి.
జ్ఞానమున రాదు వృద్ధత, కానరేల?
భావము. సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది. దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యంరాదు. (పెద్దరికం రాదు).
శ్లో. ఆద్భిర్గాత్రాణి శుధ్యన్తి మనస్సత్యేన శుధ్యతిl
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిః జ్ఞానేన శుధ్యతిll
తే.గీ. శుద్ధి చేయును దేహమున్ శుద్ధ జలము.
సత్యమది శుద్ధి మనమును సరిగ చేయు,
జ్ఞాన మది బుద్ధికిన్ శుచిఁ గలుగఁ జేయు,
ఆత్మశుద్ధిని తపమదే యమరఁ జేయు.
భావము. "జలములచేత శరీరము శుద్ధియగును. సత్యముచేత మనస్సు శుద్ధియగును. జ్ఞానముచే బుద్ధి శుచియగును. తపస్సుచే ఆత్మ పరిశుద్ధమగును".
శ్లో. ఆపత్కాలే తు సమ్ప్రాప్తే - యన్మిత్రం మిత్రమేవ తత్ ॥
వృద్ధికాలే తు సమ్ప్రాప్తే - దుర్జనోఽపి సుహృద్భవేత్ ॥
తే.గీ. అపదలయందు తోడున్నయతఁడె సఖుఁడు,
సంపదలుకల్గు వేళలో సహజముగనె
చెడ్డవారును సఖులుగా చేరుచుంద్రు,
మిత్రశత్రులనెఱుగుచు మెలగవలెను.
భావము. విపత్తును ఎదుర్కొన్నప్పుడు మీ పక్షాన నిలబడే వ్యక్తి మీ నిజమైన స్నేహితుడు. లేకుంటే మీరు సర్వతోముఖాభివృద్ధి దశనున్నప్పుడు, దుర్మార్గులు కూడా మీ స్నేహితుల వలె ప్రవర్తిస్తారు.
శ్లో. ఆపత్కాలే తు సంప్రాప్తే - శౌచాచారం న చింతయేత్ ౹
స్వయం సముద్ధరేత్ పశ్చాత్ - స్వస్థో ధర్మం సమాచరేత్ ౹౹
తే.గీ. ఆపదలయందు చిక్కిన నట్టివేళ
శౌచమాచరించెడి చింత సాగనేల?
స్వాస్త్యమును చూచుకొనుటది సముచితమయ!
పిదప ధర్మప్రవృత్తికై విలువనిమ్ము.
భావము. ఆపత్కాలంలో అంటే కష్టాలు వచ్చినప్పుడు శౌచాచారం విషయానికి చింత చేయరాదు. మొదట తనను తాను రక్షించుకొంటూ తరువాత ధర్మం చేసేవైపు గమించ వచ్చు.
శ్లో. ఆపదర్థం ధనం రక్షేత్, దారాన్ రక్షే ద్ధనై రపి,
ఆత్మానం సతతం రక్షేత్, దారై రపి ధనై రపి.
తే.గీ. ఆపదల్ బాప ధనము నీ వరసి కాచు.
ధనము వెచ్చించి కాచుమీ దారనెపుడు.
నిన్ను కాపాడు కొనుము నీ వనితరగతి.
ధర్మమును కాచు మెన్నడు ధరణి పైన.
భావము. ఆపత్కాలము కొఱకై ధనమును భద్రపఱచుకొనవలెను. ఆ ధనములను వ్యయము చేసియైనను భార్యా పుత్రాదులను సంరక్షించుకొనవలెను. ధనము, కుటుంబము యీ రెండింటితోనూ తనను యెల్లప్పుడూ కాపాడుకొంటూండవలెను.
శ్లో. ఆమరణాంతాః ప్రణయాః, కోపాః తక్షణ భంగురాః
పరిత్యాగాశ్చ నిశ్శంకాః భవంతి హి మహాత్మనామ్.
క. మహితుల ప్రణయమనంతము.
మహితుల కుపితము క్షణంబె మాయును పిదపన్.
మహితుల త్యాగమశంకిత
మహితులకును హితులు వారలమరులు తెలియన్.
భావము. మహాత్ముల స్నేహాలు కోపాలు తక్షణమే నశించి పోతాయి. వారి త్యాగాలు ఏమాత్రమూ శంకలేనివిగా ఉంటాయి.
శ్లో. ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపి నాథ నమోస్తు తే.
తే.గీ:- ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు గనుమయ్య! భక్త హనుమ!
భావము:- ఓ రామ భక్త హనుమా! నిన్ను ప్రార్థన సేతును. నాకు ఆయుర్దాయమును, మంచి ప్రజ్ఞను, సత్కీర్తిని, శ్రద్ధను, సత్పుత్రులను, సౌశీల్యాది సద్గుణములను, సౌఖ్యమును, ఆరోగ్యమును, అమరునట్లు కరుణతో చూడుము.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం , మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ , నవ గోప్యా మనీషిభిః.
ఆ.వె. వయసు, ధనములింట బాధించు గొడవలు
మంత్ర యౌషధములు, మాన, దాన
సంగమములు, మనల కృంగించు యవమాన
ములను పరుల కెపుడు తెలుప రాదు.
గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, మౌషధమును,
మానమును సంగమంబవమానము మరి
దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.
భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము ,
అవమానము – ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను.
శ్లో. ఆయుషం క్షణ ఏకో೭పి సర్వ యత్నైర్నలభ్యతే!
నీయతే తద్వృథాయేన ప్రమాదః సుమహానహో!!
క. గడచిన క్షణమును వెనుకకు
నడుపఁగ మన వశమగునొకొ?. నడువఁగ వలయున్
వడివడి సమయము వెనుకనె.
నడువకునికి హితమొదవదు. నడువుడు వడిగా.
తే.గీ. కోటి స్వర్ణనాణెములైన సాటిరావు
క్షణముకాలమాయువునకు, కానమనము
క్షణము వ్యర్థము చేసినన్ గలుగవచ్చు
ఘోరమైనప్రమాదంబు, శ్రీ రమేశ!
భావము: ఆయుర్దాయము ఒక్క క్షణము (వ్యర్థముగా) గడిచిపోయినను ఎన్ని ప్రయత్నములు చేసి అయినను దానిని తిరిగి వెనుకకు తీసుకొని రాలేము. (ఎంతటి మహానుభావులకయినను) సమయము వ్యర్థము అయినచో గొప్ప ప్రమాదము కలుగ చేయును కదా! అహో ఎంతటి ఆశ్చర్యకరమయిన విషయమిది!
శ్లో. ఆర్తానాం ఆర్తి హంతారం - భీతానాం భయనాశనం
ద్విషతాం కాలదండం తం - రామచంద్రం నమామ్యహం.
తే.గీ. ఆర్తులకునార్తిఁ బాపెడి యమృతమూర్తి,
భీతులకు భీతిఁ బాపెడి వేదమూర్తి,
ద్విషుల పాలిటి యముఁడగు దేవదేవుఁ
డట్టి శ్రీరామచంద్రునకంజలింతు.
భావము. దుఃఖితుల దుఃఖమును నశింపఁ జేయువాఁడును,భయపడువారి భయమును పోఁగొట్టువాఁడును, శత్రువులకు యమపాశమైనవాఁడు అగునట్టి రామచంద్రునకు నేను నమస్కరించుచున్నాను.
శ్లో. ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః. చంద్రో యశో నిర్మలం.
భూతిం భూమి సుతః. సుధాంశు తనయః ప్రజ్ఞాం. గురుర్గౌరవం.
కన్యాః కోమల వాగ్ విలాస మతులం . మందో ముదం సర్వదా.
రాహుర్బాహు బలం విరోధ శమనం . కేతుః కులస్యోన్నతిం.
శా. ఆరోగ్యంబును సూర్యుడిచ్చు. శశి తా నత్యంత కీర్తిన్. సిరిన్
ధారాపాతముగా నొసంగు కుజుడున్. దక్షుండుగా నిల్చి తా
తీరున్ ప్రజ్ఞ నొసంగి కాచు బుధుడున్. ధ్యేయంబుతో గౌరవం
బారోపించును సద్ గురుండు. భృగుడున్ భాషన్ మహన్మాధురిన్.
ధీరుండౌ శని నిత్య శాంతి సుఖముల్. ధిష్ణ్యంబునా రాహువున్.
కోరన్ దగ్గ కులోన్నతిన్ కృపను చే కూర్చున్ సదా కేతువున్.
భావము:-సూర్యుడు ఆరోగ్యమును, చంద్రుడు నిర్మలమైన కీర్తిని, కుజుడు సంపదలను, బుధుడు ప్రజ్ఞను, గురుడు గౌరవమును, శుక్రుడు కోమల వాగ్విలాసమును, శని సంతోషమును, రాహువు బాహు బలమును, శత్రు నాశనమును,కేతువు కులోన్నతిని చేకూర్చెదరు గాక.
శ్లో. ఆరోగ్యం విద్వత్తా స – జ్జనమైత్రీ మహా కులే జన్మ
స్వాధీనతాచ పుంసాం – మహదైశ్వర్యం వినాప్యర్థైః.
తే.గీ.
అరయ నారోగ్య విద్వత్తు లమరి యుండి,
సరస సన్ మైత్రి, సత్కుల జననమంది
ఇంద్రియాల జయించిన యింటి కాపు ,
పేదవాడయ్యు ధనికుండు పృథివి పైన.
భావము. ఆరో గ్యము, విద్వత్తు, సజ్జన మైత్రి, కులీనత, ఇంద్రియ నిగ్రహము ఇవి వున్న వాడు పేదవాడయ్యును ధనికుడే సుమా!
శ్లో. ఆరోగ్యం వ్యసనం హన్తి - తద్ధన్తి రుగ్మతా తాం చ|
మృత్యుర్వై హన్తి తం హరః - తస్మాత్ హరం భజాऽనిశమ్ ||
రచన- సదాశివానందనాథః (ఆచార్య రాణి సదాశివ మూర్తిః)
తే.గీ. వ్యసన మారోగ్యమును చంపు, వ్యసనమదియు
రోగమునఁ జచ్చు, చచ్చును రోగమదియు
మృత్యు దేవత చేతిలో, మిత్తి శివుని
చేత చచ్చును, గొలువుమా శివుని సతము.
భావము. ఆరోగ్యమును వ్యసనము హరించును. వ్యసనమును రోగము హరించును. రోగమును మృత్యువు హరించును. మృత్యువును హరుడు హరించును. కనుక హరుని ఎల్లప్పుడూ సేవింపుము.
శ్లో. ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా
పాత్యతే తు క్షణేనాధస్తథాత్మా గుణదోషయోః.
తే.గీ. కొండ పైనుండి పడిపోవు బండ త్రోయ,
కొండపైకది చేర్చుట కుదురు నెటుల?
మంచి మాయును క్షణములో మలిన గతిని.
మంచి గడియ్తింప కష్టము. మంచి కనుఁడు.
తే.గీ. పర్వతము పైకి శిల మోయు పగిది, మంచి
నరయు టెన్నగ కష్టంబు నరుని కిలను.
పర్వతము నుండి త్రోయగ పణుకు వోలె.
సులభముగ చేరు మదు లందు మలిన బుద్ధి.
భావము. ఒక పెద్ద శిలను పర్వతాగ్రం మీదికి చేర్చటానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేయాలి. దానినే నేలమీదికి జార్చటానికి ఒక్క తోపు తోస్తే , క్షణం చాలు. అలాగే సద్గుణాలు సాధించటానికి ఎంతో సాధన కావాలి. పతితుడు కావటానికి ఏ శ్రమా అవసరంలేదు !
శ్లో. ఆలస్యస్య కుతో విద్యా? అవిద్యస్త కుతో ధనం?
అధనస్య కుతో మిత్రమ్? అమిత్రస్య కుతః సుఖమ్?
తే.గీ. సోమరికి విద్య లభియించునేమిగతిని?
ధనమవిద్యనెటులమరు తరచి చూడ?
ధనములేకున్న మిత్రులన్ దనరుటెట్లు?
మిత్రహీనుడు సుఖమెట్లు మేదినిఁగను?
భావము. సోమరికి చదువెక్కడిది. చదువులేని వాడికి ధనమెక్కడిది? ధనం లేని వాడికి మిత్రులెక్కడ? మిత్రులు లేని వాడికిసుఖమెక్కడ?కాబట్టి సుఖం కావలెనన్నచో మిత్రులుండవలెను. మిత్రులుండవలెనన్నచో ధనం ఉండవలెను. ధనం ఉండవలెనన్నచో చదువుండవలెను. చదువుండవలెన్నచో సోమరితనము ఉండకూడదు. అనగా సోమరితనమును పారద్రోలవలెను.
శ్లో. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచిన్తయా |
ఆయుః క్షీణం న జానాతి తస్మాత్-జాగ్రత జాగ్రత ||
ఆ.వె. పాప పుణ్య ఫలిత బహుచింతనములచే
నాశ బధ్యులగుదు రనవరతము.
గడిచిపోవు వయసు పొడనైనఁ గనలేరు
కనుక జాగృతినిల మనఁగఁ దగును.
భావము. లోకులు తమ కర్మ ఫలముల చేత, అనేక చింతల చేత ఆశాపాశ బధ్యులై ప్రవర్తించుదురే కాని గడిచిపోవుచున్న్ ఆయువును చూడజాలేరు. కావున జాగ్రత్తాగా ప్రవర్తించ వలసి యున్నది.
శ్లో. ఆశయా సంఞ్చితం ద్రవ్యం - కాలేనైవోపభుజ్యతేl
అన్యే చైతత్ ప్రపద్యన్తే - వియోగే తస్య దేహినఃll
(మహాభారతమ్ - అనుశాసనపర్వమ్)
తే.గీ. ఆశనార్జించు ధనము నీ వనుభవింప
జాల వన్యు లనుభవింత్రు, చనినపిదప,
ధనము గడియించు, వెచ్చించు ధర్మమునకు,
నిహముపరమును దక్కునో మహిత! నిజము.
భావము. దురాశతో సంపాదించిన ధనం అవసరమైనప్పుడు అనుభవంలోకి రాదు. ఆ జీవి గతించినప్పుడు ఆ ధనాన్ని ఇతరులు పొందుతారు.
శ్లో. ఆశా ధృతిం హన్తి సమృద్ధిమన్తకః - క్రోధః శ్రియం హన్తి యశః కదర్యతాl
అపాలనం హన్తి పశూంశ్చ రాజన్ఏ - కః కృద్ధో బ్రాహ్మణో హన్తి రాష్ట్రమ్ll
తే.గీ. ఆశ ధైర్యమున్, బంధులన్ యముఁడు జంపు,
వసు యశంబులన్ క్రోధ లోభములు చంపు,
పాలనములేమి పశువులన్, బ్రాహ్మణుండు
చంపు కినుకచే రాష్ట్రమున్, సత్యమిదియె.
భావము. "ఆశ ధైర్యాన్ని చంపుతుంది. యముడు పుత్రకళత్ర సమృద్ధిని చంపుతాడు. కోపం సంపదను చంపుతుంది. లోభం కీర్తిని చంపుతుంది. అపాలనం (రక్షణం లేకుండుట) పశువులను చంపుతుంది. కోపించిన బ్రాహ్మణుడు రాష్ట్రమంతటినీ చంపుతాడు.
శ్లో. ఆశా నామ మనుష్యాణాం కాచిదాశ్చర్య శృంఖలా
యావత్ బద్ధో ప్రధావంతి ముక్తా తిష్టంతి పంగువతు
తే.గీ. ఆశ వింతైన సంకెల యవనిజులకు.
బద్ధుడైయున్ననాడు తా పరుగు పెట్టు
బద్ధముక్తుఁడై చతికిల పడును తాను.
ఆశ వింతైన త్రాడురా!.అద్భుతమిది.
భావము. ఆశ గురించి చమత్కారంగాఇందు వర్ణింపఁబడినది. ఆశ మనిషికి ఒక ఆశ్చర్యకరమైన సంకెల వంటిదిట. ఆశ సంకెల అంటే కాదనేవారుండరు. కానీ అందులో ఆశ్చర్యం పొందటానికి ఏముంది??? సంకెళ్ళతో బంధించేది దోషి పారి పోకుండా ఒకచోట కట్టిపడేయటానికి. కానీ ఆశా సంకెళ్ళతో బంధీగా వున్న వాడు ప్రధావంతీ అంటే పరిగెడుతూనే వుంటాడట. ఎందుకు పరిగెడతాడు? తన కోరికలు ఆశలు తీర్చుకోవడానికి ప్రపంచం అంతా తిరుగు తాడు. అదే ఆశా బంధవిముక్తుడు తిష్టంతి అంటే ఒక మూల చతికిలపడి కూర్చుంటాడట. అదీ ఎలాగ అంటే పంగువతు, కుంటివాడిలా కూర్చుండిపోతాడట. ఎంత అద్భుతమైన భావం ఎంత అందంగా చమత్కారంగా వర్ణించాడో కవి.
శ్లో. ఆశాయా దాసా యే - దాసాస తే సర్వలోకస్య।
ఆశా దాసీ యేషాం - తేషాం దాసాయతే లోకః॥
తే.గీ. దాసులగువార లాశకున్, దాసులగుదు
రెల్లలోకములకు, నట్లె యెల్ల లోక
ములును దాసియౌ నాశయే పూజ్యులయిన
వారలకు దాసి యైనచో, భక్తవరద!
భావము. ఆశకి ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికీ దాసులే. ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికి సమస్త లోకమూ దాసియే.
శ్లో. ఆశాపిశాచికావిష్టః - పురతో యస్య కస్యచిత్ |
వందతే నిందతి స్తౌతి - రోదితి ప్రహసత్యపి || (సుభాషితసుధానిధి)
తే.గీ. ఆశ పెనుభూత మెవనికి నావహించు
నతఁడు దూషించు, భాషించు, నంతలోనె
యేడ్చు, నవ్వుచునుండు తా నెవ్వరున్న
నాశ యుండగనొప్పు దురాశ తగదు.
భావము. ఆశ అనే పిశాచి పట్టినవాడు 'ఎవరంటే వారి ఎదుట' నమస్కరిస్తాడు,
దూషిస్తాడు, ప్రశంసిస్తాడు, ఏడుస్తాడు మరియు నవ్వుతాడు.
శ్లో. ఆశాయాః యే దాసాః , తే దాసాః సర్వలోకస్య
ఆశా యేషాం దాసీ ,తేషాం దాసాయతే లోకః.
తే.గీ. ఆస కలవారు జగతకి దాసులయ్య.
ఆస వీడిన జగతియే దాసియగును.
ఆస గొలుపును దైన్యము నరసి చూడ.
ఆస వీడిన సుఖమబ్బునసదృశమది.
భావము. ఎవరు ఆశకు దాసులౌతారో , వారు లోకానికంతటికీ దాసులౌతారు. ఎవరికి ఆశ దాసిగా ఉంటుందో , వారికి లోకమే దాస్యం చేస్తుది!
శ్లో. ఆశ్రుతస్య ప్రదానేన - దత్తస్య హరణేన చ।
జన్మప్రభృతి యద్ దత్తం - తత్ సర్వం తు వినశ్యతి॥
తే.గీ. ఇచ్చెదనటంచు చెప్పియు నీయకున్న,
నిచ్చినది లాగుకొన్నను, నిహమునందు
పూర్వందున చేసిన పుణ్యమెల్ల
గ్రహియించు నరుఁడ! నీవు.
భావము. "ఇస్తాను" అని చెప్పిన వస్తువును దానం చేయకపోవడంచేత, ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకోవడంచేత జన్మించిన నాటినుండి చేసిన దానాల ఫలితం అంతా నశిస్తుంది.
శ్లో. “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే,
వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”
తే.గీ. భోజనమువేళ, పడుకొనఁ బోవువేళ,
దానమిచ్చునప్పుడు వస్త్ర ధారణమున,
కూర్చొనెడివేళ, పెండ్లిలో, ఘోరమైన
తగవులప్పుడు తుమ్ముట తగును, శుభము.
భావము. కూర్చునే సమయములో, పడుకునే సమయములో, దాన సమయములో,
భోజన సమయములో, వస్త్ర సంగ్రహ సమయములో, వివాద సమయములో,
వివాహ సమయములో, ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకము.
శ్లో. ఆహార నిద్రా భయ మైధునాని - సామాన్యమేతత్పశుభిర్నరాణాం,
జ్ఞానంహి తేషా మధికో విశేషః - జ్ఞానేన హీనః పశుభిస్సమానః. (ఉత్తర గీత 2-44)
తే.గీ. నిద్ర, భయ, మైధు నాహార క్షుద్రగుణము
లరయ పశువులన్ మనుజుల నాశ్రయించి
యుండు, జ్ఞానంబు నరునిలో నుండు, జ్ఞాన
హీన నరుఁడు పశు సముఁడు, భానుతేజ!
భావము. ఆహారము నిద్ర భయము మైధునము నాలుగును ప్రాణి ధర్మములు. ఇవి జంతుకోటికి ఎంతటి అవసరమో మానవులకును ఆంతియే. ఆయిననిందు విశేష మేమిటనిన మానవులకు జ్ఞానమనునది అధికముగా నున్నది. పశువుల కది లేదు. అందువలన జ్ఞానహీనుడు పశు సమానుడు.
శ్లో. ఇంద్రియాణాం ప్రసంగేన - దోషమృచ్ఛత్యసంశయమ్ |
సంనియమ్య తు తాన్యేవ - తతః సిద్ధిం నియచ్ఛతి || (మనుస్మృతి)
తే.గీ. ఇంద్రి యాకర్షితుఁడు దోషమెలనిఁ జేయు,
నిల జితేంద్రియుఁడన శుభకలితుఁడె యగు,
నింద్రియములఁ జయించుమో సాంద్ర సుగుణ!
దోషమందక గొప్ప సంతోషము కను.
భావము. ఇంద్రియాల ఆకర్షణకు లోనయినవాడు పాపం చేస్తాడు. వాటిని అదుపులో పెట్టినవాడు మంచి ఫలితాన్ని పొందుతాడు.
శ్లో. ఇంద్రియాణి చ సంయమ్య - బకవత్ పణ్డితో నరః |
దేశకాల బలం జ్ఞాత్వా - సర్వకార్యాణి సాధయేత్ ||
తే.గీ. పండితులుబకమట్టుల నుండవలయు
పనులనేకాగ్రచిత్తులై ఫలితమంద
దేశకాలస్వశక్తులతెలుసుకొనుచు
పనులనన్నిటిన్ సాధించి పరఁగవలయు.
భావము. బుద్ధిమంతుడైన మనుష్యుడు కొంగవలె నేకాగ్రచిత్తుడై
యింద్రియములను వశమునందుంచుకొని, దేశమును, కాలమును,
తన బలమును తెలిసికొని సమస్త కార్యములను సాధింపవలెను.
శ్లో. ఇక్షోరగ్రాత్ క్రమశః - పర్వణి పర్వణి యథా రసవిశేషఃl
తద్వత్ సజ్జనమైత్రీ - విపరీతానాం తు విపరీతాll
(భోజప్రబన్ధః)
తే.గీ. కణుపు కణుపున తీపిని కలిగి యుండు
ఘనత పెరుగుచున్ జెరకున, ఘనులతోడ
స్నేహమట్టులే వృద్ధియౌన్, నీచ జనుల
స్నేహము విరుద్ధమిందుకు, చిద్విభాస!
భావము. "చెఱకు చివరినుంచి మొదటివరకు కణుపు కణుపునా ఎట్లు రసవిశిష్టముగనుండునో సజ్జనులతోడి స్నేహము అట్లే క్రమవృద్ధిగనుండును. దుర్జనులతో మైత్రి దానికి విరుద్ధముగానుండును."
శ్లో. ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం, రాజ్యస్థః స్వర్గమీహతే.
తే.గీ. నూరు కలవాడు వేయిని కోరుచుండు.
వేయికలవాడు లక్షల వేలు కోరు.
లక్ష కలవాడు రాజ్యసల్లక్మిఁో్ గోరు.
రాజ్యవంతుఁడు స్వర్గసామ్రాజ్యమడుగు
భావము. వంద ఉన్నవాడు వెయ్యి కోరుకుంటాడు. వెయ్యి ఉన్నవాడు లక్షకావాలంటాడు. లక్షాధికారి రాజ్యంకావాలంటాడు. రాజు స్వర్గంకోరుతాడు.(ఆశకు హద్దు లేదు).
శ్లో. ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా - విలిఖితాని సహే చతురానన!
అరసికేషు కవిత్వ నివేదనం - శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !
క. చతురాస్యుఁడ! నా నుదురున
అతులిత దుష్కర్మవ్రాయి! హాయిగ వలతున్!
స్తుతియింపగ నరసికుల
మతిమాలియు వ్రాయఁబోకు. మరువకుమయ్యా!
భావము. ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా వ్రాయుము. సహిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం వ్రాయకుసుమా! . ముమ్మాటికీ వ్రాయకు.
శ్లో. ఇదం తీర్ధమిదం తీర్ధం - భ్రమన్తి తామసా జనాః
ఆత్మతీర్ధం నజానన్తి - కధం మోక్షః శృణు ప్రియే.
తే.గీ. ఇదిగొ తీర్థంబు, పుణ్యంబు నిదియె యిచ్చు,
నదిగొ తీర్థంబు ముక్తినే యది యొసంగు
నంచు మునుగుదు రిచ్చట నెంచనేర
రాత్మతీర్థాన మునుగక నబ్బవనుచు.
భావము. ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు ఆత్మ తీర్థమున మానసికముగా మునుగనినాడు అవి లభించవని తెలియలేకున్నారు.
శ్లో. ఇహ యత్ క్రియతే కర్మ - పరత్రై వూపభుజ్యతే ౹
సిక్తమూలస్య వృక్షస్య - ఫలం శాఖాసుదృశ్యతే ౹౹
తే.గీ. ఇహమునం దెట్టి కర్మ తా మహిగతిని
చేయు, పరమునన్ బొందఁగఁ జేరుతనకు,
చెట్టు మూలాన నీర్వోయ చెట్టుపైన
ఫలములుండెడి తీరునన్, భవ్యచరిత!
భావము. ఇహ లోకంలో ఏ కర్మ చేస్తాడో పరలోకంలో కూడా అదే అనుభవిస్తారు.
చెట్టు వేరుకు నీళ్లు పోస్తేనే పండ్లు కొమ్మల్లో కనబడతాయి.
మంత్రము. ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనమ్.(ఈశావాస్యోపనిషత్ ౧)
తే.గీ.. ఈశ్వరుని సృష్టిలోనుండు నీ సతతము
నీశ్వరునికే సదా చెల్లు నీశ్వరుండె
నుండునంతట ననుచు నీవుండు మెపుడు,
పరుల ధనము నాశింపకు, వరగుణాఢ్య!
భావము. జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి. అలాంటి త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.
శ్లో. ఈశ్వరే నిశ్చలా బుద్ధిః దేశార్థం జీవన స్థితిః.
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతమ్.53 ( నేపాల చరిత్రమ్ )
తే.గీ. పుడమి పరమాత్మపై లసద్బుద్ధి నిలుపు.
దేశ సేవకై జీవించు ధీశుఁడవయి.
బంధు వృద్ధికి కృషి చేసి పరఁగుమిలను.
ఇదియె కర్తవ్యమని యెంచు మదిని నీవు.
తే.గీ. దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున
తే.గీ. నిరతమగు దైవ భక్తిని నిశ్చలముగ
కలిగి, దేశంబుకై తాను మెలగుచుండు,
లోకులెల్లరు తన బంధు లోకమనుచు
సజ్జనుండెదతలచును సహజముగనె.
తే.గీ. దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున.
భావము. భగవంతునిమీద నిశ్చల మైన బుద్ధి దేశ సేవ కొఱకు జీవంచటం పృధివి మీద బంధు వృద్ధి ఈ మూడూ మన అందరి కర్తవ్యం అని సనాతన ధర్మం చెపుతుంది.
శ్లో. ఉజ్జ్వలగుణమభ్యుదితం - క్షుద్రో ద్రష్టుం న కథమపి క్షమతే |
దగ్ధ్వా తనుమపి శలభః - దీప్తం దీపార్చిషం హరతి ||
(ప్రబంధచింతామణి)
కం. ఎదుగుచునొదిగినవాఁడన
మదిమెచ్చఁడు దురితుఁడెపుడు, మాత్సర్యముచే,
పదపడి జ్వాలను ఝల్లిక
వదలక చేరుచు నశించు, భక్తవరదుఁడా!
భావము. ఉత్తమ గుణాలతో అభివృద్ధి చెందుతున్నవారిని చూసి నీచుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేడు. చిమ్మటపురుగు తన శరీరాన్ని కాల్చుకున్నా, వెలిగే దీపాన్ని ఆశ్రయిస్తుంది.
శ్లో. ఉత్తమం స్వార్జితం విత్తమ్, మధ్యమం పిత్రార్జితమ్.
అధమం భ్రాతరం విత్తం స్త్రీవిత్తమధమాధమమ్.
తే.గీ. తనదు సంపాదనము మేలు. తండ్రి ధనము
మధ్యమంబన్నదమ్ముల మాన్య ధన మ
ధమము స్త్రీధనంబులధ మాధమము తలుప,
కష్ట జీవికి సంతోష పుష్టి కలుగు.
భావము. కష్టపడి స్వయముగా సంపాదించిన ధనమే ఉత్తమమైనది. తండ్రి సంపాదించిన ధనముతో జీవించుట అన్నది మధ్యమము.సహోదరుని ధనముతో జీవించుట అధాము. స్త్రీ ధనముతో జీవించుట యన్నది
అధమాధమము.
శ్లో. ఉత్తమః క్లేశవిక్షోభం - క్షమః సోఢుం న హీతరః।
మణిరేవ మహాశాణ - ఘర్షణం న తు మృత్కణః॥
తే.గీ. క్లేశవిక్షోభమోర్చుసచ్ఛీలుడిలను,
బాధలన్యులోర్వగలేరు, భాసురమగు
మణియె రాపిడినోర్చును,మట్టిబెడ్డ
యోర్వలేనటుల్,సుజనుల కోర్పధికము.
భావము. కష్టాలవల్ల కలిగే క్షోభను ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు. సాన మీద ఒరిపిడిని మాణిక్యమే సహించగలదు కానీ మట్టిపెడ్డ సహించగలదా.
శ్లో. ఉత్తమా తత్వ చింతాచ మధ్యమం శాస్త్ర చింతనం
అధమా మంత్ర చింతాచ తీర్థ భ్రాంత్య z ధమాధమం.
తే.గీ. తత్వ చింతన శ్రేష్ఠము. తలచి చూడ!
శాస్త్ర చింతన మధ్యమ. చక్కనెఱుఁగ
మంత్ర చింతన మధమము మనుజులకును
తీర్థ చింతనయధమాధమర్థి నెఱుఁగ.
భావము. తత్వ విచారము ఉత్తమ మార్గము. శాస్త్రచింతన మధ్యమాధికారము. మంత్రోపాసనము అధమ మార్గము. ఇక తీర్థ పర్యటనాభినివేశము అధమాధమము.
శ్లో. ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్
తే.గీ. ఉత్తముని కోప మొక క్షణ ముండు. నిజము.
మధ్యమునకు రెండుఘడియల్మసలు కోప
మధమునకురాత్రి పగలుండి యంతమగును.
పాపిమరణించు వరకును కోపముండు.
తే.గీ. ఉత్తముడు క్షణ కోపియై యుండు నిజము.
మధ్యముని లోన ఘడియుండి మాసి పోవు.
అధమునందున రోజుండి ఆరిపోవు.
పాపి మరణించు వరకును పాయదతని.
భావము:- ఉత్తమునకు వచ్చెడి కోపము ఒక్క క్షణ కాలముండి పోవును. మధ్యమునకు వచ్చు కోపము రెండు ఘడియల కాలము మాత్రమే ఉండి పోవును. అధమునకు వచ్చుయ్ కోపమైతే ఒక రాత్రి, ఒక పగలు ఉండును. కాని పాపాత్ములకు వచ్చు కోపము వారు మరణించు వరకూ ఉండును.
శ్లో. ఉత్తమైరుత్తమైర్నిత్యం - సంబంధానాచరేత్సహ |
నినీషుః కులముత్కర్షమ్అ - ధమానధమాంస్త్యజేత్ || (మనుస్మృతి)
తే.గీ. ఉత్తమున కుత్తములతోడ నొప్పు పొత్తు,
బంధములుకల్పుకొననది పరగు ధరను,
కానినాడది నిలువదు, కర్మఁగాల్చు,
నుత్తముఁడు గానివానితో పొత్తదేల?
భావము. ఎప్పుడూ విద్య, ఆచారాలలో శ్రేష్ఠులైన వారితోనే సంబంధాలను పెంచి, అలాంటివారితోనే కుమార్తెను ఇచ్చిపుచ్చుకోవడం చేసి తన వంశాన్ని ఉన్నతంగా తయారుచేయవచ్చు. తమకన్న అధములను త్యజించాలి.
సమౌ హి శిష్టైరామ్నాతౌ - వర్త్స్యంతావామయః స చ ||
(శిశుపాలవధ)
తే.గీ. ఎదుగు చున్నట్టి దుష్టుని యెదుగుదలను
మంచితోనాపవలె, వేచి మించనీక,
పెరుగువ్యాధియు శత్రువు ధరను హాని
మనకు గొలుపుననెడు మాట మరువరాదు.
భావము. హితాన్ని కోరేవాడు బలిష్ఠుడవుతున్న శత్రువును నిర్లక్ష్యం చేయకూడదు. పెరుగుతున్న వ్యాధి మరియు పెరుగుతున్న శత్రువు ఇద్దరూ హానికరంగా ఉండటంలో సమానమని ఉత్తములు భావిస్తారు.
శ్లో. ఉత్థానేన జయేత్తన్ద్రీం - వితర్కం నిశ్చయాజ్జయేత్|
మౌనేన బహుభాష్యం చ - శౌర్యేణ చ భయం త్యజేత్||
(మహాభారతమ్)
తే.గీ. యత్న మున సోమరితనంబు నణచవచ్చు,
శాస్త్ర నిశ్చయము వితర్క జయమొసంగు,
మౌనముననతివాగుడు మాయమగును,
శౌర్యమున పిరికితనము చక్కఁ బాయు.
భావము. ప్రయత్నం వలన సోమరితనాన్ని , శాస్త్రనిశ్చయం వలన విపరీతతర్కాన్ని , మౌనం వలన అతివాగుడును , శౌర్యం వలన భయాన్ని విడిచిపెట్టాలి.
శ్లో. ఉత్సాహసంపన్నమదీర్ఘసూత్రం
క్రియావిధిజ్ఞం వ్యసనేష్వసక్తం
శూరం కృతజ్ఞం దృఢసౌహృదం చ
సిద్ధిః స్వయం గచ్ఛతి వాసహేతోః.
గీ. కనఁగ నౌత్సాహి, నేర్పరి, ఘన సుగుణుఁడు,
సత్ కృతజ్ఞుఁడు, శౌర్యుఁడు, సమత, స్నేహ
కలితుఁడైనట్టి వానికి కలుగు జయము.
కార్య సంసిద్ధి యాతని ఘనత ఫలము.
భావము. ఉత్సాహవంతుడు, పనులలో ఆలస్యం చేయనివాడు, పనిసాధించే పద్ధతి తెలిసినవాడు, చెడు అలవాట్లయందు ఆసక్తి లేనివాడు, శూరుడు, కృతజ్ఞతా బుద్ధికలవాడు, దృఢమైన స్నేహస్వభావం కలవాడు అయితే, అతనికి కార్యసిద్ధి తనంతట తానే కలుగుతుంది.
శ్లో. ఉదయే సవితా రక్తో రక్తశ్చాస్తమయే తథా
సంపత్తే చ విపత్తే చ మహతామేక రూపతా.
తే.గీ. మహితు లొకరీతినే యుంద్రు మహిని తాము
సంపదలలోన యాపన్న సమయమునను.
సూర్యుఁడుదయాస్తమయములఁ జూ డ నెఱుపు
వర్ణమునె యొప్పుచుండును భ్రమణమందు.
భావము. సూర్యుడు ఉదయించే సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అస్తమయ సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అలాగే మహాత్ములు సంపదలలోనూ, ఆపదలలోనూ ఒకే విధంగా ఉంటారు.
శ్లో. ఉద్ధరేత్ ఆత్మ న్ ఆత్మానమ్ ఆత్మానమ్ అవసాదయేత్
ఆత్మైవ హి ఆత్మానో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః
తే.గీ. తానె యుద్ధరించుకొనును తనను మనిషి.
తానె పతనహేతువగును తనకు చూడ.
తనకు మిత్రుఁడు చూడగ తానె యగును.
తనకు శత్రువు తానెగా తలచ మనిషి.
భావము. మనిషి ఉద్ధరింపబడటానికి అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలను తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువుకూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువు గా, మన ని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువు గా మనలను అధోగతి పాలు చేస్తుంది.
శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.
కం. కోరి నంతనె కోర్కెలు తీరఁ బోవు.
కోరి యత్నించ సిద్ధించు కోర్కెతీర్చు.
సుప్త సింహంబు నోటను చొచ్చునొక్కొ
మృగము లేవైన? కష్టించ మిగులు ఫలము.
భావము. ప్రయత్నంతోనే పనులు సిద్ధిస్తాయి కాని , కేవలం కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహం నోటిలోనికి మృగాలు తమంతట తాము ప్రవేశించవు కదా.(సింహం వేటాడకుండా ఆహారం లభించదుకదా)
శ్లో. ఉద్యోగః ఖలు కర్తవ్యః ఫలం మార్జాలవద్భవేత్
జన్మప్రభృతి గౌర్నాస్తి పయః పిబతి నిత్యశః.
క. ఫల సాధనకై సతమును
సెలవెఱుగక పిల్లివోలె చెలగుట తగు, తా
కలుగకపోయియు ఆవును
వలసిన పాల్త్రాగు పిల్లి. భావించుడయా!
భావము. ఫలితాన్ని పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పుట్టినప్పటినుండి తనకు ఒక ఆవు లేకపోయినా, నిరంతర ప్రయత్నంతో పిల్లి ప్రతిరోజూ పాలను త్రాగుతూనే ఉంది!
శ్లో. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః
దైవేన దేయమితి కాపురుషా వదన్తి ।
దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా
యత్నే కృతే యది న సిధ్యతి కోఽత్ర దోషః ॥ (హితోపదేశః ౦.౩౧॥)
తే.గీ. యత్న మున లక్ష్మియు, జయము నరయఁ జేరు,
చెడుగులందురు దైవమే చేర్చుననుచు,
దైవమును వీడి చేయుము నీవె పనిని,
యత్న విఫంబె యగు, దోషమది యగునొకొ?
భావము. ప్రయత్నశీలుడైన పురుషశ్రేష్ఠున్ని, విజయము కాని సంపద కాని పొందుచున్నది . స్వశక్తిని మరిచి, ప్రయత్నశూన్యులైన జనులు మాత్రము, భాగ్యము చేతనే విజయము కాని, సంపద కానీ ఇవ్వబడాలి అని పలుకుచున్నారు. కాని అదృష్టంపై భారము వేయక, స్వసామర్థ్యముతో ప్రయత్నమును చేయాలి. ప్రయత్నము చేసిననూ... ఒకవేళ పని యొక్క ఫలితం సిద్ధించకున్నను, ఈ ప్రయత్నంలో దోషమే లేదని భావము . మళ్ళీ కార్యోన్ముఖుడై ఉద్యమించి, సాధించవలెను.
శ్లో. ఉద్వేజనీయో భూతానాం - నృశంసః పాపకర్మకృత్ |
త్రయాణామపి లోకానాం - ఈశ్వరోఽసి న తిష్ఠతి || (రామాయణం)
తే.గీ. ప్రజలకహితంపుకార్యముల్ ప్రబలఁ జేయు
లోక పాలకుఁడల మూడు లోకములకు
ప్రభువెయైనను నిలలేడు, భ్రష్టుపట్టి
నాశనంబగు నాతండు ధీశుఁడైన.
భావము. ప్రజలకు ఉద్వేగాన్ని కలిగించే దుర్మార్గమైన పనులు చేసే ఘాతుకుడు మూడు లోకాలకు అధిపతిగా ఉన్నా కూడా ఎక్కువ కాలం బ్రతకలేడు.
శ్లో. ఉపయుక్తంతు నా దద్యాత్వ - ర్తికార్థంతు సాధకః
ఉపాదద్యాన్నూత్నమేవ - సతతం శ్రీ వివృద్ధయే.
తే.గీ. వాడియున్నట్టి యారిన వత్తులనిడి
దీపమును పెట్టరాదిల దేవుని కడ,
చేసి క్రొత్తగా వత్తులన్ శ్రీప్రదముగ
పెట్టుటొప్పును దీపమ్ము విజ్ఞులార!
భావము. సాధకుఁడి పూజాదికములలో దీపముపెట్టగా ఘనమైన ఆ దీపపు వత్తులతో మరల దీపారాధన చేయరాదు. మంగళములు కలుగుటకు దీపారాధన నూతనమైన వత్తులతోనే చేయవలెను.
శ్లో. ఉపదేశో హి మూర్ఖాణాం - ప్రకోపాయా న శాంతయే ౹
పయః పానం భుజంగనాం - కేవలం విష్వవర్ధనం ౹౹
తే.గీ. మూర్ఖులకుబోధ చేయుట మూఢగుణము,
కోపమే పెంచు వానిలో, కొనఁడు శాంతి,
పాలు పోయుచు పెంచినన్ బాములోన
విషమె వృద్ధియౌ నిజమిది, వేదవేద్య!
భావము. మూర్ఖులకు ఉపదేశం చెయ్యడం వల్ల వాళ్లకు కోపం తెప్పించడం అవుతుందే కానీ వాళ్ళని శాంతపరచలేము.సరి చెయ్యలేము.పాములకు పాలు పొయ్యడం వల్ల వాటి విషం వృద్ధి అవుతుంది.
శ్లో. ఉపాధ్యాయాన్ దశాచార్యః - ఆచార్యాణాం శతం పితా.
సహస్రంతు పితౄన్ మాతా - గౌరవేణాతిరిచ్యతే.
తే.గీ. ఒజ్జలు పదుగురాచార్యుఁడొక్కని సరి
నూర్గురాచార్యులకు మిన్న నుత పితరుఁడు.
తల్లి వేయి రెట్లధికము తండ్రి కన్న.
కాన తల్లిని సేవించి కనుము ప్రీతి!
భావము. పది మంది ఉపాధ్యాయుల కంటె ఆచార్యుఁడు గౌరవార్హుఁడు. నూరుగురు ఆచార్యుల కంటె తండ్రి, తండ్రి కంటె వేయి రెట్లు తల్లి పూజనీయులు.
శ్లో. ఉపానహౌ చ వాసశ్చ ధృత మన్యై ర్న ధారయేత్,
ఉపవీత మలంకారం స్రజం కరకమేవ చ.
తే.గీ. పాదరక్షలు, పూవులు, వస్త్రములును,
జంధ్యములు నలంకారముల్ చక్కనివని,
పరులు ధరియించు వాటిని వాడ రాదు.
కోరి దారిద్ర్యమును తెచ్చుకొనుటె యగును.
భావము. ఒకరు ధరించిన పాదరక్షలు ధరించుట, ఒకరు కట్టిన వస్త్రమును కట్టుట, ఒకరి యజ్ఞోపవీతమును ధరించుట, ఒకరు ఉపయోగించిన అలంకారములను, పూలమాలలను ధరించుట. వేరొకరి కమండలువు ఉపయోగించుట. ఇవి ఎవ్వరును చేయరాదు. ఈ విధమైన పనులు కోరి దారిద్ర్యమును ఆహ్వానించుటయే.
శ్లో. ఉభయోర్నాస్తి భోగేచ్ఛా - పరార్థం ధనసంచయః |
కృపణోదారయోః పశ్య - తథాపి మహదంతరమ్ || (సుభాషితసుధానిధి)
కం. కృపణుఁ డుదారుఁడు నిరువురుఁ
దపియింపరు భోగములకు, ధనముగడింపన్
దపియింతురు, పర వశమౌ
స్వ, పరార్థంబుగఁ గల నిధి, సామ్యము కలదే?
భావము. పిసినారి మరియు ఉదారి ఈ ఇద్దరూ తాము అనుభవించాలనే కోరిక కలిగి ఉండరు; ఇద్దరూ ఇతరులకోసం డబ్బు కూడబెట్టడానికే పనిచేస్తారు. అయినప్పటికీ, వీరిద్దరి మధ్య అపారమైన తేడా.
శ్లో. ఋణమోచన కర్తారః పితుస్సంతి సుతాదయః
బంధమోచన కర్తా తు స్వస్మాదన్యో న కశ్చన.
తే.గీ. తండ్రి ఋణ ముక్తుఁ జేయును తనయుడిలను.
భువిని సంసార బంధ విముక్తి పొంద
నెవరి యత్నము వారలే భవుని కృపను
కలిగి చేయక తప్పదు. కాంచుడయ్య.
భావము. తండ్రిని ఋణవిముక్తుణ్ణి చేయటానికి కుమారులు మొదలైన వారుంటారు. కానీ సంసార బంధవిముక్తులు కావాలంటే ఎవరికి వారే కర్తలు తప్ప వేరొకరుకాదు.
శ్లో. ఋణశేషోగ్ని శేషశ్చ - శత్రుశేషస్తథైవ చ !
పునః పునః ప్రవర్ధంతే - తస్మాచ్ఛేషం న రక్షయేత్!!
తే.గీ. ఋణము, నగ్నిని, శత్రువున్, మనము మిగుల
నీయరాదెప్పుడిలనున మేయమైగుచు
వృద్ధిచెందుట జరుగును శ్రద్ధతోడ
శేషరహితముల్ గావించి భాసిలుమయ!
భావము. ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం మరల మరల ప్రవృద్ధమౌతాయి. అందువల్ల ఆమూడింటినీ మిగుల్చు కోరాదు.
శ్లో. ఏకం విషరసో హంతి - శస్త్రేణైకశ్చ హన్యతే |
సబంధురాష్ట్రం రాజానం - హంత్యేకో మంత్రవిప్లవః || (యశస్తిలక)
తే.గీ. విషము చంపునొక్కనిఁ జూడ విబుధవర్య!
ఆయుధము చంపునొకనినే, మాయ దుష్ట
రాజకీయంబు నాశమున్ రాజునకును,
రాజ్యమునకునుఁ గలిగించు ప్రబలమగుచు.
భావము. విషం ఒక వ్యక్తిని చంపుతుంది. ఆయుధంతో ఒక వ్యక్తిని హతమార్చవచ్చు. కానీ, చెడు రాజకీయ ప్రణాళిక (దుష్ట మంత్రాలోచన) రాజును మాత్రమే కాక, ఆయన కుటుంబాన్నీ, రాజ్యాన్నీ నాశనం చేస్తుంది.
శ్లో. ఏకశ్చండ్యా, రవౌ సప్త, త్రిస్రో దద్యాత్ వినాయకః.
చతస్రం వాసుదేవస్య, శివస్యార్థ ప్రదక్షిణా!!
ఆ.వె. అమ్మవారికొకటి, యా భాస్కరునకేడు,
గణపతికిని మూడు, గౌరవముగ
విష్ణువునకు నాల్గు,విశ్వ హర్తకునర్థ
సుప్రదక్షిణములు చొప్పుఁ జేయ.
భావము. అమ్మవారికి ఒక ప్రదక్షిణము, సూర్యునికి ఏడు, గణపతికి మూడు, విష్ణువుకి నాలుగు, శివునికి అర్థ ప్రదక్షిణ చేయవలయును.
శ్లో. ఏకేనాzపి కు వృక్షేణ కోటరస్థిత వహ్నినా
దహ్యతే తద్వనం సర్వం. కు పుత్రేణ కులం యథా.
ఆ.వె. చెట్టు తొఱ్ఱ నుండి పుట్టిన యగ్ని, తా
చెట్టుతోడ వనము చుట్టి, కాల్చు.
దుష్ట పుత్రకుండు దురిత వహ్నిని గొల్పి
వంశ మెల్లఁ గాల్చు పగిది నిలను.
భావము:- ఒక చెడ్డ చెట్టు తొఱ్ఱలో నిప్పు గనుక పుట్టినచో ఆ నిప్పువలన ఆ చెట్టే కాక వనమంతాకూడా కుపుత్రుఁడు వలన వంశమంతయూ దహింపఁబడు విధముగా దహింపఁబడును.
శ్లో. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా
వాస్యతే తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా!
ఆ.వె. మంచి చెట్టు పూసి యెంచగా లేనంత
పరిమళంబు నింపు వనమునెల్ల.
మంచి పుత్రు డున్నమన్ననల్ కలిగించి
వంశమునకు, తాను వరలు నటుల.
భావము. అరణ్య మంతనూ ఒక్క మహా వృక్షము పుష్పించి, సువాసనలచే సుగంధితముగా చేయుచున్నది. అట్లే ఒక్కడైననూ సుపుత్రుడు కలిగినచో వంశమున కంతకును కీర్తి చంద్రికలు పర్వు చున్నవి.
శ్లో. ఏకో౽పి కృష్ణస్య కృతః ప్రణామః - దశాశ్వమేధావభృథేన తుల్యః ౹
దశాశ్వమేధీ పునరేతి జన్మ - కృష్ణప్రణామీ న పునర్భవాయ ౹౹ (సుభాషితరత్నకోశః)
తే.గీ. కృష్ణునకు వందనము చేయ విష్ణుని కృప
నశ్వమేధదశకఫల మందుమనకు,
నశ్వమేధ ఫలము తుద నతఁడు పుట్టు,
పుట్టడిక కృష్ణ భక్తుఁడు ముక్తిఁ గనును.
భావము. కృష్ణునికి హృదయపూర్వకంగా చేసిన ఒకేఒక నమస్కారం పది అశ్వమేధయాగాలు చేశాక అవభృథస్నానం చేసినంత ఫలితం ఇస్తుంది. కానీ? కృష్ణునికి చేసిన నమస్కారంలో ఒకవిశేషం ఉంది. దశాశ్వమేధాలు చేసినవాడు మళ్లీ జన్మిస్తాడు. కానీ? "కృష్ణునికి నమస్కరించినవాడు మళ్లీ జన్మ ఎత్తడు.
శ్లో. ఓంకార పంజర శుకీ ముపనిషదుద్యాన కేళి కలకంఠీమ్.
ఆగమ విపిన మయూరీ మార్యా మంత ర్విభావయే ద్గౌరీమ్.
తే.గీ. కలికి యోంకారపంజర చిలుక, యుపని
షద్వనవిహార కలకంఠి,సత్ప్రభాస,
ఆగమవిపిన యురగారి, యనుపమయుమ
అట్టి సజ్జన స్తుతగౌరికంజలింతు.
భావము. ఓంకారమనే పంజరములో ఉండే రాచిలుకకు, ఉపనిషత్తులను ఉద్యానవనములో ఆటలాడుకొను దివ్య సుందర స్వరగాత్రము గల జగన్మాతకు, ప్రపంచ సృష్టికార్యము కొరకు నిరంతరము చేయబడుచున్న కార్యమును విశదీకరించు శాస్త్ర సముదాయమైన మహారణ్యములో విహరించు మయూరమునకు, గొప్ప సంస్కారముగల మహనీయుల అంతరంగమందు సదా భావింపబడు మాతయగు గౌరీదేవికి నమస్కారము.
శ్లో. కంఠస్థా యా భవేత్ విద్యా సా ప్రకాశ్యా సదా బుధైః.
పుస్తకే, పర హస్తేచ న సా విద్యా న తత్ ద్ధనం.
తే.గీ. వినగ కంఠస్థమైనట్టి విద్య విద్య.
బుధులు వర్ధిల్లఁ గలుగు తత్ సుధను గలిగి.
పుస్తకమునున్న విద్య తో పొసఁగు నేమి?
పరుల నున్నట్టి ధనముతో ఫలమదేమి?
భావము. ఏ విద్య మనకు కంఠస్థమై యుంటుందో ఆ విద్యయే విద్య అనబడుతుంది. అట్టి విద్య వలన బుధులు ప్రకాశింతురు.
పుస్తకమునందుఁ గల విద్య వలన గాని, పరుల వద్ద గల ధనము వలన గాని మనకు ఏమి ప్రయోజనము కలుగును?
శ్లో. కన్దుకో భిత్తినిక్షిప్త - ఇవ ప్రతిఫలన్ముహుః|
ఆపతత్యాత్మని ప్రాయో - దోషోఽన్యస్య చికీర్షతః|| (కథా సరిత్సాగరం)
తే.గీ. బంతి గోడకు కొట్టిన వచ్చు తిరిగి,
యటులె మనమితరులకును హాని చేయ
మనకె యాహాని కలుగును, మరువఁబోకు,
జ్ఞానహీనతన్ వరలకు గర్వమునను.
భావము. గోడకు కొట్టిన బంతి వెంటనే వేసిన చోటకే తిరిగి వచ్చినట్టు, ఇతరులకు చెడు చేద్దామని ప్రయత్నిస్తే, ఆ చెడు మనకే జరుగుతుంది. కావున ఇతరులకు చెడు తలపెట్టకూడదు.
శ్లో. కదర్థితస్యాపి హి ధైర్య వృత్తేః
- న శక్యతే ధైర్యగుణః ప్రమార్ష్టుమ్
అధోముఖస్యాపి కృతస్య వహ్నేః
- నాధః శిఖా యాతి కదాచి దేవ. (భర్తృహరి)
తే.గీ. ఎట్టి దుఃఖము లాపదల్ నెట్టలేవు
ధైర్యవంతును ధైర్యమున్ ధరణిపైన,
నగ్నిఁ గ్రిందికి త్రిప్పిన నాగకుండ
పైకె ప్రసరించునట్లుగా భవ్యచరిత!
భావము. ధైర్య వంతునికి యెట్టి దుఃఖము, ఆపద సభవించి ననూ అతని ధైర్యమును పోగొట్టుట అసాధ్యము అనగా తానెల్లప్పుడును ధైర్యము కోల్పోవడు. అగ్నిని తలక్రిందులుగా పెట్టినను పైకి ప్రససరించునే కానీ అధోముఖము గా వెలుగదు కదా!
శ్లో. క యితి బ్రహ్మణో నామ, - ఈశోహం సర్వ దేహినాం,
ఆవాం తవాంగే సంభూతౌ - తస్మాత్ కేశవ నామవాన్.
తే.గీ. క యన బ్రహ్మనామంబగు, కనుమ నేను
నీశుఁడను దేహులకు హరీ! యెపుడు మేము
నీదు దేహంబుననునుంట, నిఖిల భాస!
కేశవుండుగ నీపేరు భాసిలునయ.
భావము. కేశవ అను విష్ణునామములో క యనునది బ్రహ్మనామము, ఈశ అనునది శివనామము, సమస్తదేహములందు ఉండు కేశవుని దేహములో బ్రహ్మ, ఈశ్వరుఁడు ఉన్నందున విష్ణువునకు కేశన అను నామము లకుగెను. త్రిమూర్తులకు ప్రతీకగా నిలుచు ఈ కేశవ నామమే పూజాదికములలో ప్రథమముగా ఆచమనసమయమున చెప్పబడుచుండును. అంతటి వైశిష్ట్యము కలదీ కేశవ నామము.
శ్లో. కరారవిందేన పదారవిందమ్ ముఖారవిందే వినివేశయమ్ తమ్
వటస్య పత్రస్య పుటే శయానమ్ బాలమ్ ముకుందమ్ మనసా స్మరామి.
క. కరపద్మములను గొనుచును
చరణాబ్జము; ముఖజలజముఁ జక్కగ నిడుచున్
ధరణి వట పత్ర శయనుని
దరహసితుఁని; బాలకృష్ణుఁ దలతును నేనున్.
భావము. పద్మముల వంటి చేతులతో పద్మముల వంటి కాళ్ళను పట్టుకొని ముఖ పద్మమున చేర్చుచు; వట పత్రముపై శయనించి యున్నబాల ముకుందుని మనసారా స్మరింతును.
శ్లో. కర్కటే పూర్వ ఫల్గున్యాం - తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం - వందే శ్రీరంగ నాయకీం.
ఆ.వె. కర్క టాఖ్య మైన అర్క మాసము, పూర్వ
ఫల్గునమున, తులసి వనము లోన,
పాండ్య దేశమందు ప్రభవించినట్టి మా
రంగ నాయకికిని ప్రణుతి సేతు.
భావము. పాండ్యదేశమున కర్కాటకమనబడే అర్క మాసమున తిలసీ వనమున పుబ్బ
నక్షత్రమున ప్రభవించిన విశ్వంభర అయిన గోదామాతను, శ్రీరంగ నాయికకు ప్రణమిల్లుదును.
శ్లో. కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్.
క. ఇల కర్కోటక నాగు న
మల నల దమయంతులను సుమతి ఋతుపర్ణున్
కొలిచిన కలిదోషంబులు
కలుఁగవు మది కొలువుఁడిక ప్రకాశము పొందన్.
భావము. కర్కోటకుడు అనే నాగు ని, దమయంతి నలుడు అను పుణ్య దంపతులని, ఋతుపర్ణుడు అను పేరుఁగల రాజర్షిని తలచుకొనినచో మానసిక రోగములు, కలి వలన కలిగెడి పీడలు తొలగిపోవును.
శ్లో. కర్తవ్యంచైవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి;
అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి.
తే.గీ. చేయవలసిన పనులను చేయవలయు
ప్రాణములు దేహమందున వరలు వరకు,
చేయకూడని పనులను చేయరాదు
ప్రాణములుపోవుచుండినన్, భావ్యమదియె.
భావము. ప్రాణాలు పోయే వరకూ మనం ధర్మమే పాటించాలి.చేయకూడని పని చేయకూడదు.
శ్లో. కర్మణా జాయతే భక్తిః - భక్త్యా జ్ఞానం ప్రజాయతే
జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః - ఇతి శాస్త్రార్థ సంగ్రహః.
తే.గీ. భక్తి కర్మచేఁ బుట్టును,
భక్తి చేత
జ్ఞానమబ్బును,
ముక్తి సజ్జ్ఞానముననె
మనకు లభియించు
ననిశాస్త్రమున గలదయ!
కర్మసన్మార్గమునఁ
జేయఁ గలుగు శుభము.
భావము. మానవుడు ముక్తిని గోరితే అది నిష్కామ కర్మ మార్గము ద్వారానే సాధ్యమగును. కర్మ వలన భక్తి ప్రభవించును. భక్తి వలన జ్ఞానము ప్రభవించును. జ్ఞానము వలననే ముక్తి ప్రాప్తించును. అట్టి ముక్తి శాశ్వతానంద దాయకము. దుఃఖాతీతము. కాన మనము కూడా నిష్కామ కర్మ నాచరించుట ద్వారా భక్తి > జ్ఞాన > ముక్తులను పొందడాని కుపేక్ష యెందుకు. సత్కర్మలనాచరిద్దాం.
శ్లో. కర్పూరక్షారయోస్సామ్యం - రూపే స్యాన్న తు తద్రసేl
బాహ్యాకృతిర్భవేదేకో - నాన్ తః సదసతోర్గుణఃll
తే.గీ. కప్పురమునుప్పు పోలికన్ గనగ నొకటె,
వాటి రుచులందు వేరుగా వరలుచుండు,
సుజన దుర్జనులొకపోల్కె చూడనొప్పి
యుండవచ్చు, గుణంబులా యుండవటుల.
భావము. ఉప్పు, కర్పూరము బయటకు చూడటానికి ఒకేవిధంగా ఉంటాయి. వాటి రుచులు మాత్రం వేరుగా ఉంటాయి. సజ్జనులు, దుర్జనులు బయటకు ఒకేవిధంగా ఉంటారు. వారి మనసులోని గుణం మాత్రం వేరుగా ఉంటుంది..
శ్లో. కలహాంతాని హర్మ్యాణి - కువాక్యాంతం చ సౌహృదమ్|
కురాజాంతాని రాష్ట్రాని - కుకర్మాంతం యశో నృణామ్||
తే.గీ. చెడును గృహములు కలహాన, చేటు కలుగు,
చెడుగ మాటాడ స్నేహంబు చెడును భువిని,
రాజు చెడుగైన చెడిపోవు రాజ్యమెల్ల,
చెడుప్రవర్తన కీర్తికే చేటు తెచ్చు.
భావము. ఇల్లు కలహంతోను, స్నేహం ఒక చెడు వాక్యంతోను, రాజ్యం చెడ్డరాజుతోను, యశస్సు ఒక చెడు పని చేయటం తోనూ అంతరించిపోతాయి.
శ్లో. కలిః శయానో భవతి - సంజిహానస్తుద్వాపర
ఉత్తిష్ఠే త్రేతా భవతి - కృతం సంపద్యతే చరన్.
తే.గీ. నిదుర కలియగమెన్నగ, నిదురలేవ
ద్వాపరంబౌను, త్రేతయౌ వరల నడువ,
కృతయుగమౌను సత్యంబు నతులితముగ
కనఁగ నడచినన్, సత్యమే కనిము నడచి.
భావము. నిద్రపోతుంటే కలియుగము. లేచి కూర్చుంటే ద్వాపరయుగము. లేచి నిలబడితే త్రేతాయుగము. లేచి తన లక్ష్యం వైపు అడుగులు వెయ్యడం కృతయుగము. లక్ష్య ప్రాప్తి కొఱకు అడుగులు వెయ్యాలి. ముందుకు వెళ్ళాలి.
శ్లో. కలౌకల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినామ్
విధి క్రియా విహీనానాం హరేర్నామైవ కేవలమ్.
తే.గీ. కలి యుగంబున కల్మష కలితులకును,
పాప ద్రవ్యోప భుక్కులౌ పాపులకును,
విహిత క్రియ వీడి చరియించు వెడఁగులకును
హరి ముదావహ నామము శరణమరయ.
భావము. కలియుగంలో కల్మష చిత్తమున్న వారికి, పాప సంపాదనతో జీవిస్తున్న వారికి,వేద విహిత కర్మాచరణ లేనివారికి కేవల హరి నామమే మార్గము.
శ్లో. కవిః కరోతి కావ్యాని .. రసం జానాతి పణ్ణితః|
తరుః సృజతి పుష్పాణి .. మరుద్వహతి సౌరభమ్.
తే.గీ. కవులు చేయగ సత్కావ్య కల్పనలను
కావ్యసారమున్ బండితుల్ గాంతురెన్ని,
వృక్షములు చక్కనైనట్టి విరులు పూయ
పరిమళము వ్యాప్తిచేయును వాయువిలను.
భావము. కవి కావ్యాలను వ్రాయును. పండితుడు అందలి సారమును తెలుసుకొనును.
చెట్టు పుష్పములను పుష్పించును- వాయువు వాటి సుగంధమును వ్యాపింపజేయును.
శ్లో. కరావివ శరీరస్య , నేత్రయోరివ పక్ష్మణి
అవిచార్య ప్రియం కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే.
ఆ. దేహమునకు మేలు దేహ భాగములెట్టు
లప్రయత్నముగనె యరసి చేయు
నటులె చేయుచుండు నరసి సన్మిత్రుఁడు.
మిత్రుఁడనిన యతఁడె ధాత్రిపైన.
భావము. శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.
శ్లో. కర్మణా జాయతే భక్తిః - భక్త్యా జ్ఞానం ప్రజాయతే।
జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః - ఇతి శాస్త్రార్థసఙ్గ్రహః॥
తే.గీ. భక్తి కర్మచే కలుగును భక్తి వలన
జ్ఞానముత్పన్నమయెడు నా జ్ఞానమునను
ముక్తి సాధ్యమౌ మనలకు, పూజ్యులార!
శాస్త్రమర్మంబు నెఱుఁగుడీ చక్కగాను.
భావము. కర్మలవల్ల భక్తి కలుగుచున్నది. భక్తి వల్ల జ్ఞానమున్నూ,
తద్వారా మోక్షము కలుగుతున్నదని శాస్త్ర నిర్ణయము.
శ్లో. కర్మ లోకవిరుద్ధం తు - కుర్వాణం క్షణదాచర |
తీక్ష్ణం సర్వజనో హంతి - సర్పం దుష్టమివాగతమ్ ||
(రామాయణం)
తే.గీ. ఇంటఁ దూరిన సర్పమ్మునెటుల చంపు
దురొ యటులఁ జంపుదురు ప్రజ దురితుఁడైన
ప్రజల కహితముఁ జేసెడివానినిలను,
హితమె ప్రజలకుఁ జేయుమో హితుఁడ! సతము.
భావము. ప్రజలకు విరుద్ధమైన పనులు చేసే క్రూర స్వభావం ఉన్నవాడిని, ఇంటిలో ప్రవేశించిన విషసర్పాన్ని కొట్టి చంపినట్లే, ప్రజలు కొట్టి చంపుతారు.
శ్లో. కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః
తరుః సృజతి
పుష్పాణి , మరుద్వహతి సౌరభమ్.
క. కవి
కావ్యము రచియింపగ
కవి హృదయము
రసములెఱుగు ఘన పండితు
డీ
భువి విరులను
పూయ తరువు
సవిధంబుగ గాలి
మోయు సౌరభమెల్లన్.
భావము. కవి కావ్యాలు వ్రాస్తే , పండితుడు రసాన్ని గ్రహిస్తాడు. వృక్షాలు పూలను సృజిస్తే, వాయువు సువాసనను వహిస్తుంది.
శ్లో. కశ్యపోzత్రి భరద్వాజో - విశ్వామిత్రోzధ గౌతమః
వశిష్ఠో జమదగ్నిశ్చ - సప్తైతే ఋషయస్మృతాః
తే:-కశ్యపుండత్రి జమదగ్ని గౌతముండు
ఆ వశిష్ఠ భరద్వాజు లనెడువారు
వినుతుడైన విశ్వామిత్రు డనెడు వారు
సప్త ఋషులంచు లోకాన సన్నుతి గనె.
భావము. "కశ్యపుడు - అత్రి - భరద్వాజడు - విశ్వామిత్రుడు - గౌతముడు - వశిష్టుడు - జమదగ్ని" అనబడే ఏడుగురూ సప్త ఋషులుగా ప్రసిద్ధి పొందిరి.
శ్లో. కాంతాకటాక్షవిశిఖా న దహంతి యస్య
చిత్తం న నిర్దహతి కోపకృశానుతాపః |
కర్షంతి భూరివిషయాశ్చ న లోభపాశైః
లోకత్రయం జయతి కృత్స్నమిదం స ధీరః || (భర్తృహరి)
తే.గీ. ఇంతి చూపులశిఖికి తపించఁడెవఁడొ,
కలుష కోపాగ్ని మదిఁ జొచ్చి కాల్చదెవని,
నింద్రియ సుఖము లెవనిఁ బ్రేరించలేవొ,
యట్టి ఘనుఁడు విజితలోకుఁడగుట నిజము.
భావము. స్త్రీల కనుచూపుచేత ఎవని హృదయము తాపము చెందదో, కోపం అనే అగ్ని ఎవరి మనసును కాల్చలేదో, ఆశాపాశాలతో ఉన్న ఇంద్రియ సుఖాలు ఎవ్వరిని ఆకర్షించలేవో, అటువంటి ధీరుడు మూడు లోకాలను కూడా జయిస్తాడు.
శ్లో. కాకః కృష్ణః పికః కృష్ణః - కో భేదః పికకాకయోః!
వసంతకాలే సంప్రాప్తే - కాకః కాకః పికః పికః!!
తే.గీ. నలుపుగానుండు కాకము, నలుపు పికము,
రెంటికిని గల భేద మేక్రియను గనుట?
వచ్చినపుడు వసంతము వ్యక్తమగును
కాకపికముల భేదంబు, గరుఁడ గమన!
తే.గీ. కాక పికములు నల్లగా కానిపించు.
తరుణ వాసంత మున భేదమరయ వచ్చు.
మౌన ముద్రలో నందరూ జ్ఞాన ఖనులె.
వినుత వాగ్ఝరిఁ చూపించు ఘనుడెవండొ.
భావము. కాకి నల్లగా ఉంటుంది. కోకిల కూడా నల్లగా ఉంటుంది. కాని వసంత కాలంలో కాకి గొంతులోని కాఠిన్యం, కోకిల గొంతులోని మాధుర్యం సులువుగా గుర్తించవచ్చు.
శ్లో. కామం కర్ణాంత విశ్రాంతే - విశాలే తస్య లోచనే
చక్షుష్మత్తాతు శాస్త్రేణ - సూక్ష్మ కార్యార్థ దర్శినా.
క. కను లాకర్ణాంతము గని
కను లను టది తగదు. నిజము. కావ్యార్థంబుల్
కనుగొని సూక్ష్మ జ్ఞానము
కనిపింపగ తెలుపువాని కన్నులు కన్నుల్.
భావము. విశాలమైన నేత్రాలతో లోకాన్నయితే చూడగలంగాని, సూక్ష్మ దృష్టి గలిగి నప్పుడు మాత్రమే కావ్యార్థాల్నీ, అందులోని సూక్ష్మ కార్యార్థ దర్శనములను వివరింప గల సూక్ష్మాంశాల్నీ చూచి చెప్పగలగడానికి సాధ్యమౌతుంది.
శ్లో. కారణాన్మిత్రతాం యాతి - కారణాదేతి శత్రుతాం ౹
తస్మాన్మిత్రత్వమేవాత్ర - యోజ్యం, వైరంనధీమతా.
తే.గీ. కారణముచేతసన్మైత్రి కలుగ వచ్చు,
కారణముననే వైరమున్ గలుగవచ్చు,
మైత్రినేకోరఁ దగునిల మహితులెపుడు,
వైరదూరంబుగానుండి వరలవలయు.
భావము. ఏదైనా విషయముతో స్నేహం అయ్యి ఉండవచ్చు.అలాగే ఏదో కారణంతో శత్రుత్వం అయ్యి ఉండవచ్చు.అందువల్ల వివేకశాలి అయినవాడు స్నేహాన్ని వృద్ధి చేసుకోవాలే కానీ శత్రుత్వాన్ని కాదు.
శ్లో. కార్త వీర్యార్జునో నామా రాజా బాహుసహస్ర భృత్
తస్య స్మరణ మాత్రేణోర భాధా వినశ్యతి.
తే.గీ. వేయి చేతులు కలిగిన వీరుడైన
కార్తవీర్యార్జునుడను భూభర్త పేరు
తలచువారిల్లు దొంగలు తరియ లేరు.
పద్యమియ్యది చదివిన భవ్య ఫలము.
భావము. వేయి చేతులు కలిగిన కార్తవీర్యార్జునుని నామ స్మరణ చేసినవారికి చోర భయమెన్నడును కలుగదు. ఈ పద్య పఠనము సత్ఫలమునిచ్చును.
శ్లో. కార్యేషు యోగీ, కరణేషు దక్షః - రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం - షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
చ. ఫలితము కోరనట్టి యతి వై యొనరించుము కార్యముల్ సదా!
కరణములందు దక్షత ప్రకాశము కావలె ధర్మబద్ధమై.
సురుచిర రూపమున్ హరిగ శోభిలుటొప్పును సంతసోద్ధతిన్,
ధర సుగుణాభిరాముఁడన తప్పని సత్ క్షమనొప్పుటొప్పు, భా
సుర ముఖమొప్పుటొప్పు తినుచుండెడి వేళను తృప్తినందుచున్,
వర సుఖ దుఃఖముల్ కలుఁగఁ బాయని మిత్రునిగా వెలుంగుచున్
వరలుము పుంస్త్వ ధర్మమిది బాయనివాఁడగు నాథుఁడిద్ధరన్.
భావము.. పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది.
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి. ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
శ్లో. కాలః పచతి భూతాని, - కాలః సంహారతే ప్రజాః!
కాలః సుప్తేషు జాగర్తి,
- కాలో హి దురతిక్రమః!!
కం. కాలము ప్రాణుల మ్రింగును
కాలమె జనులను నశింపగా చేయుచు నా
కాలము మాత్రము నిలుచును,
కాలంబునతిక్రమింపగాలేముకదా.
భావము. కాలము ప్రాణులను మ్రింగుచున్నది. కాలమే ప్రజలను నశింపజేయును.
సమస్త పదార్థములు నశించినను కాలము నిలిచియుండును.
నిశ్చయముగా కాలమును ఎవ్వడును ఉల్లంఘింపజాలడు.
అతిక్రమించలేడు.
శ్లో. కాలస్యామూల్యతాం జ్ఞాత్వా తద్వృధాయాపనం మహా
దోషస్స్యాదితి నిశ్చిత్య సత్కాలక్షేప మాచర!!
తే.గీ. కనఁగ కాలమమూల్యము. కాన మనకు
కాల యాపన దోషంబు. కలుఁడు నిజము.
మంచి పనులకు కాలముఁ బంచి నడవ
జన్మసార్థక్యమగు నిది సజ్జనోక్తి.
భావము. కాలము అమూల్యమైనదని తెలుసుకొని, దానిని వ్యర్థము చేయడం మహా దోషమను నిశ్చయబుద్ధితో కాలమును సదుపయోగము కావించవలె.
శ్లో కాష్ఠభారసహస్రేణ ఘృతకుంభశతేన చ
అతిథిర్యస్య భగ్నాశస్తస్య హోమో నిరర్థకః.
తే.గీ. ధనము వెచ్చించి కట్టెలు, తగిన నేయి,
అమరికను చేసి క్రతువులనరసి చేసి,
ఒక్క యతిథియే యగు ప్రీతి నందకున్న,
వ్యర్థమా క్రతువంతయునరయుఁడయ్య.
భావము. ఎన్నో కట్టెలను , వందలకొలది నేతి కుండలను వినియోగించి యజ్ఞం చేసినా, ఒక్క అతిథి నిరాశ చెందితే ఆ యజ్ఞం నిరర్థక మౌతుంది.
శ్లో. కాష్ఠాత్ అగ్నిర్జాయతే మధ్యమానాత్
భూమిస్తోయం ఖన్యమానా దదాతి!
స ఉత్సాహానాం నాస్త్యసాధ్యం నరాణాం
మార్గారబ్ధాః సర్వయత్నాః ఫలంతి!!
తే.గీ. కాష్ఠమునగ్ని మదియించి కలుగ జేయ
వచ్చు, జలమునే తీయగ వచ్చు భూమి
నుండి త్రవ్వుటన్, నరునకు నుండబో ద
సాధ్య మమితయత్నమునన్ని సాధ్యమగును.
భావము. కాష్టం అంటే చెక్క లేదా వంటచెఱకు. ఎండిపోయిన
చెక్కముక్కలోనుంచి కూడా మధిస్తే అగ్ని పుట్టించవచ్చు, భూమినుండి
తవ్వి తవ్వి మంచినీరు రప్పించవచ్చు, అలాగే, ఉత్సాహవంతుడైన నరుడికి
అసాధ్యమైనది ఏమీ లేదు. ఆరంభించిన ప్రతి పనిని ప్రయత్నలోపం
లేకుండా చేస్తే మంచి ఫలం లభిస్తుంది.
శ్లో. కిం వాససైవం న విచారణీయం , - వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం , - దిగంబరం వీక్ష్య విషం సముద్రః !
తే.గీ. వలువయే పెంచు మనిషికి విలువనిలను.
పీత వస్త్రున కిచ్చె విఖ్యాత రమను,
సాంబునకునిచ్చె విషము దిగంబరుఁడని
రత్న గర్భుఁడు. తెలియుడీ క్రమము మీరు.
తే.గీ. కట్టు బట్టకె లోకంబు గౌరవంబు.
పట్టు గట్టిన హరి గాంచి పాల కడలి
వాని కిచ్చెను లక్ష్మిని. వస్త్ర హీను
శివుని తా గాంచి విష మిచ్చె. చిత్ర మిదియె.
భావము. వస్త్రధారణలో ఏముందిలే - అని తేలికగా అనుకోకూడదు. అదియే యోగ్యతకు ప్రధానం. సముద్రుడు - పీతాంబరం కట్టుకొన్న విష్ణువుకు తన కుమార్తెను ఇచ్చాడు! దిగంబరుడైన శివునికి విషం ఇచ్చాడు ! (కొందరు ఆడంబరానికే ప్రాధాన్యం ఇస్తారని చమత్కారం)
శ్లో. కిమప్యస్తి స్వభావేన - సున్దరం వాప్యసున్దరమ్|
యదేవ రోచతే యస్మై - భవేత్ తత్తస్య సున్దరమ్||
తే.గీ. మనము కోరెడిదేదైన మహిని కనఁగ
సుందరంబెయైనఁ గన నసుందరంబె
యైననున్ సుందరంబెయౌ ననుపమమది,
భావననెనుండునంతయున్ భవ్యభావ!
భావము. ఈ లోకంలో ఏదైనా స్వభావరీత్యా అందంగా ఉన్ననూ లేకున్ననూ ,ఎవడికైతే ఏదైతే నచ్చుతుందో అది అందంగా లేకున్ననూ అదే వాడికి అందంగా తోస్తుంది.
శ్లో. కుంభః పరిమితమంభః - పిబత్యసౌ కుంభసంభవో ఽంబోధిమ్ |
అతిరిచ్యతే సుజన్మా - కశ్చిత్ జ్జనకం నిజేన చరితేన ||
తే.గీ. పరిమితంబగు జలముచే వరలు కుండ,
కుండనుండి తా పుట్టియు కుంభజుఁ డిల
సంద్రమునను ద్రాగివేసెను, సన్నుతముగ,
తండ్రినే మించు ప్రతిభచే తనయు లరయ.
భావము. కుంభము (కుండ) పరిమితమగు నీటిని కల్గియుండును. ఆ కుంభము నుండి జన్మించిన అగస్త్యుడు (కుంభసంభవుడు) సముద్రమునే త్రాగినాడు. సుజన్మగల వ్యక్తి తన ఉత్తమ ప్రవర్తనచే తండ్రిని మించిన వాడవుతాడు.
శ్లో. కురంగ, మాతంగ, పతంగ, భృంగ - మీనాః హతాః పంచభిరేవ పంచ.
ఏకః ప్రమాదీ స కథం నహన్యతే - యస్సేవతే పంచభి రేవ పంచ.
తే.గీ. జింక లేనుగుల్ శలభముల్ చేపలు మఱి
తుమ్మెదలు నొక్కొకటి యింద్రియమ్ముబలిమి
నాశనము బొంద, మనుజుఁడు నాల్గు నొక్క
యింద్రియమ్ముల బలిమి తానెట్లు కాచు?
భావము. జింకలు, ఏనుగులు, శలభములు ( మిడతలు ), చేపలు, తుమ్మెదలు, అవి ఒక్కొక్క ఇంద్రియ ప్రేరణ మాత్రముననే నాశనము పొందు చున్నవి. ఇక ఆ ఐదు యింద్రియాలూ ఒక్కుమ్మడిగా కలిగి యున్న మానవుడు వాటిని నిగ్రహించి మనగలుగుట ఎంతటి కష్ట సాధ్యమో కదా! ఐననూ మానవుడు జితేంద్రియుడై, పరమాత్మనే ప్రత్యక్షం చేసుకోగలిగే సామర్థ్యాన్ని ఆత్మ స్థైర్యంతో సాధిస్తున్నాడు. అందుకే అన్నారు మానవుడే మహనీయుడని. మనమూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి ఆహార వ్యవహారాల్లో కట్టుబాట్లను కలిగి వుందామా ?
200. మంత్రము. కుర్వన్నేవేహ కర్మాణి - జిజీవిషేచ్చతగ్‌ం సమాః
ఏవం త్వయి నాఽన్యథేతోఽస్తి - న కర్మ లిప్యతే నరే. (ఈశావాస్యోపనిషత్ ౨)
తే.గీ. వరల కర్మలన్ జేయుచు వర్షశతము
నాశపడుమీవు, మించుచు నాశపడకు,
మింతకన్న నన్యము లేదు, శాంతచిత్త!
అరయ కర్తవ్యములు నిన్నునంటఁ బోవు
అర్థం: ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు
జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు.
కర్తవ్యాలు నిన్ను అంటవు.
201. శ్లో. కూపస్తటాక ముద్యానం, మండపం చ ప్రపా తథా
జలదాన మన్నదానం, అశ్వత్థారోపణం తథా
పుత్రశ్చేతి చ సంతానం, సప్తవేదవిదో వీదుః.
తే.గీ. నూయి, యుద్యానము, చెరువు, స్వీయ సుతుఁడు,
మండపము, చలివేంద్రమ్ము మహిత రావి
సప్త సంతతు లొకటున్న చాలు మనకు
ముక్తిఁ గొలుపును గాంచుడు పూజ్యులార!
భావము. నూయి, చెరువు, ఉద్యానవనం, మండపం, చలివెంద్రము, ఆశ్వత్థారోపణం, పుత్రుడు, అనే ఈ ఏడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్తున్నారు.
పుత్రుడు పితృ కర్మలద్వారా నరకం నుండి ఉద్ధరించి స్వర్గాన్ని కలుగచేస్తాడని విశ్వాసం. వాడది సవ్యంగా చెయ్యకపోతే... అంతే వాడిని కని తెచ్చిపెట్టుకొన్న నరకం ఏదైతే వుందో, అది మనకి అక్కడా తప్పనట్లే. మిగిలిన ఆరు ఆయా ప్రదేశాలలో మనపేరు చిరస్థాయిగా ఉండేట్లు చేస్తాయి. మన పేరు ఎంతకాలం వినపడితే అంతకాలం స్వర్గలోక వాసం అని ధర్మశాస్త్రాదులు చెప్పుచున్నవి.
శ్లో. కృతస్య కరణం నాస్తి - మృతస్య మరణం తథా|
గతస్య శొచనం నాస్తి - హ్యేతద్వేదవిదాం మతమ్||
తే.గీ. చేయఁబడినట్టిదానిని చేయనుండ
దటులె మృతి లేదు మృతికింక, నిటలనేత్ర!
గతముచింతింపనుండదు, గతము గతమె,
వేదవేత్తల మతమిట్లు విదితమగును.
భావము. చేసిన దానిని చేసేదేమిటి? చచ్చిన జీవిని చంపేదేమిటి? జరిగినదానికి ఏడ్చేదేమిటి? తెలుసుకోన్నచో తొలగును చీకటి. ఇదీ పారమార్థిక జ్ఞానసంపన్నుల లక్షణమ్.
శ్లో. కృత్వా పాపం హి సంతప్య, తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే.
నైవ కుర్యాత్ పున రితి నివృత్యా పూయతే తు స:.
క. తెలియక పాపముఁ జేసినఁ
గలఁగి, మదిఁ దపింతు మేని కలుగదు పాపం
బలసత నికఁ జేయ ననుచుఁ
దలచినచో తద్విముక్తి తధ్యము మనకున్.
భావము. పాప కార్యము మనకు తెలియ కుండానే మనము మనచేఁ జేయఁబడినచో, అదితెసిన పిదప ఆ పాప భీతితో ఆవేదనకు లోనగుదుము. అట్టి తఱి తద్ విషయమై మిక్కిలి పశ్చాత్తాపముతో ఇకపై జాగరూకతతో మెలగి ఇట్టి పాపములు జరుగ కుండా చూచుకొందునని మనము దృఢచిత్తులమయి నిశ్చయించుకొన్నచో తెలియక చేసిన పాపము వలన కలిగిన దోషము ఆ పశ్చాత్తాపముతోనే పరిహారమగును.
శ్లో. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః.
మౌనేనకలహంనాస్తి, నాస్తి జాగరుతో భయమ్.
తే.గీ. కఱవు లుండవు కృషి చేయ కమల నయను
జపముతో పాప హరమగు. సహన మతిని
మౌనముగనున్న కలహంబు కానమెపుడు
జాగరూకున కభయంబు జగతిలోన.
తే.గీ. కృషిని చేసిన దుర్భిక్ష విషము తొలగు.
జపముఁ చేసిన పాతక చయము తొలగు.
మౌనముద్రను కలహంబు మాయమగును.
జాగ్రతన్భయ మొలయదు. సద్గుణాఢ్య!
భావము. వ్యవసాయము చేసినచో కఱవుండదు. జపమొనర్చిన పాతకములు తొల్సగిపోవును. మౌనముగా నుండినచో పోట్లాటలు రావు. జాగరూకులమై ఉండినచీ భయముండదు.
శ్లో. కోఽతి భారః సమర్థానాం! - కిం దూరం వ్యవసాయినాం!
కో విదేశః సవిద్యానాం! - కః పరః ప్రియవాదినాం!!
తే.గీ. భారమేముండు నిపుణతన్ వరలినపుడు,
కష్టజీవికి దూరమే కనఁబడదుగ,
వినగ పరదేశమేముండు విద్య కలుగ,
పరులు ప్రియభాషికుండరు భక్తవరద!
భావము. సమర్థులకు ఏదీ భారం కాదు. కష్టపడే వారికి ఏదీ దూరం అనిపించదు. చదువుకున్న వారికి ఏ చోటూ పరాయి ప్రాంతం కాదు. ప్రియంగా మాట్లాడే వారికి ఎవరూ పరాయి వారు కాదు.
శ్లో. కోஉన్ధో ? యోஉకార్యరతః , కో బధిరో ? యో హితాని న శ్రుణోతి
కోమూకో ? యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి.
ఆ. చేయ రాని పనులు చేసిన గ్రుడ్డియే.
హితము వినని వాఁడు క్షితిని చెవిటి.
పలుక వలయు చోట పలికమి మూగయే.
తెలిసి మసలుకొనుడు తెలివి చూపి.
భావము. ఎవడు గ్రుడ్డివాడు? కానిపనులు చేసేవాడు! ఎవడు చెవిటివాడు? హితవాక్యాలు విననివాడు! ఎవడు మూగవాడు ? తగిన సమయంలో ప్రియభాషణం చేయటం తెలియనివాడు.
శ్లో. కో హి భారః సమర్థానాం? కిం దూరం వ్యవసాయినాం?
కో విదేశః సవిద్యానాం? కః పరః ప్రియవాదినామ్?
తే.గీ. మహిని భారమేముండు సమర్ధునకును?
కృషిని చేయువానికి దూరమేమియుండు?
దివ్య విద్వద్వరునకు విదేశమేమి?
ఇష్ట సద్భాషణాఢ్యునికితరులెవరు?
భావము. సామర్థ్యం కలవారికి కార్యభారం ఏమిటి? కృషి చేయగలవానికి దూరం ఏమిటి?విద్య గలవానికి విదేశం ఏమిటి? ప్రియ భాషణం చేసేవానికి ఇతరులు ఎవ్వరు?
శ్లొ. క్రోధో వైవస్వతో రాజా - శా వైతరణీ నదీ
విద్యా కామ దుఘా ధేనుః - సంతోషో నందనం వనం.
తే.గీ.
క్రోధమే యముడందురు కోవిదు లిల.
ఆశ వైతరణీ నది. అరసి చూడ.
విద్యయే కామ ధేనువు.విశ్వమందు.
సంతసమునంద నవనము. సన్నుతాత్మ !
భావము. మానవునకు గల కోపమే యమ ధర్మ రాజు. అతనికుండే ఆశయే వైతరణీ నది. అతని విద్యయే అతని పాలిటి కామ ధేనువు. అతని సంతోషమే ఆనంద నందన వనము.
శ్లో. క్షణశః కణశశ్చైవ - విద్యామర్థంచ సాధయేత్.
క్షణ త్యాగే కుతోవిద్యా - కణ త్యాగే కుతో ధనమ్.
తే.గీ. విద్యనార్జించుక్షణమైన విడువకుండ.
ధనము నార్జించు కణమైన తప్పకుండ.
క్షణము పోయిన విద్య యే గతిని కలుగు?
కణము పోయిన ధనమెట్లు కలుగునయ్య?
భావము:- క్షణ క్షణమూ ఉపయోగించుకొని విద్యను, కణము కణమూ చొప్పున సేకరించి ధనమును కూడబెట్ట వలెను. క్షణము వ్యర్థ పరచినచో ఇక విద్య ఎక్కడ సంపాదించుట జరుగును? అటులనే కణమునైనను విడిచిపెట్టితిమేని మరి ధనమునెటుల సంపాదించుట జరుగును?
విద్యా సముపార్జనాసక్తులు ఒక్క క్షణమైనను వ్యర్థము చేయ కూడదు. ధన సముపార్జనాసక్తులు ఒక్క కణమాత్రమైనను విడిచిపెట్ట కూడదు అని గ్రహింపనగును.
శ్లో. క్షాంతి తుల్యం తపో నాస్తి, సంతోషాన్నపరం సుఖం
నాస్తి తృష్ణాసమో వ్యాధిః, న చ ధర్మో దయాపరః.
తే.గీ. క్షాంతి తుల్యమౌ తపమెన్న కానరాదు.
సంతసముకన్న సుఖము లేదెంతకునిల.
ఆశకన్నను రోగమీ యవని లేదు.
దయను మించిన ధర్మంబు తలప లేదు.
భావము. క్షమతో సమానమైన తపస్సులేదు. సంతోషాన్ని మించిన సుఖంలేదు. అత్యాశతో సమమైన రోగం లేదు.దయను మించిన ధర్మంలేదు.
శ్లో. క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?
తే.గీ. క్షాంతి కలిగిన కవచంబుఁ గలుగ నేల?
కలుగ క్రోధము శత్రువు కలుగ నేల?
జ్ఞాతి కలిగిన యగ్నిని కలుగ నేల?
కలుగ సన్మిత్రు లౌషధి కలుగ నేల?
కలుగ దుష్టులు సర్పముల్ కలుగ నేల?
కలుగ సద్విద్య ధనములు కలుగ నేల?
కలుగ సిగ్గు సుభూషలు కలుగ నేల?
కవి జనాళికి రాజ్యంబు కలుగ నేల?
భావము. ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు. కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు. దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు. మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు. దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పని లేదు.
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు అక్కర లేదు. లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు అక్కర లేదు. కవితా శక్తి కల వారికి వేరే రాజ్య మక్కర లేదు.
శ్లో. క్షుధ్, తృట్, ఆశా: కుటుంబిన్యో మయి జీవతి నాஉన్యగా:
తాసాం ఆశా మహాసాధ్వీ కదాచిత్ మాం న ముంచతి .
క. ఆకలి దాహము నాశయు
నాకగుయిల్లాండ్రు సతులునను విడువరిలన్
ఆకలి, దాహము విడనగు,
నాకున్నదురాశభార్య ననువిడి పోదే!
భావము. నాకు(సంసారికి) – ఆకలి, దాహము, ఆశ అనే ముగ్గురు - ఎన్నడూ వదలని ఇల్లాండ్రు. వారిలో అప్పుడప్పుడు మొదటి ఇద్దరూ (ఆకలి,దాహము) కొంతసేపు దూరమైనా, మూడవదైన ఆశ మాత్రం మహాసాధ్వి. నన్ను(సంసారిని) ఎప్పుడూ వదిలిపెట్టదు!
శ్లో. క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని ।
తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహం సుఖీ ॥
(వివేకచూడామణి 537)
తే.గీ. ఆకలిని దేహబాధల నతఁడు మరచి
యాడుకొను బాలుఁడెట్టులో యటులె పండి
తుండు మమకారమహము తా తుడిచివైచి
ధ్యానమగ్నుఁడై యానంద మానసుఁడగు.
భావము. ఆకలి దప్పుల్ని దేహ బాధను వదలి బాలుడు ఆటపాటల్లో ఎలా నిమగ్నమై ఉంటాడో,అలానే తత్త్వవేత్త దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలను నేననే భ్రాంతిని వీడి,నిత్య నిరతిశయానంద నిష్ఠలో నిమగ్నమై ఉంటాడు.
శ్లో. ఖలః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి.
ఆ.వె. పరుల దోషములను దురితుండు చూపించు
నల్పమైన యది యనల్పముగను.
తన యనల్ప దోష మరయంగ నేరడే!
దుష్ట చిత్ప్రవృత్తి శ్రేష్టమగునె?
భావము. దుర్జనుడు పరదోషం ఆవగింజంత మాత్రమే ఉన్నా, దానినే ప్రత్యేకించి చూస్తాడు. తనదోషం మారేడు కాయంతగా ఉన్నా,తెలిసి కూడా చూడడు.
స్నాన సమయమున పఠించ వలసిన శ్లోకములు
శ్లో. ఖలానాం, కంటకానాంచ, ద్వివిధైవ ప్రతిక్రియా!
ఉపానన్ముఖ భంగోవా, దూరతోవా విసర్జనమ్.
తే.గీ. ఖలునకునుకంటకమునకు నలతిగ తగి
న ప్రతిక్రియల్ రెండు గనన్ గలవిల.
చెప్పున ముఖమున్ మడచుటొ,తప్పుకొ్నుటొ,
తగు,మనకది పరగునయ్య! సుగమ మిదియె.
తే.గీ. గర్భ కందము 4పాదాలు 4రంగుల్లో.:-
ఖలునకునుకంటకమునకు నలతిగ తగి
న ప్రతిక్రియల్ రెండు గనన్ గలవిల.
చెప్పున ముఖమున్ మడచుటొ,తప్పుకొ్నుటొ,
తగు,మనకది పరగు(న్ + అ)నయ్య! సుగమ మిదియె.
భావము. దుష్టులకు, ముండ్లకు ప్రతి క్రియ రెండే విధములు. చెప్పుతో ముఖ భంగము చేయుటో, తప్పుకొని దూరముగా పోవుటో, ఈ రెండే తగిన మార్గములు.
శ్లో. గంగా గంగేతి యో బృయాత్ యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వ పాపెభ్యో విష్ణులోకం స గచ్చతి.
క. గంగా గంగా యనుచును
పొంగుచుపలికేటివారి పుణ్యము పండున్.
తుంగను కలియును పాపము
బంగరు హరి లోకమొదవు భరతావనిలో.
శ్లో. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.
క. గంగయు యమునయు కృష్ణయు
పొంగే గోదారి వాణి భువి నర్మదయున్
రంగుగ సింధూనదియును
హంగుగ కావేరి జలము లమరుత! నీటన్.
శ్లో. గంగా పాపం, శశీ తాపం, దైన్యం కల్పతరుస్తథా,
పాపం తాపంచ దైన్యంచ ఘ్నంతి సంతో మహాత్మనః.
తే.గీ. పాపమును గంగ చంద్రుఁడు తాప బాధ,
కల్ప వృక్షము దైన్యము కలుగనీవు.
పాప తాపాలు, దైన్యము, వదలి పోవు
మహితులను చేరి వసియింప మాన్యులార!
క. పాపమును బాపు గంగయు,
తాపంబును బాపును శశి తరు కల్పకమే
పాపును దైన్యము. సంతులు
పాపుదురీ మూడు మనకు వారిని చేరన్.
క:- పాపముఁ బాపును జాహ్నవి.
తాపము శశి బాపు, కల్పతరువది లేమిన్
బాపును. సజ్జన సంగతి
పాపము తాపంబు దైన్య పరిహృతిఁ గొలుపున్
తే.గీ. పాపమణచు గంగ,విధుండు తాపమణచు,
దైన్యమును కల్ప
భూజంబు తప్పకణచు,
తాప, పాప, దైన్యములను,
ధరణిపైన
సంతులైన మహాశయుల్
సరగునణచు.
భావము. గంగ తాపమును హరించును. చంద్రుఁడు తాపమును పోఁగొట్టును. కల్ప వృక్షము దైన్యమును నశింపఁ జేయును. మహాత్ములనాశ్రయించినచో పాపము, తాపము, దైన్యము మూడూ కూడా నశించును.
శ్లో. గజానాం మంద బుధ్ధిశ్చ - సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం - త్రిభిర్లోకోపకారకమ్.
తే.గీ. ఏనుగులమందబుద్ధియు, నిలను నాగు
పాములకునతినిద్రయు, బ్రాహ్మణులకుఁ
జూడ నైక్యత లేకుంట మూడునివ్వి
లోకమునకుపకారమే, శ్రీకరుండ!
భావము. ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !
శ్లో. గతే శోకో న కర్తవ్యో - భవిష్యం నైవ చిన్తయేత్।
వర్తమానేన కాలేన - వర్తయన్తి విచక్షణాః॥
తే.గీ. గడిచినట్టి శోకమునకు కలతఁ బడక,
భవితకైచింత చేయక, ప్రస్తుతమును
గూర్చి చింతించు విజ్ఞాని గొప్పవాఁడు,
చేయవలసిన పనులందు చేవఁ జూపు.
భావము. గతించి పోయినదాన్ని గూర్చి ఆలోచిస్తూ కూర్చోకూడదు.... జరగబోవు దాన్ని గూర్చి ఆశాసౌధాలు కడుతూ కూర్చోకూడదు, విచక్షణ వివేకంగలవారు వర్తమానమునకు అనుగుణంగా చేయవలసిన కర్తవ్యాలను చేయుదురు.
మంత్రమ్.
గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే - కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత - ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్.
చం. గణములలో సదా పతివి.గౌరవమొప్పఁగ పిల్చితేను నిన్.
ఘనముగ నే హవిస్సులను కామ్యద! అర్పణ చేతు నీకిలన్
ఘన కవి రాజిలో కవివి. గణ్యుఁడవీవెగ కీర్తి శ్రేష్టులన్.
ఘనుఁడవు రాడ్వరుండవు. ప్రగణ్య మహీసుర శ్రేష్టుఁడీవె. సద్
వినయముతోడ రమ్మనుదు. వేల్పుగ పీఠమలంకరింపుమా!
భావము. గణాలలో నీవు గణపతివి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. హవిస్సులర్పిస్తున్నాను.
కవులలో కవివి (మహాభారతం రచించినవాడివి) అందరిలో పోల్చవలసిన కీర్తిశ్రేష్ఠులలో కూడా
నీవే శ్రేష్ఠుడవు. రాజులకు జ్యేష్ఠుడవు, బ్రాహ్మణులలో గొప్ప బ్రాహ్మణుడవు. వచ్చి సుఖాసనంలో
కూర్చుని మా కోరికలు వినుము.
శ్లో. గర్జతి శరది న వర్షతి - వర్షతి వర్షాసు నిస్స్వనో మేఘః
నీచో వదతి న కురుతే - న వదతి సుజనః కరోత్యేవ.
తే.గీ. ఉరుము మేఘము వర్షము కురియఁబోవు.
ఉరుమకుండనె వర్షంబు కురియు కొన్ని.
పలుకులాడెడి నీచులు పనికి రారు.
పనిని చేతురు మహితులు, పలుకబోరు.
భావము. శరత్కాలంలో మేఘం ఊరికే గర్జిస్తుంది. వర్షాకాలంలో చప్పుడు చేయకున్నా వర్షిస్తుంది. నీచుడు మాటలు చెప్తాడు కానీ పని చెయ్యడు. సుజనుడు మాటలు చెప్పడు, చేసి చూపుతాడు.
శ్లో. గవో మేచాగ్రతో నిత్యం! - గావః పృష్టత ఏవచ!
గావో మే హృదయేచైవ! - గవాం మధ్యే వసామ్యహం!
(స్కాంద పురాణము)
తే.గీ. నాకు నెదురుగన్, హృదియందు, నాకు వెనుక,
నిత్యముండుత గోవు లనిత్యమయిన
భవము విడువంగ వసియింతు భవ్యమయిన
గోవులనడుమ నెప్పుడున్ గోపబాల!
భావము. గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక.
శ్లో. గాత్రేషు వలయః ప్రాప్తాః - శ్వేతాశ్చైవ శిరోరుహాః |
జరయా పురుషో జీర్ణః - కిం హి కృత్వా ప్రభావయేత్.
(వాల్మీకి రామాయణం)
తే.గీ. చర్మమందున ముడతలు సహజముగనె
పడును, శిరసుపై జుత్తును పండుచుండు,
వెద్దవయసున మనిషికి, వీటినరసి
యాపగలిగెడిదేది? మహాత్మ! నృహరి!
భావము. అవయవాలు ముడతలు పడతాయి. జుట్టు తెల్లబడుతుంది.
వృద్ధాప్యంతో మనిషి క్షీణిస్తాడు. దాన్ని ఆపడానికి ఏ ప్రభావం అక్కడ జరుగుతుంది?
శ్లో. గాయంతి దేవాః కల గీతికాని - ధన్యాస్తు తే భారత భూమి భాగే
స్వర్గాపవర్గాస్పద మార్గ భూతే - భవంతి భూయః పురుషాః సురత్వాత్.
ఉ. భారత భూమిపై కలుగు భవ్య మహాద్భుత జన్మ జన్మ. యీ
భారత మాతృ గానమును భక్తిగ దేవత లాచరింత్రు. యీ
భారత భూమి స్వర్గ పథ ప్రస్ఫుట మార్గము, ముక్తి మార్గమున్.
భారత మాతకున్ కడుపు పంటగ పుట్టుట భవ్య యోగమే.
భావము. ఓ భారత మాతా! నీ బిడ్డలు ధన్యులు. నిన్ను గూర్చి దేవతలు గానం చేస్తున్నారు. స్వర్గ లోకమునకు, మోక్షమునకు నీవే మార్గము. సోపానమూ నీవే సుమా. ఎంతో పుణ్యము చేసుకొనిన ప్రాణికి మాత్రమే నీ సంతతిగా పుట్టే భాగ్యం లభిస్తుంది. అని విష్ణు పురాణం భరత మాతను ప్రశంసించింది.
శ్లో. గావః పశ్యంతి గంధేన - వేదైః పశ్యంతి పండితాః!
చారైః పశ్యంతి రాజానః - చక్షుభ్యాం ఇతరే జనాః!
తే.గీ. గంధచక్షువులన్ బశుల్ కనుచునుండు,
వేదచక్షులన్ గాంతురు వేదవిదులు
చారు చక్షులన్ బాలకుల్ చక్క గాంత్రు,
చర్మ చక్షువులన్ గాంత్రు సకలజనులు.
భావము
గోవులు వాసనా నేత్రము చేతను, పండితులు వేదవిజ్ఞానమనే నేత్రము చేతను,
రాజులు చారులనెడి (గూఢచారులు) నేత్రములతోడను, తమకు
కావలసిన విషయములను చూచుచుండగా, సాధారణజనులు
చర్మచక్షువులతోనే చూడగలుగుచున్నారు.
శ్లో. గిరౌమయూరో, గగనే చ మేఘః. - లక్షాంతరేర్కః, సలిలే చ పద్మః,
లక్షద్వయే గ్లౌః,కుముదాని భూమౌ, - యయోఽస్తి మైత్రీ, న తయోర్హి దూరమ్.
తే.గీ. జలదమును గాంచి నర్తించు సర్పభుక్కు.
పద్మములురవిన్ గాంచినన్ బరవశించు,
కలువలాకాశ చంద్రుని గాంచి పొంగు,
మిత్రులకుమధ్య దూరంబు ధాత్రి లేదు.
భావము. ఏ ఇరువురి మధ్య స్నేహము ఉంటుందో వారికి దూరముతో నిమిత్తము ఉండదు. ఏ విధముగాననగా నెమళ్ళు కొండలపై ఉంటాయి. మేఘాలు ఆకాశంలో ఉంటాయి ఐనా కాని స్నేహితుఁడైన మేఘుఁడు రాగానే అవి పురివిప్పి ఆడతాయి. లక్షయోజనాల దూరంలో సూర్యుఁడుంటాడు. ఐనా కాని అతనిత్రో మైత్రిని ఒప్పే పద్మము అతఁడు ఉదయించగానే ఆనందంతో వికసిస్తుంది. చంద్రుఁడు రెండులక్షల యోజనాలదూరంలో ఉంటాడు. ఐనా కాని అతడు ఉదయించగానే అతనితో మైత్రి కలిగిన కలువలు వికసిస్తాయి. దీనిని పట్టి స్నేహానికి దూరంతో నిమిత్తం లేదని అర్థమగును.
శ్లో. గుణః భూషయతే రూపం, శీలం భూషయతే కులం
సిద్ధిః భూషయతే విద్యాం, భోగః భూషయతే ధనమ్.
ఆ.వె. గుణము చేత రూపు, కులమది శీలమున్,
సిద్ధి చేత విద్య, చిద్గుణోప
భోగమున ధనంబు, భూషణంబగునయ్య.
రమ్య సుగుణ ధామ! రామ కృష్ణ!
భావము. రూపాన్ని గుణము , కులాన్ని శీలము, విద్యను సిద్ధి (విద్య ద్వారా నేర్చిన దాన్ని ఆచరించటం), ధనాన్ని భోగము ( సద్వినియోగం చేయటం) రాణింప జేస్తాయి.
శ్లో. గుణదోషౌ బుధో గృహ్ణన్ , ఇందుక్ష్వేడావివేశ్వర:
శిరసా శ్లాఘతే పూర్వం , పరం కంఠే నియచ్ఛతి.
తే.గీ. బుధుఁడు గుణ దోషము లరసి మూర్ధముననె
గుణము నుంచుచు నణచు దుర్గుణమునతఁడు.
శివుఁడు చంద్రుని శిరమున చేర్చుకొనుచు,
విషము కంఠాన నిలిపిన విధముగాను.
భావము. పండితుఁడు గుణ, దోషాలను రెండిటినీ గ్రహించి, గుణాన్ని నెత్తినపెట్టుకుంటాడు. దోషాన్ని నియంత్రిస్తాడు. శివుడు చంద్రుణ్ణి శిరస్సు మీద ఉంచుకున్నాడు. విషాన్ని గొంతులోనే నిలిపి ఉంచాడుకదా !
శ్లో. గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ - భవంతి నిర్గుణాస్సుఖినః |
బంధనమాయాంతి శుకాః*ల్ - యథేష్ట సంచారిణః కాకాః ||
తే.గీ. బాధలను గుణవంతులే పడుదురిలను,
సుఖములను దుష్టు జనులందుచుందురు రకట!
పంజరంబులన్ జిలుకలు బంధనమగు,
వాయసములాకసముననే వరలుఁ గనుమ.
భావము. లోకమున గుణవంతులగు జనులే తరచుగా బాధలను అనుభవించుచున్నారు. గుణహీనులు సుఖమును అనుభవించుచున్నారు. చిలుకలు పంజరమున బంధింపబడుచున్నవి. కాకులు స్వేచ్ఛగా ఆకాశమున విహరించుచున్నవి.
శ్లో. గుణవజ్జన సంసర్గాత్ - యాతి స్వల్పోఽపి గౌరవమ్ !
పుష్పమాలానుషంగేణ
- సూత్రం శిరసి ధార్యతే!!
కం. గుణవంతులఁ గూడి మనిన
గుణహీనుఁడుకూడ
పొందు గొప్పతనమ్మున్,
మనుటను పూమాలను
తా
ఘనముగ శిరమందు
నిలుచుకద సూత్రంబున్.
భావము. గుణవంతులతోనున్న
గుణహీనుడు కూడా గౌరవింపబడును. సువాసనగల పూ మాలలో దారముగానున్నందున దారము కూడా శిరముపైధరింపబడుచుండునుకదా.
శ్లో. గుణా గుణజ్ఞేషు గుణా భవంతి - తే నిర్గుణం ప్రాప్య భవంతి దోషాః.
ఆస్వాద్య తోయాః ప్రభవంతి నద్యః. - సముద్రమాసాద్భవంత్యపేయాః.
తే.గీ. గుణము లగుచుండె గుణములు గుణ గణుకడ.
నిర్గుణుల జేరి దోషమై నిలుచునదియె.
త్రాగ తగు యేటి నీరముల్ సాగిసాగి
జలధి చేరి యయోగ్యమౌనిలను త్రాగ.
క. గుణములు గుణవంతుని కడ
ఘనముగ భాసించు నవియె ఖలుఁ దరి నున్నన్
ఘన దోషములగును. జలము
లు నదిని తీయన. జలధిఁ గలుషితములునగున్.
తే.గీ. సుగుణులను చేరు గుణములు శోభిలు నవి
దుర్గుణులఁ జేరి కనిపించు దోషములుగ,
నదుల నీరము దాహంబునదిమివేయు,
నవియె సాగరమున్ జేరి చవకబారు.
భావము. గుణజ్ఞుని చేరి గుణములు సద్గుణములుగా భాసిల్లును. గుణములు నిర్గుణుని చేరిన చేరినంతనే దోషములగుచున్నవి. నదీ జలము త్రాగుటకు యోగ్యమైనవై ఒప్పుచుండును. ఆ జలములే సముద్రుని చేరగానే త్రాగుటకయోగ్యములగుచున్నవికదా!
శ్లో. గుణిని గుణజ్ఞో రమతే - నా గుణశీలస్య గుణిని పారితోషః
అళిరేతి వనాత్కమలం - నతు భేక స్త్వేకవాసోఽపి.
కం. గుణవంతుఁడగు రసజ్ఞుఁడు
గుణవంతుని మెచ్చు, కనఁడు గుణరహితుఁడిలన్,
వనపద్మము వికసించినఁ
గని తుమ్మెద చేరు, కప్ప కాంచదు దరినే.
భావము. గుణవంతుని రసజ్ఞుడే మెచ్చవలయును గానీ మొరటువాడు నేరడు. పద్మము వికసించగానే దానికోసం తుమ్మెద యెగిరివచ్చునే కానీ అక్కడ వున్న కప్ప చేరరాదు కదా.
శ్లో. గుణైరుత్తుంగతాం యాతి - నోచ్చైరాసన
సంస్థితః|
ప్రాసాద శిఖరస్థోsసి - కాకః
కిం గరుడాయతే ||
తే.గీ. గుణముతోడ నౌన్నత్యంబు ఘనతరమగు,
నాసనముపైన కూర్చున్న నమరఁ బోదు,
రాజభవన శిఖరమున వ్రాలినంత
కాకి గ్రద్దగా నగుటది కల్లకాదె?
భావము. మనుష్యుడు గుణముతోనే యౌన్నత్యము పొందును.
ఉన్నతమైన ఆసనము మీద కూర్చుండినంత మాత్రము ఔన్నత్యము కలుగబోదు. రాజభవనము యొక్క శిఖరము
మీద కూర్చుండినంత మాత్రముచేత కాకి గరుడపక్షి యగునా?140.
శ్లో. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాః
స గరుః దుర్లభో యస్తు ,శిష్య హృత్తాపహారకః.
తే.గీ. శిష్య విత్తాపహారులై చెలగునట్టి
గురువులుందరనేకులు, కూర్మిఁ జేరు
శిష్య హృదయార్తి తొలగించి చెలగునట్టి
గురువులరుదుగనుందురు నిరుపమముగ.
భావము. శిష్యుల ధనమును కాజేయు గురువులు ఎందరో ఉన్నారు. కానీ, వారి హృదయార్తిని తొలగించు గురువు దుర్లభుడు కదా.
శ్లో. గురుందృష్ట్వా
సముత్తిష్టే దభివాద్య కృతాంజలిః|
నైతైరుపవిశేత్ సార్ధం
వివదేన్నాత్మకారణాత్||
జీవితార్థమపిద్వేషాత్
గురభిర్నైవ భాషణమ్|
ఉదితోపి గుణై రన్యై
ర్గురుద్వేషీ పతత్యథః॥ (శ్రీ కూర్మ పురాణం
శ్లో॥29-30, అధ్యా-12, ఉ, )
చం. గురువును చూచినంతటనె కూరిమితో నెదురేగి వందనం
బురవుగఁ జేసి
వేరుగను నొప్పుగకూర్చొనియుండి, వారి వి
స్తరమగు బోధనల్
వినుచు దానికి మారు వచింపకుండ, నే
తెరగునఁ గోప
మొందకను, ద్వేషము చూపక నుండగా వలెన్.
భావము. గురువు కనపడిన వెంటనే
కూర్చున్న ఆసనం నుంచి లేచి రెండు చేతులూ జోడించి విధిగా నమస్కరించాలి. గురువుతో కలిసి
ఒకే ఆసనం మీద ఎప్పుడూ కూర్చోకూడదు. తనకోసం గానీ, బ్రతుకుతెరువు కోసం గానీ గురువుతో
ఎప్పుడూ వాదన చేయకూడదు. గురువుతో ఆగ్రహంగా,
ద్వేషపూరితంగా ప్రసంగించకూడదు. గురువు దగ్గర అవగుణాలున్నప్పటికీ గురువుని ద్వేషించకూడదు.
అలా ద్వేషించిన వాడు పతితుడవుతాడు.
శ్లో. గురుం వా, బాల, వధ్వౌవా, - బ్రాహ్మణంవా బహు శృతం.
ఆతతాయిన మాంతవ్యం - హంత్యాదే వవిచారయన్.
తే.గీ. గురువు, బాల వధువనక, గొప్ప వేద
విదుడు బ్రాహ్మణుడనకుండ కౄరముగను
ఆతతాయైన చంపగ నర్హమయ్య.
యోచనేమియు లేకయే. నీచు లంచు.
భావము. ఆతతాయి అయితే అట్టి వారు గురువవ వచ్చును, బాలులవ వచ్చును, స్త్రీ లవ వచ్చును, అనేక వేదముల నెఱిగిన బ్రాహ్మణు లవ వచ్చును, అటువంటి వారిని విచారణ చేయనక్కర లేకుండానే హతమార్చ వచ్చును
శ్లో. గురురగ్నిర్ద్విజానీనాం, - వర్ణానాం బ్రాహ్మణో గురుః,
పతిరేవ గురుస్త్రీణాం, - సర్వస్యాభ్యాగతోగురుః.
తే.గీ. బ్రాహ్మణుల కగ్ని గురువు, పరంబుఁ గొలుపు,
వర్ణములకెల్ల గురువు సత్ బ్రాహ్మణుండు,
సతికి గురువన పతియేను క్షితిని జూడ,
జనుల కభ్యాగతుఁడు గురువని గ్రహించు.
భావము. బ్రాహ్మణులకు అగ్నిహోత్రమే గురువు. అన్ని వర్ణములవారికి సద్బ్రాహ్మణుఁడే గురువు. ఆడువారికి భర్తయే గురువు. జనులందరికీ అభ్యాగతుఁడే గురువు.
శ్లో. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః.
క. గురువే బ్రహ్మయు విష్ణువు
గురువే పరమేశ్వరుండు గురువే తలపన్,
గురువే పరమగు బ్రహ్మము
గురువునకేనంజలింతు గురుతరభక్తిన్!
భావము. గురువే సృష్టికర్తయగు బ్రహ్మ. గురువే మనకు విష్ణువు. పరమేశ్వరుఁడు కూడా గురువే. అట్టి గురువు సాక్షాత్తు బ్రహ్మపదార్థమే. అట్టి గురువునకు నేను నమస్కరుంచుచున్నాను.
శ్లో. గురుసత్కారకాలేతు - శిష్యదర్శన లాలసా,
జాయతే వర్ధతే, సత్యం - పుత్ర సందర్శనాత్పరమ్.
(రచన .. డా.పీ.టీ.జీ. రంగాచార్యులు)
తే.గీ. గురువు సత్కృతిఁ గొనువేళ కూర్మినొప్పు
శిష్యుఁ డటఁ గనఁబడినచో చెప్పనలవి
కాని యానంద మొదవు తత్ కాలమందు
కొమరుఁ గాంచినట్లనిపించు కొమరు మిగుల!
భావము.
గురువు గారికి సత్కారం జరిగే సమయంలో శిష్యుడు కనబడితే, ఆ ఆనందము
తన కుమారుడు కనబడిన దానికన్నా అధికము ఇదే సత్యము.
శ్లో. గృహస్థస్తు యదా పశ్యేత్ వళీపలితమాత్మనః
అపత్యస్యైవ చా உ పత్యం తదారణ్యం సమాశ్రయేత్.
క. మనుజుఁడు వార్ధక్యంబును
గని, మనుమలఁ గని, వనములఁ గడపెడు పగిదిన్
తనయింటను గడుపగవలె
తన తగులములను విడుచుచు, ధర్మంబిదియే.
భావము. గృహస్థు ఎపుడు తన శరీరముపై ముడతలను, తల నెరసిపోవుటను గమనిస్తాడో, తన సంతానానికి పుట్టిన సంతానాన్ని చూస్తాడో అపుడే వనవాసాన్ని ఆశ్రయించాలి. (వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలి)
శ్లో. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి స్సత్యవాదిభిః|
అలుబ్దై ర్దానశీలైశ్చ సప్తభిర్దార్యతే మహీ ||
తే.గీ. మహిని గోవులు విప్రులు, మహిత వేద
ములును, పతివ్రతల్, సత్యవా క్పూర్ణు లసమ
లుబ్ధ దూరులు దానశీలురును కలిగి
యుండుటను నిల్చె గగనాననొప్పిదముగ.
భావము. గోవులు, విప్రులు, వేదాలు, పతివ్రతలు, సత్యవచనులు, లుబ్ధులు కానివారు, దానశీలురు ఈ ఏడుగురి వల్లనే భూమి నిలిచి యున్నది.
శ్లో. గో భూ తిల హిరణ్యాజ్య వాసౌ ధాన్య గుడానిచ
రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః.
ఆ.వె. గోవు, భూమి, తిలలు,కుందన మాజ్యము,
వలువ, ధాన్య, గుడ, లవణ, రజతము
లిలనివి దశ దానములనుచు ద్విజులకు
దానమిచ్చుచుంద్రు ధర్మపరులు.
భావము. దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి,వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు.అనునవి దశ దానములు. ఇవి యోగ్యులగు బ్రాహ్మణులకు దానమిచ్చుట సత్ఫలదాయకము.
శ్లో. గ్రహణం ధారణం చైవ
- స్మరణం ప్రతిపాదనమ్ |
ఊహాపోహాఽర్ధవిజ్ఞానం - తత్త్వజ్ఞానం
చ ధీగుణాః || (కామన్దక నీతిసారం)
తే.గీ. గ్రహణ ధారణ స్మరణముల్ కలిగియుండి,
దాని ప్రతిపాదనమ్ము, తత్ తత్వగరిమ
నెఱిగి, చెప్పు టూహించుటలింత కాక,
సంశయనివృత్తి కలిగి ప్రశంసలందు.
భావం. వినాలనే కోరిక కలగడం, వినిన విషయాన్ని గ్రహించటం, గ్రహించినదానిని మనస్సున నిలుపుకొనడం, నిలుపుకొనినదాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, చెప్పడం, ఊహించడం, సంశయనివృత్తి చేసుకోవడం, అర్థమును చక్కగా గ్రహించడం, తత్త్వజ్ఞానాన్నితెలుసుకొనడం అను ఈ ఎనిమిది బుద్ధిమంతులకు గల గుణాలు.
శ్లో. ఘటం భిన్ద్యాత్ పటం ఛిన్ద్యాత్ - కుర్యాద్వా గార్ధభస్వనమ్
యేన కేనాప్యుపాయేన - ప్రసిద్ధో మనుజో భవేత్.
తే.గీ. ఘటము బ్రద్దలుకొట్టియో పటము చింపొ,
గాడిదనుపోలి యరచియో ఘనత కొఱకు,
నేదియో యొకటొనరించి మేదినిపయి
పేరు పొందగ యత్నించు, దారిలేక.
భావము.
తననందరూ గుర్తించాలనే కండూతితో అందరి ముందూ హడావడి ప్రదర్శిస్తూ
కుండను నేలకేసి కొట్టియో, లేదా అక్కడ ఉన్న పటములను చింపివేసియో,
లేదా గాడిదలా గాండ్రీంచో తన ఉనికిని ప్రకటించుకొంటాడు
ఇంకే మంచిదారిలోనూ పేరు తెచ్చుకోవడం చేతకాని అల్పుడు.
శ్లో. ఘృత కుంభ సమా నారీ - తప్తాగార సమః పుమాన్
తస్మాత్ ఘృతంచ వహ్నించ - నైకత్ర స్థాపయేద్బుధః
ఆ.వె. పురుషు డగ్ని,
" ఘృతము పూబోడి." కావున
ప్రక్క నున్న కరుగు, ప్రబలు నగ్ని.
వరుస చూడ వద్దు. దరిని యుంచగ వద్దు
అన్న చెల్లెల వరు సైన గాని.
భావము. స్త్రీ నేయి వంటిది. పురుషుడు అగ్ని వంటి వాడు. అగ్ని సమీపమున ఉన్న నేయి కరుగుట, ఆనేయి తగల గానే అగ్ని ప్రబలుట మనకు తెలియనిది కాదు. అదే విధముగా స్త్రీ పురుషులకు ఏకాంతము సంభవించిననూ, పరస్పర స్పర్శ సంభవించిననూ, ప్రకృతి ధర్మాన్ని అధిగమించే సంస్కారము ఎంతున్నా అలాంటి అవకాశం కుదిరినప్పుడు ఊహించని విపరీత పరిణామం సంభవించదని చెప్పగలమా? అందుకే పెద్దలెందుకు చెప్పారో అని గ్రహించి బుధులు తప్పక పాటించాలి.
శ్లో. చందనం శీతలం లోకే - చందనాదపి చంద్రమాః |
చంద్రచందనయోర్మధ్యే - శీతలా సాధు సంగతిః ॥
తే.గీ. చందనము లోకులకుఁ జూడ చలువకలిమి,
చంద్రుఁడంతకు మించిన చలువరేడు,
చంద్రచందనములకన్ను చలువ కనగ
సజ్జనులమైత్రి ధరణిపై సజ్జనులకు.
భావము. చందనము శీతలమైనది. చందనము కన్న చంద్రుడు శీతలమైనవాడు. చంద్ర, చందనముల కంటే సజ్జనసహవాసము మిక్కిలి చల్లదనము నిచ్చును.
శ్లో. చత్వారో విత్త దాయాదాః - ధర్మ, భూపాగ్ని తస్కరాః I
జ్యేష్ట భ్రాత్రవమానేన - త్రయః కుప్యంతి సోదరాః II
తే.గీ. ఆర్జిత ధనమునకుఁ దమ్ము లరయ నల్గు
రిలను, ధర్మ భూపాగ్నులు నహరహంబు
చూచు దొంగలు, ధర్మమున్ చుల్కనఁగొను
వానిపై కోపమున గొంద్రు వాని ధనము.
భావము. మనము సంపాదించుకొన్న ధనానికి నలుగురు దాయాదులు. వారు ధర్మము, ప్రభువు, అగ్ని, దొంగ. వారు దాయాదులైనప్పటికీ పెద్దన్నపై గౌరము అపారముగా కలవారు. కావుననే మనము మన సంపాదనను ధర్మము కొరకై వెచ్చించినచో మిగిలినవారు మన సమీపమునకు రారు. మనము మొదటివానికి అన్యాయము చేసినచో అనగా ధర్మము చేయకుండా కూడబెట్టుకొంటూ కూర్చున్నచో
మిగిలిన ముగ్గురికీ కోపం వచ్చి మనపై దండెత్తి ధనం మొత్తం హరిస్తారు. అనగా మనం ధర్మ చేయుట విషయంలో నిర్లక్యముగా ఉండరాదు. సంపాదించినది ధర్మము చేయుచుండ వలెను.
శ్లో. చన్దనం శీతలం లోకే, - చందనాదపి చంద్రమా|
చంద్రచన్దనయోర్మధ్యే - శీతలా సాధుసంగతః||
తే.గీ. చందనము లోకులకునిచ్చు చల్లఁదనము,
శశియునట్టులే మనకిచ్చు చల్లఁదనము,
సాధుసాంగత్యమిచ్చెడి చల్లఁదనము
చంద్ర చందనముల కన్న చాల హెచ్చు.
భావము. లోకములో మంచిగంధము చల్లఁదనాన్ని కల్గఁజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగ జేస్తాడు. చందనము చంద్రుడు రెంటికి కంటే సజ్జనుల సాంగత్యం మరి ఎక్కువ చల్లదనాన్ని కలుగ జేస్తుంది.అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని, ప్రశాంతతని చేకూరుస్తుంది.
శ్లో. చితా, చింతా ద్వయోర్మధ్యే - చింతా నామ గరీయసీ.
చితా దహతి నిర్జీవం -చింతా ప్రాణ యుతం వపుః !
క. చితికిని చింతకు నడుమన
చితి కన్నను చింత గొప్ప. జీవము పోవన్
చితి కాల్చును భౌతికమును,
బ్రతికుండగ కాల్చు చింత. పరికించుడయా !
భావము. భూమిపై చితి కన్నా చింత గొప్పది. చితి జీవము పోయిన పిదప మాత్రమే మన శరీరమును దహించును. చింత ఆవిధముగా కాక అది బ్రతికుండగనే మానవుని దహించివేయును.
శ్లో. చేతో భృఙ్గ! భ్రమసి వృథా భవ మరు భూమౌ విరసాయాం,
పిబ పిబ గీతా మకరందం యదుపతి ముఖ కమల భవాడ్యమ్.
శా. శ్రీమన్మంగళ భారతావనిజవే, చేతో లసత్ భృంగమా!
భూమిన్ స్వార్థముతోడ వెల్గుటె ఘనంబో? నీరసంబైన యీ
ధామంబన్ మరుభూమిపై తిరిగెదే? ధర్మాది సంసిద్ధితో
క్షేమంబున్ గన, కృష్ణబోధిత లసద్గీతా సుధన్ గ్రోలుమా.
భావము. మనస్సు అనెడి ఓ తుమ్మెదా!రసహీనమగు యీ సంసారమను
మరుభూమిపై యేల సంచరించుచుంటివి? శ్రీకృష్ణ పరమారత్మునియొక్క
ముఖ పరద్మమునుండి వెలువడిన గీతా మకరందమును పానము
చేయుము.
శ్లో. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే
ఫలాన్యాపి పరార్థాయ వృక్షా: సత్పురుషా: ఇవ .
క. పరులకు నీడగ నిల్చుచు,
తరువులు తామెండలోన తపియించునటుల్
నిరుపమ సేవను పరులకు
కరుణాత్ములు చేసి తాము గాంతురు వెతలన్.
తే.గీ. ఎండలోవృక్షమెండుచు నితరులకది
నీడనిచ్చును. ఫలములు నేల వ్రాల్చు.
మంచివారిని పోలుచు మహిని వెలసి
తీయనైనట్టి పండ్లను తినగ నొసగు.
భావము. వృక్షాలు తమ నీడను అన్యులకు ఇస్తూ , తాము స్వయంగా ఎండలో నిలబడుతున్నాయి. సత్పురుషుల వలె తమ ఫలములను కూడా పరులకే ఇస్తున్నాయి.
శ్లో. జకారో జన్మ విచ్ఛేదః - పకారో పాప నాశన:.
జన్మ చ్ఛేద కరో యస్మాత్పమిత్యభిదీయతే.
గీ. జన్మ రాహిత్యమగునుజ, సకల మైన
పాప సంహారమగునుప, పట్టు పట్టి
జపము భక్తిగ చేసిన జన్మ లేమి
మనకు ప్రాప్తించు. చేయుడు మనుజులార!
తే.గీ.
కలుగనీయదు జన్మ జకార మరయ.
కలుగు పాపము బాపు పకార మదియు.
జన్మ పాప వినాశిని జపము కాన
జపము చేయంగ తగునయ్య సద్విధేయ.
భావము. జ అనగా జన్మ రాహిత్యము. ప అనగా పాప నాశనము. జపముము అనగా పాపము నశింపఁ జేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది.
శ్లో. జన్మతో జాయతే బుద్ధి: - యావజ్జీవం స్థిరా భవేత్
గురుబోధసహస్రైశ్చ - న కించిత్ పరివర్తతే !
తే.గీ. పుట్టినప్పుడె వచ్చెడి బుద్ధి మనకు
జీవితాంతము విడబోదు, జీవితేశ!
గురులెందరు నేర్పినన్ నిరుపమముగ
మార్పు రాబోదు బుద్ధిలో, మాయ యిదియె.
భావము. మనిషి పుట్టుకతోనే స్వభావం పుడుతుంది.అది జీవితాంతము స్థిరంగా ఉంటుంది.వేలమంది గురువులు బోధలు చేసినా కుక్క తోక
వంకర వలె అది మారనే మారదు.
శ్లో. జన్మ ప్రభృతి యత్కించిత్! - చేతసా ధర్మ మాచరేత్!
సర్వంతు నిష్ఫలం యాతి! - ఏకహస్తాభివాదనాత్!! (విష్ణు పురాణం)
తే.గీ. ఏకహస్తాభివాద మూహించనంత
దుష్ఫలంబిడు గమనింప దురితమద్ది,
పూర్వపుణ్యమంతయుకూడ పోవు నిజము.
హస్తములుమోడ్చి పెద్దలకంజలించు.
భావము. పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము
ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము
చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదనమందు
అవినయమే భాసిస్తుంటుంది.దానివల్ల సర్వధర్మములు నిష్ఫలమైపోతాయి.
శ్లో. జనితా చోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్ఛతి
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః.
తే.గీ. కన్నతండ్ర్యుపనేతయు, జ్ఞాన విద్య
కరపునాతడు నన్నంబు కడుపునిండ
బెట్టునాతఁడు,భయము పోగొట్టునతడు
తండ్రులౌదురీయేవురు తలచి చూడ.
భావము. కన్నవాడు , ఉపనయనం చేసినవాడు , విద్య నేర్పినవాడు ,అన్నం పెట్టినవాడు , భయం పోగొట్టినవాడు ఐదుగురూతండ్రులే.
శ్లో. జపహోమార్చనం కుర్యా - త్సు ధౌతచరణః శుచిః|
పాదశౌచవిహీనం హి - ప్రవివేశ నలం కలిః ||
తే.గీ. జపము హోమార్చనల్ చేయు సమయమునకు
ముందు కాళ్ళు కడుగుకొని పొలయుటొప్పు,
పాదశౌచవిహీనుని వదలఁబోక
కలి ప్రవేశించి కష్టముల్ కలుఁగఁ జేయు.
భావము. జపాలు, హోమాలు, అర్చనలు, పూజాది క్రతువులు ఆచరించే ముందు శుభ్రముగా కాళ్ళు కడుక్కుని ప్రారంభించాలి. ఎవరైతే పాదాలు కడగకుండా దైవ కార్యాలు చేసినా, మల మూత్ర విసర్జన తరువాత, భోజనం తరువాత, బయట నుండి వచ్చిన తరువాత కాళ్ళు కడగరో ఆ కడగని పాదాల ద్వారా కలి పురుషుడు ఇంట్లోకి ప్రవేశించి దరిద్రాలను, రోగాలను, కలహాలను ప్రసాదిస్తాడు.
శ్లో. జయతు జయతు దేవో దేవకీనందనోஉయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:!
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్ద:!!
తే.గీ. దేవకీ నందనా! కృష్ణ దేవ! జయము.
వృష్ణి వంశ ప్రదీప! శ్రీ కృష్ణ జయము.
కోమలాంగాశిత బాల గోప జయము.
పృథ్వి దుర్భార దూర శ్రీ కృష్ణ జయము.
భావము. దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగు గాక! మేఘశ్యామలుడు, కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!
శ్లో. జరాం మృత్యుం భయం వ్యాధిం యో జానాతి స పండిత:
స్వస్థ స్తిష్ఠే న్నిషేదే ద్వా స్వపేద్వా కేనచి ద్ధసేత్.
క. జర, మృత్యు, భయ, వ్యాధుల
నరయు నతడె పండితుండు. అతడు సుఖించున్.
స్థిర చిత్తముతో నుండును.
పరిహాసము సుఖ నిదురల భవ్యత నలరున్.
భావము. అపాయములు, వ్యాధులు, ముసలితనము, చావు, ఇవి ఎవ్వరికిన్నీ తప్పవు. కాని ఇవి తప్పవని ఎవ్వరును గుర్తించినట్లు ప్రవర్తించరు. వీటి అవశ్యంభావిత్వమును గుర్తించి ప్రవర్తించేవాడు పండితుడు. అట్టివానికి మనస్సు ఎప్పుడూ స్వస్థముగానే ఉంటుంది. అతడు సుఖంగా కూర్చుంటాడు. నిద్రిస్తాడు. పరిహాసంగా మాటలడుతాడు.
శ్లో. జరా రూపం హరతి ధైర్య మాశా, - మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా.
కామో హ్రియం వృత్త మనార్యసేవా, - క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః.
తే.గీ. ముసలితనమున రూపము పోవు. నాశ
వలన ధైర్యమణఁగు. మృతివలననుసురు
పోవు. ధర్మముననసూయపోవు. పోవు
లజ్జ కామమునను. దుష్టువలన మనకు,
తే.గీ. వృద్ధతను రూపు చెడిపోవు పెరుగు దైర్య
మాశను హరించు, మృత్యువు ప్రాణముఁ గొను,
నరయ ధర్మమసూయనుహరణ సేయు
కామమునసుగ్గు, కోపాన కనగ శ్రియము,
దురభ్మానాన సర్వమున్ దూరమగును.
తే.గీ. ముదిమి రూపమున్, ధైర్యమున్ పోని యాశ,
ప్రాణమున్ మృత్యు వసూయ వర్తనమును
కల్గు కామము సిగ్గును, ఖలుల సేవ
శీలము, శ్రియమున్ గోపము,కొల్లగొట్టు,
గర్వమది సర్వమున్ బాపు కనరదేల?
భావం. ముసలితనము రూపాన్నీ , ఆశ ధైర్యమును , మృత్యువు ప్రాణాలను , అసూయ ధర్మప్రవృత్తినీ , కామము లజ్జను , దుష్టసేవ సత్ప్రవర్తనను , కోపము ఐశ్వర్యమును , గర్వము సర్వమును హరించివేస్తాయి .మొదటిదాన్నీ మూడోదాన్నీ ఎలానూ తప్పించుకోలేం. కనుక మిగిలినవాటినైనా వదిలించుకొనే ప్రయత్నం చేద్దాం.
శ్లో. జలం విష్ణుః స్థలం విష్ణుః. విష్ణురాకాశముచ్యతే.
ఇదం సర్వ జగం విష్ణుః సర్వం విష్ణుమయం జగత్.
తే.గీ. విష్ణుదేవుండె జలమగు, విష్ణువేను
స్థలము, విష్ణువాకాశంబు, సర్వమెన్న
విష్ణువే మది కనినచో, విశ్వమతఁడె,
సర్వమున్ విష్ణు మయమెన్న, సత్యమిదియె.
భావము. నీరు విష్ణువే. నేల కూడా విష్ణువే. నీలముగా కనిపించే ఆకాశమంతా విష్ణువే. ఈ సమస్త జగత్తు విష్ణువే. సమస్తమైన జగత్తూ విష్ణుమయమై యున్నది.
శ్లో. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః
స హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ.
క. ఒక్కొక్క నీటి బిందువు
చక్కగ పడినంత కుండ చక్కగ నిండున్.
ఒక్కొక్క విషయమెఱిగిన
నిక్కమువిద్యాధనాళినిండునుమదిలో.
భావము. ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది.అలాగే అన్ని విద్యలు , ధర్మము , ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తేసంపూర్ణమౌతాయి.
శ్లో. జానాతి వివిధాః భాషాః - జానాతి వివిధః కలాః,
ఆత్మానం నైవ జానాతి - యో న జానాతి సంస్కృతమ్.
తే.గీ. వివిధ భాషలు తెలియనౌన్ సవివరముగ,
వివిధ కళలును తెలియనౌన్ విశ్వమునను
సంస్కృతము రానివారికి చక్కనైన
యాత్మసుజ్ఞానమెఱుగంగనవదు, నిజము.
భావము.
వివిధములైన భాషలు తెలియుచున్నవి. వివిధములైన కళలు తెలియుచున్నవి. ఎవరికయితే సంస్కృతము తెలియకున్నదో
వారికి ఆత్మజ్ఞానము కూడా తెలియదు.
శ్లో. జానాతే యన్న చంద్రాఽర్కౌ జానతేయన్న యోగిన:
జానీతే యన్న భర్గో-పి తజ్జానాతి కవిస్స్వయఽ.
తే.గీ. ఎన్నుచును సూర్యచంద్రులు న్నెఱుఁగనదియు,
నెన్నికను యోగివర్యులు న్నెఱుఁగనదియు
నీశుఁడైనను జగతిలో నెఱుఁగనదియు
నెఱుఁగుకవి తాను స్వయముగా నెఱుకఁ గలిగి.
భావము. ఏదైతే సూర్యచంద్రులునూ ఎఱుఁగ లేరో, ఏదైతే యోగీశ్వరులు కూడా ఎఱుఁగ లేరో, ఏదైతే పరమేశ్వరుఁడునూ ఎఱుఁగలేడో, అది కవి స్వయముగా
తానెఱుఁగును.
శ్లో. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ ,జిహ్వాగ్రే మిత్ర బాంధవాః
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః ,జిహ్వాగ్రే మరణం ధృవమ్.
తే.గీ. మంచి మాటను లక్ష్మి సంప్రాప్తమగును.
మంచి మాటాడ బంధువుల్ మనను విడరు.
మాట బాగోనిచో కల్గు బంధనంబు.
మాట బాగోనిచో మృతియు మనకు కలుగు.
క. నాలుక మూలము లక్ష్మికి.
నాలుక సద్బంధు మిత్ర నవనాదులకున్
మూలము. బంధన ప్రాప్తికి
నాలుక మూలము. మరణము నాలుక తెచ్చున్.
కం. జిహ్వాగ్రము నుండును సిరి.
జిహ్వాగ్రము నుండు మిత్ర బృందము, బంధుల్.
జిహ్వాగ్రము బంధన మిడు.
జిహ్వాగ్రము మరణ కారి. జీవిత మందున్.
భావము. నాలుక చివరనే సంపదలు, మిత్రులు, బంధువులు, బంధనం ,చివరకు మరణం కూడా ఉంటాయి. (అందువల్ల నాలుకనుఅదుపులో ఉంచుకొని మాట్లాడాలి.)
శ్లో. జిహ్వే! ప్రమాణం జానీహి - భోజనే భాషణేఽపి చ
అతిభుక్తి రతీవోక్తిః - సద్యః ప్రాణాపకారిణీ.
తే. పరిమితినిగను నాలుకా! భక్షణమున,
మాటలాడువిషయమున, మరచిపోకు,
మతిగ భుజియింప నారోగ్యమంరించు,
నతిగవాగున ప్రాణాలె యావిరగును.
భావము. ఓ నాలుకా! భోజనం విషయంలోనూ మాట్లాడే విషయంలోనూ పరిమితిని తెలుసుకో. అతిగా తినడం, అతిగా మాటలాడడం ప్రాణాలను తీస్తాయి.
శ్లో. జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్జితం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః.
తే.గీ. భువినధర్ముఁడు నడయాడు, శవము తలప.
ధర్మ సద్వర్తి మృతుఁడయ్యు తలప జీవి.
ధర్మ మార్గంబు వీడని ధన్య జీవి
మృతియె లేనట్టి దైవమై క్షితిని నిలుచు.
తే.గీ. ధర్మ హీనుడు బ్రతికియు ధరణి మృతుఁడు.
ధర్మ బద్ధుఁడు మృతుఁడయ్య ధరణి జీవి.
ధర్మమును వీడ బోక యీ ధరణి పైన
కీర్తి ప్రదముగ బ్రతుకుడు స్ఫూర్తి తోడ.
భావము. ధర్మాన్ని త్యజించిన వ్యక్తి జీవించి ఉన్నా మృతునిగా పరిగణింప బడుతాడు. ధర్మాన్ని పాటించిన వాడు మృతుడైనా చిరంజీవి అనటంలో సందేహంలేదు.
శ్లో. జ్ఞాతిభి ర్వంచతేనైవ, చోరేణాపి న నీయతే|
దానేన న క్షయం యాతి, విద్యారత్నం మహాధనం|| (చాణక్యనీతి)
తే.గీ. జ్ఞాతులెవ్వరుఁ గొనలేని, కలుష మతులఁ
జోరులెవ్వరు గొనలేని, సుజన తతికి
దానమెంతగ చేసినన్ దరుగఁబోని,
విద్య మహనీయ రత్నమౌన్, విబుధులకును.
తే.గీ. జ్ఞాతి వంచనకెరగాని జాతిరత్న
మందనట్టిది చోరుల, కనవరతము
దానమును చేయుచున్నను
దరుగనట్టి
జాతి రత్నంబువిద్య విఖ్యాత
ధనము.
భావము: జ్ఞానముపెన్నిధి వంటిది. అది జ్ఞాతులువంచించి తీసుకోడానికి వీలులేనిది; దొంగలు అపహరించ లేనిది; దానము చేసినా తరగలేనిది పైగా వృద్ధినొందునది; ఇదిఒక అనర్ఘరత్నము.
శ్లో. జ్ఞాతిభిః వంచ్యతేనైవ - చోరేణాపి ననీయతే.
దానేన న క్షయం యాతి - విద్యా రత్నం మహా ధనమ్.
క. జ్ఞాతులు పంచుకు పోనిది.
ఏతరి దొంగిలగరాని దెంతగనైనన్
ప్రీతిని దానము చేసిన
ఖాతిగ పెరిగెడిది విద్య. ఘన రత్నమిలన్.
భావము. జ్ఞానము పెన్నిధి వంటిది. అది జ్ఞాతులు వంచించి తీసుకొనుటకు వీలు పడనిది. దొంగ లపహరింప జాలనిది. దానము చేసిననూ తరుగనిది. .అది ఒక అనర్ఘ రత్నము.
శ్లో. జ్ఞానం ప్రధానం న తు కర్మ హీనం
- కర్మ ప్రధానం న తు బుద్ధి హీనమ్ l
తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధిః
- న హ్యేక పక్షో విహగః ప్రయాతి ll
తే.గీ. జ్ఞానము గనప్రధానంబు, కర్మలేని
జ్ఞానసంపద వ్యర్థము, జ్ఞానహీన
కర్మ వ్యర్థము, రెండును కావలెనయ!
ఒక్క రెక్కతో పక్షి తానెక్కడెగురు?
భావము. జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం నిరుపయోగము. కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే. జ్ఞాన, కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు. ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!
శ్లో. తత్క్లిష్టం యద్విద్వాన్ - విద్యాపాఙ్గతోऽపి యత్నేన
విజ్ఞాతారం అవిన్దన్ - భవతి సమః ప్రాకృతజనేన.
తే.గీ. ప్రజల గుర్తింపు లేనట్టి పండితులిల
బ్రతుకవలయును సామాన్య ప్రజల వోలె.
కుందనపుపళ్ళెమునకైన గోడ చేర్పు
తప్పదిలలోన యను సూక్తి తలప నిజము.
భావము. ఎంతో శ్రమపడి సకల విద్యలలోను పండితుఁడైన విద్వాంసుఁడైనా సరే తనను గుర్తించేవారు లేక అందరిలోను సామాన్యులతో బాటుగానే సామాన్యజీవనం గడుపుతూ ఉండవలసినదే. బంగారు పళ్ళేమునకైనా గోడ చేర్పు కావాలంటారు.అదే ఇది.
శ్లో. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమాన్! యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ.(సుం.కాండ 39వ సర్గ)
క. ఈ పని నీకే సాధ్యము.
ఏ పనిచే నాదు దుఃఖ మిల క్షయమగునో
ఆపని చేయుము హనుమా!
ప్రాపగు శ్రీరామచంద్ర భక్తుఁడవు కదా!
భావము. ఓ హరిసత్తమా! ఈ కార్యమును నిర్వహించుటలో నీవే సమర్దుడవు. వానర శ్రేష్ఠుడగు ఓ హనుమంతుడా! ఏమి చేసిన ఈ దుఃఖము పోవునో నీవు అట్లే అలోచించి చేయవలెను. అని సీతాదేవి హనుమంతునితో చెప్పిన మాటలు.
శ్లో. తస్కరేభ్యో నియుక్తేభ్యః శత్రుభ్యో నృపవల్లభాత్
నృపతిర్నిజ లోభాచ్చ ప్రజా రక్షేత్ పితేవ హి.
తే.గీ. తస్కరుల నుండి, ఉద్యోగి దళమునుండి,
శత్రువులనుండి, తన ప్రియ సఖుల నుండి,
స్వీయ లోభము నుండియు ప్రియము తోడ
జనుల రక్షింప వలె రాజు జనకుని వలె.
భావము. రాజు – దొంగల నుండి, తాను నియమించిన ఉద్యోగుల నుండి, శత్రువుల నుండి, తనకు ఇష్టమైన వారి నుండి, స్వీయ లోభము నుండి ప్రజలను కన్నతండ్రి వలె కాపాడాలి.
శ్లో. తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే|
క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చాలితః|| (భాగవతం)
తే.గీ. ఎంత వరకు పుణ్యంబుండు నంత వరకె
స్వర్గసుఖములు జీవాళి చక్కగఁ గను,
క్షీణపుణ్యులు భువిపైకి చేరుచుందు
రందుకే ముక్తి మార్గంబు నందవలయు.
భావము. స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు..
శ్లో. తావన్మౌనేన నీయన్తే కోకిలశ్చైవ వాసరాః|
యావత్సర్వం జనానన్దదాయినీ వాఙ్న ప్రవర్తతే ||
తే.గీ. కూతవచ్చునందాక తా కోయిలమ్మ
మౌనముననుండి పిదపతా గానఫణితి
ప్రకటనముచేయు నట్టులే ప్రతిభు లవని
సమయమును చూచి పలుకుట జాణతనము.
భావము. తనకు కూత వచ్చే వరుకు కోయిల మౌనంగా ఉండి రోజులు గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షిస్తుంది. అదే విధంగా సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి. సమయం సందర్భం రానంతవరుకు మౌనం వహించడమే ఉత్తమం.
శ్లో. తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:
న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.
ఆ.వె. మంచివారలైన; వంచితు లైనను
కోపగింప పరులు తాపమొందు.
అగ్ని తుమ్మచెట్టు; నటులె గంధపు చెట్టు
నంటుకొన్నఁ గాల్చు నవనిపై.
భావము. కోపం మంచి వారికి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులను బాధించును. గంధపు చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒకే విధముగా దహించి వే్యును కదా? కోపం అగ్ని వంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతముగా ఉండవలెనని సూచిస్తూ అన్ని కార్యక్రమముల లోనూ శాంతి మంత్రమును పఠించుచుందురు.
శ్లో. తృణం బ్రహ్మవిదః స్వర్గః, - తృణం శూరస్య జీవితమ్ |
జితాsక్షస్య తృణం నారీ, - నిఃస్పృహస్య తృణం జగత్ ||
తే.గీ. దొడ్డ బ్రహ్మజ్ఞునకు దివి గడ్డిపరక,
చూడ ప్రాణంబు తృణమేను శూరునకును,
స్త్రీలు తృణమెన్న వరజితేంద్రియులకిలను,
తృణము విగతస్పృహులకెన్న సృష్టి, నృహరి!
భావము. బ్రహ్మజ్ఞానికి స్వర్గం గడ్డిపరక. శూరునికి ప్రాణాలు తృణం. ఇంద్రియాలు జయించిన వానికి స్త్రీ తృణం. ఆశ లేనివానికి జగత్తు తృణం.
శ్లో. తృణతులితాఖిల జగతాం - కరకలిత త్రయీరహస్యానాం |
శ్లాఘావరవధూటీ - ఘటదాసత్వం సుదుర్నిరసం || (సదాశివ బ్రహ్మేంద్రులు)
తే.గీ. లోకమును గడ్డిపోఁచగా లోననెంచు,
వేదవిదులైనవారికిన్ మోదముండు
కీర్తికాంతపై, నుతులపై, కేవలమిది
దైవమును శరణము వేడఁ దలగిపోవు.
భావము. లోకాన్నే తృణంగా పరిగణించే సన్న్యాసులకూ, వేదవేదాంతముల రహస్యములను ఎఱిగినవారికి కూడా కీర్తి మత్తు ప్రశంసలపై అభిలాష సులభంగా తొలగి పోజాలదు. ఇది భగవంతుని మాయయొక్క విశిష్టమైన ప్రభావము. మాయ 'నేను, నాది' అనే అహంకార మమకారములతో ఎంతటివారినీ మరులుగొల్పుతుంది. దీనికి భగవంతుని ఆశ్రయమును అవలంబించుటయే పరిహారము.
శ్లో. తృణాం ఖాదతి కేదారే, జలం పిబతి పల్వలే
దుగ్ధం యచ్ఛతి లోకేభ్యో ధేనుర్నో జననీ ప్రియా.
కం. పొలమున తృణమునె మేయుచు
జలములు పల్వలములందు చక్కఁగఁ గొనుచీ
యిలప్రజలకు పాలనొసగు
సులలిత గోదేవి మనకు చూడఁగ తల్లే.
క. పొలమున మేతను మేయుచు
చలములజలములను త్రావి, చక్కగ క్షీరం
బిలజనులకిచ్చు ధేనువు
తలచగమన తల్లి నిజము దయఁ గాచుడయా!
భావము. పొలాలలో గడ్డి తింటూ , గుంటలలో నీళ్ళు త్రాగుతూ, లోకులకు పాలనిచ్చే ఆవు - కన్న తల్లి వంటిదే కదా!
శ్లో. తృణాదపి లఘుస్తూల | స్తూలాదపి చ యాచక
వాయునా కిం ననీతో సౌ | మామ యం యాచేదతి.
తే.గీ. తృణము కన్నను దూదియే తేలిక కద.
యాచకుడు దూది కన్నను నరయ లఘువె.
ఎగురఁ గొట్టెడి వాయువే యెదురు పడడు
యాచనము చేయు తననని యాచకునకు.
భావము.
గడ్డి పోచ కన్నాదూది తేలిక. దానికంటే తేలిక యాచకుడు. గడ్డిపరకను దూదిని ఎగురుకొట్టు వాయువు యాచకుని జోలికి రాడు కారణము తననెక్కడ యాచించుతాడోనన్న భయముచేతనే సుమా. . యాచకుని పరిస్థితి అంత నీచం. అందువల్ల ఏ విధంగా నయినా కష్టపడి సంపాదించుకోవాలి గాని యాచనా వృత్తికి ఒడబడ కూడదు.
శ్లో. “ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే || ”
భగవద్గీత 9-21
తే.గీ. స్వర్గ భోగులు తమపుణ్య చయము తరుగ
మనుజ లోకంబునే చేరు మరల, పార్థ!
కర్మబద్ధులకీగతి కలుగుచుండు
నన్నె నమ్మిన ముక్తి సంపన్నులయెడు.
భావము.
“ చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు ; మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడపోకడలను పొందుతున్నారు.”
శ్లో. తైలాద్రక్షేత్ జలాద్రక్షేత్ - రక్షేత్ శిధిలబంధనాత్ |
మూర్ఖహస్తే న దాతవ్యం - ఏవం వదతి పుస్తకమ్ ||
తే.గీ. తైలముల నుండి రక్షించు ధర్మ విదుఁడ!
జలము సోకక రక్షించు సరస మతిరొ!
శిథిలమవనీక రక్షించు చిత్స్వరూప
మూర్ఖులకునీయకుండు నన్ పూజనీయ.
అనుచు ప్రార్హించె పుస్తకమనుపమ నిను.
భావము. "నూనె నుండి, నీటి నుండి మరియు కుట్టునుండి విడిపోని విధంగా రక్షించవలెనని,ఆ విధంగా రక్షించలేని తనని మూర్ఖుడికి దానం ఇవ్వవద్దని పుస్తకం ప్రార్థించుచున్నది".
శ్లో. త్యజ దుర్జన సంసర్గం,భజ సాధు సమాగమం
కురు పుణ్యమహోరాత్రం, స్మరనిత్యమనిత్యతామ్.
క. వీడుము దుష్టుల సంగతి.
వేడుము సజ్జనుల తోడు.వివిధ సుకర్మల్
వీడక చేయుము సతతము.
నీడగ మృతి కలదటంచు నిరతము కనుమా!
భావము.
చెడ్డవారితో సాంగత్యం వదలాలి.సజ్జనులతో స్నేహాన్ని కాంక్షించాలి. రాత్రింబవళ్ళు పుణ్యకార్యాలు చేయాలి. అనునిత్యమూ అనిత్యతను గుర్తు చేసుకోవాలి.
శ్లో. త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః కిమన్యైర్గుణరాశిభిః
త్యాగాజ్జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాః
తే.గీ. త్యాగమొక్కటేశ్లాఘింప తగిన గుణము.
గుణములితరము లెన్నున్నగొప్ప కాదు.
శిలలు, వృక్షముల్, పశువులు చెలగు గాదె
త్యాగగుణమున. కాంచుడీ తత్వమరసి.
భావము. త్యాగగుణం ఒక్కటే మెచ్చదగినది. మిగిలిన గుణసమూహం ఎంతఉంటే ఏమి?ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు ఈ త్యాగం వల్లనే పూజింపబడుతున్నాయి.
శ్లో. త్రయః కాలకృతాః పాశాః - శక్యన్తే
న నివర్తితమ్।
వివాహో జన్మ మరణం - యథా యత్ర
చ యేన చ॥
తే.గీ. పుట్టుకయు పెండ్లి మృత్యువు పుడమిపైన
బ్రహ్మ లిఖియించినట్టులే పడయవలయు,
మార్చగానేరరెవ్వరున్, మాన్యులార!
ఎక్క డేదియో పొందెద మక్కడేను.
భావము.
వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు. ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవింపఁబడవలెనో
అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే! ఇవి మార్చడానికి అసాధ్యమైనవి.
శ్లో. త్రిభిఃవర్షైః త్రిభిర్మాసైః - త్రిభిఃపక్షైః త్రిభిర్దినైః |
అత్యుత్కటైః పుణ్యపాపైః - ఇహైవ ఫలమశ్నుతే ||
తే.గీ. కలియుగంబున చేసెడి కర్మఫలము
మూడు వత్సరములలోనొ, మూడు నెలల
లోనొ, మూడుపక్షములందొ, గాన ననుభ
వించుదుము దినత్రయమందొ, విశ్వభాస!
భావము. ఈ కలియుగంలో మనం చేసే పాపపుణ్యముల స్వభావాన్ని అనుసరించి వాటి ఫలములను మూడు సంవత్సరాలు, మూడు నెలలు, మూడు పక్షాలు లేదా మూడు దినములలో అనుభవిస్తాము.
శ్లో. త్రివర్గఫలదాః సర్వే - దానయజ్ఞజపాదయః |
ఏకం సంగీతవిజ్ఞానం - చతుర్వర్గఫలప్రదమ్ || (శివసర్వస్వం)
తే.గీ. దాన యజ్ఞ జపాదులు ధరణిపైన
పరగు ధర్మార్థకామసత్ఫలము లొసగు,
పూజ్య సంగీత మొసగును మోక్షఫలము,
భక్తిసంగీత సాధకుల్ ముక్తిగాంత్రు.
భావము.
దానము చేయుట, యజ్ఞయాగాదులను ఆచరించుట, దివ్యమంత్రాల
పునశ్చరణ అనునవి త్రివర్గ ధర్మము అర్థము కామము అను ఫలములను
మాత్రమే ఇచ్చును. సంగీతము యొక్క సమ్యక్‌జ్ఞానమొక్కటే నాలుగవదైన
మోక్షాన్ని ఇవ్వగలదు.
శ్లో. దగ్ధం ఖాండవ మర్జునేనచ వృథా దివ్యౌషధైర్భూషితం!
దగ్ధా వాయు సుతేన హేమ రచితా లంకా పురీ స్వర్గ భూః!
దగ్ధః సర్వ సుఖాస్పదశ్చ మదనో హాహా! వృథా శంభునా!
దారిద్ర్యం ఘన తాప దం భువి నృణాం కేనాపి నో దగ్ధ్యతే!
ఉ. దగ్ధము చేసె ఖాండవము దర్పము జూపుచు నర్జునుండు. తా
దగ్ధము చేసె లంక నల దండన జేయుచు నాంజనేయుడున్.
దగ్ధము చేసె మన్మధుని తా పరమేశుడు. ధాత్రిపై నిటన్
దగ్ధము జేయ నేర్వరుగదా! పురి విప్పెడి యీ దరిద్రమున్.
భావము. దివ్యౌషధ స్థావరమైన ఖాండవ వనమును అర్జునుడు దగ్ధము చేసెను. భూలోక స్వర్గమైన లంకను హనుమంతుడు దగ్ధము చేసెను. సర్వ సుఖాస్పదుడగు మన్మధుని ఆ పరమేశ్వరుడు దగ్ధము చేసెను. లోకములో అత్యంత బాధాకరమగు దరిద్రమును మాత్రము ఎవ్వరునూ దగ్ధము చేయు జాలకుండిరి కదా!
శ్లో. దయయా సర్వభూతేషు , సంతుష్ట్యా యేనకేన వా
సర్వేంద్రియోపశాంత్యా చ , తుష్యత్యాశు జనార్దనః
తే.గీ. సకలజీవులఁ దయఁజూచి సంతసముగ
తా జితేంద్రియుండై యుండి దర్పము విడి
జీవనము సేయు నెవ్వండు వానితోడ
దైవముండును నిరతము.దేవుఁడతఁడు.
భావము. అన్ని జీవులయందు దయ కలిగి ఉండటం, ఉన్న దానితో సంతృప్తి చెందటం, ఇంద్రియ నిగ్రహం అనే సుగుణాలు కలవారికి దైవం వెంటనే ప్రసన్నుడౌతాడు.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
తే.గీ. పేదకొసగెడి దానము ప్రీతి కరము.
శూన్య లింగార్చనంబు సన్మాన్యమతము.
దిక్కు లేని శవదహన మెక్కుడిలను.
అశ్వ మేధసుఫలదములరసి చూడ.
క. బీదలకు దానమొసగుట,
పేద శివార్చన, యనాథ ప్రేతములకు స
మ్మోదముతో సంస్కారము
మేదినినొనరింప నశ్వ మేధ సమంబౌన్.
భావము. బీదవానికి దానం చేయటం, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయడము, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిస్తాయి .
శ్లో. దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణేపివా
యత్ర ద్రవత్యంతరంగం , సస్నేహఇతి కథ్యతే .
క. స్నేహితులను
చూచునపుడు
స్నేహితుల స్పృసించునపుడు,
స్నేహితు పల్కుల్
స్నేహమున విని
పలుకునెడ
స్నేహితుమది యార్ద్రమగును.
స్నేహంబదియే..
భావము. చూచుటయందు, స్పృశించుటయందు, వినుటయందు,భాషణమునందు ఎక్కడ మనస్సు ఆర్ద్రమవుతుందో అది స్నేహమని చెప్పబడుతుంది.
శ్లో. దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం.
క. ఇది యిచ్చుట ధర్మంబని,
మది నుపకృతి చేయనట్టి మహితునికిలలో
ముదమున సమయోచితముగ
వదలక ధర్మంబు చేయ వలయును సుజనుల్.
భావము. "ఇది ఇచ్చుట నా ధర్మము" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయములో, సందర్భముననుసరించి ఇచ్చే దానమే సాత్త్వికమైన దానము.
శ్లో. దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్య
యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥
తే.గీ. దాన, భోగ, వినాశము ధనము గతులు.
విత్త సముపార్జితులు దాని విలువ నెఱిఁగి
దాన భోగాల వెచ్చించి తనియవలయు
కానినాడది నాశమౌన్. కానరేల?
భావము. ధనమునకు దానము, భోగము, నాశనము అను మూడే గతులు, ఒకరికీయక, తాననుభావింపక కూడబెట్టిన ధనమునకు నాశనమే కలుగును.
శ్లో. దానేన తుల్యో నిధిరస్తి నాన్యో
లోభాచ్చ నాన్యోఽస్తి రిపుః పృథివ్యామ్।
విభూషణం శీలసమం నచాన్యత్
సన్తోషతుల్యం ధనమస్తి నాన్యత్॥ (పఞ్చతన్త్రమ్)
తే.గీ. దానమునకు మించెడి నిధి ధరను లేదు,
లేదు లోభమునకు మించు రిపువు కనఁగ,
శీలమును మించు భూష నీ మ్రోల లేదు,
సంతసమును మించు ధనము సఖుఁడ! లేదు.
భావము. ఈ భూమిపై దానముతో సమానమైన ఇతర నిధి లేదు. లోభముతో సమానమయిన శత్రువు లేడు. శీలముతో సమానమైన
ఇతర ఆభరణము లేదు. సంతోషముతో సమానమైన వేరే ధనము లేదు.
శ్లో దానేన భోగీ భవతి, మేధావీ వృద్ధసేవయా
అహింసాయ చ దీర్ఘాయుః ఇతి ప్రాహు ర్మనీషిణః.
తే.గీ. దానమున భోగి యగు వసుంధరను నరుఁడు.
పూజ్యులకు సేవ చేసిన బుద్ధి పెరుగు.
క్షమ, యహింసల దీర్ఘాయు వమరి బ్రతుకు.
దాన సేవ నాஉహింసల తనియుఁడయ్య.
క. దానముచే భోగంబులు,
జ్ఞానము సద్వృద్ధ సేవ సలుపుట వలనన్
ప్రాణుల హింసింపమిచే
మానిత దీర్ఘాయువమరు. మరువకుడయ్యా.
భావము. మానవుడు దానం చేస్తే భోగి అవుతాడు, పెద్దలను సేవించటం వల్ల బుద్ధి కుశలత కలవాడౌతాడు, అహింస వల్ల దీర్ఘాయువౌతాడని విద్వాంసులు చెప్తారు.
శ్లో. దానే తపసి శౌర్యే చ , విజ్ఞానే వినయే నయే
విస్మయో హి న కర్తవ్యో బహురత్నా వసుంధరా.
తే.గీ. దాన, తప, శౌర్య, వినయ, విజ్ఞాన, నీతి,
శోభితులయందు గర్వమ్ము చొచ్చుకొనదు.
మహితులిలనుంద్రు పెక్కురు మహిని. వారి
నరసి నేర్తురు సచ్ఛీల నాదికములు.
భావము. దానము, తపస్సు, పరాక్రమము, విజ్ఞానము,వినయము, నీతి - కలిగి ఉన్నందువల్ల ఏమాత్రమూ గర్వపడకూడదు. ఈ సద్గుణాలున్నవారు ఈ లోకంలో మరెందరో ఉంటారు.
శ్లో. దారిద్ర్య రోగ దుఃఖాని - బంధన వ్యసనానిచ
ఆత్మాపరాధ వృక్షస్య - ఫలాన్యేతాని దేహినాం.
తే.గీ. నరున కాత్మాపరాధమన్ తరువు ఫలము
లరయ దారిద్ర్యములు, దుఃఖ వ్యసన బంధ
నములు, రోగముల్, కావున నరుడెఱంగి
ఆత్మ సాక్షిగా నడచిన హాయి గొలుపు.
భావము. దారిద్ర్యము, దుఃఖము, వ్యసనము, బంధనము, రోగము, ఇవన్నియూ మానవునకు తప్పక అనుభవించ వలసిన ఫలములు. ఈ ఫలములు కాసే వృక్షము మరేదో కాదు. మానవులు చేసుకొనిన అపరాధములే. ఈ అపరాధములే బీజముగా మారి మొలకెత్తి, మహా వృక్షమై ఆ వృక్షమునకు కారణ భూతుడయిన వానికే దాని ఫలములనందించును. ఆ ఫలముల నా నరుడు తప్పక అనుభవించి తీరవలెను. మనమనుభవీంచే వన్నీ అట్టి కర్మ ఫలములే సుమా!
శ్లో. దిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి
సౌందర్య మాహవసి లోచన లోభ నీయం
అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే
యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి.
ఉ. రమ్య రసాల సౌరభము ప్రాకును నల్దిశలున్ మనోజ్ఞమై,
సౌమ్య మనోజ్ఞరూపమున చక్కగ నేత్ర సుపర్వమిద్ధరన్
సామ్యము లేనిదయ్యు వివశంబగు టెంక కఠోర చిత్తయై
రమ్యత క్రోల్పడేను, కనరాని కఠోరత కీడు చేయునే!
భావము. ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగా ఉంది.
శ్లో. దినాంతే చ పిబేత్ దుగ్ధం - నిశాంతే చ పిబేత్ పయ:l
భోజనాంతే పిబేత్ తక్రం - కిం వైద్యస్య ప్రయోజనంll
తే.గీ. రాత్రి శయనవేళను పాలు త్రాగుటొప్పు,
నిద్ర లేచి త్రాగుట యొప్పు నీరు సతము,
భోజనము చేసి మజ్జిగ పొలుపు మీర
త్రాగుటొప్పును, క్షేమంబు తప్పకొదవు.
తే.గీ. పాలు త్రాగి రాత్రులపుడు పడుకొనుటయు,
లేచుచునె నీరు త్రాగుట,క్లేశమనక
భోజనాంతమున్ మజ్జిగ పూటపూట
త్రాగ, వైద్యంబదేలను? భోగశయన!
భావము. రాత్రి పడుకోబోయే ముందు పాలు త్రాగాలి. ఉదయం నిద్ర లేవగానే మంచి నీరు త్రాగాలి. భోజనానంతరం మజ్జిగ త్రాగాలి. ఈ మూడు పనులు నిత్యం చేస్తూ ఉంటే వైద్యునితో పనిలేక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.
300. శ్లో. దీపం జ్యోతిః పర బ్రహ్మా - దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం - సంధ్యా దీపం నమోస్తుతే.
క.
దీపము జ్యోతి సురూపము.
దీపము తిమిరమును బాపు. తేజము నొసగున్.
రూపము చూపెడి సంధ్యా
దీపమునకు నంజలింతు. తృప్తిగ నెలమిన్.
భావము. దీపము ప్రజ్వలనమే స్వరూపముగా కలది. అదియే పర బ్రహ్మము. అన్నిటి మీదను సమానముగా తేజస్సును బరపును. అట్టి దీపము వలననే సర్వ కార్యములూ సుగమములగుచున్నవి. అట్టి సంధ్యా దీపమా! నీకివే నా వందనములు.
301. శ్లో. దీపనం వృష్య మాయుష్యం - స్నానమోజోబలప్రదః.
కండూ మలశ్రమ స్వేద - తంద్రాయృడ్దాహపాపనుత్.
తే.గీ. స్నానమునుఁ జేయ జఠరాగ్నిచక్కఁ బెరుగు,
ధాతు పుష్టి, దీర్ఘాయువు, తగిన బలము,
తేజమొలయు. దురదఁ బాపు దివ్యముగను
మురికి, చెమట, దప్పిక, శ్రమ, మొద్దుతనము
పాప చింతన నశియించు. ప్రభను గొలుపు.
భావము. స్నానము వలన జఠరాగ్ని దీపనము, ధాతు పుష్టి, దీర్ఘాయువు, తేజస్సు, బలము కలుగును. దురదలు, మురికి, బడలిక, చెమట, సోమరితనము, దప్పిక, పాప చింతన నశించును.
స్నానము చేసే నీటిని ఉద్దేశించి ఈ క్రింది శ్లోకము చదువుతూ ఆ గంగలో ఓంకారాన్ని వ్రాసి ఆ నీటితో స్నానం చేయాలి.
శ్లో. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలం చ ప్రసూయతే
యదన్నం భక్షయతే నిత్యం జాయతే తాదృశీ ప్రజా.
క. దీపము చీకటిఁ దినుచును
నేపుగ కాటుకను గను. తినేదే పగిదో
యాపగిది ప్రభవ మగు కన.
దీపించెడి నీతిఁ గను సుధీవరులారా!
భావము. దీపం చీకటిని భక్షిస్తుంది. కాటుకను కంటుంది.ఎట్టి ఆహారం నిత్యమూ భక్షిస్తే ,అట్టి సంతానమే కలుగుతుంది.
శ్లో. దుఃఖం దదాతియోஉన్యస్య ధ్రువం దుఃఖం స విందతి
తస్మా న్న కస్యచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖ భీరుణా.
క. దుఃఖమితరులకుఁ గొలిపిన,
దుఃఖంబతనికిని కలుగు తోడనె, కానన్
దుఃఖముగొలుపడొరులకిల
దుఖమునకు వెఱయు వాడు తోయజ నేత్రా.
భావము. ఇతరులకు ఎవడు దుఃఖం కలిగిస్తాడో అతడు నిశ్చయంగా దుఃఖాన్ని పొందుతాడు.అందువల్ల దుఃఖానికి భయపడే వాడెవ్వడూ ఎవరికీ దుఃఖం కలిగించకూడదు.
శ్లో. దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం
మధుతిష్ఠతి జిహ్వాగ్రే హృదయే తు హలాహలమ్.
తే.గీ. తీపి మాటల ధూర్తుని తెలియుఁడయ్య
నమ్మి మోసపోవలదట్టి నరుని వలన.
మాటలందునె తీయన. మనసు విషము.
రామ కృష్ణుని మాటలు బ్రహ్మ వాక్కు.
భావము. తీయగా మాట్లాడు తున్నాడు కదా అని చెడ్డవాడిని ఎన్నడూ నమ్మకూడదు. వాని నాలుక చివర తేనె, మనస్సులో మాత్రం విషం ఉంటాయి.
శ్లో. దుర్జన వచనాంగారైర్ధగ్నోஉపి న విప్రియం వదత్యార్యః
అగరు రపి దహ్యమానః స్వభావగంధం పరిత్యజతి కిం ను ?
తే.గీ. దురితు కఠినోక్తులన్ మది మరిగియు నిల
సుజనుడప్రియంబులు పల్కఁ జూడడు కద!
దహన మౌచును గంధపు తరువు తనదు
మంచి వాసన పంచును. మహితమదియె.
భావము. దుర్జనుల వచనాగ్నితో దహింపబడినా సజ్జనుడు అప్రియమైన మాటలు మాట్లాడడు. అగరువత్తి తాను కాలిపోతున్నా తన సహజసిద్ధమైన సుగంధాన్ని వదలుతోందా ఏమి?
శ్లో. దుర్జనేన సమం వైరం - ప్రీతించాపి నకారయేత్.
ఉష్ణో దహతిచాంగారః - శీతః కృష్ణాయతే కరమ్.
తే.గీ. దుర్జనుల తోడ స్నేహము దుష్ఫలంబు
దుర్జనుల తోడ వైరము దుష్టఫలము.
బొగ్గు తాకిన వేడిని బొబ్బలెక్కు.
చల్లనౌ బొగ్గు మసి చేత నల్ల బరచు.
భావము. దుర్జనునితో విరోధమూ వలదు, స్నేహమూ వలదు. బొగ్గులు వేడిగా ఉన్నపుడు చేతులను కాలుస్తాయి. చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతులను మసి చేస్తాయి.
శ్లో. దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణం !
ఉపోషితస్య వ్యాఘ్రస్య పారణం, పశుమారణమ్ !
తే.గీ. దుష్టులందున శాంతము దురిత కరము.
సమయమునకు వేచి సహించి, సమయఁ జేయు.
ఆకలిగనుండు పులి జంతు వమరు వరకు.
చంపి భక్షించు నమరిన సహజ మదియె.
భావము. దుర్జనుడు సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే , అది పరులకు మరింత హాని చేయటానికే ! ఉపవాసం ఉన్న పులి చేసే పారణం , (ఉపవాసానంతర భోజనం) పశు మారణమే కదా !
శ్లో. దుర్లభం త్రయ మేతత్ దైవానుగ్రహ హేతుకమ్
మనుష్యత్వం , ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయః.
క. దుర్లభమిల నరజన్మము.
దుర్లభమిల మోక్ష కాంక్ష. దొరకిన ఘనమే.
దుర్లభము సుజన సంగతి.
దుర్లభములు దైవగతిని దొరకును మనకున్.
భావము. మనుష్యజన్మ , మోక్షకాంక్ష , మహాత్ముల ఆశ్రయం అనే మూడూ దుర్లభమైనవి . అవి దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి.
శ్లో. దుష్టా భార్యా శఠో మిత్రం - భృత్యోఽహంకారసంయుతః
ససర్పేచ గృహే వాసో - మృత్యురేవ నసంశయః .
తే.గీ. మోసగాడగు మిత్రుఁడు, పొగరు బోతు
సేవకుఁడు, దుష్ట భార్యయు, శీవమున్న
యింటనుండుట, మృత్యువు వెంటనున్న
యట్టులే నిజము కనఁగ, హాని కలుగు.
భావము. దుష్టురాలైన భార్య, మోసగాడైన స్నేహితుడు, పొగరుమోతు అయిన సేవకుడు, పాము ఉన్న ఇంటిలో నివాసం - ఇవి మృత్యువునే కలిగిస్తాయి. సందేహం లేదు.
శ్లో. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః.
(శివరహస్యము)
తే.గీ. నాశనమవ దుష్టాచారరాశి ధరను
పూర్వసత్సంప్రదాయముల్ పూర్తిగాను
వ్యాప్తి చేయ సాంబుండుతా పరగ బుట్టె
శంకరాచార్యునిగ, భక్తుల శంకలుడుప.
భావము. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు.
శ్లో. దేశరక్షా సమం పుణ్యం
- దేశ రక్షా సమం వ్రతం,
దేశరక్షా సమం యోగో - సృష్టో నైవచ నైవచ.
తే.గీ. పుడమి దేశరక్షణ మించు పుణ్యమేది?
వరలు దేశరక్షణబోలు వ్రతమదేది?
యుర్వి దేశరక్షణమించు యోగమేది?
సృష్టిలో కానరావివి, శ్రీగుణాఢ్య!
భావము. దేశరక్షణ చేయుటతో సమానమగు పుణ్యము, దేశ రక్షణతో సమానమగు వ్రతము, దేశరక్షణతో సమానమగు యోగము ఈ సృష్టిలో లేవుకాకలేవు.
శ్లో. దేహదండనమాత్రేణ కా ముక్తిరవివేకినాం
వల్మీక తాడనాదేవ మృతః కుత్ర మహోరగః ?
తే.గీ. పుట్టపై కొట్టినంతలో పుట్టలోని
పాముమరణించబోదుగా! పాంసనుండు
మనసులోనుండు మలినము బాప కుండ
దేహదండన ఫలమీదు. తెలియుఁడయ్య..
భావము. (మనస్సులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా)శరీరాన్ని (ఉపవాసాదులతో) దండింపజేసుకొన్నంత మాత్రాన అవివేకులకు ముక్తి ఎక్కడిది ? పుట్టను ధ్వంసం చేసినంత మాత్రాన దానిలోని మహాసర్పం మరణిస్తుందా !
శ్లో. దేహీతి వచనం కష్టం - నాస్తీతి వచనంతథా
దేహీనాస్తీతి మద్వాక్యం - నాభూత్ జన్మనిజన్మని.
తే.గీ. కష్టమగు దేహి యనుటయు కష్టమిలను
నాస్తియనుటయు కనఁగ నో నలిననయన!
దేవ! వలదయ్య నాస్తియున్ దేహియు
నిల
జన్మజన్మలకున్ నాకు, సరసిజాక్ష!
భావము. ఓ దేవా! దేహి
అని నోటితో ఇతరుల అడుగుకొనుచు పలుకుటయు, అడిగినవారితో నాస్తి యని పలుకుటయు
చాలా కష్టముగ ననిపించుచున్నది. జన్మజన్మలకు నాకు ఈ పదములు సంభవించకూడదని ప్రార్థించుచున్నాను.
శ్లో. దేహే పాతిని కా రక్షా - యశో రక్ష్యమపాతవత్|
తస్మాద్దేహేష్వనిత్యేషు - కీర్తి మేకా ముపార్జయేత్||
తే.గీ. పతన దేహంబునకు రక్ష క్షితిని లేదు,
కీర్తి దేహంబునకు లేదు క్షీణత ధర,
కాన దేహంబుతో కీర్తి గాంచుటొప్పు,
శాశ్వతంబగు సత్కీర్తి చక్కఁ గనుము.
భావము. నశించునట్టి ఈ మానవదేహమునకు రక్షణ ఎక్కడ కలదు?అందువలన అనిత్యమైన ఈ దేహముతో నిత్యమై సత్యమై వెలుగొందు శాశ్వతమైన కీర్తిని మానవుడు ఆర్జించవలెను.
శ్లో. దేహో దేవాలయః ప్రోక్తో - జీవః ప్రోక్త స్సనాతనః
త్యజేదజ్ఞాన నైర్మాల్యం - సోహం భావేన పూజయేత్.
తే.గీ. దేహమే గుడి తలపగ, దేహమునను
జీవుఁడెన్నఁగ దైవమే, శ్రీకరుండ!
విడిచి యజ్ఞాన నైర్మాల్య వితతి, సతము
దైవమును నీవె నేనని తలచి కొలుము.
భావము. దేహమే దేవాలయము. జీవుఁడు సనాతనుఁడైన ఈశ్వర స్వరూపము. అజ్ఞానమనెడి నైర్మాల్యమును తీసివేసి నీవే నీను అనే భావముతో ఆత్మస్వరూపుని పూజించవలెను.
శ్లో. దోషభీతే రనారంభః త త్కాపురుష లక్షణం
కిమజీర్ణ భయాద్భ్రత ! భోజనం పరిహీయతే?
తే.గీ. దోష భీతిచే పని చేయ తోపకునికి
దుష్ట దుర్మార్గ వర్తన. దోష మరయ.
తిన నజీర్ణ దుర్భయమొంది తిండిమాను
జనులు భువి నుందురా కన? సదయులార.
భావము. ఏదైనా దోషం జరుగుతుందేమో అనే భయంతో ఏ పనినీ ప్రారంభించకపోవటం దుష్టుని లక్షణం. అజీర్ణం చేస్తుందేమో అనే భయంతో ఎవడైనా భోజనం మానుకుంటాడా?
శ్లో. ద్రోగ్ధవ్యం న చ మిత్రేషు న విష్వస్తేషు కర్హిచిత్ ౹
యేషాం చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః ౹౹
(మహాభారతమ్ 3.154.13)
తే.గీ. స్నేహితులయెడలను, విశ్వసించువారి
యెడల, మృష్టాన్న దాతల యెడల, తనకు
తానుగా నాశ్రయంబిచ్చు ధన్యులయెడ,
ద్రోహమొనరింపరాదయా, దురితమొదవు.
భావము. మిత్రుల విషయములో, విశ్వాసం పెట్టుకున్నవారివిషయములో, ఎవరి అన్నము స్వీకరింతురో అటువంటి వారివిషయములో, మరియు తనకు తానుగా ఆశ్రయము ఇచ్చిన వారి విషయములో ద్రోహం ఎప్పటికీ చెయ్యరాదు.
శ్లో. ద్వారం ద్వార మటన్ భిక్షుః శిక్షత్యేవ న యాచతే
అ దత్వా మాదృశో మాభూః దత్వా త్వం త్వాదృశో భవః.
క. పెట్టక నావలె యుండక
పెట్టుచు మీవలెనె యుండి పెంపును గనుడన్
చట్టుల చెప్పక చెప్పెడి
దిట్ట కదా ముష్టి వాడు. తెలియగ వలదా!
భావము. ముష్టి వాడు ఇంటింటికీ వచ్చి యాచిస్తున్నాడనుకొనుట కంటే హెచ్చరిస్తున్నాడనుకోవడం మంచిది. ఎలాగంటారా? దానము చేయుట మాని నాబోటి వారు కాబోకుడు. పెట్టి మీవలె మీరుండండి. అని సోదాహరణంగా గృహస్తులను శిక్షిస్తున్నాడనుకొనినచో సముచితంగా నుండును కదా.
శ్లో. ద్వే పదే మోక్ష బంధస్య , మమేతి , న మమేతి చ
మమేతి బద్ధ్యతే జంతుః , న మమేతి విముచ్యతే.
కం. నాదిగ తలచిన బంధము.
కాదిదినాదియనుకొనిన కలుగును మోక్షం
బేదిశుభం బనుకొందువొ
యాదారినినడువుమయ్య, యమలిన చరితా!
తే.గీ. బంధ మోక్షమ్ములకు రెండు పదము లిలను
కారణము గన, మమ యన కలుగు మనకు
విడువరానట్టి బంధము, విజ్ఞులార!
నమమ యన ముక్తి కలుగును, విమలగతిని.
భావము. ముక్తికి గానీ, బంధానికి గానీ రెండు పదాలు కారణమౌతున్నాయి. “మమ” (ఇది నాది) అనుకుంటే అది బంధం. “న మమ ” ( ఇది నాది కాదు) అనుకుంటే మోక్షం.
శ్లో. ధనం తావదసులభం లుబ్ధం కృచ్ఛ్రేణ రక్ష్యతే।
లబ్ధానాశో తథా మృత్యుః తస్మాదేతన్న చిన్తయేత్॥
తే.గీ. ధన సమార్జన కష్టము దాని రక్ష
ణంబు మిక్కిలి కష్టమో యంబుజాక్ష!
యదియు నిలుచునో, పోవునో, యంతలోనె
చత్తుమేమో? ధనార్జనాసక్తి తగదు.
భావము. ధనసంపాదన చాలా కష్టము. సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టము.
లభించిన ధనము పోనూవచ్చు, లేదా తానే మృతినొందవచ్చు. కావునా ధనముగూర్చి అంతగా వ్యసనపడుట
మంచిది కాదు.
తే.గీ. ధనమస్తీతి వాణిజ్యం - కించిదస్తీతి కర్షణం |
సేవా న కించిదస్తీతి - భిక్షా నైవ చ నైవ చ ||
తే.గీ. ధనము కలిగిన వాణిజ్యమున బ్రతుకుము,
భూమి కలిగిన వ్యవసాయమున బ్రతుకుము,
సకలమును లేని నాడు సేవకునుగాను
బ్రతుక నేర్చుము, యాచనన్ బ్రతుకవలదు.
భావము. ధనం ఉంటే వ్యాపారం, కొంచెం భూమి అయినా ఉంటే వ్యవసాయం, ఏమీ లేకపోతే సేవా వృత్తి. కానీ భిక్షాటన మాత్రం ఎప్పటికీ తగదు.
శ్లో. ధనమార్జాయ కాకుత్స్థ ! - ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ.(రామాయణము)
తే.గీ. ధనమునార్జింపుమో రామ ధరణిపైన,
ధనమె మూలము జగతిలో, దానిలోనఁ
గలుగు నాంతర్యమును గను ఘనతరముగ,
ధనము లేమిచో మృతతుల్యుడనగనొప్పు.
భావము. ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.
శ్లో. ధనే నష్టే పునః ప్రాప్తుం శక్తిస్స్యాద్య స్య కస్యచిత్
గత కాలస్తు నాయాతి ఏవ మీశ్వర శాసనమ్.
తే.గీ. ధనము పోయిన నెటులైన దాని మరల
పొంద వచ్చును. కలిగిన ముందు చూపు.
కనగ గత కాల మును మరి కాన లేము.
దైవ శాసనమిది మీరు తలచ వలయు.
భావము. ధనమును మనము నష్టపోయినచో ఏదో విధముగ మరల దానిని సంపాదించ వచ్చును. కాని గడచిపోయిన కాలమును మాత్రము ఏ విధముగనూ కాడా వెనుకకు తిరిగి రాబట్టలేము. ఇది దైవ శాసనము.
శ్లో. ధన్యానాముత్తమమ్ దాక్ష్యం - ధనానాముత్తమమ్ శ్రుతమ్ ।
లాభనాం శ్రేయ ఆరోగ్యం - సుఖానాం తుష్ఠిరుత్తమా ॥
(యుధిష్ఠిర
గీత 53వ శ్లోకం)
తే.గీ. భౌతికముకంటె మర్యాద వసుధ నిన్న,
జ్ఞానమెన్నగ సంపదకన్న ఘనము,
ధనము కన్నను స్వస్తత ధరణి మేలు,
సుఖములందున తుష్టియే చూడ ఘనము.
భావము. మర్యాద గల ప్రవర్తన భౌతిక విషయాల కంటే శ్రేష్ఠమైనది, జ్ఞానం సంపద కంటే గొప్పది. ధనలాభము కంటే ఆరోగ్యం శ్రేష్ఠమైనది మరియు సంతృప్తి అనేది అన్నింటిలోనూ ఉత్తమమైనది.
శ్లో. ధన్వంతరి, క్షపణ, కామరసింహ, శంకు, బేతాళభట్టి, ఘటఖర్పర, కాళిదాసాః
ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య.
తే.గీ. క్షపణకుఁడును, ధన్వంతరి, కాళిదాసు,
శంకు, భేతాళ, ఘటఖర్ప, జన వరరుచి
అమరసింహుఁడుఘన వరాహమిహిరుఁడును
విక్రమార్కుని నవరత్న విశ్వకవులు.
భావము. ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుభట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు వరరుచి అను కవులు తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు.
శ్లో. ధర్మం, ధనం చ , ధాన్యం చ , గురోర్వచన , మౌషధం
సుగృహీతం చ కర్తవ్య మన్యథా తు న జీవతి.
తే.గీ. ధర్మ, ధన, ధాన్య, గురు వాక్య తత్వ, మౌష
ధములమరినప్పుడే యిల తడయకుండ
ననుసరించిన జీవింపనగును మనకు
నమృత పంచకమీయైదునరయుఁడయ్య.
భావము. ధర్మం, ధనం , ధాన్యం , గురువాక్యం , ఔషధం చక్కగా గ్రహించి వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే జీవించలేం.
శ్లో. ధర్మ ఏవో హతో హంతి, - ధర్మో రక్షతి రక్షిత:.
తస్మాద్ధర్మో న హంతవ్యో, - మానో ధర్మో హతోవధీత్. (వాల్మీకి రామాయణం)
తే.గీ. ధర్మమును చంప ధర్మము చంపు మనను.
ధర్మమును కాయ కాచును ధర్మమేను.
ధర్మమునుచంపుటెన్న నధర్మమగును.
నాశనముకోరకోకున్న నయత నడుము.
భావము.
ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !
శ్లో. ధర్మాదర్థ: ప్రభవతి - ధర్మాత్ ప్రభవతే సుఖమ్.
ధర్మేణ లభతే సర్వమ్ - ధర్మసార మిదం జగత్.
తే. గీ. ధర్మమునప్రభవించును ధనము మనకు.
ధర్మమునసుఖమమరునుతరచి చూడ.
ధర్మమున సర్వమమరును ధరణి నయిన.
ధర్మసారంబుజగతిని తలపనిదియె.
భావము.
ధర్మం వల్ల సంపదలు లభిస్తాయి.ధర్మం వల్ల సుఖమ్ లభిస్తుంది.ధర్మం చేత సర్వమూ
లభిస్తుంది. ఈ జగత్తుకు ఆధారమే ధర్మం. మన యితిహాసాలన్నీ ఈ నీతినే బోధిస్తున్నాయి.
శ్లో. ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం
కళాసుచ
కరోతి కీర్తిం
ప్రీతించ సాధు కావ్య
నిషేవణం.
తే.గీ. కావ్యపఠనము ధర్మార్థ కామమోక్ష
జ్ఞాన మొసగును. కలిగించు కళల మహిమ
నరయు శక్తి. పాఠకులకు నసదృశమగు
కీర్తి ప్రదమిది. చదువుడు స్ఫూర్తి నొంది.
భావము. మనము కావ్య పఠనము చేయుచుంటిమేని అది మనకు ధర్మార్థ కామ మోక్ష సాధనమే కాక, కళలలోని మహిమ నరయు శక్తిని కలిగించుటతో పాటు మనకు కీర్తి ప్రదమగును.
శ్లో. ధర్మేచాஉర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ!
యది హాஉస్తి తదన్యత్ర, యన్నేహాஉస్తి న తత్ క్వచిత్!! (మహా భారతం)
కం. ధర్మార్థ కామ మోక్షము
లర్మిలి భారతము చెప్పె నవియే కనగా
పేర్మిని పేర్కొని రితరులు.
ధర్మము లిట లేని వెచట తలపఁగ లేవోయ్!
భావము. ఓ భరత శ్రేష్ఠుఁడా! ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములను బోధించే వచనములు ఏవి యీ భారతమున ఉన్నవో అవే సమస్తమైన ఇతర గ్రంథములలోను ఉన్నవి. ఇందు లేనివి మరెచ్చటను లేవు.
శ్లో. ధర్మేణ హన్యతే వ్యాధిః గ్రహో ధర్మేణ హన్యతే |
ధర్మేణ హన్యతే శత్రుః యతో ధర్మస్తతో జయం ||
తే.గీ. ధర్మమున రుగ్మతలు పాయు ధరణిపైన,
ధర్మమున గ్రహపీడలు తప్పిపోవు,
ధర్మమున శత్రు నాశము తప్పకగును,
ధర్మమే జయపథమిల ధర్మపరుఁడ!
భావము.
ధర్మము వల్లనే రోగాలను పోగొట్టుకొనవచ్చు. గ్రహబాధల నుండి విముక్తుడు
కావచ్చు. శత్రువును సంహరించవచ్చు. ధర్మమున్న చోటనే జయముండును.
శ్లో. ధర్మార్థం క్షీణ కోశస్య కృశత్వమపి శోభతే
సురైః పీతావశేషస్య శరద్ధిమ రుచేరివ.
తే.గీ. దేవతలు త్రా గ మ్గిలిన దివ్య జ్యోత్స్న
తేజరిలె శరచ్చంద్రికై దివ్యముగను.
దాన ధర్మాదులన్నిధుల్ తరిగి కూడ
శోభిలాగారముల్ దాన ప్రాభవమున.
భావము. దేవతలు త్రాగగా మిగిలిన సన్నని శరత్కాలపు వెన్నెల కాంతిలా, ధర్మాచరణలో ఒకని ధనాగారం క్షీణించిపోయినా , ఆ సన్నగిల్లటం కూడా శోభిస్తుంది.
శ్లో. ధర్మే తత్పరతా, ముఖే మధురతా, దానే సముత్సాహతా
మిత్రేzవంచకతా, గురౌ వినయతా, చిత్తేzతిగంభీరతా,
ఆచారే శుచితా, గుణే రసికతా, శాస్త్రేషు విజ్ఞానతా,
రూపే సుందరతా, శివే భజనతా, సత్స్వేవ సందృశ్యతే.
ఉ. ధర్మమె రూపమౌన్ నయ సుధా పరిభాషణ, దాన శీలమున్,
మర్మము లేని మైత్రి, గురు మానిత భక్తియు, చిత్త శోభ, సత్
కర్మల శౌచమున్, సుగుణ గ్రాహ రసజ్ఞత, శాస్త్ర బోధయున్,
భర్మ శరీర శోభ,శివ భక్తి, మహాత్ముల యందు తెల్లమౌన్.
భావము. ధర్మాచరణమునందు ఆసక్తి, నోటియందు మధురభాషణము, దానము చేయుటయందు సమధికోత్సాహము, మిత్రుల యందు మోసబుద్ధి లేకుండుట,గురు జనుల పట్ల వినయము, మనస్సులో గాంభీర్యము, ఆచారాలను పాటించటంలో శుచిత్వము,సద్గుణ గ్రహణములో రసజ్ఞత, శాస్త్ర జ్ఞానము కలిగి యుండుట,రూప సౌందర్యము, పరమేశ్వర సేవ, అనే లక్షణాలు సత్పురుషులయందు మాత్రమే గోచరిస్తూ ఉంటాయి.
శ్లో. ధర్మో జయతి నాధర్మః , సత్యం జయతి నానృతం
క్షమా జయతి న క్రోధో, విష్ణుర్జయతి నాసురః.
తే.గీ. ధర్మముజయించు నోడు
నధర్మమెపుడు
సత్యముజయించు నోడునసత్యమెపుడు
క్షమ జయించును
క్రోధము కాదు జగతి.
విష్ణుఁడు జయించునసురుల
వినుతగతిని.
భావము. ధర్మమే జయిస్తుంది , అధర్మం కాదు. సత్యం జయిస్తుంది ,అసత్యం కాదు. క్షమ జయిస్తుంది , క్రోధం కాదు, విష్ణువు జయిస్తాడు , రాక్షసుడు కాదు.
శ్లో. ధర్మో మాతా పితా చైవ - ధర్మో బంధుః సుహృత్తథా।
ధర్మః స్వర్గస్య సోపానం - ధర్మాత్ స్వర్గ మవాప్యతే ॥
(చాణక్య నీతి)
తే.గీ. ధర్మమే తల్లి, తండ్రియు ధర్మమేను,
ధర్మమే సఖుఁడెన్నగా మర్మరహిత!
ధర్మమే మెట్లు దివిఁ జేర, తరచి చూడ,
ధర్మమున స్వర్గమొదవును, ధాత్రిజులకు.
భావము. ధర్మమే తల్లి, తండ్రి, బంధువు, మంచి కోరే మిత్రుడు. ధర్మమే స్వర్గానికి సోపానం. ధర్మము వలననే స్వర్గాన్ని సంప్రాప్తిస్తుంది.
శ్లో. ధాత్రీఫలాన్ ఆమావాస్యా - అష్టమీ నవమీసుచ,
రవివారే చ సంక్రాంతౌ - సంస్మరేన్మునిపుంగవాః.
తే.గీ. ఆదివారంబమావాస్య, నష్టమి మరి,
నవమి, సంక్రాంతులందు, మానవు లుసిరిని
తినగరాదు స్మరణ చేయఁగనగుననుచు
మునులు తెలిపిరి వినుఁడయ్య! పూజ్యులార!
భావము. అమావాస్య, అష్టమి, నవమి, ఆదివారము, సంక్రాంతులందు ఉసిరికాయ తినరాదు. స్మరణమాత్రము చేయవలెను అని మునిపుంగవులు తెలిపియున్నారు.
శ్లో. ధారణాద్ధర్మమిత్యాహుః. ధర్మో ధారయతి ప్రజాః!
ప్రభవార్ధాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం.
కం.
ధరియించునదియె ధర్మము.
వరలించును ప్రజల. జీవ ప్రభవ స్థితులన్
వరలింపఁ జేయ నమరెను
ధర ధర్మ ప్రవచనమది. ధర్మ విధేయా!
భావము. ధరించునది కావున ధర్మమమి పెద్దలు చెప్పుచున్నారు. ధర్మమే ప్రజలను నిలిపి ఉంచుతుంది.జీవుల ఉత్పత్తి స్థిత్యర్థమై ధర్మ ప్రవచనము చేయ బడినది.
శ్లో. ధిక్ తస్య జన్మ య: పిత్రా - లోకే విజ్ఞాయతే నర:l
యత్పుత్రాత్ ఖ్యాతి మభ్యేతి - తస్య జన్మ సుజన్మ:ll
తే.గీ. తండ్రిచేఁ దిలియఁబడెడి తనయుఁడు ధర
వ్యర్థజన్ముఁడు, తనకీర్తి వలన తండ్రి
కిలను గుర్తింపుఁ గొలిపెడి సలలితుఁడగు
సుతుఁడు కల తండ్రి జన్మము శోభఁగాంచు.
భావం: ఎవడు తండ్రి యొక్క ఖ్యాతి చేత లోకానికి తెలియబడుచున్నాడో వాడి జన్మ వ్యర్థం. ఏ తండ్రి పుత్రుని యొక్క జన్మ వలన కీర్తించబడుచున్నాడో ఆ తండ్రి యొక్క జన్మయే సార్థకం.
శ్లో. ధృతిః క్షమా దమోஉస్తేయం శౌచమింద్రియనిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్.
తే.గీ. ధైర్యమోర్పును నిష్టయు, తరళ విద్య,
సత్యమును, దొంగ కాకుంట, సద్గుణంబు,
కోపహీనతేంద్రియజయ గుణము మరియు
శౌచమనుపది ధర్మలక్షణములరయ.
తే.గీ. నిత్య ధైర్య మోర్పును నాత్మ నిగ్రహంబు,
తనది కానిది
కోరని ధర్మ నిరతి,
బుద్ధి, విద్య,
జితేంద్రియ పూజ్యశక్తి,
కోప రహితము,
సత్య సద్గుణము, సౌచ
మనెడు పదియును
ధర్మలక్షణములగును.
తే.గీ. నివృత ధైర్యమోర్పును మనో నిగ్రహంబు
పరధనాశ లేకుంట, శుభ్రతయు, నింద్రి
య జయమును, బుద్ధి, విద్య, సత్య వచనమును,
కోప రాహిత్య మివి ధర్మ గుణములరయ.
భావము. ధైర్యము,ఓర్పు, నిష్ఠ, దొంగతనము చేయకుండుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపరాహిత్యము - ఈ పది ధర్మలక్షణాలు.
340. మం. 'ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి:
ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్".
తే.గీ. వరుణ రాజు స్థిరంబుగా వరలుగాక,
వర నృహస్పతి స్థిరుఁడయి ప్రబలు గాక,
యింద్రుఁడునునగ్ని, స్థిరమునునెనయుగాక,
రాజ్యమును సుస్థిరమునిల్పి రక్షనిడుత.
భావము. వరుణ రాజు స్థిరుడు అగును గాక. బృహస్పతి దేవత స్థిరుడు అగునుగాక. ఇంద్రాగ్నులు స్థిరులై రాజ్యమును స్థిరముగ పోషింతురుగాక. ప్రభుత్వం పంచభూతము లంతటి స్థిరం కావాలి.
No comments:
Post a Comment